– వసుంధర


ఆపదలు చెప్పి రావు. ఐతే ఒకోసారి ఆపదలు కూడా కలిసొస్తాయి.
శ్యామ్‌ ఆఫీసు పనిమీద కార్‌లో వైజాగ్‌ ‌టూర్‌ ‌వెళ్లాడు. అక్కడ అతడితో కలిసి పని చేసే బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. దాంతో మొత్తం అందర్నీ క్వారంటైన్లో పెట్టారు. మామూలుగా ఐతే రెండు వారాలు. కానీ మూడు వారాలు కూడా ఉండాల్సి రావచ్చట.
‘‘అన్నాళ్లు నిన్నొదిలి ఉండాలన్న బాధ తప్పితే, ఇక్కడ రాజాలా చూసుకుంటున్నారు నన్ను’’ అన్నాడు శ్యామ్‌ ‌ఫోన్లో. నాకు మాత్రం ఆ మాట గుండె లోతుల్లోంచి కాక, పెదాల చివర్నించి వచ్చిందనిపించింది.

‘‘నువ్వు బాధంటున్నావు. నాకైతే గుండె బద్ధలౌతోంది’’ అన్నాను. నా మాట కూడా పెదాల చివర్నించి వచ్చినట్లు నాకు తెలుస్తోంది.
ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నాక ఫోను పెట్టేశాను.
కనీసం రెండు వారాలు – నా ఇంట్లో నేనొక స్వేచ్ఛా విహంగాన్ని కావచ్చునన్న భావన కలిగి ఉత్సాహమొచ్చింది. నా జీవితం నాది అనుకునేలా, నాకున్న మామూలు సరదాల్ని పునరుద్ధరించాలనుకున్నాను.

లాక్‌డౌన్‌ ఉం‌ది కాబట్టి షాపింగుకి వెళ్లలేను. ఐతేనేం, ఇంట్లోనే ఉండి రోజుకోలా మేకప్‌ ‌చేసుకుని సెల్ఫీలు తీసుకోవచ్చు. రోజూ గంటైనా సంగీతసాధన చేసి రికార్డు చెయ్యొచ్చు. ఇష్టమైన కారం వంటకాలు వరుసగా చేసుకోవచ్చు. సోషల్‌ ‌మీడియాలో చురుగ్గా పాల్గొనవచ్చు. పక్కనెట్టిన ఇంగ్లీషు నవల్లు పూర్తి చెయ్యొచ్చు. ఇంకా ఆన్లైన్‌ ‌షాపింగు, చానెల్సుకి బదులు యాప్స్‌లో వచ్చే పోగ్రామ్సు..
తలచుకుంటేనే కలుగుతున్న భావోద్వేగాన్ని తట్టుకునేందుకు గుండెమీద చెయ్యి వేసుకుంటే, చేతికి గుచ్చుకున్న మంగళసూత్రాలు – లబ్‌డబ్‌ ‌శబ్దాన్ని అధిగమిస్తూ గలగలమన్నాయి.

నా జీవితం నాక్కాకుండా పోవడానికి కారణమైన పసుపు తాటి బంధనం. సుమారు మూడేళ్లుగా పలుపుతాడైన శిక్షాబంధనం. నా గుండె చప్పుణ్ణి నాకే వినిపించనివ్వని బంధనం. ఈ రెండు వారాలైనా మెడలోంచి తీసెయ్యాలనుకుని చేతిని మెడమీద వేస్తే – చటుక్కున శ్యామ్‌ ‌నా కళ్లముందు ప్రత్యక్షమై – ‘నా ప్రాణము తీతువా’ అని బావురుమంటున్నట్లు అనిపించి క్షణం తటపటాయించాను.
‘‘నీ మెడలో తాళి శ్యామ్‌కి రక్షాబంధనమంటుంది సంప్రదాయం. ఆ సెంటిమెంటే ఆడదాన్ని మగాడికి బానిసని చేస్తోంది. ముందా తాళిని కాసేపు మెడలోంచి తీసెయ్‌’’ అని మనసు ప్రోత్సహించింది. తటపటాయిస్తూనే ఆ గొలుసుని బయటకు తీశాను.

* * *
మధ్యతరగతి ఆడపిల్లని. చదువే జీవితమనే పరిసరాలు. అందరిచేతా మంచమ్మాయి అనిపించు కోవాలన్న తాపత్రయం. ఇవన్నీ కలిసి మామూలు సరదాల్ని కూడా మనసారా అనుభవించే అవకాశాల్ని బాగా తగ్గించేశాయి నాకు. ఎప్పుడైనా అమ్మ దగ్గర గునిస్తే, ‘‘పెళ్లయ్యేక నీ మొగుడు నీ సరదాలన్నీ తీరుస్తాడులే’’ అని తేలిక చేసేది. అబద్ధ మెందుకూ, నేనా మాట నిజమను కున్నాను.
బీకాం కంప్యూటర్స్ ‌పూర్తి చేశాను. వెంటనే మంచి ఉద్యోగమొచ్చింది. సంపాదిస్తున్నాను కాబట్టి సరదాలు తీర్చుకుంటూ కొన్నాళ్లైనా లైఫ్‌ ఎం‌జాయ్‌ ‌చెయ్యాలనుకున్నాను. కానీ షోకులున్నా, చలాకీగా ఉన్నా ఆడపిల్లకి పెళ్లి కష్టమట. ‘‘ఇన్నాళ్లాగావు. పెళ్లయ్యేదాకా ఆగు. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా ఉందువుగాని’’ అంది అమ్మ. ఆ మాటా నమ్మాను.
షోగ్గా, చలాకీగా ఉన్న అమ్మాయిలు నా మిత్రబృందంలోనే ఉన్నారు. వాళ్లలో ఇద్దరు ముగ్గురికి ఇటీవలే పెళ్లిళ్లయ్యాయి. అందులో ఇద్దరివి ప్రేమ పెళ్లిళ్లు. అయినా అమ్మ మాటలే నమ్మి, నా సరదాలు తీరడానికి పెళ్లే ఏకైక మార్గమని నమ్మి – అప్పటికి సరదాల్ని వాయిదా వేశాను. అమ్మా నాన్నా శ్యామ్‌తో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే ఇష్టంగానే సరేనన్నాను.
శ్యామ్‌ ‌సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీరు. మధ్యతరగతి అబ్బాయి. పెళ్లిచూపుల్లో నన్నేమీ అడక్కుండానే, ఇష్టపడ్డట్లు చెప్పాడు. నన్నేమైనా అడగమని కాబోయే అత్తమామలు అన్నారు. నా సరదాల గురించి చెప్పాలనుకున్నా, తనేం అడగనప్పుడు నేనడగడం బాగుండదనిపించింది.
మాకు పెళ్లయింది. ఇక స్వేచ్ఛా విహంగాన్ని అనుకున్నాను.
పెళ్లయ్యేక మొదటిరాత్రి నన్నడిగాడతడు – నాలో ఏం చూసి ఇష్టపడ్డావని.
‘‘ఊహ తెలిసినప్పట్నించీ ఎందుకో – నా జీవితం నాది కాదన్న బాధుండేది. నా జీవితం నాది కావాలంటే, పెళ్లి చేసుకోవాలని అమ్మ అనేది. నిన్ను చూడగానే – నా జీవితాన్ని నాది చేస్తావనిపించింది. మరి నీ సంగతి చెప్పు’’ అన్నాను.
‘‘చాలా బాగా చెప్పావ్‌ ‌శ్వేతా! నీ అంత బాగా చెప్పలేను కానీ, ప్రయత్నిస్తాను’’ అని గొంతు సవరించుకున్నాడు శ్యామ్‌.
‌మెచ్చుకున్నాడని మహదానందం కలిగింది. అతడేం చెప్పినా సరే మెచ్చేసుకుని, అదే ఆనందాన్ని అతడికీ ఇవ్వాలనుకున్నాను.
‘‘నా పక్క అపార్టుమెంట్‌లో ఉండే సుబ్బారావు గారు ఎలక్ట్రికల్‌ ‌షాపు ఓనరు. బాగా సంపాదిస్తు్త న్నాడు. ఆయన భార్య యశోదమ్మ ఆదర్శ గృహిణి. వాళ్లబ్బాయి గిరిధర్‌ ‌బీటెక్‌ ‌ఫైనలియర్‌. అమ్మాయి చతుర ఇంటర్‌ ‌ఫైనల్‌. ఇద్దరూ నన్ను నోరారా అన్నయ్యా అంటారు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నాకెంతో నచ్చారు. మీ ఇంట్లోవాళ్లు ఆ ఇంట్లోవాళ్లలా అనిపించారు’’ అన్నాడతడు.
అంటే నేను ఎప్పటికీ ఇప్పటిలాగే ఉంటేనే అతడికి నచ్చుతానని! కానీ ఆ క్షణంలో అలా స్ఫురించలేదు.
ఒక పక్క పొగడాలన్న తాపత్రయం. మరోపక్క తొలిరాత్రి ఆకర్షణ. ఆ స్పందనలతో ఆ రాత్రి ఊహకందనంత మనోహరంగా గడిచింది. జీవితాన్ని అతడికే అంకితం చెయ్యాలనిపించేటంత ప్రేమ పుట్టింది. తెల్లారేక అతడితో మళ్లీ ఏకాంతం కోసం మనసు తహతహలాడింది.
రెండవరాత్రి అతడు, ‘‘ఈ పూట నీకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాలుంటే చెప్పు. వింటాను’’ అన్నాడు.
నా సరదాలు చెప్పుకునేందుకది మంచి అవకాశం. కానీ ఉపయోగించుకునే వివేకం నాకేదీ? ‘‘ముందు నువ్వే ఏదైనా చెప్పు’’ అన్నాను.
అతడు నవ్వి, ‘‘అవన్నీ చెప్పుకునేందుకు మనముందు బోలెడు జీవితముంది. మరి నేను నిన్నెందుకు అడిగానంటావా – కాసేపు తియ్యని నీ గొంతు వినాలని. అసలు పాట పాడమందామను కున్నాను. కానీ గొంతెత్తి పాడే అవకాశం ఇప్పుడు లేదుగా. బయటివాళ్లు విని నవ్వుకుంటారు. అందుకని నీ మాటల్నే పాటలుగా ఆస్వాదిద్దామనుకున్నాను’’ అన్నాడు.
వెరీ రొమాంటిక్‌. ఆపైన అతడి సంగీతప్రియత్వం తెలిసి ఉత్సాహం పొంగిపొర్లింది. శాస్త్రీయ సంగీతమంటే ప్రాణమైన నాకు ఎనిమిదేళ్లప్పుడు మంచి గురువు దొరికాడు. నా గొంతును మెచ్చి బాగా సాధన చెయ్యమనేవాడు. వీలయ్యేది కాదు. చదువుకైతే వెయ్యి కళ్లతో కనిపెట్టి హెచ్చరించే అమ్మ, సంగీతసాధన గురించి అంతగా పట్టించుకునేది కాదు. తగిన ప్రోత్సాహం లేదని బాధ పడేదాన్ని.
అది చెప్పుకుని, ‘‘నువ్వు ప్రోత్సహిస్తే, బాగా సాధన చేసి సంగీతకచేరీ ఇవ్వాలని నా కోరిక’’ అన్నాను ఉత్సాహంగా.
‘‘కచేరీ అంటే శాస్త్రీయ సంగీతమేనా? అమ్మో, చలికో భయానికో అన్నట్లు అదేపనిగా వణికే ఆ పాటలు నన్నూ భయపెట్టి వణికిస్తాయి. నాకు పాట సరళంగా ఉండాలి. నీ గొంతులో లలిత గీతాలు పలికితే, కోకిలనే గానశ్వేత అనాలనిపించదూ’’ అన్నాడు శ్యామ్‌.
అతడి అభిరుచి అర్థమైనా నిరుత్సాహం కలగలేదు. కోకిలకే గానశ్వేత అని బిరుదివ్వడం, నాలో పులకింతలు రేపింది.
మూడవ రాత్రి అతడు నాతో, ‘‘ఈవేళ నీ సహజ సౌందర్య రూపం సమ్మోహనమై నాలో పరవశాన్ని కలిగిస్తోంది. నాకనిపిస్తోందిప్పుడు – గడిచిన రెండు రాత్రులూ నీ పట్ల నాది వ్యామోహం మాత్రమే ఏమోనని’’ అన్నాడు.
మొదటి రెండు రాత్రులూ నన్ను మా పిన్ని ప్రత్యేకంగా అలంకరించింది. ఆమె బ్యుటీషియన్‌ ‌కావడంతో నాకున్న సరదాలన్నీ చెప్పుకుని మేకప్‌ ‌చేయించుకున్నాను. ఈ రోజామె వాళ్ల ఊరెళ్లిపోయింది. అమ్మ నన్ను సాదాసీదాగా అలంకరించింది. అదే అతడి అభిరుచికి సరిపోవడం ఇబ్బందిగానే అనిపించినా, అది క్షణమాత్రం. నా సహజ సౌందర్యం అతణ్ణి అలరించడం నన్నూ అలరించింది.
కాపురానికి వెళ్లేక, రోజులు గడుస్తూ, నా అభిరుచులకు పూర్తి భిన్నంగా ఉన్న అతడి అభిరుచులన్నీ ఒకటొకటిగా బయటపడుతూంటే, నాలో కలవరం మొదలైంది. దానికితోడు అతడెంతగానో ఇష్టపడే సుబ్బారావుగారి కుటుంబం నాకు పక్కలో బల్లెమైంది.
ఆయన భార్య యశోదమ్మ ఇంచుమించు మా అమ్మలాంటిదే. ఎక్కువ ఇంటికే పరిమితం. సాదాసీదాగా ఉంటుంది. ముక్తసరిగా మాట్లాడు తుంది. ఆమె కూతురు చతుర లేత వయసు కన్నెపిల్లయుండీ, మా ఇంట్లో నాకు లాగే కనీసం లిప్‌స్టిక్‌ ‌కూడా వేసుకోదు. ఆమె అన్న గిరిధర్‌ ఎం‌త మొహమాటస్థుడంటే, పక్కింట్లో ఉన్న నాతో మాట్లాడేటప్పుడు కూడా మొహంలోకి చూడడు. వాళ్లింట్లో బాగా కలుపుగోలుగా ఉండేది సుబ్బారావు గారొక్కరే! పలకరిస్తే, ఎన్నాళ్లనించో ఎరిగున్నట్లు అనిపిస్తుంది. కానీ పలకరింపుకే దొరకడు. ఉదయం పదికి వెళ్లి మళ్లీ రాత్రి పదికి ఇంటికొస్తాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడు తుంటాడు.
వచ్చిన కొత్తలోనే ఒకసారి చతురని అడిగాను, మేకప్‌ ‌చేసుకోవెందుకని! దానికి చతుర వెంటనే, ‘‘ఇంగ్లిషులో మేకప్‌ అం‌టే లోటుని భర్తీ చెయ్యడం. అంటే లోటుందనుకున్నవాళ్లే మేకప్‌ ‌చేసుకుంటారు. నా రూపంలో ఏ లోటూ లేదని నా నమ్మకం. మా అమ్మంటుందీ, ఉన్న అందాన్ని కప్పేసేదే మేకప్పు అని’’ అంటూ నవ్వింది.
ఎవరి అభిప్రాయం వాళ్లది. కానీ ఇదే అభిప్రాయం శ్యామ్‌కి ఉండడం నాకు ఇబ్బంది. అది తొలగాలంటే అట్నించి నరుక్కు రావాలి. అంటే చతురని మార్చాలి. అందుకని, ‘‘ఏ అమ్మయినా చిన్నతనంలో తన సరదాలన్నీ తీర్చుకుని, పెద్దయ్యేక ఇలాగే చెబుతుంది. మీ అమ్మ చెప్పింది, నువ్వు నమ్మావన్న మాట!’’ అన్నాను.
‘‘అమ్మెప్పుడూ తన అభిప్రాయాలు పిల్లలమీద రుద్దదు. రోజూ అమ్మ మాకోసం ఓ అరగంట సమయాన్ని కేటాయిస్తుంది. అప్పుడు మాకు ఏది మంచో ఏది చెడో వివరిస్తుంది. అందుకు పురాణ కథలూ ఉదహరిస్తుంది. వాటిలో సైన్సునీ కలుపు తుంది. సమాజంలో సమకాలీనంగా జరిగేవాటిని విశ్లేషిస్తుంది. మేం దాన్ని క్వాలిటీ టైం అంటాం. దానికి తగిన సమాచారం సేకరించడానికి – కాలేజీలో మా టీచర్లకంటే ఎక్కువ కృషి చేస్తుంది అమ్మ. ఆ సమయంలో తను చెప్పింది నచ్చుబాటు ఐతేనే – మేం అనుసరిస్తాం’’ అంది చతుర.
నాకాశ్చర్యమేసింది. ‘‘క్వాలిటీ టైం కోసం తనంత కష్టపడ్డమెందుకూ? మీరూ మీ అంతటివాళ్లయ్యారు. చుట్టూ సమాజాన్ని చూసి మీకు మీరుగా తెలుసుకోలేరా?’’ అన్నాను.
‘‘అలా అనుకునే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే, ఇప్పుడు ప్రపంచంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయింది. దోషుల నేరాలకు బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులే అంటుంది అమ్మ. అన్నయ్య, నేను – ప్రపంచంలో ఆదర్శపౌరులుగా ఎదగాలని తన ఆశయం. అది సాధించడానికి ఉడతాభక్తిగా అమ్మ ఎన్నుకున్నదే క్వాలిటీ టైం. అంతా అమ్మలా ఉంటే, అందరు అబ్బాయిలూ మా అన్నయ్యలా ఉంటే – కాలేజీ లైఫ్‌ ‌నాకు మరింత బాగుండేదనిపిస్తుంది’’ అంది చతుర.
చతురకు వాళ్లమ్మంటే ఉన్న ఆరాధనాభావం ఆమె కళ్లలోనూ, తన భాషలోనూ కూడా స్పష్టమైంది. అయితే మా అమ్మ నాకు చెప్పేవే యశోదమ్మ తన పిల్లలకు చెప్పింది. కానీ నాకు అమ్మ మాటలు నచ్చలేదు. ఆమె పట్ల ఆరాధనాభావం కలుగలేదు. తనూ నా కోసం క్వాలిటీ టైం వెచ్చించి ఉంటే, నా ఆలోచనలు వేరుగా ఉండేవేమో! ఏదేమైతేనేం – నాకిప్పుడొకటి అర్థమైంది. మార్పు చతుర వైపునుంచి సాధ్యం కాదు. ఇక శ్యామ్‌ ‌వైపునించే ప్రయత్నించాలి. కానీ..
కాపురానికొచ్చేక కొన్నాళ్లు ఉద్యోగం కొనసాగిం చాను. ఇద్దరం ఇంటి పనులు కలిసి చేసుకునేవాళ్లం. తన ఆఫీసుకెళుతూ శ్యామ్‌ ‌నన్ను మా ఆఫీసు దగ్గర దింపేవాడు. శనాదివారాలు సెలవైనా శ్యామ్‌ ఒకోసారి ఆఫీసుకు వెళ్లాల్సొచ్చేది. అప్పుడు నేను ఇంట్లో ఉండి తనకోసం అన్నీ అమర్చిపెట్టేదాన్ని. అలాంటి ఓ రోజున శ్యామ్‌, ‘‘అన్ని రోజులూ ఇలాగే ఉంటే ఎంత బాగుండేది?’’ అన్నాడు.
చివుక్కుమంది మనసు. ‘‘బాగుంటుంది. కానీ మంచి ఉద్యోగం. ఎవరైనా వదులుకుంటారా?’’ అని నిట్టూర్చాను.
‘ఎవరైనా’ అనడం నేను చేసిన తప్పు. ఇలాంటి వాటికి శ్యామ్‌ ‌వద్ద సిద్ధంగా ఉండే పేరు యశోదమ్మ. ఆమె కంప్యూటర్‌ ఇం‌జనీర్‌. ‌పెళ్లికి ముందు మంచి ఉద్యోగంలో ఉంది. పెళ్లయ్యేక భర్త, ‘‘ఇంటి పనుల్లో సాయం చెయ్యడం నా వల్ల కాదు. అలాగని అటు ఉద్యోగం, ఇటు ఇంటిపనీ నువ్వే చెయ్యడానికి ఒప్పుకోను. అన్నింటికీ మనుషుల్ని పెట్టుకుందాం’’ అన్నాట్ట. ఆయనకి తన సంపాదన మీద ఆసక్తి లేదని గ్రహించగానే, ఆమె ఆలోచించింది. ఉద్యోగానికి రోజూ బయటికెళ్లి రావడం ఓ అలసట. ఇక ఈ పురుషాధిక్య ప్రపంచంలో-ఉద్యోగం చేసే ఆడదానికి ఇల్లు, ఆఫీసు – రెండు వేర్వేరు ప్రపంచాలు, ఇద్దరు బాస్‌లు. ఇంట్లో బాస్‌ ‌స్వంతమనిషి. బయటి బాస్‌ ‌పరాయివాడు. రెండు ప్రపంచాలకీ సమన్యాయం చెయ్యలేనప్పుడు, ఏదో ఒక ప్రపంచాన్ని వదులుకోక తప్పదనిపించి, ఉద్యోగం వదిలేసిందామె. పిల్లలు పెద్దవాళ్లయి, ఇంటి బాధ్యతలు తగ్గాక, తన వీలు ప్రకారం రోజుకి నాలుగైదు గంటలు మాత్రం పని చేసేలా వర్క్ ‌ఫ్రంహోమ్‌ ‌మొదలెట్టింది.
రెండో ప్రపంచం విషయంలో యశోదమ్మ పడ్డ ఇబ్బందులు నాకూ స్వానుభవమే! ‘ఇంట్లో మాత్రం చాలా వాటికి సర్దుకుపోవడం లేదూ – ఇదీ అంతే’ అనుకుంటూ సర్దుకుపోతున్నాను.
శ్యామ్‌కి సింపుల్‌గా ఉండడం ఇష్టం. తీపి తినడం ఇష్టం. లలితసంగీతం వినడం ఇష్టం. సోషల్‌ ‌మీడియా అంటే చిరాకు. సాహిత్యం చదవడు. టివిలో ఎప్పుడూ వార్తలు, ఎప్పుడైనా సినిమాలు – అంతే! బయటికెళ్లడానికి – పార్కంటే రెడీ కానీ, షాపింగుకి విముఖం.
అన్నింటా నేను పూర్తిగా భిన్నం. అదతడు గ్రహించాడు. కానీ తను మారడు. పాపం మాటెందుకూ, నన్నూ మారమని బలవంతపెట్టడు. కానీ తెలివైనవాడు. నాకు నేనుగా మారాలనుకునేలా చేస్తాడు. దంపతులు అన్నీ కలిసి అనుభవించా లంటాడు. ఇష్టాలు మార్చుకోలేని తన అశక్తతకు బాధ పడతాడు. ఇష్టం మార్చుకోలేని నా అశక్తతని అర్థం చేసుకుంటానంటాడు. కానీ మార్చుకోవాలన్న ఆశ కళ్లలో స్పష్టంగా కనబడుతుంది.
ప్రేమ కబుర్లు భలే చెబుతాడు. వాటికి లొంగిపోతాను. అది ఆడతనపు బలహీనతో ఏమో -అతడి మొహంలో అసంతృప్తి చూడ్డం నాకు బాగుండదు.
అతడి ఆనందం కోసం-జ్వరమొచ్చిందని అబద్ధమాడి మా ఆఫీసుకి ఓ వారం రోజులు సెలవు పెట్టాను. దృష్టంతా ఇంటిపనుల మీదే పెట్టాను. శ్యామ్‌ ‌చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఆశ్చర్యమేమంటే, అతడి సంతోషం నాక్కూడా తృప్తినిచ్చింది. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చెయ్యడానికి ఎన్నాళ్లో పట్టలేదు. చిత్రమేమిటంటే, ఆఫీసువాళ్లు పూర్తిగా నన్నొదులుకునేందుకు ఇష్టపడలేదు. తోచినప్పుడు తోచినంత పని చెయ్యొచ్చునంటూ వర్క్‌ఫ్రం హోమ్‌ ఆఫర్‌ ఇచ్చారు.
క్రమంగా నేను శ్యామ్‌కి సంతోషం కలిగించేలా మారిపోతున్నాను. అందుకు అసంతృప్తిగా అనిపించినా, నాలో మార్పుకి అతడిలో కలిగే స్పందనల అలరింపు నాకు ఎక్కువ సంతోషాన్ని స్తోంది. అయితే శ్యామ్‌ ‌పక్కనుంటేనే బాగుంటుంది. తను లేనప్పుడు మాత్రం అన్నీ గుర్తుకొచ్చి, నా జీవితం నాది కాకుండా పోయిందే అని వాపోతాను. ఇప్పుడు శ్యామ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్నాడని తెలియగానే స్వేచ్ఛావిహంగాన్ని అయిపోయానన్న భావన కలిగి ఉత్సాహమొచ్చింది. నా జీవితం నాది అనుకునేలా, నన్ను నేను పునరుద్ధరించాలని అనుకున్నాను. కానీ అందుకు అడ్డుగా తాళి. ముందు తటపటాయించినా దాన్ని తీసేశాను.
ళి ళి ళి
మంగళసూత్రాల గొలుసు ఇంకా చేతిలోనే ఉంది. అంతలో కాలింగ్‌బెల్‌ ‌మ్రోగింది.
వెళ్లి తలుపు తీస్తే – ఎదురుగా యశోదమ్మ. ఆమె చేతిలో చిన్న గిన్నె. ‘‘ఏం మంత్రం వేశావమ్మా, మీ ఆయనకి. వైజాగు నుంచి ఫోను చేసి ఆర్డరేశాడు. నీకు మిర్చీబజ్జీలు చేసిమ్మని’’ అంటూ ఆమె తన చేతిలోని గిన్నె అక్కడున్న టీపయ్‌ ‌మీద పెట్టింది.
ముక్తసరిగా మాట్లాడే యశోదమ్మ అలా మాట్లాడ్డం నాకు కొత్త. కానీ అది నేను గ్రహించలేదు. శ్యామ్‌ ‌నా కోసం ఆమెని మిర్చీ బజ్జీ చెయ్యమన్నాడన్న వార్త నన్ను ఆనందాశ్చర్యాలకు గురి చేసింది.
అంతలో యశోదమ్మ నా చేతిలో గొలుసు చూసి, ‘‘అదేంటమ్మాయ్‌, ‌మంగళసూత్రాలు అలా తీసేశావ్‌. అసలే మీ ఆయన క్వారంటైన్‌లో ఉన్నాడు. వెంటనే కళ్లకద్దుకుని మెళ్లో వేసుకో’’ అంది ఇంచుమించు గదిమినట్లే!
అప్రయత్నంగా గొలుసు మెళ్లో వేసుకుని, ‘‘పశువుకైనా పలుపుతాడు అన్నివేళలా ఉండదు. పెళ్లయిన ఆడదాని బ్రతుకు పశువుకన్నా హీనం’’ అని నిట్టూర్చాను. దానికామె వెంటనే, ‘‘అదేం పోలికమ్మాయ్‌! ‌పలుపుతాడు బానిసత్వానికి గుర్తు. మన హోదాని మరింత పెంచే పసుపు తాడుకి దాంతో పోలికేమిటి?’’ అందామె. అప్పుడామె ఇచ్చిన వివరణ అంతవరకూ నేనెక్కడా విననిది, నాకెన్నడూ స్ఫురించనిది!
ఆడది శారీరకంగా బలహీనం. అందుకని ఆమె తన రక్షణకోసం అన్నకు రక్షాబంధనం కడుతుంది. దాంతో ఆ అన్నకు సామాన్యుణ్ణి రక్షించే సైనికుడి హోదా, గౌరవం దక్కుతాయి. కానీ మగాడు మానసికంగా చపలుడు, బలహీనుడు. మానవుల ప్రగతికి అత్యవసరమైన కుటుంబ వ్యవస్థని నిలబెట్టలేడు, సమాజాన్ని కాపాడలేడు. మానసిక బలంలో, అంకితభావంతో మగవాడికి అందనంత ఎత్తులో ఉంటుంది మగువ. అందుకే మగాడికి ఆమె తోడు అవసరమైంది. అందుకే పెళ్లి వ్యవస్థ వచ్చింది. కుటుంబవ్యవస్థని బలపర్చి సమాజాన్ని కాపాడ్డానికి మగాడు మగువ మెడలో కట్టే రక్షాబంధనమే – మంగళసూత్రం! అది మగవాడి అల్పత్వానికీ, మగువ ఔన్నత్యానికీ గుర్తు.
వినడానికి బాగుంది కానీ, అలాగని మగాడు కూడా అనుకుంటాడా? ‘‘ఏం ఔన్నత్యమో- పెళ్లయ్యేక నా అలవాట్లు, రుచులు, అభిరుచులు మొత్తం మార్చుకోవాల్సొచ్చింది. శ్యామ్‌లో మాత్రం ఏ మార్పూ లేదు. పెళ్లంటే నా జీవితం నాది కాకుండా పోయిందన్న భావన నన్ను తరచుగా వేధిస్తుంది’’ అన్నాను.
యశోదమ్మ నవ్వింది. ‘‘ఇది నీకే కాదు, నాకూ, మీ అమ్మకీ, ఇంకా ఎందరో వివాహితలకీ కూడా వర్తిస్తుంది. కానీ ఒక్క విషయం ఆలోచించు. మారమని ఎప్పుడైనా శ్యామ్‌ ‌నిన్ను వేధించాడా? అతడిమీద అనురాగంతో కావాలని నువ్వే మారేవా?’’ అంది యశోదమ్మ. అంతలోనే జవాబు తెలుసన్నట్లు, ‘‘పెళ్లంటే అదేనమ్మాయ్‌, ‌తన జీవితం తనది కాకుండా పోవడంలోనే ఆనందం పొందడం. అది ఆడదానికే సాధ్యం. మగాడికీ సాధ్యపడితే సమాజం మరింత ముందుకెడుతుంది’’ అంది తనే మళ్లీ.
మంగళసూత్రం మగాడి అల్పత్వానికీ, మగువ ఔన్నత్యానికీ గుర్తు – అన్న యశోదమ్మ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి.
అయితే శ్యామ్‌ని అల్పుడనుకునేందుకు మనస్కరించలేదు. అతడికోసం నేను మారేనంటే, అందుకు కారణం అతడికి నాపై ఉన్న అనురాగమే ఏమో! అది నా మనసు పసి కట్టిందేమో! ఒకసారి మా దాంపత్య జీవితానుభవాల్ని నెమరేసుకోవాలి…
‘‘బజ్జీలు వేడి వేడిగా ఉన్నాయి. చల్లారకుండా తినమ్మాయ్‌’’ అనేసి వెళ్లిపోయింది యశోదమ్మ.
గిన్నె మూత తెరిస్తే బజ్జీల స్థానంలో శ్యామ్‌ ‌కనిపించి నవ్వాడు. అప్రయత్నంగా తాళిని కాదు, రక్షాబంధనాన్ని తడుముకున్నాను.

About Author

By editor

Twitter
Instagram