పూలగండువనం-1

– డా।। చింతకింది శ్రీనివాసరావు

‘‘ఏం నాయనా! ఇంకా పొర్లాడుతున్నావు. భూమికరిచే ఉన్నావే. ఎంత నిద్దరతీస్తావట. లేవయ్యా. పొద్దుపారిపోతోంది.’’ ఇంటి పనులతో అలసిపోతున్న రేక గలగలలాడింది. పట్టించుకోలేదు కోలన్న.

సగం అరిగిపోయిన కొండచీపురుతో పెరట్లోని నల్లమట్టినేలను వీలయినంత తెరిపిచేసేందుకు యాతన పడుతోంది రేకమ్మ. చీపురు చిన్నది కావడం, తను భారీమనిషి కావడంతో నడుం బాగా వంచవలసి వస్తోంది. మరంచేతనే వెన్ను సలుపూ పెడుతోంది.

‘‘నీకే చెప్పేది. వినపడటం లేదేంటి? పుల్లంబలి మరీ పులిసిపోవాలా ఏంటి!’’ నిష్టూరంగా మరోసారి మాట విసిరింది.

మాట్లాడక తప్పదనుకున్నాడు కోల. లేవకా తప్పదనుకున్నాడు. విసుగుపడుతూనే,

‘‘ఏహే. పొద్దున్నే గోల గోల. పండగా లేదూ. పబ్బం లేదు. పాటా లేదూ. మంచి మాటా లేదూ.’’ ఇంటి ముంజూరున చిట్టీత చాప వదలిపెట్టకుండానే, ముణగదీసుకున్న భంగిమను మార్చకుండానే, గగ్గోలుపెట్టాడు. అంతటితో ఆగిపోకుండా,

‘‘నువ్వనుకున్నట్టు నేనేం పడుక్కోలేదు. పాట వింటున్నాను. నా కూతురు ఎంత బాగా పదం పాడుతోందో వినబడ్డం లేదా నీకు? పైగా ఇటింపండగ. అంతకుమించి దేశిరాజుల పుట్టినరోజు. హాయిమని ఉండొద్దా!’’ ఇలా అంటూనే,

‘‘కల్లుతాగితీమి.. కమము తప్పితీమి.. కల్లు తాగితీమి.. కమము తప్పితీమి..’’ కూనిరాగాలూ మొదలెట్టాడు.

ఎప్పుడయితే భర్త ఇటింపండగను గుర్తుచేశాడో రేకమ్మ మనసులో సంతోషం పొంగింది. ఆ వెంటనే దేశిరాజుల ప్రస్తావనా అతగాడు చేయడంవల్ల ఆ సంబరం క్షణాల్లోనే ఆవిరి అయింది. ఉస్సురు మన్నట్టుగా అయిపోయింది. అప్పటికే పెరటి ఊడుపు పూర్తికావడంతో పీనెఅరుగు దాటుకుంటూ ఇంటిలోపలికి నిస్త్రాణగా చేరుకుంది.

‘పాపం దేశిరాజులు.’ మనసులోనే మూలిగింది. ఆ మాటే బయటపెడుతూ,

‘‘రాజులంతా అన్యాయం అయిపోయారేం.’’ భర్తమీద అప్పటివరకూ ఉన్న కోపమంతా ఎటో పోయినట్టు వేదనాపూరితస్వరంతో ముంజూరుకు చేరి అనేసింది. ఆ మాట వినీవినబడగానే అప్పటివరకూ చాపను వదలని కోలన్న ఠక్కున లేచిపోయాడు. చలిని అడ్డుకునేందుకు కప్పుకున్న అడ్డాకుల పైవస్త్రాన్ని ఒక్కసారిగా ఒత్తిగించాడు.

‘‘నిజమేనే రేకా! రాజులు ఘోరంగా బలయి పోయారు. ఏం చెయ్యలేం. వాళ్ల రాత అది. వాళ్లను తలచి దండాలు పెట్టుకోవడమే. ఇటింపండగంటే నాకెంతో ఇష్టం. అప్పుడే దేశిరాచపండగా వస్తుంది. అదో బాధ.’’ వగచివగచి వాపోయాడు.

‘‘సరేలే. నువ్వీ చోడంబలి తాగు. నీ కూతుర్ని తీసుకొచ్చి దానికీ ఇంత తాగబొయ్యి. కంపల కోసం నేను కొండకిపోతాను.’’ అంబలిదిప్పను మొగుడికి అందిస్తూ నింపాదిగా పలికింది రేక. వాడూ దిప్ప అందుకోబోతుండగా అప్పటివరకూ ఒక మోస్తరుగా వినవచ్చిన అడవిపాట ఒకానొక పెనుస్వరంగా ఆకాశాన్ని అంటుకునేలా గగనగీతమై ఎగసిపడింది.

‘ఆట మనదే పాట మనదే – అన్ని విద్యలు గల్లవారము

వేటమనదే వెట్టి మనదే – వేయివిద్యలు గల్లవారము

కొలువు మనదే కొలత మనదే – కోటి విద్యలు గల్లవారము

వీట్లం కాము విద్దెలం కాము – వేడుకల బాలలాము

సపిరెలు తొక్కవాలె – చాపచుట్టు చుట్టవాలెయా

గుంపెనలాడవాలె – గుళ్ల చుట్టు చుట్టవాలెయా

ఆడవాలె పాడవాలె – వేడికీలు సేయవాలెయా..’

కళ్లు మూసుకుని మనసారా పాట వింటున్న కోలన్న ఒక్కసారిగా నేత్రాలు తెరచి,

‘‘ఒసేయ్‌ ‌రేకా! నా బిడ్డ ఎలుగే ఎలుగు. బంగారమే కదూ! అసలు నా గంగమ్మ గొంతెత్తితో మండివలసలోనే కాదే. కిడగనూరిదేశంలోనే ఏ గాయనమూ సరిపోదు.’’ మురిసిపోయాడు. అంతటితో సరిపెట్టలేదు.

‘‘గంగు పాడుతుంటే ఏం ధృతగతే. శబరినది ప్రవాహంలాగానే ఉంటుందేం.’’ మురిపెంగా ముచ్చటపడిపోయాడు.

ఈ సంగతులన్నీ రేకకి తెలియనివికావు. ఆ అమ్మాయి పుట్టినప్పుడే లెంకలందరూ కూడి జాతకురాలని చెప్పారు. పూజారులందరూ చేరి పనిమంతురాలనీ అన్నారు. దానికి లకుముకిపిట్ట లాంటి నదరైన మొగుడే తగులుకుంటాడనీ చెప్పారు. ఇవన్నీ ఎరుకలో ఉన్నా పెద్దగా రేక స్పందించదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని హెచ్చుగా పొగడ కూడదనేది ఆమె సిద్ధాంతం. అందుకే ఒక్కగానొక్క కూతుర్నీ ఎప్పుడూ నెత్తిన పెట్టుకోదు. మీదు మిక్కిలిగా కోలన్న నెత్తికెక్కే ఆ పిల్లని కిందికి దించే ప్రయత్నమే చేస్తుంటుంది.

‘‘చాల్లే. గీర మాటలు. ఈ పోతుగడ్డలో నువ్వూ నీకూతురే మొఖాసాదారులు. మేమంతా ఎనిపిన పప్పులం. ముందు నువ్వెళ్లి ఆ పాటగత్తెని ఇంటికి లాక్కురా. పొద్దున్ననగా పోయింది. తిన్నదీ లేదు. తాగిందీ లేదు. నీ వ్యవహారమంతా ఒడిదుడుకుల మెరకపొలం.. జారుబురద జాగరత..’’ విరసంగా వెల్లువెత్తుంది.

‘‘అవునా. పాప ఏం తినలేదేం. ఇప్పుడే వెళ్లి దాన్ని తెస్తానుండు.’’ విసురుగా లేచాడు కోల. చేతికందిన అంబలిదిప్పను పక్కనే ఉన్న మట్టిగూట్లో పెట్టాడు. ముంజూరు వదిలి ఇంటిముంగిట్లోకి వచ్చాడు. పాట పెల్లుబుకుతున్న ఉరికి ఉత్తరంవైపు సిమ్మాలగద్దెకు నడవబోయాడు. ఇంతలోనే,

‘‘ఓ కోలయ్యా. నీకూతురేం చిన్న బొట్టెగాదు తేవడానికి. పందిని కొట్టవాలె.. పాలవిందు పెట్టవాలె.. అనేంత వయసు దానిది. పదిహేనేళ్లు ఒంటికి చేరాయి. రేవుతొక్కి రెండు నెలలయింది. నడిపించుకురా. మరేం కందిపోదు.’’ విలాసంగా ఇంట్లోనుంచే ఎగతాళిగా కేకవిసిరింది రేక. ఆలకించిన కోలడికి కర్తవ్యమేదో గుర్తుకువచ్చినట్టయింది. నిరుత్సాహపడినట్టూ అయ్యాడు.

‘అవును. ఇంతలోనే గంగు ఎంత పెద్దదయింది. మొత్తం మారిపోయింది. నిన్నమొన్నటివరకూ తన పొట్టమీద పాకే పిల్ల అప్పుడే పెద్దదయింది. తన వీపున గుమ్మడిపండుగా ఆడే పిల్ల తనే గుమ్మడి పాదులా పిందెలు పెట్టే అర్హత సాధించుకుంది. కాలం పరుగుపెడుతోందేం. ఆడపిల్ల అడ్డగింజ ఒక్కటే. పేలితే ఎక్కడ పడతారో తెలీదు. ఏ భూమికి చేరి ఏ విత్తనాలు కాయిస్తారో అసలు తెలీదు.’ తనలో తనే ఏవేవో తలపోస్తూ,

‘‘ఫరవాలేదులే. మా భారం నువ్వేం మోయనక్కర లేదు.’’ బింకంగా పలికి గద్దెరాళ్లవైపు దౌడాయింపు మొదలెట్టాడు. ఊరి ఆడపిల్లల ఇటింపాట గాలితో కలిసి తెరలుతెరలుగా వచ్చి వాలుతుండగా,

‘కొండగొర్రె కొవ్విదో లేదో – కొనవంచి మేయలేదు.

ఆడబొట్టె కొవ్విదో లేదో – అంచకుండ వారియలేదు..’

తను కూడా శ్రుతి కలిపి పాడుకుంటూ పోతున్నాడు. ఈ లోపునే దేశిరాజులు జ్ఞప్తికిరాగా అతని స్థితి మారింది. ఒకింత వ్యాకులత మనసున చోటుచేసుకుంది. తల కిందికి వేసుకుని భారంగా మునుముందుకు సాగిపోయాడు.

——————-

మండివలస గ్రామం కిడగనూరిదేశంలోది. కోట్ల ప్రదేశంలోనిది. మండేబు పర్వతానికి పక్కది. ఇంకా చెప్పాలంటే నందరాజ్యపు సరిహద్దుల్లో ఉంది. తూరుపు కనుమల్లో వీరగడ్డలెన్ని ఉన్నప్పటికీ మన్యంలో విలసిల్లే నందపురం స్థితిగతులే వేరు. ఆ సంస్కృతీ సౌరభమే వేరు. ఆ సంప్రదాయాల గరిమే వేరు. ఆ ఆచార పరాయణత్వమే వేరు. పదిమంది కోసం నిలిచే రాజ్యం నందరాజ్యం. త్యాగానికి ప్రతీకగా పదుగురి చేతా ప్రశంసలందుకునే రాజ్యం నందరాజ్యం. దాతృత్వానికి పట్టుగొమ్మ. అనుశాసనకు పెట్టింది పేరు. ప్రజాక్షేమమే ప్రగతిమార్గమని భావించే పాలకులకు ఆటపట్టు. మానాభిమానాలకు విలువనిచ్చే స్వర్ణసీమ. పచ్చదనానికి, ప్రకృతిశోభకు నిలువెత్తు నిదర్శనం. ఆటపాటలకు నెలవు. భక్తితత్వానికి పుణ్యభూమి. భారతదేశాన చల్లని సీమ. గౌరవ గణరాజ్యం. ‘అందమైన నందపురం – నందియాటలు ఆడివద్దాం.’ అని దిగువప్రాంతాల జనావళి మక్కువచూపించే ఘనరాజ్యం. వాకాటక పారంపర్యవర్ధనుల పాలనలో గడితేరిన జనరాజ్యం. శిలవంశీయుల చేతుల్లో పరిఢవిల్లిన సవ్యరాజ్యం. అన్నింటికీమించి శరణని వచ్చిన శత్రువునైనా అక్కున చేర్చుకోగల హృదయరాజ్యం. మానవులంతా ఒక్కటే అనే నినాదంతో, సమతామమతల విధానంతో మసలే సురాజ్యం.

అయితే, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇదంతా గతం. అద్భుతం. ఇదంతా నాటిమాట. తేనెతేట. ఇదంతా ఒకప్పటి ముచ్చట. నిగారింపుల అచ్చట. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. పూర్తిగా వేరు. చాలా వేరు. చెప్పలేనంత వేరు. గడిచిన ఇరవైయ్యేళ్లుగా పరిస్థితి మరీ వేరు. నందపురం నేడొక నిద్రాణమైన నేల. నందరాజ్యం ఇప్పుడొక రోదనాభరిత తప్త వసుధ. నందం ఈ వేళ ఒకానొక అందవిహీన. భయకంపిత. లయభూమి. చేతనారహిత. పచ్చనిరాజ్యాన్ని మరింత పచ్చాపచ్చగా దిద్దితీర్చవలసిన ఏడుగురు యువరాజులు ఒకేసారి నందపురానికి దక్కకుండా పోయిన వైనమే ఇందుకు హేతువు. దేశిరాజులుగా దానధర్మాలకు పేరుబడిన శిలవంశోద్ధారకులు ఉన్నట్టుండి పైలోకాలకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. గద్దెనెక్కవలసిన యువ సమ్రాట్టులు అందనితీరాలకు తరలిపోవడంతో నందరాజ్యం బాధ్యత నేడు రాజమాత మాకలిశక్తి మీద పడిపోయింది. డెబ్భయ్యేళ్లు దాటిన వయస్సులో ఆ బరువును నెత్తికెత్తుకోవాలంటూ మాకలికి సవాలు విసిరింది ధరిత్రి. వర్తమానం వ్యధాభరితమై, భవిష్యత్‌ అగమ్యగోచరమైన కాంలోనూ ఆమెకింతటి కష్టం తప్పకపోవడం కల్తీలేని విధివైచిత్రి.

మాకలిశక్తి వ్యూహప్రతివ్యూహ దురంధర కాదు. రాజ్యాన్ని నడిపే సుళువూ సూత్రం మెండుగా ఎరిగిన మనిషీ కాదు. నందపురాన్ని నిరంతరమూ కాచి బ్రోచే నీలకంఠుణ్ణి శరణువేడటమూ, రాజ్యంలో వేంచేసిన మహంకాళీ అమ్మవారిని పూజించడమూ తప్పనిచ్చి ఆమెకు మరో వ్యాపకమే తెలియదు. భర్త భైరవుడు కాలం చేశాక ప్రాప్తించిన వైధవ్యం దరిమిలా నలభై సంవత్సరాలుగా పూజాపునస్కారాల్లోనే గడుపుతోంది.

ఇప్పటి ఈ రాజ్యబాధ్యత మాకలికి తప్పనిది. తప్పనిసరిగా నిభాయించవలసినది. పుత్రశోకంతో కొడుకు వెంకటేశుడు, కోడలు దేవేంద్రాలు అడవులు పట్టిపోయారు. సింహాసనం రిక్త అయింది. నందరాజులు ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ముప్ఫయి రెండుమెట్ల విక్రమార్క సింహాసనం శూన్యంగా మారింది. ఆ గద్దెను మోస్తున్న సింహాలు నాలుగూ బేలగా రేడు కోసం పరితపిస్తున్నాయి. ఎవరో రావాలి. నందరాజ్యానికి నాటి మేటి విభవం తేవాలి అన్నట్టుగా ఎదురుచూస్తున్నాయి.

మరి ఎవరు వస్తారు? ఎప్పుడు మళ్లీ ఆ వైభవాన్ని తెస్తారు? ప్రభువు ఏలుబడిలో నందమంతా మరెప్పుడు కళకడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ రాజమాత మాకలిశక్తి వద్ద ఒకే ఒక్క సమాధానం ఉంది. అది ఆరని ఆశ రూపాన ఉంది. నంద రాజ్యానికి తూరుపు హద్దుల్లోని దోరశి బయలులో పెరుగుతున్న పెద్ద దేశిరాజు కుమారుడు సంజీవుడే ఆ ఆశ. కాళ్ల పారాణి సైతం ఆరకుండానే అయిదోతనాన్ని పొగొట్టుకున్నప్పటికీ, పుత్రుణ్ణి పెంచిపెద్దవాడిగా చేస్తున్న మోదమ్మే ఆ ఆశ. మినుములూరు గిరుల్లో జీవితాలు గడుపుతున్న ఆ తల్లీకొడుకు మీదనే ఆశ. ఎప్పటికైనా నందపురం పాలనాపగ్గాలను వారందుకుంటారన్నదే ఆ అశ. ఆ ఆశతోనే నందవనాలను నడిపించే కర్తవ్యాన్ని మాకలిశక్తి స్వీకరించింది. సమస్యలే మనిషికి మనుగడ నేర్పుతాయి. అపాయాలే మానవుడికి ఉపాయాలు తట్టేలా చేస్తాయి. రాజ్యరక్షణ విషయంలో మాకలి పరిస్థితి కూడా అచ్చంగా అదే.

రాజమాత ఏలుబడిలో నందరాజ్యం వికాసపథాన పయనించకపోవచ్చు. గడచిన కొన్నేళ్లుగా కోనల వారసత్వసంపదను మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తోంది. యువరాజులు పోయిన దుఃఖాన్ని ఇప్పుడిప్పుడే రాజ్యంలోని ప్రజలు మెల్లగా దిగమింగు కుంటున్నారు. నందాన్ని ఐక్యంగా ఉంచేందుకు, ప్రజలందరినీ సమైక్యబాటలో పయనింపజేసేందుకు, మాకలిశక్తి ప్రధానంగా ఉద్వేగపరమైన కొన్ని అంశాలను అమల్లోకి తెచ్చింది. బహుశా అవే ఇప్పటికీ నంద సామ్రాజ్యాన్ని చెదరకుండా చేస్తున్నాయేమో!

భైరవకాళీమాతను కొలిచే భక్తిమార్గాన్ని పెద్దఎత్తున ప్రచారం చేయడంతో పాటుగా, దేశిరాజుల బలిదానాన్ని ఎప్పటికప్పుడు కళ్లకు కట్టేలా వారి జయంత్యుత్సవాలను ఊరూరా నిర్వహించే ఏర్పాటు చేసింది. స్వాభిమానంతో దేహాలను తృణప్రాయంగా త్యాగంచేసిన దేశిరాజుల వృత్తాంతాన్ని పాటలుగా కట్టి రాజ్యమంతా వినిపిస్తోంది. ఇటింపండగ వేళలో గ్రామగ్రామానా వెజ్జులు, లెంకలు, పూజారులు దేశిరాజుల కథాగానం చేసేలా చర్యలు చేపట్టింది.

మాకలి చేసిన ఈ యోచన సరైనదే. ఈ దారి మంచిదే. ఈ పథకం గట్టిదే. కొత్త ప్రభువు నందపురానికి దక్కేవరకూ జనావళిని ఏకసూత్రంతో కలిపి ఉంచే ఈ ఆలోచన విలువైనదే. అందుకే రాజమాతకు నంద పౌర సమాజం హారతులెత్తు తోంది. నమస్సులు చెల్లిస్తోంది. తమకోసం, తమరాజ్యంకోసం, ముదిమి మీదపడుతున్నా పరిశ్రమిస్తున్న మాకలిని నెత్తిన పెట్టుకుంటోంది.

————————

‘‘ఏం. లోపలికి రారేం. దిష్టి తియ్యాలా ఏంటి. రండి. రండి. అబ్బాకూతుళ్లకి గొప్ప తిమ్మిరిగా ఉంది.’’ ముంజూరు ముందు నిలిచిన కోలన్న, గంగులను చూస్తూ ఎకసెక్కంగా అంది రేక. అందుకు జవాబుగా,

‘‘ఏవంట! దిష్టి తిస్తే ఏం పోయిందట? ఊరి కళ్లన్నీ నా బిడ్డ మీదనే ఉన్నాయీవేళ. దాని పాటకి, ఆటకి మన్యం పరవశించిపోయింది. చప్పున దయచెయ్యి. గభాల్న రా.’’ ముదలకించాడు కోలడు. ముసిముసిగా నవ్వింది గంగు. ప్రేమగా నాన్న చేతిని అదిమి పట్టుకుంది.

‘‘సరిపోయింది మేళం.’’ అంటూనే ఒక పిడికిట సామలు, మరో పిడికిట ఉప్పుకల్లు పట్టుకుని ఇంటి బయటకు వచ్చింది రేక. వస్తూనే రెండు చేతులూ పెనిమిటి చుట్టూ, పిల్ల చుట్టూ తిప్పుతూ మనసులోనే జాకరమ్మను తలచుకుంది. దిష్టి తీసింది. రేక దిష్టి తీస్తున్నప్పుడు కోలయ్య నోరు సవరించాడు.

‘నల్లపూస కొడివల్లన – పచ్చపూస కొడివల్లన

శరణుబాబు దేబాలమ్మలు – శరణుబాబు మాకలిశక్తి

మా మీద దయలుంచుడు తుమ్మిదీరో..’

దిష్టిమంత్రాలన్నట్టుగా గుర్తున్న భక్తి పలుకులేవో పలికాడు. దిష్టిసప్పరలు వీధిలో పారేసి వచ్చింది రేక. బయట పీనె మీదున్న నీళ్లగూన వంచుకుని కాళ్లు కడుక్కుంది. రేక కడుగుడు అయ్యాక తండ్రీబిడ్డలిద్దరూ పాదాల మీద నీళ్లు పోసుకున్నారు. ఇంట్లోకి కదిలారు. వాళ్లలా వస్తుండగా రేకమ్మ అందుకుంది.

‘‘ఏమే గంగా! మీ నాన్న చేతిని అంత గట్టిగా పట్టుకున్నావు. చిన్న లోలివి కాదు. గుబ్బటవయ్యావని గుర్తుపెట్టుకో. నీ వాలకం చూస్తుంటే రేపు పెళ్లయినా మీ బాబుని వదలనట్టుగా ఉన్నావే. తీసుకుపో. పెళ్లయ్యాక అత్తింటికే అబ్బనీ పట్టుకుపో.’’ కిలకిలలాడింది. ప్రశ్న, వెటకారం కలగలిసిన అమ్మమాటలకు గంగు బదులిస్తూ,

‘‘నాన్న నాడెం. నేనెంటే ప్రాణం. నువ్వూ ఉన్నావు! ఎప్పుడూ ఈసడింపే. పెళ్లయ్యాక నాన్నని నా ఇంటికే తీసుకుపోతా. నిన్ను మాత్రం గుమ్మం ఎక్కనివ్వను.’’ విసవిసలాడింది. ఆలకించిన కోలడు పులకించి పోయాడు. కూతురు బుగ్గలు పుణికాడు. రేక మాత్రం అలా చేయకపోగా,

‘‘చాల్లే మిటకరింపు. నీ ఇంటికెవడొస్తాడు. నేనేం రాను. నా మానాన నే బతుకుతాను. అయినా, నువ్వేం నందరాజ్యం రాణీవా? నీకొచ్చే మొగుడు కిడగనూరి మహరాజా?’’ ప్రేమపూర్వకంగానే కూతురిని అలుసు చేస్తూ మాట్లాడింది. గంగు పట్టించుకోలేదు. కోలడు కొంచెం కినిశాడు.

(ఇంకా ఉంది)

 

రచయిత పరిచయం

డా।। చింతకింది శ్రీనివాసరావు

విశాఖపట్నం జిల్లా చోడవరంలో పుట్టాను; విద్యార్హతలు: ఎమ్‌ఏ (‌తెలుగు), పీహెచ్‌డీ; వృత్తి: జర్నలిజం; ప్రవృత్తి: కథ, నవల, నాటక, మానవీయ కథనాల రచన, పరిశోధన.

దాలప్పతీర్థం, కాన్పులదిబ్బ, కప్పస్తంభం, ఉడుకుబెల్లం కథా సంపుటాలు వచ్చాయి. వికర్ణ, అదిగో ద్వారక, ఔటర్‌ ‌హార్బర్‌, ‌బుగతలనాటి చుక్కపల్లి నవలలు రాశాను. గర్భగుడి, ధారపాలెం మెజార్టీ, ఎక్కడివాళ్లక్కడే, ఒప్పులకుప్ప, గతి తప్పిన పాదం నాటికలు వెలువరించాను.

పురస్కారాలు:

–              భరతముని సాహిత్య పురస్కారం

–              పరిశోధనకు గాను ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి త్రిపురనేని గోపీచంద్‌ ‌బంగారు పతకం

–              రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు అవార్డు

–              కె.ఎన్‌.‌వై. పతంజలి సాహితీ పురస్కారం

–              కొలకలూరి నవలా పురస్కారం

–              ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ ఉగాది పురస్కారం

–              గర్భగుడి నాటిక రచనకు నంది అవార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram