శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు, దాస్యభక్తికి ప్రథమోదాహరణ. అనితరసాధ్యుడు, పట్టుదలకు మారుపేరు. అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయ పూర్వకంగా ఎదురునిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మాటకారి. నిర్భయత్వం, అమోఘమైన వాక్చాతుర్యం, అపారమైన బుద్ధిబలం, అద్భుత పాండిత్యాలకు గని. లోకారాధ్యుడు, ప్రత్యక్ష భగవానుడు, సూర్యభగవానుడి శిష్యుడు. కార్యాకారణ విచక్షణ, యుక్తాయుక్త వివేకం కలవాడు. భవిష్యద్బ్రహ్మత్వాన్ని సంపాదించిన మహా తవస్వి. అయినా నిగర్వి. ‘దేనికి నిరాశ చెందకూడదు. నిరంతరం శ్రమించాలి. స్వామి కార్యకోసం సిద్ధంగా ఉండగలగాలి. అప్పగించిన పనిని నిర్వర్తించేందుకు శక్తి మేరకు పాటుపడాలి. అవకాశాలు మూసుకు పోయినప్పుడు మరింత అప్రమత్తతతో ప్రత్యామ్నాయం అన్వేషించాలి’ అనేది హనుమత్‌ ‌సందేశం.

ఆయన పరాక్రమం, కార్యదీక్ష, స్వామి భక్తి, బుద్ధికుశలత, రాజనీతిజ్ఞత, యుక్తాయుక్త విచక్షణ తదితర సుగుణాలు సుందరకాండలో వెల్లడవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహునేర్పరి. ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు/పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్య కీర్తించారు.

సంకల్పసిద్ధుడు

సంకల్పం ఉంటే సాధించలేనిది లేదనేందుకు ఆంజనేయుడి సాహస కృత్యాలే నిదర్శనం. సీతాన్వేషణ నుంచి రామాయణంలోని ప్రతి విపత్కర పరిస్థితిలో ఆయన చూపిన చొరవ అనన్యసామాన్యం. దైవంతో పాటు స్వశక్తిని నమ్ముకున్నాడు. దైవభక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. కేవలం దైవభక్తి ఉంటే చాలదు. ఆత్మవిశ్వాసమూ ప్రధానం. ఇవి లోపించిన వారు ఏమీ సాధించలేరన్నది ఆంజనేయుడి తీరును బట్టి తెలుస్తుంది. ‘రామ బాణమంత వేగంగా లంకకు చేరతాను. సీతమ్మ కనిపించక•పోతే రావణుడిని బంధించి తీసుకువస్తాను. సర్వ విధాల కృతకృత్యుడనై సీతామాతతో సహా వస్తాను’ అన్న మాటలు ఆయన ఆత్మ విశ్వాసానికి ప్రతీకలు. దైవభక్తి, ఆత్మవిశ్వాసంతో పాటు ధీరత్వం (విఘ్నాలను లక్ష్యపెట్టక అనుకున్నది సాధించడం) ఆయనలోని మరో ప్రధాన లక్షణం. జలధి లంఘన నుంచి లంక నుంచి తిరిగి వచ్చేంతవరకు ఎన్నో అవాంతరాలను అధిగమించి, సీతామాత సందర్శన సమాచారాన్ని రాముడికి అందించిన ధీరుడు.

కర్తవ్యదీక్షా పరాయణత్వం

అప్పగించిన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ‘ రేపటి పనిని ఈ రోజు… నేటి పని ఇప్పుడే చేయాలి’ అనే వ్యక్తిత్వవికాస సూక్తికి స్ఫూరిప్రదాత. రామసుగ్రీవ మైత్రి సంధానంలో, సీతాన్వేషణలోని సముద్ర లంఘనంలో, సంజీవిని తెచ్చి సౌమిత్రిని కాపాడడంలో, రామలక్ష్మణులను మైరావణ బారి నుంచి కాపాడడంలో – ఇలా అడుగడుగునా హనుమ కార్యదీక్షా పటిమ వెల్లడవుతుంది. కొన్ని నిర్దేశిత కార్యాలైతే, ఇంకొన్ని నిర్దేశించుకున్న పనులు. వెరసి స్వామి కార్యాలు, లోకరక్షక విధులు. లోక సంరక్షణే వాటి పరమార్థం. ద్వాపరంలోనూ సోదర సమానుడు అర్జునుడి రథంపై ఆసీనుడై కురుక్షేత్ర సంగ్రామాన్ని కుతూహలంగా పరికించి విజయోస్తు అన్నారు. శ్రీకృష్ణభగవానుడి ముఖ పద్మం నుంచి వెలువడిన ‘భగవద్గీత’ అమృత వాక్కులను రథారూఢుడై విన్నారు. రెండు అవతారాల పరమ పురుషులు శ్రీరామకృష్ణులను సేవించిన స్వామి భక్తి పరాయణుడు.

ఉత్తమ దూత

దూతలను ఉత్తమ, మధ్యమ, అధములని మూడు వర్గాలుగా చెబుతారు. యజమాని అప్పగించిన పనిని నెరవేర్చకపోగా చెడగొట్టేవాడు మూడవ శ్రేణికి చెందిన వారు కాగా, చెప్పినంత వరకే చేసే వారు రెండవ శ్రేణికి చెందినవారు. యజమాని అప్పగించిన పనిని నిర్వర్తించడంతో పాటు తన తెలివితేటలను వినియోగించి పూర్తి సంతృప్తిని కలిగించేవారిని ఉత్తమ దూతగా చెబుతారు. మొదటి సందర్శనంలోనే హనుమలోని ప్రత్యేకతను గ్రహించిన రామచంద్రుడు ఆయనలోని విశిష్టతను తమ్ముడు సౌమిత్రికి వివరించారు. ‘ఏవం విధో యస్యదూతో నభవే త్పార్ధివస్యతు…’ (ఇలాంటి దూత ఎవరికి ఉండడో ఆ రాజు కార్యాలు ఎలా సిద్ధిస్తాయి? అంటే సిద్ధించవు అని అర్థం) ఇలాంటి దూత కలిగి ఉన్న వారి సర్వకార్యాలు సులువుగా, సలక్షణంగా నెరవేరతాయని వాల్మీకి మౌని రాముడి నోట పలికించారు.

సీతాన్వేషణకు ఆంజనేయుడే కార్యసాధకుడని సుగ్రీవుని సూచనతో పాటు స్వానుభవంతో గ్రహించిన రాముడు తన అంగుళీయకాన్ని అనుగ్రహించారు. ఆయన నమ్మకాని వమ్ము కానీయలేదు హనుమ. అంజనీసుత, పవనసుత, వాయుసుత, కేసరినందన, పావని, కపిశ్రేష్ఠ లాంటి ఎన్ని నామాలు ఉన్నా ‘శ్రీరామదూత’గా ఉండడమే ఆయనకు ఇష్టమట. ఆయన ఎంతటి రామ భక్తుడంటే… ‘యశ్చ రామం నపశ్యేత్తు/యం చ రామోనపశ్యతి/నిందితస్స వసేల్లోకే/ స్వాత్మేనం విగర్హతే!’ (శ్రీరామచంద్రుని చూడని వారు, రాముడు చూడని వారు నిందితులు. వారి ఆత్మలే వారిని గర్హిస్తాయి) అనేటంత. ‘యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌/‌తత్రతత్ర కృతమస్తకాంజలిమ్‌’ – ‌రామనామం వినిపించినచోటల్లా వినయాంజలితో నిలుచుండి పోతారట. ‘జై శ్రీరామ్‌’ ‌పిలుపుతో రాముడి కంటే ముందే చేరి తన తేజశ్శక్తిని ప్రసరింపచేసి కార్యోన్ముఖు లవుతారట. అందుకే శ్రీరాముడు వంటి ప్రభువు/యజమాని ఆంజనేయుడు వంటి సేవకుడు పుట్టలేదన్నది పెద్దల మాట.

తేజోమూర్తి

ఆంజనేయుడు ఎంతటి శాంతమూర్తో అంతటి తోజోమూర్తి. జ్మోతిర్మయుడు. దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడు. ‘కిమేషు భగవాన్నందీ భవేత్‌ ‌సాక్షా దిహాగతః’ (సాకాత్తు శంకరకింకరుడు నందీశ్వర భగవానుడిలా దిగివచ్చాడు. అలనాడు కైలాసంలో పరిహసించినందుకు నన్ను శపించినవాడు ఈయన కాదు కదా?)అని హనుమను చూసిన రావణుడు చకితుడై మనసులో అనుకున్నాడట. ఎక్కడ, ఎటు చూసినా వెలుగు, జ్ఞానమే. ఎటునుంచి ఎలా నమస్కరించినా, ఎలా ధ్యానించినా, ఎలా అర్చించినా ఆమోదిస్తారు. లోకాన్ని జయించిన ఆయన జీవితానికి రామనామమే రమణీయత, మహనీయత అని విశ్వసించిన భక్తా గ్రేసరుడు. ధైర్యశౌర్యఅభయాలకు ప్రతిరూపం.

వినయశీలి

కపిశ్రేష్ఠుడిగా మన్ననలు అందుకున్నప్పటికీ తాను ఏలికను కావాలనుకోలేదు. సుగ్రీవునికి సచివుడిగా ఉండేందుకే ఇష్టపడ్డారు. మంత్రిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించారు. దిగువ శ్రేణిలో పనిచేసినంత మాత్రాన అలాంటి వారిని తక్కువగా మదింపు చేయరాదని ఆంజనేయుడి వ్యవమారశైలిని బట్టి తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని కేవలం వారు చేసే పని, హోదాల ప్రాతిపదికన కాక, ఆయా పనులను సమర్థంగా చక్కబెట్టుకు రావడాన్ని బట్టి వారి ఉన్నతిని గుర్తించాలన్నది ఆర్యుల మాట. ఎదుటి వారి ఉన్నతినీ మన్నించే అంజనీసుతుడు పొగడ్తలు రుచించనివాడు. వినయశీలి. ‘ఈ సముద్రాన్ని దాటగల శక్తి వాయు దేవుడు, గరుత్మంతుడు, నీకే ఉందని నాకు అనిపిస్తోంది. వానరులలో నీవు తప్ప ఎవరు ఇలా లంకకు రాగలరు?’ అని ప్రశ్నించిన జానకితో ‘అమ్మా! సుగ్రీవుడు ఒక్కడే లంకలోని రాక్షసులను సంహరించగలడు. నాకంటే అమిత బలశాలురు, నాకు సమానమైన శక్తిగలవారు వానర సమూహంలో ఉన్నారు. ఆకాశంలో, భూమిపై మనసు కంటే వేగంగా అవలీలగా ప్రయాణించగల వారు సుగ్రీవాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. అందరికంటే చిన్నవాడినైనా నన్ను నీ జాడ కోసం పంపారు’ అని విన్నవించారు.

ఇంత వినయశీలి వీరత్వంతో కార్యరంగంలోకి దూకాలంటే పొగడ్తలు అనివార్యం. చిన్ననాట సంక్రమించిన శాపమే అందుకు కారణమైంది. ఆంజనా సుతుడు పుట్టీపుట్టగానే సూర్యబింబాన్ని ఫలంగా భావించి దానిని కబళించే ప్రయత్నంలో ఇంద్రుడి వజ్రాయుధఘాతానికి గురయ్యారు. దానితో తండ్రియైన వాయువు స్తంభించిపోయాడు. గాలిలేక లోకాలు అల్లకల్లోలమైపోయాయి. ఇంద్రాది దేవతలు దిగివచ్చి కేసరి నందనుడికి చిరంజీవిత్వాన్ని అనుగ్రహించారు. ఇంద్రుడి వజ్రాయుధ ధాటికి దవడలు (హనుములు) నొక్కుకుపోవడంతో ‘హనుమ’గా పేరు పొందారు. హనుమ పెరిగి పెద్దవుతున్న కొద్దీ బలగర్వంతో ఆగడాలు అధికమవుతున్నాయట. ఆయన అవంద్యుడు కనుక మరోలా శపించే అవకాశం లేక ‘నీకు బలం తెలియకపోవుగాక. నిన్ను పొగిడితేగాని నీ బలం పెరగకుండుగాక’ అని మునులు తదితరులు శపించారట. అందుకే సీతాన్వేషణకు బయలుదేరే ముందు జాంబవంత, అంగదాది కపివీరులు ఆయన బలాన్ని గుర్తు చేయవలసి వచ్చిందని అంటారు.

మనసు తెలిసి మాట

సమయానుకూలంగా మాట్లాడడంలో ఆంజనేయుడు బహునేర్పరి. ఉదాహరణకు, ‘రావణుని చెర నుంచి విముక్తి కలిగేనా?’ అని దైన్యస్థితిలో ఉన్న సీతాదేవికి శ్రీరాముని రాకపై, ఆయన సాధించబోయే విజయంపై, అందుకు సహకరించనున్న వానరసేన బలపరాక్రమాపై అపార విశ్వాసం కలిగేలా మాట్లాడారు. లంక నుంచి తిరిగి వచ్చి రాముడితో ‘దృష్ట్యా దేవీ’ (చూశాను సీతను) అని ప్రథమ సమాచారం అందించారు. ముఖ్య సమాచారం కోసం ఆతురతతో నిరీక్షించేవారిని ఎలా సమాధాన పరచవచ్చో దీని ద్వారా నేర్చుకోవచ్చు. సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడితో ఆమె పేరుతో మొదలెడితే ఆయన కంగారు పడవచ్చు. అందుకే ‘చూశాను/కనుగొంటిన్‌’ అని ప్రారంభించి తాను చేపట్టిన పనిని సానుకూలంగా పూర్తి చేసుకువచ్చిన వైనాన్ని వివరించారు. అంతకుముందు ఋష్యమూక పర్వతప్రాంతంలోనూ రామలక్ష్మణులను మొదటి సారిగా దర్శించినప్పుడు సంభాషణా చాతుర్యంతో మెప్పించి, సుగ్రీవునితో చెలిమి కుదిర్చారు.

హనుమే ఆదర్శం

దేశ యువతకు హనుమే ఆదర్శం అన్నారు స్వామి వివేకానంద. ఆయనలో అవధూతకు అవసరమైన లక్షణలు సంపూర్ణంగా ఉన్నాయన్నారు రామకృష్ణ పరమహంస. ‘రామా! కొన్ని సమయాలలో నీవు పూర్ణం. నేను అంశను. కొన్ని సమయాలలో నీవు ప్రభువు, నేను సేవకుడను. కానీ తత్త్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతావు’ అనేలా హనుమ తత్త్వం ఉంటుందని పరమహంస వ్యాఖ్యానించారు. ఆత్మపరాయుణుడైన తులసీదాస్‌ ‌వందల ఏండ్ల క్రితమే అందించిన‘హనుమాన్‌ ‌చాలీసా’ అశేష భక్తకోటికి పారాయణ గ్రంథమైంది. భూతవర్తమానభవిష్యత్తులు ఆయన అధీనంలోనే ఉంటాయని విశ్వసించిన తులసీదాస్‌ అణువణున ఆయనను ఆవహింపచేసుకున్నారు. ప్రముఖ గాయకుడు ఎం.ఎస్‌.‌రామారావు ఆలపించిన ‘సుందరకాండ భక్తుల హృదయాలను పరవశింప చేస్తోంది. ఇక ఆంజనేయుడికి ఆసేతుశీతాచల పర్యంతం ఆలయాలకు కొదువలేదు. రామచంద్రుడు ఊరిమధ్యలో కొలువుదీరితే హనుమన్న ఆలయాలు గ్రామ శివారుల్లో రక్షగా అన్నట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి.

‘హనుమత్సదృశం దైవం నాస్తి నాస్త్యేవ భూతలే అనేనైన ప్రమాణేన జయ సిద్ధికరం పరమ్‌’ (‌హనుమంతునితో సమానమైన దైవం భూతలంలో లేడు ఈ ప్రమాణం వల్లనే హనుమంత వ్రతం ఆచరించినవారికి నిశ్చయంగా జయం కలుగుతుంది) అని శాస్త్ర వచనం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram