ముందొచ్చిన చెవుల కంటే, వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నది సామెత. అది నక్సల్‌ అనే మాట విషయంలో తుపాకీలో తూటాలా సరిపో తుంది. ఇప్పుడు నక్సల్‌ అన్న పదం కంటే అర్బన్‌ ‌నక్సల్‌ అన్న పదం ఎక్కువమందికి తెలుసునేమో! దీనికి కారణం, నక్సలైట్‌ ఉద్యమ జన్మస్థలి నక్సల్‌బాడి (పశ్చిమ బెంగాల్‌) ఆ ‌జాడలని వదిలించుకోవాలని చూడడం అలాంటి పరిణామమేనేమో! అలాగే గెరిల్లా (రహస్య ఉద్యమానికి పేరు. అయితే గెరిల్లా ఉద్యమాన్ని అంచనా వేసేటప్పుడు పొరబడరాదు) అనే మాట స్థానంలో అర్బన్‌ ‌గెరిల్లా అన్న కొత్త మాట కూడా పుట్టుకొచ్చింది. అంటే అడువులలో కాకుండా నగరాలలో కడుపులో చల్ల కదలకుండా యూనివర్సిటీలలో ప్రాఫెసర్లుగా, లాయర్లుగా, జర్నలిస్టులుగా, ఎన్‌జీవో నిర్వాహకులుగా కాలం గడుపుతూ, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా రోడ్లూ, సరిహద్దులూ కబళించే తెగ అన్నమాట (ప్రభుత్వ వ్యతిరేకత అంటే సంఘ పరివార్‌ ‌విషయంలోనే). ఇలాంటి వాళ్లందరినీ కలిపి ఒక వర్గం మీడియా ‘మేధావులు’ అని పిలుస్తూ ఉంటుంది. వీళ్ల ఎజెండాకి చిరునామయే టూల్‌కిట్‌.

‌డీఎన్‌ఏ అనే పత్రిక, వెబ్‌సైట్‌ ‌బృందం ఈ మధ్య ఆ నక్సల్‌బాడి గ్రామాన్ని సందర్శించింది (ఫిబ్రవరి 19 నాటి నివేదిక).1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌కు మిగిలిన చేదు అనుభవం తరువాత మన దేశంలో వామపక్ష సిద్ధాంత ఆరాధకులు, విశ్లేషకులు చైనాను శ్లాఘించే పనిని భుజాన వేసుకున్నారు. అప్పటిదాకా సోవియెట్‌ ‌రష్యా భక్తులే ఉండేవారు. 1962 దరిమిలా చైనా భక్తబృందం కూడా మొలుచుకొచ్చింది. చైనా అధ్యక్షుడు ఇండియా అధ్యక్షుడంటూ గోడల మీద రాతలు కూడా వెలిసేవి. ఇందులో నుంచి పుట్టిన ఒక తెగే 1967లో నక్సల్బరీ ఉద్యమం ఆరంభించింది. అది జరిగింది ఈ నక్సల్‌బాడిలోనే. అందుకే వాళ్లని నక్సలైట్లు అంటూ ఉంటారు. అన్నట్టు నక్సల్‌బాడిలో మావో జెండాగ్‌ ‌విగ్రహం ఇప్పటికీ ఉంది.

రాజకీయాలంటే రక్తపాత రహితంగా జరిగే యుద్ధం. ఇక యుద్ధం అంటే రక్త సహిత రాజకీయాలే అన్నాడట నక్సల్స్ ఆరాధ్యదైవం మావో. ఆయన సిద్ధాంతాలని అమలు పరచడానికి నక్సల్‌ ఉద్యమాన్ని ఇక్కడ ఆరంభించినవారే  చారు మజుందార్‌, ‌కానూ సన్యాల్‌. ‌పేదలకు హక్కులు దఖలు పరచాలంటే ప్రభుత్వాన్ని తుపాకీతో, తుపాకీ మందుతో హడలు గొడితేనే సాధ్యమన్నది వారి ప్రగాఢ నమ్మకం. ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న నక్సల్‌ ‘‌విప్లవం’ తరువాత దాదాపు వందముక్కలయింది. ఇంకా ముక్కలవుతూనే ఉంది. కొన్ని సంస్థలు చారు మజుందార్‌ ‌పంథాను విడిచిపెట్టవలసిందేనని భావించాయి కూడా.  ఇప్పుడు అడవులు కాదు, నగరాల కేంద్రంగా సాయుధ విప్లవం నడపాలన్నది వారి వ్యూహం. తాజాగా అర్బన్‌ ‌నక్సల్స్ ‌పంథా ఏమిటంటే అడవికి బదులు ట్విటర్‌ని ఆశ్రయించడం, తుపాకీ బదులు టూల్‌కిట్‌ని నమ్ముకోవడం.

నక్సల్‌బాడిలో రెండు తరాల క్రితం నక్సలిజం పుట్టింది. అక్కడ చాలామంది నక్సల్‌ ‌నాయకులుగానే ఉనికిని చాటుకుంటూ ఉంటారు. అయితే నేటితరం మాత్రం ఈ ఆలోచన నుంచి సుదూరంగా జరిగి పోయారు. మావో, ఇతర నాయకుల శిలా విగ్రహాలు యువతరం దృష్టిలో  కేవలం రాళ్లు, బొమ్మలు. ఆలోచనావిధానం మార్చుకోవలసిన అవసరం గురించే ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వాల కార్యక్రమాల మీద నిరసన పలచబడిపోయాయి. అక్కడి యువతే ఇప్పుడు ప్రభుత్వోద్యోగాల కోసం పోటీ పరీక్షలకు హాజరవుతున్నది. మాకు తుపాకులు అక్కరలేదు, కంప్యూటర్లు కావాలి అంటున్నారు.

‘నేను సైన్యంలో చేరాలని అనుకుంటున్నాను’ అని ఒకరు, ‘నేను ప్రభుత్వోద్యోగంలో చేరడానికి పరీక్షలు రాస్తున్నాను’ అని మరొకరు అంటే, ఇంకొకరు ఏకంగా అసలు ‘నక్సల్‌బాడి రూపు మార్చాలి’ అన్న అభిప్రాయంతో ఉన్నారు. అక్కడి వారంతా గతంలో జరిగిన హింసాకాండను మరచిపోయి, శాంతియుతంగా బతకాలని కోరుకుంటున్నారు. ఆనాటి కొన్ని అరాచకాల కారణంగా నక్సల్బరీ మొదలై ఉండవచ్చు. కానీ నేడు మాత్రం వారు మార్పునే కోరుతున్నారు. కొందరు తమ పిల్లల భవిష్యత్తు కోసం నగరాలకు పోయి బతుకుతున్నారు. చాలామంది ప్రజాస్వామ్యం గొప్పదనం తెలుసుకున్నారు. దేశ ప్రగతిని అర్ధం చేసుకున్నారు. ఈ విషయం దేశమంతటికీ ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది.


కెనడాలో, ఆ పార్లమెంటులో ఖలిస్తానీ మద్దతుదారులు!

‘నేను పుట్టుకతో సిక్కును అయినందుకు గర్వపడతాను. కెనడా సిక్కులను ఎంతో ప్రేమిస్తాను. కానీ నేను ఖలిస్తానీ ఉగ్రవాదిని కాదు. దాని సానుభూతి పరుడిని కూడా కాదు. అయితే కెనడాలో, అలాగే ఈ సభ (పార్లమెంట్‌)‌లో ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులైన సిక్కులు ఉన్నారు.’ భారత సంతతికి చెందిన కెనడావాసి, పార్లమెంట్‌ ‌సభ్యుడు రమేశ్‌సింగ్‌ ‌సాంఘా ఫిబ్రవరి 17వ తేదీన సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో (వర్చ్యువల్‌) ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఒక దేశ సొంత వ్యవహారాలని చూడకుండా, భారత్‌ ‌మీద ఖలిస్తానీలు విషం చిమ్ముతున్నారు అని కూడా రమేశ్‌సింగ్‌ ‌నిర్మొహమాటంగా ప్రకటించారు.

2018లో కెనడా రహస్య గూఢచారి నివేదిక కూడా ‘సిక్‌ (‌ఖలిస్తాన్‌) ఉ‌గ్రవాదం’ అంటూ ప్రస్తావించిన సంగతిని రమేశ్‌సింగ్‌ ‌గుర్తు చేశారు. ఈ పదాన్ని తరువాత ప్రభుత్వం తొలగించింది. అందుకు కృతజ్ఞతలు అంటూనే, ఆయన ‘అలాంటి పదాన్ని తొలగించాలంటూ ఎంపీలు, మంత్రులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసి రావడం అత్యంత అవమానకరం’ అని కూడా అభిప్రాయ పడ్డారు. భారత్‌లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నప్పటికీ కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు 2018లో కెనడా ప్రభుత్వం వారి మీద ఉగ్రవాదులు అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

‘భారతదేశంలోనే స్వతంత్ర దేశం ఏర్పాటు చేయడానికి జరుగుతున్న హింసాత్మక చర్యలకు కెనడాలోని కొందరు వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు’ అని కెనడా గూఢచారి నివేదిక స్పష్టం చేసింది. ‘ఆ చర్యలన్నీ 1982-1993 మధ్య జరిగాయి. ఆ సమయంలోనే కొందరు వ్యక్తులు, సంస్థలు కలసి పలు ఉగ్రవాదదాడులకు పాల్పడడం కనిపిస్తుంది. 331 మందిని పొట్టన పెట్టుకున్న  కనీవినీ ఎరుగని 1985 నాటి ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుట్ర కెనడాలోనే జరిగింది.’ అని కూడా అదే నివేదిక తేటతెల్లం చేసింది. ప్రస్తుతం అలాంటి ఉగ్రవాద చర్యలు ప్రపంచంలో తగ్గినప్పటికి, అందుకు సంబంధించిన సిద్ధాంతానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు ఇప్పటికీ ఉన్నాయని కూడా ఆ నివేదిక తెలిపింది. ఉదాహరణకి కెనడాలోని బబ్బర్‌ ‌ఖాల్సా ఇంటర్నేషనల్‌, ఇం‌టర్నేషనల్‌ ‌సిక్‌ ‌యూత్‌ ‌ఫెడరేషన్‌ ‌సంస్థలు. అవి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న సంస్థలుగా పేరుపడ్డాయి. ఈ తరహా వ్యక్తులను, సంస్థలను రక్షించడానికి  ఎంపీలు ప్రయత్నిస్తున్నారని రమేశ్‌ ‌సింగ్‌ ఆరోపించారు. వీళ్లని చరిత్ర క్షమించదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి రమేశ్‌సింగ్‌ ఏదైనా నిష్కర్షగా మాట్లాడే వ్యక్తి అని అర్ధమవుతుంది. ఆయన లిబరల్‌ ‌పార్టీకి చెందినవారు. అంటే ప్రస్తుత అధికార పార్టీ. ఈమధ్య ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. కారణం, ట్రుడో ప్రభుత్వాన్ని విమర్శించడమే. ఈ ప్రభుత్వం ఖలిస్తానీ ఉదగ్రవాదులకు నీడను ఇస్తున్నదని ఆరోపించారు.

కానీ భారతదేశంలో మాత్రం రైతుల ఉద్యమానికి ఖలిస్తానీల మద్దతును వరంగా భావిస్తున్నాయి కొన్ని సంఘాలు. ఉద్యమించినది ప్రధానంగా సిక్కులు. ప్రస్తుతం వారి మనోస్థితిని ఆసరా చేసుకుని తిరిగి ఖలిస్తాన్‌ ఉద్యమానికి బలం చేకూర్చాలన్న కుతంత్రమే ఆ మద్దతు వెనుక ఉంది. దానినే రమేశ్‌సింగ్‌  ‌వెల్లడించారు. సత్యం బయటకు వస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు. ఇప్పుడు భారతదేశంలో నవ యువగళం వచ్చిందంటూ కొన్ని పత్రికలు ఆకాశానికెత్తేస్తున్న దారి తప్పిన యువత అంతా ఈ ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాద సంస్థ  సమర్ధుకులేనన్న సంగతి విస్మరించలేం. అది ఈ దేశ విభజన కోరుతోంది.

About Author

By editor

Twitter
Instagram