డా. హెడ్గేవార్‌ ‌స్మారక సమితి, కర్ణావతి (గుజరాత్‌) ‌నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో సర్‌సంఘచాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌  ‌పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రసంగ పాఠం..


ఆదరణీయులైన అమృతభాయి, ఇక్కడ ఆసీనులయిన బంధు మిత్రులారా..

ఇలాంటి సందర్భం ఏటా వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతోనే గడిచిపోయిన కాలపు స్మృతులు గుర్తుకొస్తున్నాయి. జాతీయగీతాలాపన ముగిశాక నేను భారతమాతను పూజించేందుకు వెళ్లాను. మనం ‘జన గణ మన’ ఆలపిస్తున్నప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చింది- ‘భారత భాగ్యవిధాత’కు నమస్సులర్పించే సమయంలో మనం మన దేశాన్ని స్మరించాం. ‘పంజాబ్‌, ‌సింధ్‌, ‌గుజరాత్‌, ‌మరాఠా, ద్రావిడ, ఉత్కళ్‌, ‌బంగ్‌, ‌వింధ్య, హిమాచల్‌, ‌యమునా, గంగా…’ అంటే ఈ భూమినీ, సరిహద్దు లనీ, ఇక్కడ ప్రవహిస్తున్న నదులనీ, పర్వతాలనీ స్మరిస్తున్నాం… ఈ పేర్లన్నీ ఇక్కడి ప్రజలనే కాదు, స్థలాల ప్రాముఖ్యాన్నీ సూచిస్తాయి. భూమి, జలం, జనం, వనం, పశు సంపత్తి వంటివన్నీ ఇందులో ప్రస్తావనకొచ్చాయి. అంటే ఈ దేశపుత్రుల సహితంగా, పర్యావరణ సహితంగా, భూమి సహితంగా ఈ దేశ స్వరూపాన్ని సంపూర్ణంగా మన కళ్ల ముందు మనం నిలుపుకున్నాం. అలాంటి మన దేశం గురించి, హే భగవాన్‌! ‌నీ పవిత్రనామంతో ఈ దేశం జాగృతమవ్వాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. భారతదేశ విశేషం ఇదే. భారతీయులంతా ఆస్తికులే. అక్కడక్కడ భగవంతుడి ప్రస్తావన ఉంటుంది. స్మరణ ఉంటుంది, ఇన్‌ ‌గాడ్‌ ‌వీ ట్రస్ట్. అయితే ఇక్కడ సాధారణంగా ఆస్తిక ధోరణిలో లోటు కొట్టొచ్చి నట్టుగా కనిపిస్తుంది. అయినా మనం శ్రద్ధాపూర్వ కంగా మన శ్రద్ధాభావాన్ని సురక్షితంగా ఉంచమని కోరుతూ దేశం కోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో ఆలోచనాపరంగా మనం భారతమాత స్వరూపాన్ని దర్శించాం. ఆ తర్వాత మనం భారతమాతని పూజించాం. ఆ పూజా విధానంలో భారతమాత అఖండ స్వరూపమే మనకు కనిపిస్తుంది. అంతకు మునుపు మనం పతాకావిష్కరణ గావించామంటే మన సంకల్ప సాధన కోసం భగవంతుడి నుండి మనం ఆశీస్సులు కోరామన్నమాట. ప్రత్యక్షంగా ఈ సంకల్పం సాకారం కావటానికి మనం ఏం చేయాలి. అందుకోసం ‘తవ శుభ నామే జాగే ..’ అని చెప్పాం. అంటే ఆ జాగృత స్వరూపాన్ని మనం ఏమని భావించాలి? అలాగని మనం నిద్రపోవడం లేదు, అందరం మేల్కొనే ఉన్నాం. అంటే దానికి స్పష్టమైన ప్రతీక మన రాజ్యాంగ సమ్మతమైన త్రివర్ణ పతాకం. ఆ త్రివర్ణ పతాకం మీద అన్నిటికన్నా పైన భగవావర్ణం (రంగు) ఉంటుంది. అంటే మన దేశంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న, అందరికీ ఆమోదయోగ్యమైన రంగు. ఈ రంగు త్యాగానికీ, కర్మయోగానికీ ప్రతీక. అంతేకాదు తేజస్సుకు కూడా ప్రతీకే… అగ్ని జ్వాలల రంగు!! .. అది అందరినీ తనలో ఇముడ్చుకుంటుంది. అంటే అందరినీ మమేకం చేసుకోవటం, త్యాగ భావనతో, ఇంద్రియ నిగ్రహ పూర్వకమైన జీవితాన్ని గడపటం, నిరంతర కర్మలను కొనసాగిస్తూ సర్వత్రా మంగళాశాసనాలు చేయటం. ఇది మన దేశ ప్రయోజనాలకు కేంద్ర బిందువు. మనం ఏ జాగృతి విషయమైతే ప్రస్తావిస్తు న్నామో, ఆ జాగృతిలో ఇలాంటి భావనలు ఉండాలనే కోరుకుంటాం. ఇది ఉండేందుకు మనం అలాంటి కర్మలనే కొనసాగించాల్సి ఉంటుంది. మనం మన జీవితాల్లో త్యాగ – మనో నిగ్రహ భావనలు పెంపొం దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యం కర్మ నిష్కల్మషమై ఉండాలి. అంతేకాదు, అందరిని కలుపుతూ సంఘటితమై మన దేశాన్ని అత్యున్నత స్థానానికి చేర్చాలి.

దీనితోనే సరిపోదు. ఇంకా ఏం చేయాలన్నది రెండవ రంగు చెబుతుంది. ఆ రంగు చెప్పేది కూడా మనం ఆచరించాలి. ప్రతి ఒక్కరి శీలం స్వచ్ఛంగా, పవిత్రంగా, శుద్ధంగా, సుందరంగా ఉండాలి. పవిత్రతకు ప్రతిరూపమైన తెలుపు రంగు ఇదే నిర్దేశిస్తుంది. మన జీవితాలను పవిత్రతకు మారుపేరుగా సుందరీకరించుకోవాలి. జనానికీ, లోకానికీ దీన్ని ప్రసంగాల రూపంలో కాదు, కార్యరూపంలో ఆచరించి చూపాలి. అదే విషయాన్ని చెప్పాలి.

‘ఏతద్దేశ ప్రసూతస్య సకా శాదగ్ర జన్మనః

స్వం స్వం చరిత్ర శిక్షేరన్‌ ‌పృథివ్యామ్‌ ‌సర్వ మానవః…’

ఒక రకంగా చూస్తే మిగతా దేశాలన్నిటికన్నా ప్రాచీన దేశవాసులు కావటం మూలాన ఇక్కడి వారు ప్రపంచానికే పెద్దన్నలు. వారి జీవనశైలిని చూసి ప్రతివ్యక్తి తమతమ జీవనశైలిని పునర్‌వ్యవస్థీకరించు కోవాలి. అది ఎలా ఉండాలంటే మనవాళ్లు గొప్ప జీవనశైలిని మిగతావారి కళ్లెదుట నిలపాలి. దాన్ని చూసి వాళ్లంతా తమకోసం తమ పూర్వీకులిచ్చిన ఆదేశంగా భావించాలి. మన వాళ్లు ఇలాంటి పవిత్రతతో జగత్తులోని జీవనాన్ని మేల్కొల్ప గలిగినప్పుడు మన దేశం మరింతగా జాగృత మవుతుంది. అలాంటి పవిత్ర భావన మనకెంతో ఆవశ్యకం. ఇక మూడవ రంగు విషయానికొస్తే – అది ఆకుపచ్చ రంగు. లక్ష్మీదేవి రంగు. సమృద్ధిని సంకేతిస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి ఉపాసన జరుగుతున్నప్పుడు గాని, దీపావళి నాడు లక్ష్మీపూజ జరుగుతున్నప్పుడు గాని శ్రీసూక్తం చదువుతారు. అందులో లక్ష్మీదేవి వర్ణన ఉంటుంది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనలక్ష్మే కాదు, కేవలం ధాన్యలక్ష్మే కాదు… శ్రీసూక్తంలో లక్ష్మీదేవిని ఇంకా ఇలా ప్రస్తావించడం కనిపిస్తుంది-

‘న క్రోధో న చ మాత్సర్య న లోభో నాశుభామతిః।

భవంతి కృత పుణ్యానాం భక్తానాం సూక్త జాపినామ్‌।।

…‌క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్ష్మీ నాశయామ్యహమ్‌’.

