తన రచనలలో చెప్పిన ఆదర్శాలకు కవి లేదా రచయిత విలువ ఇవ్వాలనీ, దేశీయమైన విలువలు ఉన్నప్పుడు విదేశీ భావనతో రచనలు చేయడం సరికాదనీ అంటున్నారు ఆశావాది ప్రకాశరావు. ఇతరుల అభిప్రాయాలతో వెలువడిన రచనలు చదవడమనే సత్సంప్రదాయం కూడా లుప్తమైపోతున్నదనీ, నినాద ప్రాయమైన కవిత్వం రావడం వల్ల ప్రయోజనం లేదనీ ఆయన అంటున్నారు.ఈ దేశం కోసం బతికిన వారి జీవిత చిత్రాలనూ, భావజాలాన్నీ  వచ్చే తరం వారికి కూడా అందించవలసిన బాధ్యత కవులకూ రచయితలకూ ఉందని ఆయన చెప్పారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంలో ఆయనతో జాగృతి జరిపిన ముఖాముఖీలోని కొన్ని అంశాలు పాఠకుల కోసం..


మీ రచనలు జాతీయతా భావాలతో నిండి ఉంటాయి. ఇందుకు ప్రేరణ ఎవరు?

నండూరి రామకృష్ణమాచార్యులవారు, వారి రచనలు నన్ను ప్రభావితం చేశాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఆత్మకూరి గోవిందాచార్యుల వారి అల్లుడు రామకృష్ణమాచార్యులు. వీరు సబర్మతి ఆశ్రమంలో పెరిగినవారు. గాంధీ రచనలతో ప్రభావితులయ్యారు. రామకృష్ణమాచార్యుల వారి ఓంశాంతి శాంతి వంటి రచనలు నాకు ప్రేరణ. నా రచనలు అంబేడ్కర్‌, అరుంధతి, నివేదిత వంటివి అలా వచ్చినవే.

సంస్కరణవాదం, జాతీయవాదం తెలుగు సాహిత్యంలో ఎలా పరిఢవిల్లాయి?

జాతీయత పేరిట కొందరు నినాదప్రాయమైన రచనలు చేస్తున్నారు. కవి లేదా రచయిత నినాదాలకే పరిమితమైతే ఎలా? అప్పుడు కవికీ, రాజకీయ నాయకుడికీ భేదం ఏమిటి? చెప్పేంత వరకే రాజకీయ నాయకుడి పని. తాను ఏం చెప్పాడో దాని ప్రకారం అతడు జీవించడు. కవులు అలా కాకుండా ఏం చెప్పారో దానికి అనుగుణంగా జీవించాలి. అలా జీవిస్తేనే నలుగురు అతడి రచనలను ఆదర్శంగా తీసుకుంటారు. కవికి ఆదర్శప్రాయమైన జీవితం కూడా ఉండాలి. లేకపోతే, ఏమయ్యా మహాకవీ! ఏదేదో రాశావు. అంతా బాగానే ఉంది. కానీ నువ్వు చేస్తున్న వ్యవహారాలు ఇంత ఘోరంగా ఉన్నాయేమి అని నిలదీస్తారు.

ఇవాళ్టి పరిస్థితులలో సాహిత్యం ఎలా ఉండాలి? 

వైదేశికమైన భావజాలం చేత మనం చాలా వరకు పతనం అంచుకు చేరుకున్నామని నా అభిప్రాయం. దేశీయమైన విలువలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు అనుసరించకూడదు అని ఎవరూ తమను తాము ప్రశ్నించుకోవడం లేదు. అదేదో కొత్త పంథాను తొక్కుతున్నామని అంటున్నారే తప్ప, మంచి పునాదులను కూలదోస్తున్నామని వారు అనుకోవడం లేదు. ఈ విషయం గురించి రచయితలు, కవులు ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. తదను గుణంగా రచనలు చేయాలని అనుకుంటున్నాను.

తెలుగులో  జాతీయ భావాల స్ఫూర్తి కలిగిన కవిత్వ ప్రస్థానం ఎలా ఉంది?

పూర్తిగా జాతీయభావాలతో కవిత్వం రావడం మొదలయినది స్వాతంత్య్రోద్యమ కాలం నుంచేనని నా అభిప్రాయం. శివభారతం, పోతన చరిత్ర, రాణా ప్రతాప్‌ ‌వంటి రచనలు ఒకే కాలంలో వచ్చాయి. శివభారతం, రాణా ప్రతాప్‌ ‌వంటి రచనలు చదివిన వారు వాటి నుంచి స్ఫూర్తిని పొందడమే కాదు, తమ సంతానానికి ఆ రచనలలోని పాత్రల పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి రచనలు ఇప్పుడు రావడం లేదు. కానీ వాటి అవసరం ఉంది. నేను సోదరి నివేదిత ఇతివృత్తంగా కావ్యం రాశాను. అంతకు ముందు ఆమె గురించి ఎవరూ ఒక్క పద్యం కూడా రాయలేదు. ఈ జాతికి అంకితమై సేవ చేసిన వారు, ఈ గడ్డకు చెందిన మహనీయుల జీవితాలు, జాతికి ఆదర్శంగా ఉన్నవారు, వారి భావజాలం రేపటి తరానికి అందించాలి. ఇది ఒకప్పుడు జరిగింది. ఇవాళ లేదు. నివేదిత జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని నేను కావ్యం రాయడానికి కారణం ఇదే. ఈ పంథాలో కొన్ని రచనలు వస్తున్నా, మేము కూడా రాశాం అన్నట్టు ఉంటున్నాయి. వెలువడిన అలాంటి రచనతో సమాజానికి ప్రయోజనం చేకూరిందా లేదా అన్నది కూడా ప్రధానమే. ఈ ధోరణితో కూడిన రచనా స్రవంతి అవసరమే. కానీ ఆనాటి వారసత్వం కొనసాగిందని చెప్పలేం.

ఎలాంటి కవిత్వం ఇప్పుడు వస్తోంది?

సామాన్యమైన విషయాలని ఇతివృత్తాలుగా తీసుకుంటున్నారు. వాటిని సామాజిక రుగ్మతల మీద పోరాటం పేరుతో కవిత్వంగా మలుస్తున్నారు. ఇవి ఎవరినీ ఏ విధంగానూ ప్రభావితం చేయలేక పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కూడా మళ్లీ- కేవల నినాదప్రాయమైన రచనలవి. మళ్లీ చెబుతున్నాను. కవి అన్నవాడు, రచయిత అయిన వాడు తాను ఏ ఆదర్శాన్ని కవిత్వీకరిస్తున్నాడో, అక్షరబద్ధం చేస్తున్నాడో అందుకు అనుగుణంగా బతకాలి. కానీ అలాంటి రచయితలు ఇప్పుడు తగ్గిపోతున్నారు. ఇప్పటి చాలా రచనలు నిలబడక పోవడానికి ఇదీ కారణమే. రోడ్డు మీద అడుక్కుంటున్న ఒక బిచ్చగాడి గాధ ఆధారంగా, అతడి మీద సానుభూతితో ఒక రచయిత ఒక నవల రాస్తాడు. బహుమతి కూడా పొందుతాడు. కానీ ఆ వచ్చిన బహుమతి డబ్బులలో కొద్దిగా వెచ్చించి తన నవలకు ఇతివృత్తంగా మారిన ఆ బిచ్చగాడికి ఒక చొక్కా కూడా కుట్టించడు. కాబట్టి ఆ నవలతో ఏం సాధించినట్టు? ఏ ప్రయోజనం ఆశించి రాసినట్టు?

తెలుగు సాహిత్యంలో ఇన్ని వాదాలు వస్తున్నాయి. కానీ జాతీయవాదం ఎందుకు బలంగా వినిపించడం లేదు?

వాళ్లేమంటున్నారంటే- అందరూ ఒకే మార్గంలో ప్రయాణిస్తే అది ఇరుకైపోతుంది అంటారు. గమ్యం చేరడానికి ఏ మార్గమైన ఎన్నుకోవచ్చునంటారు. నేను ఏమంటానంటే, అభివ్యక్తిలో భేదం ఉన్నా, అభిప్రాయాలలో భేదాలు ఉండ కూడదు. కానీ అభిప్రాయాలతో సంఘర్షించే వాతావరణమే ఉంది. ఒక రచనలోని మేలిమిని తీసుకోవడానికి కూడా సిద్ధపడని అవాంఛనీయ ధోరణే ఉంది. ఒక పెద్ద సాహిత్యవేత్తకి నా రచనలు ఇచ్చాను, చదివి చెప్పండి అని. ఒక సంవత్సరం తరువాత ఆ విషయం ప్రస్తావించాను. చదవలేదు అన్నారాయన. ఇంకా, మీ పుస్తకాలు చదివితే మేం మారే ప్రమాదం ఉంది. మేం మారదలుచుకోలేదు అని కూడా అన్నారు. నేను నవ్వుతూ, మిమ్మల్ని కూడా మార్చగలిగే సామర్ధ్యం నా రచనలకు ఉన్నదని తెలిసింది, చాలా సంతోషం అన్నాను. పొరపాటున కూడా వేరే అభిప్రాయాలతో వచ్చిన రచనలు చూడరాదన్న మనస్తత్త్వం పెరిగింది. తమ రచనలకే ప్రాచుర్యం ఉండాలనీ, అవే అందరి నోళ్లలోను ఉండాలనీ కోరుకునే మనస్తత్త్వం ఎక్కువయింది.

ఇప్పటికీ మీరు పద్యకవిగా ఉన్నారు. ఇంకా కొందరు కవులు పద్య కవిత్వం రాస్తున్నారు. వచన కవిత్వంతో చెప్పలేనిది పద్యంతో చెప్పవచ్చా?

పద్యం మనదైన పక్రియ. పద్యంతో కలిగే ప్రయోజనం తక్కువదేమీ కాదు. పద్యాలు పిల్లలకు బాగా పట్టించాలి. పద్యం ధారణతో ముడిపడి ఉంటుంది. పద్యం భావం పాఠకుడిని శాసిస్తుంది. జరిగే మంచి ఇదే. మంచి పద్యంలో మంచి నీతి ఉంటుంది. ధారణ కారణంగా దాని సారాంశం మనసును పట్టి ఉంటుంది. అది చెప్పే నీతి వల్ల పిల్లలు పెద్దవాళ్లయినా చెడుమార్గం పట్టకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. నువ్వు చేస్తున్న దేమిటి; ఏం చేయాలి అంటూ పద్యం నిలదీస్తుంది. ఇది నా స్వీయానుభవం. అయితే వచన కవిత్వం కూడా ఉండవచ్చు. చదువుకోవచ్చు. తప్పేం లేదు. కానీ ధారణకు పనికొచ్చేది పద్యమే. గుట్టలు గుట్టలుగా వచ్చిన కవితలు వచ్చాయి. ఎన్ని గుర్తున్నాయి? ఎన్ని జనం నాల్కల మీద నిలబడ్డాయి? అదే పద్యమైతే- శతాబ్దాల క్రితం వచ్చినదైనా ఇవాళ్టి సమాజంలోనూ వినిపిస్తున్నది. ఆ గుట్టల గుట్టల వచన కవిత్వంలో కవి ముద్ర కానరానివి ఎన్నో! అదే నన్నయ పద్యాన్ని వెంటనే గుర్తించగలం. ఇది తిక్కన పద్యశైలి అని మరుక్షణంలో చెప్పగలం. ఇది విశ్వనాథ వారి పద్యమని చదివిన వెంటనే స్ఫురణకు వస్తుంది. అదే వచన కవిత్వంలో అయితే చాలా ప్రసిద్ధమైనవే తెలుస్తున్నాయి. పద్యాన్ని పరిహసిస్తూ, వచన కవితను సమర్ధించే విమర్శకాగ్రేసరులు కూడా ప్రసిద్ధ కవితలను తప్ప, ఆ కవులే రాసిన ఇతర కవితలను కూడా గుర్తు పట్టలేరు. కారణం చాలా కవితలు నినాదాలను మోసుకువస్తాయి.


గాయపడ్డ జాతికి మందు…

ఇం‌టిపేరు ఆశావాది. అమ్మానాన్నా పెట్టిన పేరు ప్రకాశరావు. ఆయన అక్షరాలన్నీ  ఆశావాదాన్నే ఆవిష్కరిస్తూ ఉంటాయి. జాతీయతా దీప్తిధారతో ఉండే ఆయన భావనలన్నీ ప్రకాశవంతమే. ఆశావాది ప్రకాశరావు తెలుగు సాహిత్యంలో చిరపరిచితమైన పేరు. ఆయనకు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించి తమను తాము గౌరవించుకున్నదంటే అతిశయోక్తి కాదు. రచయితగా, కవిగా, వ్యాసకర్తగా, సాహితీ విమర్శకునిగా ఆశావాదికి ప్రత్యేక దృష్టి ఉంది. తనదైన తాత్త్వికత ఉంది. అది జాతీయత పునాదిగా కలిగినది. మన ప్రాచీన సాహిత్యం, ఆధునిక పునరుజ్జీవనోద్యమ ప్రభావం ఆశావాది మీద గట్టి ప్రభావం చూపినట్టు అర్ధమవుతుంది. పోతననూ, జాషువనూ విశేషంగా చదవడం వల్ల కాబోలు ఆయన సాహిత్యం సునిశితత్త్వం, భావ గాంభీర్యంతోను ఉంటుంది. దానితో పాటు ఎంతో కోమలంగా కూడా ఉంటుంది వారి రచనా శైలి. ‘వివేక పునీత నివేదిత’ కావ్యంలో ఇది స్పష్టం. స్వామి వివేకానందుల వారి శిష్యురాలు సోదరి నివేదిత భారతదేశంతో, భారతీయతతో అనుబంధం పెంచుకున్న క్రమాన్నీ, ఈ పుణ్యభూమి గతాన్ని ఆమె అర్ధం చేసుకుని, భారతీయులను చైతన్యవంతం చేయడానికి పడిన తపననూ ఈ కావ్యంలో ఆశావాది హృద్యంగా ఆవిష్కరించారు.

మార్గరెట్‌ ఎలిజబెత్‌ ‌నోబెల్‌ (‌నివేదిత అసలు పేరు)కు వివేకానందస్వామి దర్శనం కావడం, ఆయన సందేశాలను ఆ పాశ్చాత్యురాలు ఆలకించడం ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. దానిని ఆశావాది ఇలా ఆవిష్కరించారు. ‘లక్ష్య హీనంబైన లౌల్యప్రయాణంబు/ సల్పు యువతకు నిజమ్ము దెలిపి’న ద్రష్టను ఆమె వివేకానందునిలో దర్శించు కున్నారట. ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలమైన భారతావని నేడు పరివేదనలో ఉంది, రక్షించు కుందాం రండి అంటూ ఆయన పిలుపునిచ్చారు,

‘అమల మమరమైన ఆధ్యాత్మ సంపద

కాది భరతదేశమయ్యె కాని

పతనమొంది నేడు పరివేదనను నుండె

నుద్ధరింప దీని సిద్ధమవుడు’ అని.

హిందూ దేశ చరిత్రలోని బలహీనతలను ఆకళింపు చేసుకుని వాటిని సరిదిద్దాలన్నదే వివేకానందుని ధ్యేయంగా కనిపిస్తుంది. దైవభావనతో ఏకం చేసి, చిత్కళాజ్యోతిని వెలిగించాలన్నదే ఆయన ధ్యేయమట. దీనినే ఆశావాది ఇలా చిత్రించారు-

‘సకల వర్గాలవారిలో జాలువారు

చిత్కళాజ్యోతి వెలిగింప,చెన్నుమీర

దైవభావన నొకటౌచు,సేవచేయ

నడుము బిగియింపవలె నంచు నుడివె స్వామి…

వివేకానందుల సందేశాలు మేఘగర్జనల వలె ఉంటాయి. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కావాలని ప్రబోధించినవారాయన. అలాగే ఒక్క కుక్క అయినా అన్నం లేకుండా పడి ఉంటే దానికి ఆహారం ఇవ్వమని చెప్పిన మానవతావాది. ఆ భావనను ఇలా ఆవిష్కరించారు ఆశావాది,

‘సకల మానవాళి సంతోషమును బెంప

 శ్రేష్ఠులైన మనుజ సింహములను

సిద్ధపరుపవలయు స్నిగ్ధోద్యమ స్ఫూర్తి

అనెడిపల్కులామె కర్థమయ్యె.’ అన్నారు. ఇవి నివేదిత భావనలుగా, ఆమె అంతరంగ తరంగాలుగా కవి చిత్రించినా, అందులో ఈ తరానికి వివేకానందుల సమున్నత బోధనలను పరిచయం చేయడమే కవి ఉద్దేశమని వేరే చెప్పక్కరలేదు. ఇదే కావ్యంలోని చతుర్థాశ్వాసంలో ఉన్న కొన్ని పద్యాలు నివేదిత వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిగా ఉంటాయి. అవతారిక, ఆపై నాలుగు ఆశ్వాసాలు ఉన్న చిన్న కావ్యంలో భారత ప్రజానీకానికి సేవ చేయటం కోసం, తద్వారా భారతమాతకు తన జీవితాన్ని సమర్పించి, జన్మ చరితార్థం చేసికోవటం కోసం తాను జన్మించిన బ్రిటిష్‌ ‌దేశాన్ని వదలి వచ్చిన సోదరి నివేదిత కథ హృదయానికి హత్తుకొనే విధంగా మన కాలపు ఈ కవి చెప్పారు. ఇక్కడ నివేదిత భారతీయ ఆత్మను అన్వేషించడానికి వచ్చిన వనితగా మనకు కనిపిస్తుంది. వివేకానందుల వారు చేసింది సరిగ్గా అదే. భారతీయ ఆత్మను తెలుసుకోవాలనుకోవడమే.

ఏ వ్యక్తి అయినా తన దేశం నుంచి ఎలా ప్రేరణ పొందాలో, దేశమాతను చూస్తే ఆమె బిడ్డల మేధస్సు ఏ విధంగా ప్రజ్వరిల్లాలో కూడా వివేకానందుడు, నివేదితల గాథ ద్వారా మనకు చెప్పారు ఆశావాది.

‘ఏ తల్లి నామంబు హృదయ పీఠి జపింప

జిహ్వాగ్రమున కైత చిందియాడు,

ఏ తల్లి రూపంబు దృక్పర్వముగ జూడ

పటు వర్ణన స్ఫూర్తి పరిఢవిల్లు,

ఏ తల్లి గుణరాజి నేప్రొద్దు దలచిన

శబ్ద వైచిత్య్రంబు సంభవించు,

ఏ తల్లి వరివస్య నెల్లవేళల జేయ

రసమయానంద సామ్రాజ్యమబ్బు

ఆ యనుగుతల్లి, శ్రితసముదాయ కల్ప

వల్లి, మామక హృత్పద్మ భర్మపీఠి

నిండువేడుక కొలువిచ్చి నెగడుగాత!

సాహితీసభా జయధాత్రి చారుగాత్రి….’ అన్నారాయన.

వివేకానందుల వారిని ఆధునిక పునరుజ్జీవ నోద్యమానికి వేగుచుక్కగా భావిస్తాం. కానీ ఆయన సమకాలీనులైన చాలామంది వలె ఆయన ఆ పునరుజ్జీవనాన్ని దిగుమతి చేసుకున్న విద్యతో, జ్ఞానంతో, చైతన్యంతో కాకుండా, ఈ నేల వాసనతో కూడిన చైతన్యంతో, జ్ఞానంతో రగుల్కొల్పాలని కోరుకున్నారు. అందుకే తన  మాతృదేశ ఖ్యాతిని వివేకానందుడు ఈ రూపంలో దర్శించారని ఆశావాది చెప్పడం ఔచిత్యంగా ఉంది,

‘జపము గాయత్రితోడనే సాగునిచట

కలుషముల్‌ ‌గంగ గ్రోలగ తొలగునిచట

తలపు గోమాత సేవలో చెలగునిచట

చదువు గీతాధ్యయనమున నొదవునిచట.’ అని రాశారాయన.

అంతేకాదు, తన కల్పనలోని భారతమాతను వివేకానందుని దృష్టికోణం నుంచి ఆశావాది ఈ విధంగా దర్శించారు. ఇది కూడా ఎంతో రమణీయంగా ఉంది.

‘సర్వమత సామరస్యము చాటు తల్లి

భిన్నతల నేకతను గూర్చుచున్న సాధ్వి

యవనికే శీర్షమాణిక్యమైన ధాత్రి

ఉన్నదాన తృప్తిగను సంపన్న సురభి.’

భారతమాత సేవలో తాను సైతం తరించేందుకు మీ కార్యకర్తలగణంలో చేర్చుకోమంటూ మార్గరెట్‌ ‌వేడుకోలుకు చాలాకాలం తర్వాత అనుమతి లభించింది. ఆమె భారతదేశం చేరింది. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస సతీమణి శారదా మాత దర్శనమైందామెకు. శారదామాత వ్యక్తిత్వాన్ని ఆశావాది అక్షరాలతో పాఠకులకు పరిచయం చేసిన తీరు అద్భుతం.

‘శారదామాత మాధురీధారలొల్కు

విలువగల భాషణముచేయు విజ్ఞురాలు

ప్రేమపూర్ణ దర్పములేని వినయశీల

స్నేహమయత పెంపొందించు స్నిగ్ధ హృదయ’ అంటారాయన. అలాగే ఆమె కోరిన రెండు మాసాల తరువాత నివేదితకు బ్రహ్మచర్య దీక్షనిచ్చి వివేకానందుడు ఉపదేశించిన ఘట్టానికి కూడా ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది. భారతీయమైన పరివ్రాజకత్వం, సమాజానికీ, సన్యాసాశ్రమానికీ మధ్య ఉన్న లోకాతీతమైన బంధం గురించి స్వామి మాటల ద్వారా ఆశావాది మన కళ్లకు కట్టారు. ‘ఆలోచనలయందు అలవాటులందున/  భారతీయత్వమే ప్రబలవలయు  బ్రహ్మచర్యంబును బహిరంతరమ్ముల’ అని ప్రబోధించారట వివేకానంద.

ఈ అనంత చరిత్ర ప్రస్థానంలో ఒక ఘట్టాన్ని తీసుకుని కవి కావ్యంగానో, పద్యంగానో మన ముందు ఉంచడం వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ కాలం ఖండం గొప్పదనం చెప్పడమో, లేదా ఆ కాలంలోనే జాతి కోల్పోయినదేమిటో గుర్తు చేయడమో కవి లేదా రచయిత చేస్తాడు. అందుకు ఆయా పాత్రలను, సందర్భాలను ఉపయోగించుకుంటారు. ఆ క్రమంలోనే ఇక్కడ నివేదిత చేత ఇలా చెప్పించారు కవి. మీకు ఇంత అద్భుతమైన కళాసంపద ఉండగా ఎవరివో కళారూపాల కోసం ఎందుకు పాకులాడతారని ఆమె చేత  భారతీయులను నిగ్గతీయించారాయన. ఇంకా, ‘జాతీయకళలచే జాగృతి నొందిన/ ధరణియే శక్తిమంత  మనె నామె/మీలోని నైపుణి మీరేల కన రని/గుండె కలచ వ్యధ నుండు నామె’. అనిపించారు

ఈ నేల గురించి, ఈ మట్టి వాసన వేసే రచనలు ఎంత అవసరమో, వాటితోనే ఈ జాతి చైతన్యవంతం కావడం ఎంత అవసరమో ఆశావాది నివేదిత పాత్ర ద్వారా చెప్పించిన ఈ మాటలు అజరామరాలు.

‘ఏవేవో రచనలతో

ఏవో భాషణలతో మనీష మరచుచున్‌

‌మీ విలువౌ కాలమ్మును

పోవిడకుడు మహిజనహితమును కవులారా!’

నివేదిత కేవలం వివేకానందుల వారి ఆధ్యాత్మిక సందేశాలకే పరిమితం కాలేదు. ఆంగ్లేయుల మీద సాగుతున్న ఉద్యమంలో ఆమె తన ముద్రను వేశారు. అందునా తీవ్ర జాతీయోద్యమంలోని వారికి సాయమందించారని చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ పద్యం చూడండి! మితవాదుల వైఖరిని ఆమె నిరసించడం వెనుక ఎంత భవిష్యత్‌ ‌దర్శనం ఉందో అర్ధమవుతుంది.

‘శ్వేతజాతిపై యెన్నాళ్ళు సిగ్గుమాలి/భారతీయులు ఆధారపడుచు నుందు/

రన్నినాళ్ళు ప్రగతిశూన్య మనుచు దెలిపి /జాతిని రగుల్ప జేసెడి నీతి పట్టె’

ఈ కింది పద్యంలో ఆవిష్కరించిన భావన వివేకానంద, నివేదితల జీవిత ధ్యేయంగా కనిపిస్తుంది. ఇంకా వివేకానందున బోధనల సర్వ సారాంశం అని కూడా అనిపిస్తుంది. వివేకానందుడు మహోన్నత మానవతావాది అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఆయన మాటలే. ఆయన చేతలే. దేశం పట్ల ప్రేమ, సాటి జీవుల ఎడ దయ, స్వాతంత్య్ర పిపాస ఎప్పటికీ ఉండవలసిన లక్షణాలు. వాటినే ఈ పద్య రూపంలో దివ్యంగా నిక్షిప్తం చేశారు ఆశావాది.

‘ఎదుటున్న జీవుల నెరిగిన చాలును

దేశీయ బాధ్యత తెలిసినట్లె

మాతృభూమ్యర్చన మానక యుండిన

సకల సురల పూజ సల్పినట్లె

కలనైన స్వేచ్ఛనే పలవరించుచు నున్న

స్వాతంత్య్ర సాధన సాగినట్లె

నైతికతను మేధ నతికించి నిల్పిన

ఆరోగ్య భావన నతికినట్లె’- ఆధునిక తెలుగు సాహిత్యంలోనే ఎన్న దగిన పద్యం. ఇది ఆశావాది కవితా వైభవం. గద్య రచనలో కూడా ఆయన తనదైన ప్రతిభను ప్రదర్శిస్తారు.

‘దేశహితం కోసం సమైక్యతా స్వరం’ వ్యాస సంకలనం ఆశావాది వచన రచనా పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది. పద్నాలుగు వ్యాసాలున్న ఈ చిన్న పుస్తకంలో చాలా లోతైన విషయాలు అవగాహనకు వస్తాయి. అరుంధతిని భారతీయతకు ప్రతిరూపం అంటారు ఆశావాది. బుద్ధుడు, బసవేశ్వరుడు, వేమన, మహాత్మా పూలే, అంబేడ్కర్‌, ‌జగ్జీవన్‌రాం, కవి జాషువ, బోయి భీమన్న వంటి కవుల, సంస్కర్తల, నిమ్న కులోద్ధారకుల జీవిత చిత్రాలు ఇందులో కనిపిస్తాయి. వీరందరి జీవితాలలో ఉండే సామ్యం ఒక్కటే-హిందూ సమాజంలోని అంతరాలను, అనాచారాలను నిర్మూలించడమే. సమరసతా దుందుభి, కుల వివక్ష నిర్మూలనకై ఎవ్వరేం చేయాలి వంటి వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇందులో అరుంధతి అనే పురాణ పాత్ర ఔచిత్యం గురించి ఆశావాది చేసిన పునర్‌ ‌మూల్యాంకన అసాధార ణంగా కనిపిస్తుంది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram