ఈ ‌జనవరి 26వ తేదీన ఢిల్లీలో హింసాత్మక ఘటనల వెనుక దేశ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రైతుల పేరుతో గణతంత్ర దిన వేడుక రోజునే ప్రదర్శనకు దిగడం వెనుక కారణాల దగ్గర నుంచి, ఉద్యమంలో విదేశీశక్తుల పాత్ర ఉందని ఇప్పటికే పోలీసుల విచారణలో బయట పడిన నేపథ్యంలో తాజా పరిణామాలు దీనికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. 

తీగ లాగితే డొంకంతా కదులుతోంది. టూల్‌కిట్‌ ‌కేసును తవ్వినకొద్దీ అనేకమంది పేర్లు బయటపడుతున్నాయి. ఈ కేసులో బెంగళూరుకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి దిశారవి (జోసెఫ్‌), ‌ముంబైకి చెందిన న్యాయవాది నికితా జాకబ్‌, ‌పుణెకి చెందిన ఇంజనీర్‌ ‌శంతను ములుక్‌లు అరెస్టయ్యారు. స్వీడన్‌ ‌పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ‌సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేసిన టూల్‌కిట్‌ (‌గూగుల్‌ ‌డాక్యుమెంట్‌)‌ను ఎడిట్‌ ‌చేశారని ఈ ముగ్గురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో ఏం ఉంది? విధ్వంసం గురించి ఎలాంటి ప్రణాళిక ఉన్నదో దేశానికీ, ప్రపంచానికీ కూడా తెలుసు. కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వీరినే ఈ దేశ యువ నవగళాలంటూ ఒక వర్గం మీడియా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారి భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి పలువురు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్న వారిని ఈ దేశ నవ గళాలని కీర్తించడం ఏమి సబబో అర్ధంకాదు. మరొకసారి ఈ దేశ విభజనే ధ్యేయంగా మొదలైనది ఖలిస్తాన్‌ ఉద్యమం. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పీటర్‌ ‌ఫ్రెడ్‌రిక్‌కి టూల్‌కిట్‌తో సంబంధం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా గుర్తించారు. పీటర్‌ ‌కరుడుకట్టిన ఖలిస్తానీ మద్దతుదారు భజన్‌సింగ్‌ ‌బిందర్‌కి సన్నిహితుడు. అంతేకాదు, పీటర్‌కి పాక్‌ ‌నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు కూడా మన నిఘా వర్గాలు గుర్తించాయి. దీనితో జనవరి 26 నాటి ఢిల్లీ  హింస వెనక ఐఎస్‌ఐ ‌పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించక తప్పడం లేదు. టూల్‌కిట్‌ ‌వ్యాప్తికి హాష్‌ట్యాగ్‌లను రూపొందించడంలో పీటర్‌ ‌కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు మోదీని ఈ దేశంలో, కొన్ని విదేశాలలో కొందరు ద్వేషిస్తూ ఉండడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో, అవే కారణాలతో పీటర్‌ ‌కూడా మన ప్రధాని మీద ద్వేషం పెంచు కున్నాడు. గతేడాది అమెరికాలో మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. గాంధేయ మార్గంలో, అహింసాయుతంగా ఆందోళన చేస్తున్నామని దబాయిస్తున్న ఉద్యమకారులు, రైతు వేషం వేసిన విధ్వంసకారుల హక్కుల కోసం విలవిలలాడిపోతున్నవారు ఈ పీటర్‌ ‌విషయంలో గమనించవలసిన వాస్తవం ఒకటి ఉంది. గతేడాది అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చిన ఘటనలో పీటర్‌ ‌పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దిశారవిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రైతు నిరసనల్లో హింసాత్మక అల్లర్లు జరిగేలా టూల్‌కిట్‌ను ఆ ముగ్గురు షేర్‌ ‌చేశారని, ఆ లింక్‌ల మూలాలు ఖలిస్తాన్‌ ‌వేర్పాటువాదులకు చెందినవని వారు చెబుతున్నారు. నికిత, శంతనులకు ఖలిస్తానీ గ్రూపుతో సంబంధా లున్నాయనీ, దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, ఖలిస్తానీ ఉద్యమానికి మళ్లీ జీవం పోసే కుట్రలో వీరు భాగస్వాములనీ పోలీసులు ఆరోపిస్తున్నారు.

గ్రెటా థన్‌బర్గ్‌తో దిశారవి చేసిన వాట్సాప్‌ ‌సంభాషణల్లో కూడా కీలక విషయాలు తెలిశాయి. రైతు ఆందోళనలకు మద్దతు వెనుక ఖలిస్తానీ శక్తుల ప్రమేయం ఉందని, దేశద్రోహం సెక్షన్ల కింద గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసిన సమయంలో గ్రెటా థన్‌బర్గ్‌తో దిశ వాట్సాప్‌ ‌సంభాషణ జరిపినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ‘టూల్‌కిట్‌ ‌వ్యవహారంలో పోలీసులకు సమాచారం ఉంది. మీరు ఏమీ మాట్లాడవద్దు…’ అని గ్రెటాతో దిశ వాట్సాప్‌లో సంభాషించిందని పోలీసులు తెలిపారు.

ఎంబీఏ చదివిన దిశారవి ‘ఫ్రైడే ఫర్‌ ‌ఫ్యూచర్‌’ ‌పేరుతో 2018లో స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ‌స్థాపించిన సంస్థకు బెంగళూరు చాప్టర్‌కి వ్యవస్థాపక సభ్యురాలు. ఆ సంస్థ కార్యకలాపాలను భారత్‌లో ఈమే నిర్వహిస్తు న్నారు. ‘ఫ్రైడే ఫర్‌ ‌ఫ్యూచర్‌’ ‌క్యాంపెయినింగ్‌లో భాగంగా విద్యార్థులు ప్రతి శుక్రవారం తరగతులను బహిష్కరించి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయాలని పిలుపునిస్తున్నారు.

రైతుల ఉద్యమానికి మద్దతు కూడగట్టడం కోసం టూల్‌కిట్‌ ‌రూపకల్పన వెనక ప్రధాన పాత్ర ఎక్స్ఆర్‌ (ఎక్స్‌టింక్షన్‌ ‌రెబెలియన్‌) ఇం‌డియా కార్యకర్తలదేననీ పోలీసుల విచారణలో తేలింది. ఇది వాతావరణ మార్పులకు దారితీసే చర్యలపై అహింసాయుతమైన శాసనోల్లంఘన కార్యక్రమాల ద్వారా నిరసనలు తెలిపే ఉద్యమకారుల బృందం. నిందితుల్లో ఒకరైన నికిత ఎక్స్ఆర్‌లో రెండేళ్ల నుంచి వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. టూల్‌కిట్‌తో తనకు సంబంధం లేదు కానీ, దాని రూపకల్పన కోసం జరిగిన వర్చువల్‌ ‌సమావేశంలో తాను పాల్గొన్న మాట నిజమేనని నికితా చెప్పడం అమాయకత్వమే అనుకోవాలా? ఇప్పుడు దేశంలో ఒక వింత వాదన మొదలయింది. వీరంతా ఇరవయ్యేళ్ల వారేనట. కాబట్టి ఇలా యువతను, భావి మేధావులను అరెస్టులు చేసి వేధించడం చూస్తుంటే బాధగా ఉందట. ప్రజాస్వామ్యం ఏమైపోతోందని గుబులుగా ఉందట. అసాంఘిక శక్తులకు హక్కులు, దయ విరివిగా ఒలకబోస్తున్న దేశంలో రైతుల ఉద్యమం విషయంలో విదేశీయులు మాట్లాడడం సరికాదని చెప్పేవారు మాత్రం ద్వేషానికి గురి కావడంలో వింతే ముంటుంది?

ఈ అరెస్టులకు దిశారవి తదితరుల సమర్ధకులు కొత్త భాష్యాలు చెబుతున్నారు. రైతుల ఉద్యమం గురించి ప్రపంచమంతా ప్రచారం చేయడమే దేశద్రోహమైతే ఆమె కారాగారంలో ఉండడమే మంచిది అంటున్నారు ఆమె న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్‌. ‌భారతీయులు వాస్తవాలను ఏ మాత్రం పట్టించుకోరని వీరి నమ్మకం కాబోలు. ఉద్యమం గురించి ప్రచారం చేసినందుకు అరెస్టు చేశారా? ఖలిస్తానీ మద్దతుదారులతో చేయి కలిపినందుకు అరెస్టు చేశారా అన్న విషయం ఈ దేశ ప్రజలు గ్రహించలేరనే వీరి నమ్మకమా? ఆమె బెయిల్‌ ‌కోసం ఢిల్లీలోని పటియాలా కోర్టులో వాదించినప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఆమె చేసిన పనులు నేరాలేనన్న సంగతి ఆమెకు తెలుసు, ఈ దేశాన్ని అపకీర్తి పాల్జేయడమే ధ్యేయంగా ఇదంతా జరిగింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు వాదించారు. కోర్టు ఇదే నమ్మింది. చాలామంది భారతీయులు కూడా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. పర్యావరణం కోసం ఉద్యమాలు చేస్తున్నానని చెబుతున్న దిశ పంజాబ్‌ ‌రైతులు పర్యావరణ రహితంగా సాగిస్తున్న సేద్యం గురించి ఎప్పుడైనా నోరెత్తారా అని నిలదీస్తున్నారు. పంజాబ్‌ ‌రైతుల న్యాయమైన హక్కులను అందరూ సమర్ధిద్దాం. కానీ వారి బాధ్యతలేమిటో గుర్తు చేయవలసిన అవసరం కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంత చిన్నవయసులోనే కంకణం కట్టుకున్న దిశకు పంజాబ్‌ ‌రైతులు పర్యావరణానికి చేస్తున్న చేటును గుర్తు చేయవలసిన అవసరమే ఎక్కువ. ఇప్పటికీ పంట కోసిన తరువాత తగులబెట్టే విధానాన్ని ఆపివేయడానికి రైతులు అంగీకరించడం లేదన్న సంగతి దిశకు తెలియదని అనుకోలేం. కానీ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది చేస్తున్న వాదన- పర్యావరణానికీ, సాగుకీ అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టే దిశ ఢిల్లీ రైతుల గురించి మాట్లాడవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రజలు సత్యం పట్ల చైతన్యం కలిగి ఉన్నామని అనుకోవడం కాదు, చైతన్యాన్ని రాజ్యాంగ బద్ధంగా ప్రదర్శించాలి. అప్పుడే ఇలాంటి శక్తులు ఇన్ని కోట్ల మంది ప్రజలను దబాయించడానికి సాహసించవు. చాయ్‌, ‌యోగాలను లక్ష్యంగా చేసుకుని కారుకూతలు కూసినా వాటిని పర్యావరణ పరిరక్షణ సూత్రాలుగానే ఈ దేశం నమ్మాలని చెప్పడం విడ్డూరం కాదా? దిశ ఎంత ఘనురాలో న్యాయవాదే చెప్పారు. నేరాన్ని మిగిలిన ఇద్దరి (నికితా, ములుక్‌) ‌మీదకు తోసేయ డానికి ప్రయత్నిస్తున్నది కాబట్టి కస్టడీ అవసరమేనని భావించారు. టూల్‌కిట్‌లో ఉంచిన మార్గదర్శకాలను బట్టి మేం ఎర్రకోట వద్ద రగడ సృష్టించినట్టు అరెస్టయినామని ఎవరూ చెప్పలేదని దిశ న్యాయవాది వాదించడం కూడా న్యాయవాదులను తప్పదోవ పట్టించే విధంగానే ఉంది.

ఆ టూల్‌కిట్‌లో పలు కీలక విషయాలున్నాయి. చిత్రం ఏమిటంటే అందులో ఏవీ కూడా పర్యావరణ రక్షణ కోసం ఉద్దేశించినవి కావు. ఉద్యమించమని చెప్పేవి కూడా కాదు. రైతు ఉద్యమం నేపథ్యంలో ఏ ఆందళోనలో ఎవరు, ఎప్పుడు పాల్గొనాలో, దేశంలో జరుగుతున్న విషయాలను ఎలా గోరంతలు కొండంతలుగా ప్రచారం చేయాలో, పథకం ప్రకారం దుష్ప్రచారాన్ని ఎలా వ్యాప్తిచేయాలో వివరించే విషయాలే అందులో స్పష్టంగా ఉన్నాయి. దీని సృష్టికర్త ‘పోయెటిక్‌ ‌జస్టిస్‌ ‌ఫౌండేషన్‌’ (‌పీజేఎఫ్‌)‌గా పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే తేలింది. దీని నిర్వాహకుడు కూడా కెనడాకు చెందిన ఖలిస్తాన్‌ ‌కార్యకర్తే. అతడి పేరు మోధలీవాల్‌. ‌ధలీవాల్‌ ‌విదేశాల్లో చిరకాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించి భారత్‌ను పలు ముక్కలుగా చేయడమే తన లక్ష్యమని బాహాటంగానే ప్రకటించాడు కూడా. అతడి ఆశయాల కోసం ఇక్కడ పనిచేస్తున్నవాళ్లని ఏమనాలి?

డిసెంబర్‌ 6‌న ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్‌ ‌ఫార్మర్స్ ‌స్ట్రైక్‌’ అనే వాట్సాప్‌ ‌గ్రూప్‌పైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమంలో హింసను ప్రేరేపించడమే లక్ష్యంగా జనవరి 11న ఖలిస్తాన్‌ అనుకూల సంస్థ, పీజేఎఫ్‌ ‌జూమ్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహించిందని పోలీసులు గుర్తించారు. టూల్‌కిట్‌ ‌విధి, విధానాలను నిర్ణయించేందుకే ఈ సమావేశం జరిగినట్లుగా సైబల్‌ ‌సెల్‌ అధికారులు తెలిపారు. పీజేఎఫ్‌ ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో దాదాపుగా డెబ్భై మంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో నికితా జాకబ్‌, ‌శంతనుములుక్‌ ఉన్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వీరితోపాటు ఇంకా ఎవరు ఈ సమావేశానికి హాజరయ్యారని విచారిస్తు న్నారు. టూల్‌కిట్‌ ‌కోసం ఉపయోగించిన ఈ-మెయిల్‌ ‌శంతనుదేనని విచారణలో వెలుగుచూసింది. అంతేకాదు, ధలీవాల్‌ ‌సహచరుడు, కెనడాకు చెందిన పునీత్‌.. ‌నికితా జాకబ్‌ను గణతంత్ర దినోత్సవానికి ముందురోజు కలిశాడని, రైతు ఉద్యమంపై సోషల్‌ ‌మీడియాలో ఒక తుపాను సృష్టించాలని సూచించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదంతా గమనిస్తే ఒక పథకం ప్రకారమే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే టూల్‌కిట్‌ ‌రూపకల్పన జరిగిందన్న బీజేపీ నేతల మాటల్ని కొట్టి పారేయలేం.

నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, మానవ హక్కుల కార్యకర్తలు, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు ఇవేవీ పట్టకపోవడం గమనార్హం. భారతదేశం మీద తమకు అపారమైన భక్తి ఉందని సమయం వచ్చినప్పుడల్లా ఉపన్యాసాల్లో ఊదరగొట్టే ఈ నాయకులు విదేశీ విచ్ఛిన్నకర శక్తులు మనదేశంలో పాగా వేయాలని చూస్తున్నా, విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నా ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. దిశారవి అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినవారిని కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తున్నదంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కానీ సచిన్‌ ‌టెండూల్కర్‌, ‌లతా మంగేష్కర్‌, ఇం‌కా కొందరు ప్రముఖులు దేశానికి మద్దతుగా విదేశీయులు భారత వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని సోషల్‌ ‌మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు, వారిపై సీబీఐ విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరెందుకు? అంటే ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు ఉన్న స్వేచ్ఛ, దేశాన్ని ప్రేమించేవారికి లేదనుకోవాలా? హింసకోసం కుట్ర పన్నినవారు గాంధీ మార్గంలో ఉద్యమిస్తున్న వారిగా వీరందరికీ అర్ధమవుతున్నారు. ఆ హింసను వ్యతిరేకించినవారు హిందూవాదులుగా కనిపిస్తున్నారు. తమతమ రంగాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సచిన్‌, ‌లతా మంగేష్కర్‌ ‌వంటి వారిని కూడా మోదీ వ్యతిరేకులు విద్రోహులుగా, సామాజిక సమరసతను చెడగొట్టే వారిగా చూపెట్టే ప్రయత్న చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట కాదా?

About Author

By editor

Twitter
Instagram