– పి.వి.ఆర్‌. ‌శివకుమార్‌

‘‘‌మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.’’

స్పృహ లేనట్లు పడుకున్న రమణమ్మని రొటీన్‌గా పరీక్షించాక, అవధానితో నెమ్మదిగా అన్నాడు డాక్టర్‌.

ఆయన గొంతులో మానవత్వాన్ని బలహీన పరుస్తూ, నిర్లిప్తతని నింపుకున్న కఠినత్వం. ఆయన వెనుకే నిలబడి ఉన్న సిస్టర్‌ ‌చూపుల్లో సానుభూతి వీచికలు.

అవధాని మనసులో నిస్సహాయతతో కూడిన ఆక్రోశం…

‘నిర్ణయం తీసుకోవటానికి తనెవడు? విధి నిర్ణయానికి తలొగ్గటమే తను చేయగలిగినది.’

డాక్టర్‌ ‌మాటలకి స్పందించే ప్రయత్నం చేయకుండా నిలబడ్డాడు.

చెకప్‌ ‌పూర్తిచేసి వెళ్తూ, ‘‘మీరొక అరగంట తరువాత నా రూమ్‌కు రండి.’’ అన్నాడు ఆయన.

డాక్టర్‌ ‌వెళ్లిపోయాక, తల్లి బెడ్‌ ‌పక్కనే కూర్చు న్నాడు అవధాని ఆమె ముఖంలోకే చూస్తూ.

 కళ్లు మూసుకుని పడుకుని ఉంది రమణమ్మ. ముఖంలో ప్రశాంతత లేదు. బాధపడుతున్నట్టు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అయిదు నిమిషాలకి కళ్లు తెరిచింది.

‘‘ఏమంటున్నారు డాక్టర్‌ ‌గారు?’’ నీరసంగా అడిగింది.

‘‘ఇంప్రూవ్‌మెంట్‌ ఉం‌ది. నాలుగు రోజులకి లేచి తిరుగుతావని అంటున్నారు.’’ చెప్పాడు అవధాని.

ఆక్సిజన్‌ ‌మాస్క్ ‌ధరించిన రమణమ్మ ఎంత కష్టపడి మాట్లాడుతోందో, అంతే కష్టపడుతున్నాడు అవధాని, ఆ మాటలు అర్ధం చేసుకోవటానికి.

కానీ, మాట్లాడకుండా ఉండలేని బలహీనత, పరిస్థితి ఆమెది. తల్లి ఆ మాత్రమైనా మాట్లాడకుండా పడుకుంటే, భరించలేని అవస్థ అవధానిది.

‘‘నిర్ణయం అంటున్నారు, దేనిగురించి…’’ ఆవిడవి పాము చెవులు.

‘అంత మగతలోనూ, డాక్టర్‌ అం‌త నెమ్మదిగా అన్న మాట ఆవిడ చెవిన పడిందా!’

అవాక్కైపోయాడు అవధాని. డాక్టర్‌ ‌పీక నులిమి వేయాలన్నంత కోపం వచ్చింది.

‘‘అహఁ…అదా… హెల్త్ ఇన్సూరెన్స్ ‌గురించి… ఫైనల్‌ ‌బిల్లు వేసేలోపు, ఇన్సూరెన్స్ ‌పాలసీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోమంటు న్నాడు…పేమెంట్‌ ‌సులువవుతుందనీ…’’

చిన్నతనంలో అవధాని బెల్లమ్ముక్క పట్టుకు పారిపోతుండగా చూసి, ‘ఏమిటా చేతిలో?’ అని నిలదీస్తే, ‘ఏం లేద’ని అతను దబాయించినప్పుడు నవ్వినట్లే నవ్వింది రమణమ్మ, ఆ నీరసంలోనే.

గతుక్కుమన్నాడు అవధాని. తల్లికేదో అర్ధమైందని తోచింది. కానీ, తనేమీ మాట్లాడలేని అవస్థ.

మౌనంగా ఉండిపోయాడు.

‘‘ఆట్టే ఆలోచించకు బాబూ. నువ్వు చెయ్యవలసిన దంతా చేసావు. నేను చూడవలసినవన్నీ చూశాను. నిస్సహాయంగా ఫీలవకు. జరగవలసినదేదో ఎప్పటి కైనా జరగవలసిందే. అందుకే.. అతిగా బాధ పడకు…’’ ఆగి ఆగి మాట్లాడుతున్న రమణమ్మ.. ఒక నిమిషం ఆగి, మళ్లీ కొనసాగించింది…

‘‘డాక్టర్‌ ‌గట్టివాడుగానే ఉన్నాడు. ఆయన సలహా ననుసరించి, ఆయన చెప్తున్న నిర్ణయమేదో తీసుకో.’’

అతి కష్టమ్మీద ఆ మాటలు చెప్పి, ఒక బాధ్యత తీర్చుకున్నట్టు కళ్లు మూసుకుంది.

కళ్లు తడి కాగా, స్తబ్దంగా ఉండిపోయాడు అవధాని.

‘నిర్ణయం! ఇవేళ నిర్ణయం తనమీద వదులుతున్న తల్లి…ఎన్నెన్ని నిర్ణయాలు, ఎంతెంత కఠిన నిర్ణయాలు – అలవోకగా తీసేసుకుంది జీవితం పొడుగునా! ఎవరి సలహాలూ అవసరం లేకుండా! జీవితాన్ని మలుపులు తిప్పే నిర్ణయాలు తీసుకోవటంలోనైనా ఒకరిమీద ఆధారపడిందా?

అలాంటిది, ఇవేళ ఆమె ఇలా అసహాయంగా పడి ఉంది కాబట్టి, తనపై నిర్ణయ భారం మోపుతోందా?’

జ్ఞాపకాల పొరలు అవధాని గుండె తలుపు తట్టాయి. దఫాలు దఫాలుగా వివిధ జీవన దశల్లో అమ్మ చెప్పిన కబుర్లు కొన్నీ, ఊహ తెలిసినప్పటి నుంచీ, అమ్మని చూస్తూ, అమ్మని చదువుతూ అర్ధం చేసుకున్నవి కొన్నీ…అన్నీ మరోసారి గుండెల్ని తడిమాయి.

— – – – – – – – – –

నాలుగు పదులు కూడా చూడని భర్త అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో పోయి, శవమై ఇల్లు చేరితే.. పల్లెటూళ్లో పక్షవాతంతో మంచంలో ఉన్న తండ్రి, ఉద్యోగాల్లో పలు దూరాల్లో ఉన్న అన్నదమ్ములు.. ఎవరూ సమయానికి రాలేకపోతే, ఊరు కాని ఊళ్లో, అత్తమామలు లేని రమణమ్మ చిన్నవాడైన మరిదిని అడ్డం పెట్టుకుని, ఆ క్షణంలోనూ తనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది – భర్తని స్మశానానికి సాగనంపే విషయంలో కూడా!

అది మొదలు…దుర్భర జీవన పయనం…ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు… ముగ్గురికి ముగ్గురూ పదేళ్ల వయసు లోపువారే! భర్తకు వచ్చిన కొద్దిపాటి ప్రావిడెంట్‌ ‌ఫండూ, ఇన్సూరెన్స్ ‌సొమ్మూ, నెల నెలా వచ్చే నామమాత్రపు పెన్షన్‌తో తండ్రి పంచన చేరింది. ఏడాది తిరగకుండానే నీడనిచ్చిన తండ్రి కూడా దాటిపోవటంతో మళ్లీ నిర్ణయం తీసుకోవాల్సిన ఘడియలే ఎదురయ్యాయి. తల్లిని అన్నలు తీసుకు వెళ్తున్నారు. తన గతి తనే నిర్ణయించుకోవలసిన దుర్గతి. రమణమ్మ బెంబేలు పడలేదు. హాలాహలాన్ని మనసులోనే దాచుకుని ముందుకు సాగింది.

ఒక మారుమూల పల్లెలో ఎప్పుడో భర్త కొన్న రెండొందల గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని, అక్కడే ఉంటానన్నప్పుడు అన్నలు అభ్యంతర పెట్టారు.

‘‘ఇంతింత సంపాదిస్తున్నాం, మాకే ఇళ్లు లేవు. డెబ్బై ఏళ్లు బతికి, నలభై ఏళ్లు ఉద్యోగం చేసిన నాన్నే సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఇప్పుడు స్థలం ఉంది కదా అని నువ్వు చేతిలో ఉన్న నాలుగు డబ్బుల్తోనూ ఇల్లు కట్టుకుని కూర్చుంటే రేపటినుండీ తిండి ఎలా గడుస్తుంది? పిల్లలని ఎలా పెంచు తావు? అర్ధంలేని ఆలోచన మానుకుని ఈ ఊళ్లోనే ఓ గది అద్దెకి తీసుకుని ఉండు. పిల్లల చదువు సంధ్యలకీ ఈ ఊరయితేనే మంచిది’’ అని చెప్పారు. ఆమె భారం ఉత్తరోత్తరా తమ మీద పడుతుందనే భయం వాళ్లది.

‘‘సొంత ఇల్లు అంటూ ఉంటే, నా పిల్లలతో నేను ఆ గూట్లో పడి ఉంటాను. ఉంటే తింటాం. లేని నాడు పస్తు పడుకుంటాం. తిన్నా, తినకపోయినా అడిగే వారు ఉండరు. అదే డబ్బుగా ఉంచుకుంటే ఎప్పుడే అవసరాలు వచ్చి ఆ కాస్తా ఎగిరిపోతుందో చెప్పలేను. అద్దెకట్టలేని పరిస్థితులు వస్తే, పిల్లలతో రోడ్డున పడతాను. ఆ డబ్బు నా ఒక్కత్తెదీ కాదు. ఏ నాటికైనా పిల్లలకి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత ఉంది. ఆయన గుర్తుగా పిల్లల కోసం ఈ ఇల్లుగా మిగులుస్తాను. ఇల్లు కట్టగా మిగిలినది బ్యాంక్‌లో ఉంచి. ఆ వడ్డీకి నా పెన్షన్‌ ‌కలిపి బతుకుతాము. రొట్టెకి సరిపడ పిండి లేనప్పుడు, పిండికి వచ్చినంత రొట్టె తోనే సర్దుకుంటాం.’’

ఆ మాటలని అహంకారంగా అర్ధం చేసుకుని దూరం జరిగిపోయారు వాళ్లు.

పల్లెటూరు చేరుకుని, ముందుగా ఓ చిన్న పాక వేసుకుని అందులో ఉంటూ, ఆరు నెలల్లో ఇల్లు కట్టించుకుంది రమణమ్మ. ఆహార్యంతో యవ్వనాన్ని కప్పుకుంది. వ్యవహారంతో పొరుగుని ఆకట్టుకుంది. క్రమశిక్షణతో పిల్లలని తీర్చి దిద్దుకుంది. ఇంటి వెనక ఉన్న కాస్త జాగాలో కూరగాయల మడులు పెంచుకుంది. కూరలు కొనే అవసరం లేకుండా చూసుకుంది.

మగదక్షత లేకపోయినా, బతుకుతో ఒంటరి పోరాటం చేస్తున్న రమణమ్మకి ఆ ఊరి కామందులు తోడు నిలిచి, తోబుట్టువుల్లా సాయం చేశారు. రమణమ్మ నిలదొక్కుకుంది. ఎవరినీ చేయి సాచి ఏ సహాయమూ అడగని ఆమె వ్యక్తిత్వం ఆ ఊరివారి గుండెల్లో ఆమెకొక గౌరవ స్థానాన్ని కల్పించింది. తనకు తోచిన సహాయం చేస్తూ రమణమ్మ వాళ్ల తలలో నాలుకై పోయింది.

రోజులు గడిచాయి. పిల్లలు ఎదిగొచ్చారు. ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ ‌తెచ్చుకున్న అవధానికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్‌ ‌సీట్‌ ‌వచ్చింది.

కొడుకుని అంత దూరం పంపి, హాస్టల్లో ఉంచి చదివించటానికి సిద్ధపడ్డ రమణమ్మ నిర్ణయానికి ఊరిలో పెద్దలు విస్తుపోయారు.

‘‘రమణమ్మా, బాగా ఆలోచించుకో. లక్షల్లో ఖర్చు అవుతుంది. నీకున్నదంతా వాడి చదువుకే అయిపో తుంది. అప్పులు చేయవలసి వచ్చినా రావచ్చు. నీ ముందు పెళ్లికెదిగిన కూతురు ఉంది. నాలుగేళ్లలో చిన్నదీ ఎదిగి వస్తుంది. ముందు పెద్దదాని పెళ్లి ముఖ్యం. అది వదిలేసి, ఇంత ఖర్చు తలకెత్తుకోవటం తెలివైన పనేనా? అంతకన్న, వీడిని దగ్గరున్న పట్నంలో ఏ డిగ్రీ చదివించినా ఏదో ఒక ఉద్యోగం దొరికి, నీకు చేతికి అంది వస్తాడు.’’ అన్నారు.

‘‘వాడు చదువుకుంటున్నాడు. చదివించటం నా విధి. ఆడపిల్ల డిగ్రీ చదువుతానంటే చదివిస్తున్నాను. వీడు ఇంజనీరింగ్‌ ‌చదువుతానన్నాడు. ఫ్రీ సీటు తెచ్చుకుంటే చదివిస్తానన్నాను. తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాటెలా తప్పను? అయినా పిల్లలకి నేనివ్వగలిగినది చదువులే. పెళ్లిళ్ల కన్న చదువుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలిగితే మిగతా అన్నీ అవే జరుగు తాయి. రేపు వాడు ఇంజనీరై మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నన్నూ, అక్కాచెల్లెళ్లనీ చూసుకోడా?’’ నవ్వుతూనే ఖండితమైన నిర్ణయం చెప్పేసింది రమణమ్మ.

ఆమె ఆశలకి అనుగుణంగానే పిల్లలు పైకి వచ్చారు. సంసారాలలో సాధారణంగా వచ్చే కలతలని ముదరకుండా చూసుకుంటూ, పిల్లల మధ్య సయోధ్య చెడకుండా సంబాళించుకుంటూ వచ్చింది. తన పిల్లలతో సమానంగా అభిమానం చూపే అల్లుళ్లతో, మనుమలు, మనవరాళ్లతో తొంభై ఏళ్ల జీవితాన్ని పెద్ద అనారోగ్యాలు లేకుండానే గడిపేసింది.

గత రెండేళ్లుగానే క్రమేపీ జీర్ణశక్తి మందగిం చింది. అశ్రద్ధ చేసింది రమణమ్మ.

‘వయసు మీద పడింది కాబట్టి ఆహారం తగ్గిపోయింది’ అని సరిపెట్టుకుంది. వయసు మూలానే కావచ్చు గానీ, లోపల జరుగుతున్న మార్పులకి ఎలాంటి చికిత్సా జరగలేదు. ఆరు నెలల నుంచీ కేవలం ద్రవాహారం తప్ప తీసుకోవటం మాని వేసింది. శరీరం నీరసపడిపోయింది. మొదటినుంచీ డాక్టర్లూ, హాస్పిటల్స్ ‌పట్ల వైముఖ్యం కనబర్చే తల్లిని అవధాని కూడా ఒత్తిడి చేయలేకపోయాడు. చివరికి, నెలరోజులనాడు వామిటింగ్స్ ‌కావటంతో హాస్పిటల్‌కి తీసుకువెళ్లాడు. మామూలు పరీక్షలు చేసి ఏమీ అనారోగ్యం లేదని తేల్చారు వాళ్లు. జీర్ణ వాహికలో ఎండోస్కోపీకి ప్రయత్నిస్తే రమణమ్మ తీవ్రంగా బాధకి గురయింది. మధ్యలోనే ఆపవలసి వచ్చింది. స్కానింగ్‌ ‌చేసి లోపమేమీ లేదని తేల్చి, అప్పటికి డిశ్చార్జీ చేసేశారు. అప్పటినుంచీ ఆమె పరిస్థితి దిగజారటం మొదలయింది. ఆహారం నామమాత్రం అయిపోయింది.

గతవారం మళ్లీ వామిటింగ్స్ ‌కావటంతో తిరిగి హాస్పిటల్లో చేర్చవలసి వచ్చింది.

– – – – – –

డాక్టర్‌ ‌గారు పిలుస్తున్నారని సిస్టర్‌ ‌వచ్చి చెప్పటంతో లేచి ఆయన గదికి వెళ్లాడు అవధాని. అతని భార్య కూర్చొని ఉంది, అత్తగారి దగ్గర.

‘‘కూర్చోండి.’’ అన్నాడు డాక్టర్‌. ఒక క్షణం తటపటాయించి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు అవధాని.

‘‘మీరు అరవై దాటారనుకుంటాను?’’ అడిగాడు డాక్టర్‌, ‌దేనికో ఉపోద్ఘాతంలా ధ్వనించిందా ప్రశ్న.

‘అసందర్భ ప్రలాపం’ అనుకున్నాడు అవధాని.

ఆ క్షణంలో అతడికి ఏ మాటలు అనాలని లేదు. అయినా బలవంతంగా జవాబిచ్చాడు ‘‘అరవై అయిదు.’’

డాక్టర్‌ ‌చప్పుడు చెయ్యకుండా చిరునవ్వు నవ్వాడు.

‘‘మీ అమ్మగారు తొంభై దాటారు…’’

‘‘అయితే?’’ అన్నట్టు చూశాడు అవధాని.

‘‘మీ అమ్మగారి రికార్డ్ అం‌తా వివరంగా చూశాను. బి.పి. ఇంప్రూవ్‌ అవుతోంది. పల్స్ ‌స్టేబుల్‌గా ఉంది. షుగర్‌ ‌లిమిట్‌లోనే ఉంది. ఇతర కాంప్లికేషన్స్ ఏమీ లేకపోవటం అదృష్టం. ఈవెన్‌.. ‌లివర్‌, ‌కిడ్నీ ఫంక్షన్‌ ‌కూడా వయసుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఆహారం.. లిక్విడ్స్ అయినా తీసుకోలేక పోవటమే లోపం. దేహం బలహీనపడుతోంది. సహజంగా ఇతర అవయవాల చర్యలు బలహీన పడుతున్నాయి. ఆహారం తీసుకోలేకపోవటానికి కారణం- ఆహార నాళాలు సంకోచించుకుపోయి ఉండవచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. ఏదైనా అగ్రెసివ్‌ ‌టెస్ట్‌లు చేద్దామంటే ఆమె శరీరం సహక రించదు. ఆమెని ఇంకా బాధ పెట్టినట్లవుతుంది.’’

‘‘………………….’’

‘‘గాలి, నీరు, ఆహారం… ఈ మూడు కేవలం కృత్రిమంగా సరఫరా అవుతున్నప్పుడు, సహజంగా తీసుకోలేకపోతున్నప్పుడు ఏ మనిషైనా ఎన్నాళ్లో తట్టుకోలేరు.

ఆవిడ అయిదు రోజులుగా ఆక్సిజన్‌ ‌మీదే ఉంటున్నారు. ఆహారం లేదు. సెలైన్‌ ‌మాత్రమే ఎక్కిస్తున్నాం. నిన్నటినుంచి సెలైన్‌ ఎక్కించటానికి కూడా వెయిన్స్ ‌దొరకటం లేదు. చేతులు, కాళ్లు గూడా వాచిపోయాయి. ఎంతగా బాధ పడుతున్నారో ఆమె ముఖం చూస్తేనే తెలుస్తోంది కదా.’’

బలవంతాన తల ఊపాడు అవధాని. కొనసాగించాడాయన..

‘‘నేనిలా చెప్పకూడదు. అది మా వృత్తి నిబంధనలకి విరుద్ధం. అయినా, ఒక తమ్ముడిలా మీకు చెప్తున్నాను. నన్ను అపార్థం చేసుకోకండి. నిర్ణయం మీదే. కేవలం సలహా, అంతే.’’

‘ఏం చెప్తాడు?’ మౌనంగా వింటున్నాడు అవధాని.

‘‘ప్రతి వస్తువుకీ ఒక లైఫ్‌ ‌పీరియడ్‌ ఉం‌టుంది. వాడగా, వాడగా అరిగి పోతుంది. మన దేహమూ అంతే. రేపు నేనైనా అంతే. మన్నినన్నాళ్లూ మన్నిక బాగుండటమే మనం కోరుకోవలసింది.

తొంభై యేళ్లు జాగ్రత్తగా, క్రమశిక్షణతో వాడుకున్నారు మీ అమ్మగారు తన దేహాన్ని. ఇప్పుడు అది కృశించటం సహజం. నిండు బ్రతుకు చూశారు ఆరోగ్యంగా!

ఇంకెన్నాళ్లు ఉన్నా మీకది పండగలాగే ఉంటుంది. కానీ, ఇహ చాలు.. అంటున్న దేహాన్ని మన సంతృప్తి కోసం యమ యాతనలకి గురిచేసి ఏదో మేలు చేస్తున్నామనుకోవటం సమర్థనీయమా?’’

‘‘ఇంకేం చేయగలను నేను?’’ అవధాని గొంతు గద్గదమైంది.

‘‘మీరు గమనించారో, లేదో తెలియదు. ఆవిడ వీపు మీద ఒత్తిడికి కమిలిపోవటం మొదలయింది. అవి బెడ్‌ ‌సోర్స్‌గా మారితే ప్రమాదమే.’’

ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని, మళ్లీ చెప్పాడు డాక్టర్‌..

‘‘అమ్మగారిని ఇంకా బాధల్లో చూడవలసి రావచ్చు. అది భరించటం ఇంకా కష్టం. మీరంతా మీ అమ్మగారిని నిండు జీవితం ప్రేమగా చూసుకున్నారు. ఈ నాలుగు రోజులుగా ఆవిడ కోసం వస్తున్న మీ కుటుంబ సభ్యుల ఆరాటం, ఆప్యాయత ఆవిడ అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో ముసలి తల్లిదండ్రుల్ని ఇంత ప్రేమగా పట్టించుకుంటున్నవాళ్లు ఎంతమంది ఉంటున్నారు? రోజుకి పదిహేను వేలు కట్టి, స్పెషల్‌ ‌రూం తీసుకున్నారు మీరు. ఇంకా ఎన్నాళ్లయినా సరే ఆవిడ ఆయువు కొనసాగించాలని తపన పడుతున్నారు. ధన్యురాలు ఆవిడ. ధన్యులు మీరు కూడా.

ఆవిడ దేహం ఇంకెన్నాళ్లు సెలైన్‌ ‌తీసుకోగలదో అనుమానమే. పల్చబడ్డ చర్మంలో నుంచి నెమ్మది నెమ్మదిగా సెలైన్‌ ‌లీక్‌ ‌కావటం కూడ మొదలవ్వవచ్చు. అందుకే, ఆమె కొద్దిగానైనా ద్రవాహారం తీసుకో గలగటం అవసరం. అందుకోసం ఆక్సిజన్‌ ‌మాస్క్ ‌తీసి ఉంచక తప్పదు.

ఈ పరిస్థితులలో ఇలాగే ఆక్సిజన్‌ ఇస్తూ ఉంచే బదులు, క్రమంగా ఆక్సిజన్‌ ‌తగ్గించుకుంటూ పరిస్థితి మానిటర్‌ ‌చేయటం ఒక పద్ధతి. మీరు ఏ పరిణామాల కైనా మానసికంగా సిద్ధపడి ఉండాలనే నేను కోరుతున్నది.’’

నెమ్మది నెమ్మదిగా డాక్టర్‌ ‌మాటలు బుర్రలో నుంచి హృదయంలోకి ఇంకుతున్నాయి.

‘‘అవసరానికి తగిన ట్రీట్‌మెంట్‌ ‌మీరు చేయండి డాక్టర్‌.’’ అని మాత్రం అనగలిగాడు అవధాని.

అమ్మ ఇక ఎక్కువ రోజులు తమతో ఉండదన్న పచ్చి నిజం హృదయాన్ని పిండుతున్నా డాక్టర్‌ ‌చెప్పిన వచనాలు సాంత్వన వచనాలలాగా పనిచేస్తున్నాయి. యాంత్రికంగా తిరిగి వచ్చాడు, తల్లి దగ్గరకి.

కళ్లు మూసుకుని పడుకుని ఉంది రమణమ్మ. బాధపడుతున్న ముఖ కవళికలతో సైతం కొడుకుని బాధ పెట్టటం ఇష్టం లేనట్లు, చరమాంకంలో తీసుకోవలసిన నిర్ణయం కూడా కొడుకుని ఇబ్బంది పెట్టకుండా తనే తీసేసుకోదల్చుకున్నట్టు పెదవులపై కనీ కనిపించని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం!

About Author

By editor

Twitter
Instagram