రాణి రుద్రమదేవి పేరు ఇప్పటికీ ప్రేరణదాయకంగానే ఉంది. ఆమె గాధ ఒక అద్భుతం. రాజ్యపాలన, అందుకు కావలసిన యంత్రాంగం, మంత్రాంగ నిర్వహణ అంతా పురుషులే నిర్వహిస్తున్న కాలంలో ఒక యోధురాలిగా, పాలికగా ఆమె పేరు తెలుగు వారి చరిత్రలో ప్రతిధ్వనిస్తుంది. విప్లవమంటే ఇదే కదా! కాలాతీతమైన వ్యక్త్తిత్వం రుద్రమ సొంతం. పదమూడో శతాబ్దంలో ఆమె జీవించింది. కానీ ఇరవయ్యొకటో శతాబ్దం లోనూ ఆ పేరు, ఆ గాధ భారతీయులను కదలిస్తూనే ఉన్నాయి. నవలలు, జీవిత చరిత్రలు, నాటకాలు, సినిమాలు, ఇప్పుడు టీవీ ధారావాహికలు ఆ గాథే ఇతివృత్తంగా వస్తూనే ఉన్నాయి. ఈ సుదీర్ఘ చరిత్ర ప్రస్థానంలో అంతటి ధీరత్వం, వ్యక్తిత్వం ఉన్నవారు అరుదు.

ముస్లిం దండయాత్రలకు అవకాశం ఇచ్చిన పరిణామాలలో మొదటిది- భారతీయులలో అనైక్యత. హిందూ రాజ్యాల మధ్య విభేదాలు దురాక్రమణ దారుల పాలిట అయాచిత వరంగా మారాయన్న వాస్తవం కంటే, పొరుగు ప్రాంతం ఒక స్త్రీ ఏలుబడిలో ఉండడం, తమతో పాటు ఆ మహిళ సింహాసనం మీద కూర్చోవడమే సమకాలీన పాలకులకు ఎక్కువ బాధించే విషయమైపోయింది. కానీ కాల పరిస్థితుల పట్ల ఏమాత్రం అవగాహన లేని ఇలాంటి శత్రువులను రుద్రమదేవి ఎదుర్కొనగలిగింది. తన కాకతీయ వంశానికి చెందిన ఇద్దరు పూర్వీకులను చంపినందుకు యాదవ వంశం మీద పగ తీర్చుకున్న దామె. అప్పుడు ఢీల్లీని పాలిస్తున్న ఖిల్జీ వంశ సేనను డీకొనే స్థాయిలో తన మనుమడు ప్రతాపరుద్రుడిని రుద్రమదేవి తీర్చిదిద్దింది. ఖిల్జీలు మొదట యాదవ వంశాన్నీ, తరువాత కాకతీ ప్రతాపరుద్రుడినీ కూడా కూల్చారు. ఇలాంటి ఆత్మహత్యాసదృశ్యమైన పోకడలు అప్పుడు భారతదేశంలో ఎలా ఉండేవో, వాటిని కాకతీయ వంశం, ప్రధానంగా రుద్రమదేవి ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే ఆ కాలం చరిత్ర చదవాలి.

దక్కన్‌ ‌చరిత్రలో యాదవులూ, కాకతీయులూ కూడా కీలక భూమికనే కలిగి ఉన్నారు. ఈ రెండూ సమకాలీన వంశాలే కాదు, ఇరుగు పొరుగు ప్రాంతాలను పాలించాయి కూడా. కాబట్టి ఈ రెండు వంశాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ రెండు వంశాల ఏలుబడిలో ఉన్న రాజ్యాలు ముస్లిం దురాక్రమణదారుల చేతిలోనే ధ్వంసమైనాయి. ఆ విధంగా దక్కన్‌లో, దక్షిణ భారతంలోని చివరి రెండు హిందూ రాజ్యాలు కూడా ముస్లిం సేనల చేతులలో పతనమైనాయి.

యాదవ, కాకతీయ వంశీయులు ఇరువురికీ మధ్య కొన్ని సామ్యాలు ఉన్నాయి. ఈ రెండు వంశాల వారు మొదట సామంతులే. తరువాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. యాదవులు మొదట రాష్ట్ర కూటులకు, తరువాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వ్యవహరించారు. కాకతీయులు కూడా చాళుక్యులకు సామంతరాజులే. యాదవ వంశీకుడు ఐదో భిల్లమ (క్రీ.శ. 1187-1191), కాకతీయ వంశీకుడు రుద్రదేవుడు (1158-1195) స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. యాదవ వంశీకులు క్రీ.శ. 850-1334 మధ్య పాలించారు. కాకతీయులు 1195-1323 మధ్య పరిపాలించారు. ఈ వంశీకులు రుద్రమదేవుడు, మహాదేవుడు (1195-1198) యాదవ రాజ్యం మీద దండయాత్రకు వెళ్లినప్పుడు మరణించారు. వీరిలో మహాదేవుని కుమారుడు గణపతిదేవుడు (1199-1262) యాదవులకు బందీగా పట్టు బడ్డాడు. తరువాత గణపతిదేవుని విడిచిపెట్టారు. ఆనాటి నుంచి కాకతీ గణపతిదేవుని పాలనా కాలంలో, యాదవ వంశీకుడు సింఘన పాలనలో (1210-1246) అసలు యుద్ధమే జరగలేదు. ఇరువురి పాలన చిరకాలం సాగింది కూడా.

కాకతీయులకు చెందినవే కాదు, యాదవుల నాణేలూ, శాసనాలూ కూడా తెలంగాణలో దొరికాయి. ఇందుకు ఒక ఉదాహరణ: నల్లగొండ జిల్లా పేరూరులో దొరికిన శాసనం. యాదవ యువరాజు విజయ పెరమాడి ఆ ప్రాంతాన్ని పాలించినట్టు ఆ శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతడు సింఘన కుమారుడు (నేలటూరి వెంకటరమణయ్య 1973లో ఆ శాసనం మీద జరిపిన పరిశోధన నుంచి). కానీ రుద్రమదేవి (1262-1289) కాలం నుంచి పరిస్థితులు మారాయి. కాకతీయ రాజ్యాన్ని ఒక మహిళ పాలించడం యాదవులకు కం•గింప యింది. ఈ వంశీయుడు మహాదేవుడు రుద్రమ మీద దండయాత్రకు వచ్చాడు. ఇతడిని రుద్రమదేవి ఓడించి, దాసుణ్ణి చేసుకుంది. యాదవులకు చెందిన బెడదకోట (బీదర్‌) ‌కాకతీయులు వశం చేసుకున్నారు. భరణం కింద అపారంగా ధనం, గుర్రాలు కూడా తీసుకున్నారు (పీవీ పరబ్రహ్మశాస్త్రి కాకతీయులు పుస్తకం నుంచి). బీదర్‌ ‌శాసనం, తెలంగాణలో దొరికిన ఒక నాణెం ఈ విషయం చెబుతున్నాయి.

ఆ నాణెం గురించి కొంచెం

అది బంగారు నాణెం. పేరు గడ్యాన. బరువు 3.77 గ్రాములు. వ్యాసార్థం 1.8 సెంటీమీటర్లు. బొమ్మవైపు ఎనిమిది రేకల కలువ ఆకారాన్ని మధ్యలో ముద్రించారు. మరొక ఐదు ముద్రలు కూడా ఉన్నాయి. కాకతీయుల చిహ్నం వరాహం అందులో ఒకటి. బొరుసు వైపు ఏమీ లేదు. అంటే మహాదేవుడి నాణేల మీద కాకతీయుల ముద్రలు వేశారు. ఎందుకంటే ఏ యాదవ వంశీకుడు కూడా నాణేల మీద ఎలుగు బొమ్మను ముద్రించ లేదు. కానీ కాకతీయుల కాలానికి చెందిన ప్రతి నాణెం మీద ఎలుగు ముద్ర ఉంటుంది. యాదవుల నాణేల మీద కలువతో పాటు శంఖం కూడా ఉంటుంది. రెండు శ్రీలు ఉంటాయి. ఈ నాణెం కృష్ణుడు అనే పాలకుడి పేరుతో ఉంది.

ఈ నాణెం కూడా కృష్ణుడు అనే యాదవ వంశీకునిదే.

దీని మీద కూడా ఎనిమిది రేకల కలువ ఉంది. శ్రీతో మిగిలిన నాలుగు చిహ్నాలు ఉన్నాయి. నాగరి లిపి అక్షరాలు ఉన్నాయి.

మూడో నాణెం మహాదేవుని కాలానిది. ఇదొక భిన్నమైన నాణెం.

చరిత్రను నాణేలూ, శాసనాలూ ఆధారాలతో సహా తెలియచేస్తాయి. కంటికి కనిపించకుండా ప్రతితరం మీద చరిత్ర తన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే మన గతం మనలను చేయి పట్టుకు నడిపిస్తుంది. ‘ఇంత చరిత్రను చూస్తుంటే, ఒక మహా మాతృమూర్తి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టు ఉంటుంది’ అంటారు శేషేంద్ర. రుద్రమదేవి వారసత్వం సరిగ్గా అలాంటిదే. ఇప్పుడు ఆమె వలె రణభూమిలో పోరాడుతూ ఎవరూ కనిపించరు. పరిస్థితులను బట్టి పురుషునిగా కనిపిస్తూ, ఆడజన్మను దాచుకోరు. కానీ స్త్రీగా ఉనికిని చాటుకుంటూనే ఏ సామర్ధ్యమైనా పురుషులకే సొంతం కాదని ఆచరణలో నిరూపించగలరు. అలా, మారిన కాం కూడా రుద్రమలను అందిస్తున్నది. నేను అలాంటి రుద్రమదేవిని కోస్తాంధ్రలో చూశాను. ఆమె ధైర్యం, రుద్రమ వలెనే కాల గమనాన్ని తన వైపు తిప్పుకోవడం వంటి లక్షణాలు ఆ యువతిలో చూశాను. రుద్రమ వలెనే ఆ యువతి కూడా సాహసి. ఆ సాహసం తన జీవితాన్ని మలిచింది.

అప్పుడే కౌమారం దాటుతుండగా, ఇరవై ఏళ్ల ఒక యువకునితో ఆ అమ్మాయికి వివాహం నిశ్చయించారు. అతడు బ్యాంకులో చిరుద్యోగి. ఎందుకో పెళ్లి వెంటనే జరగలేదు. తీరా అంతా నిశ్చయమైన తరువాత ఆ యువకుని ఆరోగ్యం, శారీరక పరిస్థితి ఘోరంగా దిగజారాయి. తీవ్రస్థాయిలో ఫిట్స్ ‌వచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. పుట్టుకతో వచ్చిన లోపం ఫలితంగా మెదడులోని ఒక దమని నుంచి రక్తస్రావం జరిగింది. చిత్రం ఏమిటంటే, ప్రతి పదిలక్షల మందిలో కేవలం 1.34 మందికే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆ యువకుడికి వచ్చింది, అంత దారుణమైన వ్యాధి. అమెరికాలో అలాంటి కేసులు ఏటా 2000 కనుగొంటున్నారు. అంటే మొత్తం ముప్పయ్‌ ‌లక్షల మంది అమెరికన్లకు (20-40 వయసుల వారు) ఈ వ్యాధి ముప్పు ఉంది. ఈ వ్యాధి కారణంగా ఆ యువకుడికి మాట పడి పోయింది. కుడిభాగం చచ్చుపడింది. గుంటూరుకు చెందిన ఒక వైద్యుడి ద్వారా నాకు ఆ కేసు వచ్చింది. నేనే 1970లో శస్త్రచికిత్స చేశాను. చివరికి అతడు పాక్షికంగానే అయినా ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు. మాట రాలేదు. కొంత బలహీనతతో అయినా కుడిభాగం కాస్త పనిచేయడం మొదలుపెట్టింది. అంతకు మించి ఆ యువకుడి ఆరోగ్యం మెరుగుపడదు. కానీ మందులతో పరిస్థితి దిగజారకుండా చూసుకోవచ్చు.

సంబంధం కుదుర్చుకున్నా కూడా ఆ యువకుడి పరిస్థితి చూసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంతా రద్దు చేసుకుందామన్నారు. తమ మాట లెక్కచేయకపోతే కూతురివే కాదనుకుంటాం అని కూడా హుకుం జారీ చేశారు. కానీ భవిష్యత్తులో ఆ అబ్బాయి ఆరోగ్యం గురించి ఆ అమ్మాయి నన్ను అడిగి తెలుసుకుంది. పుట్టిల్లు విడిచిపెట్టింది. ఒక గుళ్లో ఆ యువకుడినే పెళ్లి చేసుకుంది. అద్భుతంగా సాకింది. మనోధైర్యం కల్పించింది. ఆ తరువాత అతడు అడుగులు కూడా వేశాడు. అవతలి వాళ్లు మాట్లాడుతున్నది అర్ధం చేసుకోవడం ఆరంభించాడు. చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడడం ఆరంభించాడు. మళ్లీ బ్యాంకు పనికి వెళ్లాడు. ఆమె ధైర్యాన్ని చూశాక నాకు రుద్రమదేవే గుర్తుకు వచ్చింది. తనకు దక్కిన రాజ్యం ఏ స్థితిలో ఉన్నా, పరిస్థితులకు లొంగిపోలేదు. వాటికి భయపడి పారిపోలేదు. ఆ రాజ్యాన్నే నిలబెట్టుకుంది. అందుకు ఎదిరించి పోరాడింది. ఇది కూడా చరిత్ర నుంచి వచ్చిన స్ఫూర్తే. ఇవాళ చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవలసిన తీరు ఇదే.

సంప్రతించిన గ్రంథాలు :

సుబ్రహ్మణ్యం. ఆర్‌,: ఏ ‌క్యాటలాగ్‌ ఆఫ్‌ ‌యాదవా కాయిన్స్ ఇన్‌ ‌ది స్టేట్‌ ‌మ్యూజియం, 1965

వెంకటరమణయ్య, ఎన్‌,: ‌పేరూరు ఇన్‌‌స్క్రిప్సన్స్

‌పరబ్రహ్మశాస్త్రి, పీవీ, : ది కాకతీయాస్‌

‌- డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో

About Author

By editor

Twitter
Instagram