– ‌డా।। మన్మోహన్‌ ‌వైద్య, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సహ సర్‌ ‌కార్యవాహ

(‌గతవారం తరువాయి..)

మాటకు కట్టుబడే వారు

శాసన మండలికి నామినేట్‌ అయ్యాక నాన్న గారు ఆ వెంటనే మూడురోజుల్లో ప్రమాణ స్వీకారం చేయాలి. ఎందుకంటే స్పీకర్‌ ‌రా. సూ. గవాయి రెండు నెలల పాటు విదేశీ పర్యటనకు వెళతారు. అయితే నాన్నగారు అంతకు ముందే నాగపూర్‌లోని వినాయక్‌ ‌రావ్‌ ‌దేశముఖ్‌ ‌విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనటానికి అంగీకరించి ఉన్నారు. ఈ కారణంగా ‘మీరు విదేశాల నుండి తిరిగొచ్చిన తరువాతే ప్రమాణ స్వీకారం చేస్తా’నని స్పీకర్‌ ‌గారికి స్పష్టం చేసి విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.

సంఘంపట్ల అద్భుతమైన సమర్పిత జీవనం ఆయనది

‘సంఘమే శరణాగతి’ అనే అద్భుతమైన గుణం మన వ్యక్తిత్వంలో క్రమం తప్పక శాఖకు వెళ్లినప్పుడే వస్తుంది. పెక్కు సంవత్సరాలుగా సంఘ అఖిల భారత ప్రతినిధి సభ నాగపూర్‌లో ప్రతి మూడేళ్లకో సారి జరుగుతుంది. ఇలాంటి బైఠక్‌ ఓసారి 2018లో నాగపూర్‌లో జరుగుతోంది. పెక్కు సంవత్సరాలుగా నాన్నగారు ఇలాంటి బైఠక్‌లలో పాల్గొనేవారు. అయితే ఈ మధ్య కాలంలో వయోభారం కారణంగా బైఠక్‌లలో పాల్గొనలేకపోయేవారు. కానీ 2018 నాటి బైఠక్‌లో దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రముఖ కార్యకర్తల్ని నాన్నగారితో కలపాలనే ఉద్దేశంతో మాననీయ సర్‌ ‌కార్యవాహ భయ్యాజీ జోషి కొంత సమయం బైఠక్‌లో పాల్గొనాల్సిందిగా నాన్నగారిని కోరారు. 2018 మార్చి 11న మధ్యాహ్నం తరువాత నాన్నగారు సమావేశ స్థలికి చేరుకున్నారు. ఇంగ్లీష్‌ ‌తిథుల మేరకు మార్చి 11 నాన్నగారి జన్మదినం. సర్‌ ‌కార్యవాహ గారికి ఈ విషయం తెలిసి నాన్నగారికి 95 ఏళ్ల వయసు నిండటంతో ప.పూ.సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌డా.మోహన్‌ ‌భాగవత్‌జీతో నాన్నగారికి సత్కారం చేయించారు. సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌గారు వీల్‌ ‌చెయిర్‌పై కూర్చున్న నాన్నగారికి శ్రీఫలాన్ని ఇచ్చి, శాలువ కప్పి సత్కారం చేశారు. నాన్నగారు తనకన్నా వయసులో చిన్న వారైన సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌గారికి వంగి నమస్కారం చేసే ప్రయత్నం చేయబోగా వారు నాన్నగారి చేతులు పట్టుకొని ఆపేశారు. గుండెలు కదిలించే సన్నివేశమది. ఆ తర్వాత ఐదు నిముషాలు నాన్నగారు ప్రసంగించాలి. నాన్నగారు తన ప్రసంగంలో ఇలా అన్నారు- ‘పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌గారు నన్ను నమస్కరించనీయలేదు. అయినప్పటికీ నేను మనసులోనే వారికి పాదాభివందనం చేస్తున్నాను’. ఈ మాటలు వినగానే అందరి మనసులు ప్రేమపూర్వకంగా గద్గదితమై నాయి. ఆ తరువాత మూడు నిముషాల పాటు నాన్నగారు చేసిన ప్రసంగం చాలా విలువైనది. ‘సంఘాన్ని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు.. సంఘాన్ని అర్థం చేసుకోవటానికి ఈశావాస్యో పనిషత్తుని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఈ ఉపనిషత్తులోని ఒక శ్లోకం ఆత్మతత్వాన్ని వర్ణిస్తూనే పరస్పర విరుద్ధమైన పలుకులను ఏక కాలంలో ప్రస్తావిస్తుంది. ఆ శ్లోకమిది – ‘‘తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహృయతః’. అంటే ‘అది (ఆత్మతత్త్వం) హడావుడి చేస్తుంది, హడావుడి చేయదు కూడా. అది లోపలా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఇది సంఘం విషయంలో వర్తిస్తుంది సంఘం రాజకీయంతో ముడి పడి ఉంటుంది, ముడిపడకుండా కూడా ఉంటుంది. సంఘం ధార్మిక వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది, ముడిపడకుండా కూడా ఉంటుంది. సంఘం సమా జాన్ని సంఘటితం చేస్తుంది. సంఘం సమాజంతో మమేకమవుతుంది. సంఘం సంపూర్ణ సమాజం.’

సమావేశం ముగిశాక నేను ఇంటికెళ్లాను. నాన్నగారితో మాట్లాడుతూ ‘మీ ప్రసంగం చాలా బాగా నచ్చింది’ అన్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు కదా ‘నేను అస్వస్థత, వయోభారం మూలాన వేదికపైకి వెళ్లలేకపోయాను. నా కోసం సర్‌ ‌సంఘ చాలక్‌జీ వేదిక దిగిరావాల్సి వచ్చింది. ఇది నాకు దుఃఖాన్ని కలిగించింది.’ ప్రస్తుతం నాన్నగారు భౌతికంగా లేరు. అయితే వారి మార్గనిర్దేశనం చేసే ఆలోచన దృక్పథం, ఆదర్శాల రూపంలో మా మధ్యలోనే ఉన్నారు. వారు చేసిన మార్గనిర్దేశనంలో నడిపించే సమర్థత మాకివ్వమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

(అనువాదం – విద్యారణ్య కామ్లేకర్‌, ‌సినీయర్‌ ‌జర్నలిస్ట్)

About Author

By editor

Twitter
Instagram