అక్టోబర్‌ 30, 1990‌న జరిగిన మొదటి కరసేవకు సంబంధించిన వార్తలు దేశాన్ని కదలించేవే. 1990 అక్టోబర్‌ 30‌వ తేదీ తెల్లవారుజామున అయోధ్యలోని సరయూ వంతెనపైన కరసేవకులపై కాల్పులకు తెగబడిన ములాయం సింగ్‌ ‌ప్రభుత్వం ఇటు హనుమాన్‌ ‌మందిరం వద్ద కూడా నిరాయుధులైన రామభక్తుల మీద రెండోసారి కాల్పులు జరిపింది. ఆరోజు ఉదయం 10-11 గంటల మధ్య వేలాది మంది కరసేవలు కర్ఫ్యూను ధిక్కరించి, పోలీసులతో పోరాడుతూ చిన్న చిన్న సందుల గుండా హనుమాన్‌ ‌మందిరం వద్దకు చేరుకున్నారు. ఇంకా బయట నుంచి కరసేవకులు ఉప్పెనలా వస్తూనే ఉన్నారనే సమాచారం జిల్లా మేజిస్ట్రేట్‌ ‌రామశరణ్‌ శ్రీ‌వాస్తవకు తెలిసింది. నేరుగా అక్కడికే వచ్చిన శ్రీవాస్తవ కరసేవలను వెనక్కి వెళ్లాలని, లేకుంటే కాల్పులు జరుపుతామని హెచ్చరించాడు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ముందుకు దూకి జన్మభూమికి వెళ్లే చిట్టచివరి బారికేడ్‌ను కూడా ధ్వంసం చేశారు. శ్రీరామజన్మభూమికి-కరసేవకులకు మధ్యలో సరిహద్దు భద్రతాదళాలు, సీఆర్పీఎఫ్‌ ‌దళాలు అడ్డుగోడగా నిలిచాయి.

జిల్లా మేజిస్ట్రేట్‌ శ్రీ‌వాస్తవ కాల్పులు జరపాలని సరిహద్దు భద్రతాదళాలను ఆదేశించారు. నిరాయుధులైన కరసేవకులు, పైగా వృద్ధులపై కాల్పులు జరపడానికి ఆ దళాలు అంగీకరించక తప్పుకున్నాయి. కరసేవకులు మరింత ఉత్సాహంతో ముందుకు దూకారు. శ్రీవాస్తవ మరోసారి ఫైరింగ్‌ ఆదేశాలు ఇచ్చాడు. ఈసారి సీఆర్‌పీఎఫ్‌ ‌దళాలు కాల్పులు ప్రారంభించాయి. మొదట్లో గాలిలోకి కాల్పులు జరిపాయి. అయినా కరసేవకులు చెక్కుచెదరలేదు. దాంతో తూపాకీ గొట్టాలు నేరుగా కరసేవకుల గుండెలపై గురిపెట్టి కాల్చారు. మొదటి వరుసలోని 12 మంది కరసేవకులు అక్కడే కుప్పకూలి అసువులు బాశారు. ఇది చూసిన మిగిలిన కరసేవకులు ఆవేశంతో చొక్కాల గుండీలు విప్పి, ఛాతిని చూపిస్తూ ముందుకు దూకారు. కాల్పులకు ఆదేశాలిచ్చిన జిల్లా మేజిస్ట్రేట్‌ ‌వైపుకు కొందరు ఊరికారు. కాల్పులను గమనించిన అయోధ్య ప్రజలు ఒక్కసారిగా ఇళ్లపై నుంచి పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. శ్రీవాస్తవ పలాయనం చిత్తగించాడు. ఈ పోరాటం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.

సరిగ్గా 12 గంటలకు దాదాపు వెయ్యి మంది కరసేవకులు బాబ్రీ కట్టడం-రామ జన్మభూమి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు.

 నాలుగు నిమిషాల్లో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.

 రామ్‌ ‌లాలా హమ్‌ ఆయే హై…. అంటూ ఆనందోత్సాహాలతో జన్మస్థాన్‌ ‌పై సాష్టాంగ పడ్డారు.

మరుక్షణం కరసేవ ఆరంభమైంది. అంటే అక్కడ కొద్ది మట్టిని తవ్వి సంకేత రూపంలో పునాది పని ప్రారంభించడమే కరసేవ! ఆ పని వారు ప్రారంభించారు. వారి వద్ద ఎలాంటి ఉపకరణాలు లేవు. ఇనుప బారికేడ్‌లను ఛేదించుకుని వచ్చిన సమయంలో దొరికిన ఇనుపరాడ్లే పనిముట్లు అయ్యాయి.

అటు ఉత్సాహం పట్టలేని మరికొందరు యువకులు ఒకరి భూజాలపై ఒకరు ఎక్కి బాబ్రీ కట్టడం-మందిర గోపురాలపైకి చేరుకున్నారు. జాతికే కళంకమైన బాబ్రీకట్టడాన్ని తొలగించే పనిని ప్రారంభించారు. అది కూడా సంకేతంగానే. ఈ లోగా మరికొందరు యువకరసేవకులు బాబ్రీ గోపుర శిఖరంపై భగవాధ్వజాలను ఎగురవేశారు. విజయోత్సాహంతో వారు చేసినా జైశ్రీరామ్‌ ‌నినాదాలు అంతటా ప్రతి ధ్వనించాయి. బాబ్రీ గోపురంపై ఓంకార చిహ్నంతో కాషాయ పతాకాలు ఎప్పుడైతే కనిపించాయో ఇక కరసేవకులకు, అయోధ్య పట్టణ ప్రజలకు ఆనందానికి అంతులేదు. కొందరు భద్రతా దళాలకు దండం పెట్టారు. ఇదంతా దాదాపు 20 నిమిషాలే. అయోధ్యలోకి చిన్న పక్షిని కూడా చొరబడనీయను అంటూ బీరాలు పలికిన ములాయంసింగ్‌ ‌యాదవ్‌కు తల కొట్టేసినట్టయింది.

అప్పుడే కొందరు పోలీసు అధికారులు విశ్వహిందూ పరిషత్‌ ‌నాయకుడు, యూపీ మాజీ డీజీపీ ఎస్సీ దీక్షిత్‌ను జన్మస్థాన్‌ ‌వద్దకు తీసుకువచ్చారు. మన లక్ష్యం నెరవేరింది. ఇక వెనక్కి రమ్మని ఆయన కరసేవకులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది కరసేవకులు వెనక్కి మరలి వచ్చారు కూడా. అంతలో సరిగ్గా ఒక హెలికాప్టర్‌ ‌తక్కువ ఎత్తులో ఎగురుతూ బాబ్రీ కట్టడం వద్దకు వచ్చింది. అందులో ఉన్న యూపీ సీఎం ములాయంసింగ్‌ను, అతని మంత్రి మహమ్మద్‌ ఆజం ఖాన్‌ను కరసేవకులు గుర్తుపట్టారు. కరసేవ జరిగిందని అర్థం చేసుకున్న ములాయం సింగ్‌ ‌భద్రతాదళాలకు రెడ్‌ అలర్ట్ ‌సందేశాలు ఇచ్చాడు. వెంటనే ఒక అధికారి మందిరం లోపల కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా కరసేవకులపై మళ్లీ సీఆర్‌పీఎఫ్‌ ‌జవాన్లే కాల్పులకు తెగబడ్డారు. ఇది ఆ రోజున నిరాయుధులైన కరసేవకులపై కాల్పులకు తెగబడిన మూడో ఘటన! ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు సాధువు. రెండోవారు 14 సంవత్సరాల రాజేంద్రకుమార్‌ ‌యాదవ్‌ అనే యువకుడు. ఈ యువకుడే మొదటిసారిగా బాబ్రీ కట్టడం గోపురంపైకి ఎక్కి భగవాధ్వజాన్ని ఎగురువేశాడు. రాముని సన్నిధిలో ఆ రామ కార్యంలో అమరుడైన మొట్టమొదటి కరసేవకుడు రాజేంద్రకుమార్‌ ‌యాదవ్‌!

‌లక్ష్యం నెరవేరి ఉండవచ్చు. హిందువుల గుండె ధైర్యం, రామభక్తుల తెగింపు విశ్వాన్ని కదిలించి ఉండవచ్చు. కానీ తమతో పాటే వచ్చిన కరసేవకులు తమ కళ్ల ముందే తుపాకీ గుళ్లకు బలైన దృశ్యం అక్కడ అందరిని కలచివేసింది. అందుకే అందరి హృదయాలు బరువెక్కి ఉన్నాయి.

అక్టోబర్‌ 31, ‌నవంబర్‌ 1‌వ తేదీల అయోధ్యలో ఉద్రిక్తత నెలకొని ఉన్నా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. అక్టోబర్‌ 30‌వ తేదీన కరసేవ ముగిసినా రామ్‌ ‌లాలా దర్శనం చేసుకోలేని వారే ఎక్కువ. రామ్‌ ‌లాలా దర్శనం చేసుకున్న తర్వాతనే తిరిగి వెళ్లాలన్న కాంక్ష వారిలో ఉంది. ఇంతలో పోలీసుల కస్టడి నుంచి తప్పించుకున్న అశోక్‌ ‌సింఘాల్‌, ఎస్సీ దీక్షిత్‌లు నవంబర్‌ 1‌వ తేదీ సాయంత్రానికి మహంత్‌ ‌నృత్యగోపాల్‌ ‌దాస్‌ ‌నివాసం మణిరాం ఛావనీ వద్దకు చేరుకున్నారు. ఆ రోజు జరిగిన సమావేశంలో రెండవ తేదీన మరోసారి శాంతియుతంగా మందిర ప్రవేశా నికి ప్రయత్నించాలని నిర్ణయించారు. నిర్బంధాలతో 30వ తేదీ కరసేవకు చేరుకోలేకపోయిన వేలాది మంది కరసేవకులు అయోధ్యకు వచ్చి చేరారు. వీరిలో దక్షిణ భారతంతో పాటు, ఇటు పశ్చిమ భారతం నుంచి వచ్చిన వేలాదిమంది కరసేవకులు ఉన్నారు. రెండుదారుల గుండా వెళ్లి హనుమాన్‌ ‌మందిరం వద్ద కరసేవకులు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్టోబర్‌ 30 ‌తర్వాత అయోధ్య రెండు విభాగాలుగా చీలింది. మణిరాం ఛావనీ, దిగంబర్‌ అఖాడా ప్రాంతం అంతా కరసేవకుల అధీనంలోనే ఉంది. ఇక్కడ కర్ఫ్యూ ప్రభావం ఏ మాత్రం లేదు! అటు హనుమాన్‌ ‌మందిరం, రామ జన్మభూమి ప్రాంతం మాత్రం పూర్తిగా భద్రతాదళాల ఆధీనంలో ఉంది.

రామ్‌ ‌కొఠారీ, శరత్‌ ‌కొఠారీ

ఆ నిర్ణయం మేరకు నవంబర్‌ 2‌వతేదీ ఉదయం మణిరాం చావనీ నుంచి రెండుదిశలలో యాత్రలు ప్రారంభమయ్యాయి. కొద్దిదూరం వెళ్లగానే భద్రతా దళాలు ఎదురుపడ్డాయి. వెంటనే కరసేవకులు రోడ్డుపైనే బైఠాయించి రామనామ జపం మొదలు పెట్టారు. కింద కూర్చోని పాకుతూనే మందిరం వద్దకు చేరాలని కరసేవకులు వ్యూహం. అప్పుడే ఇంకో మార్గం నుంచి కూడా కరసేవకుల దండు వచ్చింది.

హిండాల్‌కో వసతిగృహం నుంచి సాధ్వీ ఉమాభారతి తప్పించుకుని అయోధ్య చేరుకున్నారు. ఈ వార్త కరసేవకులకు మరింత ఉత్సాహాన్ని నింపింది. తనను గుర్తు పట్టకుండా ఆమె తలనీలాలు సమర్పించుకున్నారు. ఆమె నాయకత్వంలో ఉత్తర భారతానికి చెందిన వందలాది కరసేవకులు మరో మార్గం గుండా ముందుకు కదిలారు. అలా మొత్తం మూడుమార్గాల్లో కరసేవకులు రోడ్లపై ఉన్నారు. కొద్ది దూరం రాగానే మొదట ఉమాభారతిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా కరసేవకులు రోడ్డుపై రామభజన చేసుకుంటూ పాకుతూ కదిలారు.

ఇంతలో ఏం జరిగిందో తెలియదు. భద్రతా దళాలకు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు! మూడుమార్గాల్లో పాకుతూ వస్తున్న కరసేవకులపై ఒక్కసారిగా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. తెల్లని పాగ ఆ ప్రాంత మంతా కమ్ముకోగానే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టారు. తుపాకులు కాళ్లకు కాకుండా తలలకు గురిపెట్టారు. ఒక్కొక్క కరసేవకుడిని పట్టుకుని మరి కాల్చడం కనిపించింది. ఇండ్లలో తదాచుకున్న వారిని బైటకు ఈడ్చి కాల్చారు. చనిపోయిన కరసేవకుల మృతదేహాలను తీసుకుని పోవడానికి వచ్చిన వారిని సైతం కాల్చారు. అయినా కూడా కొంతమంది కరసేవకులు ముందుకే కదిలారు. నేలకొరిగిన ప్రతి కరసేవకుడి మృతదేహం ఛాతీవైపే తూటా గాయాలున్నాయి. వీపువైపు కాదు!

మరణించిన కరసేవకుల్లో కలకత్తాకు చెందిన రామ్‌ ‌కొఠారీ, శరత్‌ ‌కొఠారీ అనే ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరు 30వ తేదీన గోపురాలపై మొట్ట మొదట ఎక్కిన బృందంలో ఉన్నారు ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిని పోలీసులు పాయింట్‌ ‌బ్లాంక్‌ ‌రేంజిలో కాల్చి చంపారు. అదే సమయంలో కరసేవ కుల బలిదానం చూసి కన్నీళ్లు పెట్టుకున్న పోలీసులు కూడా కనిపించారు. తరువాత సహచార పోలీసుల దురాగతాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నవంబర్‌ 2‌న జరిగిన కాల్పుల ఘటనపై అయోధ్య పట్టణంలోని ప్రజలు ఆగ్రహంతో ఊగి పోయారు. ఆ రోజు సాయంత్రం కనిపించిన పోలీసునల్లా రాళ్లతో కొట్టారు. ములాయం సింగ్‌ ‌ప్రభుత్వం జరిపిన ఈ నరమేధం పట్ల హిందువులలో ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంతాప సభలు, శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో కోట్లాది హిందూ సోదరులు పాల్గొన్నారు.

నాలుగైదు జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతాలను మరిపించేలా సాగిన మూలాయం సింగ్‌ ‌ప్రభుత్వ దమనకాండ, పోలీసు దౌర్జన్యం, కాల్పులతో నవంబర్‌ 2‌వ తేదీన మరణించిన కరసేవకుల సంఖ్య లెక్క జెప్పడం కష్టం. ఎందుకంటే భద్రతాదళాలు కరసేవకుల మృతదేహాలను సైతం మాయం చేశాయి. ఆ రోజున 100 మందికి పైగానే కరసేవకులు మరణించారని విశ్వహిందూ పరిషత్‌ ‌పెద్దలు చెప్పారు! దీని గురించి ఏ హక్కుల కార్యకర్త నోరు విప్పలేదు. కానీ హిందువులు నోరు విప్పారు. కార్యాచరణకు పూనుకున్నారు. ఒక కొత్త అడుగు పడింది. 1990 అక్టోబర్‌ 30, ‌నవంబర్‌ 2‌న జరిగిన కరసేవ భారతజాతి మొత్తాన్ని సమైక్యపరిచింది. దేశం నలువైపుల నుంచి భాష, ప్రాంత, కుల, వర్గ రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టి ప్రజలందరూ హైందవ శంఖారావం పూరించారు. ధనికులు- పేదలు, హరిజనులు-గిరిజనులు, బీసీలు అనే తేడా లేకుండా హిందువులంతా ఒక్కటయ్యారు! హిందువులమని గర్వంగా చాటారు.

 డిసెంబర్‌ 6, 1992.

‌రెండవ కరసేవ జరిగింది. ఇదే రామ జన్మభూమి విముక్తి పోరులో తుది ఘట్టమైంది. పెద్ద సంఖ్యలోనే కరసేవకులు హాజరయ్యారు. ఆ ఉదయం కూడా వాతావరణం ప్రశాంతంగానే ఉంది. రామకథా కుంజ్‌లో సభ ఏర్పాటయింది. సభకు 70,000 మంది వచ్చారు. స్థలం వద్ద దాదాపు ఐదువందల మంది సాధువులు పూజలు చేయడానికి వెళ్లారు. కుంజ్‌లో ప్రసంగాలు సాగుతూ ఉండగానే కొందరు బయటకు వెళ్లారు. అక్కడ పోలీసులతో ఘర్షణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దాదాపు ఎనభై మంది కట్టడం పైకి ఎక్కి గుమ్మటాలను ధ్వంసం చేసే పని మొదలు పెట్టారు. తరువాత ఆ పరిసరాలలో దాదాపు 70,000 మంది కరసేవకులు చేరారు. తరువాత కరసేవకులు గుమ్మటాల మీద కాషాయ జెండా ఎగురవేశారు. కట్టడం నేల మట్టమైంది.

(వచ్చే వారం ముగింపు, రామ జన్మభూమిలో మందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన)

About Author

By editor

Twitter
YOUTUBE