అలక్ష్మీ – లక్ష్మి లేకపోవడం, అంటే దేశంలో ఆకలితో అలమటిస్తున్న వాళ్లుండటం. పై శ్లోకంలో ఆకలిని నిర్మూలించమని చేసే ప్రార్థన ఉంది. మనః ప్రవృత్తిని ఎలా రూపొందించుకోవచ్చన్న విషయమూ అందులో చెప్పారు. రుణం, రోగం మొదలైన దారిద్య్ర పాపం క్షుధా అపమృత్యు… ఇవి జీవనంలో దుఃఖహేతువులు, ఇవి ఉండరాదు. శ్రీసూక్తంలోనే మరికొంత ముందుకు పోతే ఇలా కూడా పేర్కొనటాన్ని చూస్తాం – ‘లోభ శోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా …’ అంటే మనం ఏ లక్ష్మీదేవి కోసం సాధన చేస్తామో, మనం ఏ ‘పరమవైభవా’న్ని , ఆత్మనిర్భర భారతాన్ని ఆశిస్తున్నామో… అందులో భౌతిక సమృద్ధి ఉండనే ఉంది. అయితే మానసిక సంపన్నత కూడా ఉంటుంది. త్యాగం వల్ల మనసు నిశ్చింతతో కూడిన సాధుత్వం పొందుతుంది. దారిద్య్రాన్ని అనుభవిస్తూనే, మానసిక సంపన్నతని ఉపాసించే పవిత్ర వ్యక్తిత్వం గల వాళ్ల ప్రయత్నంతో, శక్తితో శుభకరమైన జన సమూహంతో భారత్‌ ‌జాగృతమవుతుంది. ఇది సాధించటానికి మనం ఆశీర్వాదాలు కోరుతున్నాం.

ఇవాళ గణతంత్ర దినోత్సవం. అందువల్లే ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది మన గణతంత్రం, అంటే దీన్ని కొనసాగించేది మనమే… కొనసాగించటానికి తంత్రం (మార్గం) ఉంది, రాజ్యాంగం ఉంది. ఈ కారణాల వల్లే రాష్ట్ర ప్రభుత్వాలు, కేందప్రభుత్వం ఉన్నాయి. ఒక చట్టం ఉంది, కానీ దీన్ని అమలు చేసేది ఎవరు? ఇదంతా ప్రజల నిజాయితీ, సమర్థత, ప్రయత్నాల, కోరికల మేర కొనసాగుతుంది. అందుకే మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలోని నాలుగు మాటల్ని ఎప్పుడు కూడా మార్చకూడదు. సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో తన నిర్ణయాన్ని చెప్పిందిలా – రాజ్యాంగంలో పీఠిక అంశాలు ఎన్నడూ మారవు. అయితే ఒక మినహాయింపుగా మాత్రమే, రెండు మాటలు తర్వాత అందులో చేరాయి. కానీ ఆ ప్రస్తావన పౌరహక్కుల గూర్చి, పౌరుల కర్తవ్యాలు గూర్చి మాత్రమే. మన దేశం ఎటువేపు ముందుకెళ్లాలి? దీనికోసం మార్గ నిర్దేశాలేవి అనే అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవాళ్టి రోజు మనమంతా రాజ్యాంగ ప్రతిని సంపాదించాలి. అందులో ఉన్న ఆ నాలుగు విషయాలని తప్పకుండా చదవాలి. ఎందుకంటే మనం ఎటువైపు దేశాన్ని తీసుకెళతామో అటువైపు దేశం వెళుతుంది. మనం దేశాన్ని ఎటు వేపు తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి? ఆ రోజుల్లోనే మన నాయకత్వం సమష్టి నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం గురించి అందులో రాశారు కూడా. ఆ నిర్ణయాన్ని పరిపూర్ణం చేయడానికి, అవసరమైన నాణ్యత, అవసరమైన ధ్యేయం ధ్వజారోహణంతో మన ముందుకొస్తుంది. ఇదంతా మన కర్తవ్యాన్ని, మన కోర్కెల్ని, మన ఆకాంక్షల్ని మన జాతీయగీతం ద్వారా భగవంతుడి ఆశీర్వాదాన్ని కోరుతూ దేశ చరణాల ముందు సంపూర్ణంగా అర్పిస్తాం. దాని స్వరూపాన్ని స్మరిస్తూ, ప్రతి ఏటా వచ్చే ఈ కార్యక్రమం సందర్భంగా జెండా వందనం చేస్తున్నాం. కానీ ఇది చేస్తున్నప్పుడు అటుఇటుగా 75 సంవత్సరాల విషయాలను మననం చేసుకోవటం స్వాభావిక మయింది. అయితే ఈ విషయాల వెనకనున్న భావనని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపు కోవాలి. ఈ విషయాలే నా మాదిలో మెదిలాయి. మీరంతా ఆలోచిస్తారన్న ఉద్దేశంతోనే నా అభిప్రాయాలను మీ ముందుంచాను.

ధన్యవాదాలు

(అను: విద్యారణ్య కామ్లేకర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram