కోరికలు, ఆశలు ఉండడం తప్పుకాదు. అవి లేనివారంటూ ఎవరూ ఉండరు. ఆకాంక్ష, ఆశారహితులైన వారి జీవితం తావి లేని పూవు లాంటిది. అవే జీవితనావకు చుక్కాని వంటివి. అయితే ఆ ఆశలు అత్యాశగా లేదా దురాశగా మారకూడదని, కోరికలు కళ్లాలు లేని గుర్రాలు కాకూడదని అంటారు. కోరికలే గుర్రాలైతే విపరీత, విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకు పురాణాలు నుంచి ఆధునిక కాలం వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పురాణాలలో వరాలనే కోరికలుగా అనుకుంటే, ముందువెనుక ఆలోచించకుండా అడిగిన వరాల (కోరికల) పర్యవసానాలను కథలు కథలుగా వింటున్నదే. అసలు కోరికలే కోరకూడదనడం వితండమే అవుతుంది. యుక్తాయుక్త విచక్షణను పాటించి కోరదగిన వాటినే కోరుకోవాలని వాటిని బట్టి స్పష్టమవుతుంది. అసంబద్ధ కోరికలకు అత్యాశ, అసంతృప్తి తోబుట్టువుల లాంటివి. అత్యాశ కోరికలను ప్రేరేపిస్తే,

అవి ఎంతగా సిద్ధించినా అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. తీరని

కోరికలు దుఃఖానికి హేతువులని, కోరికలే లేకుంటే

దుఃఖానికే అవకాశం ఉండదని చెబుతారు.

అసలైన శత్రువులు అరిష్వడ్గాలు అంతఃకరణలోనే ఉన్నారని, వాటిలో మొదటి కామం (కోరిక) అని చెబుతారు. విషయా సక్తులకు కోరికలు కలుగుతాయి. అవి తప్పుకాకపోయిన హద్దులు దాటక మన అధీనంలోనే ఉండాలి. అందుకు భిన్నంగా జరిగితే మనిషి వాటి వెంట పరుగులు తీస్తూ, ఫలితంగా ధర్మమార్గం తప్పవలసి వస్తుంది. అవి కొన్నిసార్లు జీవితగమనాన్నే ఛిన్నాభిన్నం చేసే ఆస్కారం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, అక్రమార్జనపరులు దీనికి కిందికే వస్తారు.

అనేక కోరికలు తీర్చుకునే క్రమంలో పొందే ఆనందం, సుఖం తాత్కాలికమే. ఒకదాని తరువాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. నీటి కోసం ఎండమావుల వెంట పరిగెత్తినట్లు కోరికలను పట్టుకొని పాకులాడడం అవివేకం అంటారు పెద్దలు. మనిషి సుఖపడేందుకు ఎన్ని దారులు ఉన్నాయో, దుఃఖ పడేందుకు అంతకుమించిన కారణాలు ఉన్నాయని విజ్ఞులు చెబుతారు. అలవిమాలిన కోరికలూ వాటిలో భాగమే. అసంబద్ధ కోరికలు మనిషిని చింతల్లోకి నెట్టవచ్చు. అసలు ఏమీ లేనప్పుడు కొంత ఆసరా కోరుకునేవారు అది దక్కిన తరువాత మరిన్ని కావాలనుకోవడం, తమతమ స్థాయిని, యోగ్యతను మరచి ఉన్నతమైన వాటిని ఆశించడం దీని కిందికే వస్తుంది. అలా అని సాధించిన దానితో సంతృప్తి చెందాలని ఎవరూ చెప్పరు. అంకిత•భావం, పట్టుదల, కృషితో సమాజహితం కోసం నిర్దేశిత లక్ష్యసాధన వేరు. ఇంకొకరికి ఇబ్బంది కలిగిస్తూ తనకు మాత్రమే ఉపయోగపడేలాంటి కోరికలు పుట్టుకు రావడం వేరు.

‘ఆశాయాః ఖలు యే దాసాః తే దాసాః సర్వదేహినామ్‌!

ఆశా దాసీకృతా యేన తస్య దాసాయతే జగత్‌!! (‌దురాశకు దాసులైన వారు సర్వప్రాణివర్గానికి దాసులై ఉండాల్సి ఉంటుంది. అదే దురాశకు దూరంగా ఉండేవారికి లోకమంతా అణగి ఉంటుంది) అని ఆరోక్తి.

తృష్ణ అంటే అత్యాశ, అపరిమిత కోరికలు. ఒక కోరిక తీరితే మరొకటి పుడుతూనే ఉంటుంది. ‘ఇదొక్కటే కోరిక’ అని ఎప్పటికప్పుడు అంటుంటారు కానీ ఎక్కువమంది విషయంలో దానికి అంతమంటూ ఉండదు.

మనిషి తన శక్తియుక్తులతో పట్టుదలతో కోరికలను సాకారం చేసుకుంటున్నాడు. అయినా కోర్కెల చిట్టా పుట్టుకొస్తూనే ఉంటుంది. అవి నిర్మాణాత్మకం, సమాజహితం అయితే ఆమోదయోగ్యమే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, ఇతరులకు ఇబ్బంది కలిగించేవో అయితే గర్హనీయమే. ‘అందరూ సుఖంగా, ఆరోగ్యంగా బాగుండాలి’ లాంటి వాటికి బదులు ‘నేను బాగుండాలి లేదా ఫ•లానా వ్యక్తి బాగుండాలి’ అనే కోరిక అలాంటిదే. దీనిని స్వార్థం, అత్యాశ అని కూడా అంటారు. అలా కాకుండా సర్వప్రాణి శ్రేయస్సును కాంక్షించడమే జీవితానికి సార్థకత అని పెద్దలు చెబుతారు.

తనతో సహా అష్ట భార్యలు కలిగిన శ్రీకృష్ణుడు తనకొక్కదానికే సొంతం కావాలన్నది సత్యభామ బలమైన కోరిక. ఆయన ‘సత్యా విధేయుడు’ అనే లోకుల మాటలను మరింత నిజం చేసి ఆయన తన ‘గీటు’ దాటకుండా చేసుకోవాలన్న కాంక్షతో ‘పుణ్యకవ్రతం’ ఆచరించింది. తన సంపదతో తిరిగి తన భర్తను పొందాలనుకుంది. దానగ్రహీత (నారదుడు) నుంచి ‘పతి’ని తిరిగి పొందాలను కుంటే, ఆమె ఐశ్వర్యగర్వం శ్రీకృష్ణుడిని తులతూచలేక పోయింది. ఫలితంగా ‘జగన్నాథుడు’ అంగడి వస్తు వయ్యాడు. మితిమీరిన అత్మవిశ్వాసంతో కూడిన కోరిక గల ఆమె ఆయనను ‘నాథుడు’గానే పరగణించింది తప్ప ‘జగన్నాథుడు’గా సంభావించలేదు.

ఎదుటవారిని నాశనం చేయాలన్న విపరీత కోరికతో వరం పొందిన భస్మాసురుడు వరదాత శివుడిపైనే దాడికి యత్నించి ఆహుతైన కథ (భస్మాసుర హస్తం) కథ తెలిసిందే.

కోరికలను జయించినవారు ఆదర్శమూర్తులు అవుతారు. ‘చేసుకున్న వారికి చేసుకున్నంత…’ అన్నట్లు దక్కవలసిందే దక్కుతుంది. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు. మనిషి కర్మానుభవాలను బట్టే భగవంతుడి ఆగ్రహానుగ్రహాలు ఆధారపడి ఉంటాయి.

కోర్కెలు ఉన్నంత మాత్రాన తీరుతాయనిలేదు. గొంతెమ్మ కోర్కెలు ఒక్కొక్కసారి వికటించవచ్చు. ‘రాముడికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం’ అని కైకేయి కోరిన వరాలలో మొదటిది నెరవేరినా, రెండవది విఫలమైంది. తనయుడు భరతుడు తల్లికోరికను మన్నించక ‘పాదుకా పట్టాభిషేకం’ చేశాడు. మరోవంక కోరరాని కోరికతో కైకేయి సౌభాగ్యాన్ని కోల్పోయింది. యువరాజ పట్టాభిషేకం నాడే వనవాస ప్రయాణానికి ఏ కోశానా బాధపడలేదు. రాముడు తండ్రి ‘తనకు అప్పగించింది వనవాసంలో మునుల శుశ్రూష, సంరక్షణ. తమ్ముడు భరతుడికి కేటాయించినది పురజనుల శ్రేయస్సు’ అనే భావించాడు. కైకేయి కోరికను తప్పు పట్టలేదు. ‘పితృవాక్య పరిపాలన’ తప్ప ఆయనకు వేరే కోరికలు, ఆశలు లేవు.

‘నాహ మర్థ పరోదేవి లోకమా వస్తు ముత్సహే!

విద్దిమా మృషి భిస్తుల్యం కేవలం ధర్మ మాస్థితమ్‌!! (‌నాకు ధనాశలేదు. రాజ్యకాంక్ష అంతకంటే లేదు. లోకులను నాకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశం లేదు. ధర్మాన్ని అవలంబించే మునిలాంటి వాడిని) అని వివరణ ఇచ్చాడు.

‘సంపాదించినకొద్దీ కోరికలు, వాటిని తీర్చుకోవడానికి కష్టాలు పెరుగుతాయని, అందుకే తృప్తికి, వైరాగ్యానికి మించిన సంపద, సంతోషం ఉండదు’ అని బోధించారు షిర్డీ సాయి.

‘అత్యాశే నిజమైన దారిద్య్రం’

నిజమైన దారిద్య్రం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే.. ఉన్నదానిని తృప్తిగా అనుభవించలేకపోవడం, కోరికల వెంట పరుగులు తీయడమే అంటుంది సుభాషితం. ఏ పూటకు ఆ పూట సంపాదనతో కంటినిండా నిద్రించే వారి కంటే సంపద పోగుపడి ఉన్నా ఇంకా కావాలనుకుంటూ సంపాదన వెంటపడేవారే బహు పేదలు. ‘తరిగిపోయే జీవితం కోసం తరగనంతటి సంపాదన ఎందుకన్నది సందేహాత్మక ప్రశ్న. ఎంత సంపాదించినా ఏమి లాభం? ఒక పైసా అయినా తీసుకుపోగలమా? ఊపిరి ఉన్నంత వరకు పరిమిత కోరికలతో నలుగురికి ఉపయోగపడేలా బతకాలన్నది ఆప్తవాక్యం.

‘ఇంటిలోని ధనము నిదినాది యనుచును

మంటినోన దాచు మంకుజీవి

కొంచెబోడు వెంట గుల్లకాసును రాదు’ (మూర్ఖమానవుడు ఇంట్లోని ధనాన్ని ఆశతో మట్టిలో దాస్తాడు. వెళ్లేటప్పుడు చెల్లని కాసు కూడా ఆతని వెంట రాదు) అని వేమన చెప్పాడు. ఈ తాపత్రయానికి కారణం కోరికలే. తరతరాలకు సరిపడేంత ఆర్జించాలన్న యావతో తన సుఖసంతోషా లను దూరం చేసుకుంటున్నాడు.

మనిషి ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కోరే కోరికలూ ఆ కోవ కిందికే వస్తాయి.

‘సగుణనిర్గుణ కార్యముల్‌ ‌సలుపు సుమతి

సేత పరిణతి గడు ప్రతీక్షిందగును

బరుషకర్మ విపాకంబు ఫలముదనుక

హృదయము దహించు శల్యంబు రీతి జగతి’ (మంచిదో, చెడ్డదో ఒక కార్యం తలపెట్టినప్పుడు బుద్ధిమంతుడు లోతుగా ఆలోచించాలి. ఆనాలోచిత పనుల పర్యవసానం జీవితాంతం హృదయంలో ముల్లులా బాధిస్తూనే ఉంటుంది) అన్నారు భర్తృహరి. అంటే పశ్చాత్తాపం కలిగించే ఏ పని చేయరాదని భావం. ఆకాశానికి నిచ్చెన వేసి గాలిమేడలు కడుతూ, వాస్తవంలో మనోవేదన చెందడం కంటే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఉత్తముల లక్షణమనే హితవు అందులో ఇమిడి ఉంది.

‘జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు/మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు’ అన్నారు ఒక సినీకవి. మనిషి పూర్ణాయుష్షు నూరేళ్లు అనుకుంటే అందులో సగం కాలం నిద్రకే సరిపోతుంది. మిగిలిన దానిలో కొంత బాల్యం, వృద్ధాప్యంలో గడుస్తుంది. మరికొంత కాలం పనిపాటలకు ఖర్చయిపోతుంది. దీనిని ప్రకృతి ధర్మంగా భావించినప్పటికీ, కోరితెచ్చు కొనే కష్టాలతో జీవులకు సుఖం ఎక్కడ? ఎప్పుడు? అనేది అందరినీ వేధించే ప్రశ్న. కానీ చాలా మంది ఆశలు, కోరికల వలయం నుంచి బయట పడలేకపోతున్నారు.

అత్యాశ,అమిత కోరికలు కేవలం ఆర్థిక పరంగానే కాదు. అన్ని రంగాలకు విస్తరించింది. వర్తమాన రాజకీయ రంగాన్నే ఉదాహరణగా తీసుకుంటే… ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలనే అధికార పక్ష కోరిక / ఆకాంక్ష అలాంటిదే. ఇలాంటి ధోరణినే దృష్టిలో పెట్టుకొనేనేమో, ‘ఈ లోకంలో తమ ఆనందాన్ని కోరుకునేవాళ్లకన్నా ఎదుటివారి బాధల్ని కోరుకునేవాళ్లే ఎక్కువ. దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎప్పుడో స్వర్గం అయిపోయేది’ అని బెర్ట్రాండ్‌ ‌రస్సెల్‌ అనే విదేశీ ప్రముఖుడు ఎన్నడో వ్యాఖ్యానించారు.

అత్యాశ వినాశకరమైన మహావ్యాధి లాంటిదని, దీనికి చికిత్స లేదని (అశానామ మహావ్యాధిః అ చికిత్సః వినాశకః) అని పెద్దల మాట. సంతోషం కలిగించే పనిపైనే సర్వశక్తులు కేంద్రీకరిస్తే అద్భుత సామర్థ్యం అలవడి సర్వ కోరికలు తీరుతాయని, సంతోషానికి గల రహస్యం అదేననే ఒక తత్త్వవేత్త హితవు పరిగణనీయం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram