– డా. నాగసూరి వేణుగోపాల్‌, 9440732392, ఆకాశవాణి మాజీ ప్రయోక్త

‌ఫిబ్రవరి 28 నేషనల్‌ ‌సైన్స్ ‌డే

విజ్ఞానశాస్త్ర సంబంధిత అక్షరాస్యత (సైన్స్ ‌లిటరసీ) అంటే ఏమిటి? జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ఇలాంటి విషయాలను చర్చించుకునే అవకాశం కల్పిస్తున్నది. సుమారు 24 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు సంకేతాలుగా రాళ్లు వాడటం మొదలైంది. వే•కు బాణాలు వంటివి వాడింది క్రీస్తుపూర్వం 25 వేల సంవత్సరాల క్రితం. రాళ్లు వాడే దశనుంచి బాణాలు వాడే పరిస్థితి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో! ఆకులున్న చక్రం మెసపొటేమియాలో క్రీస్తుపూర్వం 2000వ సంవత్సరంలో తయారైందని అంటారు. ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్న చక్రం నాలుగువేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇదంతా చూస్తే ఈ కాలగతిలో మానవుడు ఎంత అల్పప్రాణో బోధపడుతుంది. మరీ ముఖ్యంగా క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నుంచి 14వ శతాబ్దం దాకా విజ్ఞాన శాస్త్ర ప్రగతిలో పెద్దగా వేగం లేదు. కేవలం ఆరేడు వందల సంవత్సరాలలో అనూహ్యమైన రీతిలో విజ్ఞాన వృద్ధి సంభవించింది. తత్ఫలితంగా మానవుడి అవసరాలు, కోరికలు, సౌఖ్యాలు తీరడం మొదలైంది. పాలు పెరుగు కావడం, అన్నం వండుకోవడం, బట్టలు నెయ్యడం, రంగులు వేయడం, ఇల్లు కట్టడం, రవాణా సాధనాలు రూపొందించుకోవడం, పని తేలికగా, వేగంగా, నిపుణతతో జరగడానికి పనిముట్లు తయారు చేసుకోవడం, దూరాన్ని వాహనాలతో అధిగమించగలగడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి రావడం, అణుకుహరంలోకి తొంగి చూడగలగడం ఇలా ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాంశాలే. ఇలా విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యాన్ని పలు రకాలుగా చెప్పుకోవచ్చు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని నేషనల్‌ ‌సైన్స్ ‌డే లేదా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవంగా భారతదేశం జరుపుకుంటోంది. 1928 ఫిబ్రవరి 28న సి.వి.రామన్‌ ఆవిష్కరించిన రామన్‌ ‌ఫలితం (రామన్‌ ఎఫెక్ట్)‌పేరుతో విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాయిగా ఖ్యాతిగాంచింది. 1930లో ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. అంత తక్కువ వ్యవధిలో నోబెల్‌ ‌రావడం అపూర్వం. ఈ విశేష కీర్తి పొందే సమయానికి ఆయన వయసు 42 సంవత్సరాలు. నోబెల్‌ ‌బహుమతి పొందిన రెండవ భారతీయుడు, తొలి దాక్షిణాత్యుడు చంద్రశేఖర్‌ ‌వెంకట్రామన్‌ (‌సి.వి.రామన్‌). 1913‌లో రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌కు సాహిత్యంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. రామన్‌ ‌స్పెక్ట్రా, రామన్‌ ‌స్పెక్ట్రోస్కోపి అని ప్రత్యేక విభాగాలు భౌతికశాస్త్రంలో ఏర్పడినాయంటే కారణం రామన్‌ ఎఫెక్ట్. 1933‌లో బెంగుళూరులో ఏర్పడిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్‌కు మొదటి డైరెక్టర్‌ ‌సి.వి.రామన్‌. ‌వీరే 1948లో రామన్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు.

నవంబర్‌ 7,1888‌న తిరుచునాపల్లి దగ్గర తిరువన్‌కావల్‌ ‌గ్రామంలో అమ్మమ్మగారింట సి.వి.రామన్‌ ‌జన్మించారు. తల్లిదండ్రులు పార్వతి అమ్మాళ్‌, ‌చంద్రశేఖర్‌ అయ్యర్‌. ‌పార్వతి అమ్మాళ్‌ ‌తండ్రి సప్తర్షిశాస్త్రి గొప్ప సంస్కృత పండితులు. ఆయన రెండువేల కిలోమీటర్లు కాలి నడకన బెంగాల్‌ ‌ప్రాంతానికి పోయి నవ్య న్యాయం చదువుకోవడం అప్పటికీ, ఇప్పటికీ విశేషమే. సి.వి.రామన్‌ అన్న సి.ఎస్‌.అయ్యర్‌ ‌కుమారుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌ 1983‌లో నోబెల్‌ ‌బహుమతి పొందాడు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌కు సి.వి.రామన్‌ ‌వరుసకు చిన్నాన్నే అయినా వయసులో ఎంతో పెద్దవారు కాదు. సి.వి.రామన్‌ 1928‌లో రామన్‌ ఎఫెక్ట్ ఆవిష్కరిస్తే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌ 1933‌లో చంద్రశేఖర్‌ ‌లిమిట్‌ను నక్షత్రాల జీవిత కాలాన్ని వివరించడానికి ప్రతిపాదించారు. కానీ, సి.వి.రామన్‌కు రెండేళ్ల (1930)లో నోబెల్‌ ‌బహుమతి రాగా సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌కు 50 ఏళ్ల తర్వాత (1983) వచ్చింది!

సి.వి.రామన్‌ ‌తండ్రి చంద్రశేఖర్‌ అయ్యర్‌ ‌విశాఖపట్నంలో ఉపాధ్యాయునిగా, మిసెస్‌ ఏ.‌వి.ఎన్‌. ‌కళాశాలలో గణిత భౌతిక శాస్త్రాల ఉపన్యాసకునిగా పనిచేశారు. అంటే రామన్‌ ‌బాల్యం మన తెలుగునాటనే గడిచింది. సి.వి.రామన్‌కు యూక్లిడ్‌ ‌గణితమే కాదు ఎడ్విన్‌ ఎర్నాల్డ్ ‌రచించిన ది లైట్‌ ఆఫ్‌ ఏసియా గ్రంథం అంటే కూడా ఎంతో అభిమానం. 1907లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఏ. సర్వ ప్రథములుగా పూర్తిచేసి తండ్రి కోరిక మేర ఫైనాన్షియల్‌ ‌సివిల్‌ ‌సర్వీస్‌ (ఎఫ్‌.‌సి.ఎస్‌) ‌పరీక్ష రాసి అందులో కూడా సర్వప్రథముడయ్యాడు. 1907లోనే కేవలం పద్దెనిమిదిన్నర సంవత్సరాల వయసులో కలకత్తా వెళ్లి అకౌంటెంట్‌ ‌జనరల్‌గా చేరారు. అప్పట్లో ఆయన జీతం రూ. 400/- అది చాలా పెద్ద మొత్తం. జీతం, ఉద్యోగం బాగున్నా రామన్‌ ‌మనసంతా సైన్స్ ‌మీద ఉండేది.

ఒకసారి కార్యాలయానికి వెళుతూ బౌ బజార్‌లో ది ఇండియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌కల్టివేషన్‌ ఆఫ్‌ ‌సైన్స్ అనే బోర్డును చూశారు. సాయంకాలం ఇంటికి తిరిగి వెళుతూ అక్కడే దిగి ఆ సంస్థలో అమృతలాల్‌ ‌సర్కార్‌ను కలిశారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు మహేంద్రలాల్‌ ‌సర్కార్‌ ‌కుమారుడే ఈ అమృతలాల్‌. ఈ ‌సంస్థలోనే రామన్‌ ‌ప్రతిరోజూ సాయంకాలం పరిశోధన ప్రారంభించాడు. అలా చేసిన పరిశోధనకే 1930లో నోబెల్‌ ‌బహుమతి వచ్చింది. సి.వి.రామన్‌ ‌వద్ద సత్యేంద్రనాథ్‌ ‌బోస్‌, ‌మేఘనాథ్‌ ‌సాహ వంటి శాస్త్రవేత్తలు చదువుకోవడం విశేషం. ఆయన ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సైన్స్ ‌ప్రాచుర్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆకాశవాణిలో సి.వి.రామన్‌ ‌చేసిన 19 ప్రసంగాలను న్యూయార్క్‌కు చెందిన ఫిలసాఫికల్‌ ‌లైబ్రరీ ది న్యూ ఫిజిక్స్ ‌టాక్స్ ఆన్‌ ‌యాస్పెక్టస్ ఆఫ్‌ ‌సైన్సెస్‌ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు. సి.వి.రామన్‌కు సైన్స్ ‌పరిష్కారాల పట్ల చాలా గురి. దేశ ఆర్ధిక సమస్యలకు సైన్స్ ‌మార్గం చూపగలదని నమ్మేవారు. మహాత్మాగాంధీ అంటే ఆరాధన. ప్రతి పాఠ్య పుస్తకంలో గాంధీజీ బొమ్మతోపాటు ఆయన ఆశయాల గురించి ప్రచురించాలనేవారు. గాంధీ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ ‌సందర్శించిన సందర్భం కూడా ఉంది. 1970 నవంబర్‌ 21‌న కన్నుమూసిన సి.వి.రామన్‌ ‌చివరి రెండు దశాబ్దాలలో గాంధీజీ గౌరవార్ధం క్రమం తప్పకుండా స్మారక ప్రసంగాలు చేశారు. సి.వి.రామన్‌కు భౌతికశాస్త్రమే కాకుండా వాతావరణం, ఖగోళం, శరీరశాస్త్రం, సంగీతం వంటి అంశాలలో కూడా ఆసక్తి ఉండేది. వాళ్ల అమ్మగారికి సంగీత ప్రవేశం ఉండగా సి.వి.రామన్‌కు చిత్రకళలో కూడా ప్రవేశం ఉండేది. ఆయన 475 పరిశోధనా పత్రాలు వెలువరించారు.

నేషనల్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌.‌సి.ఎస్‌.‌టి.సి.) ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ ‌దినోత్సవంగా ప్రకటించమని భారత ప్రభుత్వాన్ని 1986లో కోరింది. 1987 ఫిబ్రవరి 28న తొలి నేషనల్‌ ‌సైన్స్ ‌డేను మన దేశం జరుపుకుంది. సైన్స్ ‌ప్రాచుర్యానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ…. సైన్స్ అభినివేశాన్ని పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని జరిగే కార్యక్రమాలు రూపొందడం ప్రారంభమైంది. నిత్య జీవితంలో విజ్ఞానశాస్త్ర ప్రాధాన్యత వివరించే విషయాలూ మానవ సంక్షేమానికి విజ్ఞానశాస్త్రం ద్వారా సాధ్యమైన ప్రయోగాలూ, ప్రయత్నాలూ, ఫలితాలూ వివరించడంతో పాటు విజ్ఞానశాస్త్ర రంగంలో ఎప్పటికప్పుడు తారసపడే విషయాలను పరిచయం చెయ్యడానికి ఈ సందర్భం బాగా ఉపకరిస్తుంది. ఫలితంగా 1988 సి.వి.రామన్‌ ‌శతజయంతి సంవత్సరం ఎంతో అర్ధవంతమైన కార్యక్రమాలతో శోభించింది.

సైన్స్ అం‌టే ఏ ఒక్క విభాగం మాత్రమే కాదు. మౌలిక శాస్త్రాలూ, అప్లైడ్‌ ‌విభాగాలు, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, పశువిజ్ఞానం, ఇలా పలు రంగాలలో సైన్స్ ‌విస్తరించి ఉంటుంది. వాతావరణం, తుపానులు పసిగట్టడం, ప్రకృతి విపత్తులను ముందుగానే గణించడం, ప్రమాదాలు సంభవిస్తే ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించడం కూడా సైన్స్ ‌గానే పరిగణించాలి. సైన్స్ అం‌టే మూఢనమ్మకాల మీద దండెత్తడమో, సెల్‌ ‌ఫోన్‌ ‌సమస్యను చర్చించుకోవడం మాత్రమే కాదు. సైన్స్ ‌పలురకాలుగా ప్రాచుర్యంలోకి రావాలి. అవి ఏమిటో చూద్దాం-

వివిధ సైన్స్ ‌రంగాల సమాచారం అందరికీ అందుబాటులోకి రావాలి.

ఆయా రంగాలలో సాధ్యపడే ఉపయోగాలు ఏమిటో బోధపడాలి.

ఇందులో ఎదురయ్యే సమస్యలు, పరిమితులు, ప్రమాదాలు తెలియాలి.

కాలుష్యం, కాలుష్యం నుంచి రక్షణపై అవగాహన పెరగాలి.

వివిధ శాఖలకు సంబంధించిన సిద్ధాంత విభాగాలు వృద్ధికావడం, ప్రచారంలోకి రావడం.

విజ్ఞానశాస్త్ర ప్రగతిలో తారసపడే చారిత్రక కోణాలు.

సమాజంపై సైన్స్ ‌టెక్నాలజీ రంగాల ప్రభావం.

అపోహలు, మూఢనమ్మకాలు, డిజిటల్‌ ‌డినైడ్‌.

‌సైన్స్ ‌దృక్పథం, సైన్స్ ‌దృక్పథ సాధన. పరిష్కార మార్గాలు, విజ్ఞాన పరివ్యాప్తి పోకడలు.

ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తం (థీమ్‌)‌తో జాతీయ సైన్స్ ‌దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎస్‌ ‌టి ఐ : ఇమ్పాక్టస్ ఆన్‌ ఎడ్యుకేషన్‌, ‌స్కిల్స్ అం‌డ్‌ ‌వర్క్ అనేది ఈ సంవత్సరపు జాతీయ సైన్స్ ‌దినోత్సవం ఇతివృత్తం. గతంలో ఏఏ ఇతివృత్తాలు తీసుకున్నారో చూద్దాం.

–   1999 – మారుతున్న మన భూగోళం

–   2000 – మౌలిక విజ్ఞాన శాస్త్ర అంశాల పట్ల ఆసక్తిని పెంపొందించడం

–   2001 – సైన్స్ ‌విద్యకు ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజి

–   2002 – చెత్త నుంచి విత్తం (వేస్ట్ ‌నుంచి వెల్త్)

–   2003 – 50 ఏళ్ల డిఎన్‌ఎ, ‌పాతికేళ్ల ఐవిఎఫ్‌ – ‌జీవపదార్థ బ్లూ ప్రింట్‌

–   2004 – ‌జన సామాన్యంలో సైన్స్ అవగాహనను పెంపొందించడం

–   2005 – భౌతిక శాస్త్రాన్ని ఉత్సవంగా జరుపుకోవడం

–   2006 – మన భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకుందాం

–   2007 – తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి

–   2008 – భూగోళాన్ని అర్ధం చేసుకుందాం

–   2009 – విజ్ఞాన శాస్త్ర పరిధిని పెంచడం

–   2010- స్త్రీ పురుష సమానత, సుస్థిర అభివృద్ధికి సైన్స్ ‌టెక్నాలజి

–   2011 – నిత్యజీవితంలో రసాయన శాస్త్రం

–   2012 – శుభ్రమైన శక్తి వనరులు, అణు విజ్ఞానపరమైన భద్రత

–   2013-జెనిటికల్లీ మోడిఫైడ్‌ ‌పంటలు, ఆహార భద్రత

–   2014 – శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడం

–   2015 – దేశ నిర్మాణానికి విజ్ఞాన శాస్త్రం

–   2016 – దేశాభివృద్ధికి తగిన విజ్ఞాన శాస్త్ర అంశాలు

–   2017 – స్పెషల్లీ ఏబుల్డ్ ‌పర్సన్స్ ‌కోసం సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజి

–   2018 – సుస్థిర భవిష్యత్తుకు సైన్స్ ‌టెక్నాలజి

–   2019 – సమాజం కోసం సైన్స్, ‌సైన్స్ ‌కోసం సమాజం

–   2020 – విజ్ఞాన శాస్త్ర రంగంలో మహిళలు

About Author

By editor

Twitter
Instagram