– రంగనాథ్‌ ‌సుదర్శనం

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ‘చందమామ గేటెడ్‌ ‌కమ్యూనిటీ’ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని ప్రయిమ్‌ ‌లొకేషన్‌ (‌ప్రధాన ప్రాంతం)లో మొత్తం రెండువందల అపార్ట్‌మెంట్స్‌తో విస్తరించి, ఎక్కువగా ధనవంతులైన ఎన్‌.ఆర్‌.ఐ.‌ల కుటుంబాలు నివసించే ప్రాంగణం అది.

పండుగలు – పబ్బాలు, వీకెండ్‌ ‌పార్టీలతో ఎప్పుడు సందడి, సందడిగా ఉండే ఆ ప్రాంగణం ‘కరోనా’ కారణంగా చిన్నబోయింది!!

గేటెడ్‌ ‌కమ్యూనిటీకి ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రసాదరావు గారు, అస్వస్థులై డాక్టర్ల సలహా మేరకు హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఆరోజు తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన ఇబ్బంది కారణంగా 104కు కాల్‌ ‌చేశాడు. ఈలోగా బాధ తీవ్రమైంది. తట్టుకోలేకపోతున్నాడు. అంబులెన్స్ ‌వచ్చేలోగా బయట నిలబడదామని మెల్లగా నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది, కళ్లు తిరిగి కిందపడిపోయాడు.

చూసిన వాళ్లెవ్వరూ, కరోనా భయంతో సహాయానికి ముందుకు రాలేదు. పాపం అక్కడే విలవిల లాడుతూ కొన ప్రాణాలతో అల్లాడిపోయాడు. సమయానికి భార్యా, పిల్లలు అంతా విదేశాలలో ఉండటంతో, అందరూ ఉండి కూడా ఎవరు లేని అనాధ అయ్యాడు. సుమారుగా నాలుగు గంటలపాటు సహాయం కోసం అందరినీ దీనంగా అర్థించాడు. ఎరిగినవారు, ఎరుగనివారు ఎవ్వరూ సాహసంచేసి సహాయానికి ముందుకు రాలేదు. గుక్కెడు మంచినీళ్లకోసం పరితపించాడు. శరీర బాధకన్నా మానసిక బాధ ఎక్కువగా ఆయనను క్రుంగదీసింది. ఏమిటీ పరిస్థితి? ఇప్పుడేదైనా అయితే నా గతి ఏం కాను? నాకు దిక్కెవరు? ఫోన్‌లో మెసేజెస్‌ ‌పెట్టినా బంధువులు, స్నేహితులు ఎవ్వరూ స్పందించలేదు? ఇప్పుడెలా? బీపీ పెరిగింది, శ్వాస తీసుకోవడం మరింత కష్టమైంది. మనోధైర్యం సన్నగిల్లింది అంతే… రెప్పలు బరువుగా వాలిపోయాయి. బలంగా శ్వాస వదిలి నడిరోడ్డుపైనే తలవాల్చాడు ప్రసాదరావు.

డబ్బు, పరపతి అన్నీ ఉండి, నిన్నా మొన్నటివరకు ప్రెసిడెంట్‌ ‌హోదాలో అన్నీ తానై, చందమామలో కార్యక్రమాలు నిర్వహించిన పెద్దమనిషి, ఈ రోజు దిక్కులేని శవం అయ్యాడు. ప్రసాదరావు గారు స్వతహాగా చాలా మంచివారు. అందరికీ ఆయనపై అభిమానం ఉంది కానీ, ఎవరి ప్రాణం వాళ్లకు తీపే కదా! అందుకే కరోనా భయంతో ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు. కనీసం శవాన్ని తీసే దిక్కులేకుండా పోయింది.

అదే కమ్యూనిటీలో ఉండే మైత్రి అప్పుడే బయటి నుండి వస్తూ ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది.

తన దగ్గరున్న పి.పి.ఇ. కిట్‌ ‌వేసుకొని, వెంటనే హెల్త్ ‌సెంటర్‌కు, అంబులెన్స్‌కు, నగరపాలక అధికారులకు, పోలీసులకు ఫోన్‌ ‌చేసింది. మైత్రి తల్లిదండ్రులు దూరంగా నిలబడి వద్దని ఎంత వారించినా వినిపించుకోలేదు. రేపు మనకు ఇలాంటి పరిస్థితి వస్తే… అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇది చూసిన కమ్యూనిటీలోని మరికొందరు యువకులు ముందుకు వచ్చారు. అంతా దగ్గరుండి అధికారుల సహాయంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

  *  * *

ఆ మరునాడు గేటెడ్‌ ‌కమ్యూనిటీలోని అందరి ఫోన్‌ ‌నంబర్స్ ‌తీసుకొని, అత్యవసర సమావేశం ఉందని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఒక మెసేజ్‌ ‌పెట్టి, సమావేశ ఉద్దేశాన్ని పర్సనల్‌గా ఫోన్‌ ‌చేసి అందరికీ వివరించింది మైత్రి. అలాగే నిన్న తనకు తోడుగా సహకరించిన యువకులతో సమావేశమై తన ఆలోచనను వివరించింది. అందరూ కలిసి పనిచేయటానికి సంతోషంగా ఒప్పుకున్నారు.

కానీ… అనుకున్న సమయానికి సమావేశానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. మైత్రితో పాటు తన మిత్రబృందం అంతా చాలా నీరసపడ్డారు. మంచి చేస్తానన్నా ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి అందరూ చిరాకుపడ్డారు. అసలు మనకెందుకొచ్చిన గోల, వదిలేద్దాం అనుకున్నారు. కానీ మైత్రి తనకు మరొక్క అవకాశం ఇవ్వమని, ఈ సారి కూడా ఎవ్వరూ రాకుంటే మీరన్నట్లే చేద్దామని అందరికీ నచ్చచెప్పి ఒప్పించింది.

  *  * *

కమ్యూనిటీలో ఒంటరిగా నివసించే రాజ్యలక్ష్మి గారు, అదే సిటీలో ఉన్న తన తమ్ముడు వాళ్ల ఇంటికి వెళ్తూ- వస్తూ వుండేది. ఆ రోజు వాళ్ల తమ్ముడి కొడుకుకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఆ అబ్బాయితో ప్రయిమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారందరిని, హోం క్వారెంటైన్‌ ‌చేసి, వారి నమూనాలను పరీక్షలకు పంపిస్తున్నారని తెలిసిన రాజ్యలక్ష్మి గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒక వేళ తనకు పాజిటివ్‌ ‌వస్తే ఎలా? ఆ ఊహకే ఆమె భయపడిపోయింది, పిల్లలెవ్వరు అందుబాటులో లేరు, ఏం చేయను! తనను ఎవరు ఆదరిస్తారు? ఇల్లు కదలకుండా ఉంటే తనకు ఎవరు సహాయం చేస్తారు? సహాయం చేసే తమ్ముడు కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు! ఇప్పుడెలా? తీవ్ర మనస్తాపంతో గుండె చెదిరింది, మనోధైర్యం సన్నగిల్లింది, అంతే బలహీనమైన ఆ క్షణంలో నిర్ణయం తీసుకొని, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ వార్త చందమామ గేటెడ్‌ ‌కమ్యూనిటీ వాసులను మరింత భయపడేలా చేసింది. అందరూ కరోనా భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌) ‌తీసుకున్నారు.

మళ్లీ ధైర్యంచేసి తన బృందంతో కలిసి, రాజ్యలక్ష్మి గారి అంత్యక్రియలన్నీ పూర్తిచేసింది మైత్రి.

  *  * *

ఒకసారి అందరినీ సమావేశానికి రావా ల్సిందిగా మళ్లీ ఆహ్వా నించింది మైత్రి. ఈ సారి అందరూ సమా వేశానికి హాజరయ్యారు. కొవిడ్‌-19 ‌నిబంధనలు పాటిస్తూ, సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటిస్తూ, పూర్తిగా సానిటైజ్‌ ‌చేసిన సమావేశమందిరంలో సభ్యులంతా సమావేశమయ్యారు. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. అప్పటికే ఆ కమ్యూనిటీని కుదిపేసిన వరుస ఘటనల కారణంగా అందరూ భయకంపితులై దిగాలుగా కూర్చున్నారు. ‘సింహానికి వంతులవారీగా ఆహారం కోసం వెళ్లే జంతువుల్లా’ ఎప్పుడు తమ వంతు వస్తుందో! ఎవరిని ఈ కరోనా మహమ్మారి కబళిస్తుందోనని! అంతా విషాద వదనాలతో దిగాలుగా కూర్చున్నారు.

మైత్రి ఈ వాతావరణాన్ని తేలికచేయడానికి, అందరిలో మనోధైర్యం నింపడానికి, అందరినీ ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టింది.

‘‘పెద్దలందరికి నమస్కారం!

మనం గతంలో అనేక ఈవెంట్స్, ‌మన చందమామ గేటెడ్‌ ‌కమ్యూనిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించాము. మనమంతా ఎక్కడో పుట్టి- పెరిగి ఇక్కడ కలిసి ఉంటున్నాము. ఎన్నో సంతోషాలను కలిసి పంచుకొని ఆత్మీయులుగా దగ్గరైన మనం, ఒక కుటుంబంలా కలిసి మెలసి ఉన్నాము. కానీ ఈరోజు అందరికీ కష్టం వచ్చింది! ఇది డబ్బు ఖర్చు పెట్టి దూరం చేసుకునేది కాదు. ఇది అందరం కలిసికట్టుగా ఎదు రించాల్సిన సమస్య, కరోనా కన్నా మనలోని భయం చాలా ప్రమాదకర మైనది. ముందు మనం ధైర్యంగా ఉంటూ అందరిలో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమెవ్వరము ఒంటరివాళ్లము కాదు! మనం ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాము అన్న భావన మనలో ఏర్పడాలి, ఆ నమ్మకం అందరిలో కలగాలి. ఒక్క విషయం మాత్రం నిజం, అదేంటంటే? మనను మనమే కాపాడుకోవాలి! మనను ఎవరో వచ్చి కాపాడుతారు అనుకోవడం భ్రమే. ఈ వాస్తవం అందరూ గుర్తించాలి’’.

బహుశా.. ఇది వేరే సందర్భం అయి ఉంటే, మైత్రి మాటలు అసలెవ్వరు వినేవారు కాదు, అంతేకాక తననెవ్వరు పట్టించుకునే వారు కూడా కాదు. కానీ… ఇప్పుడు పరిస్థితి వేరు, పైగా ఎవ్వరూ ముందుకురాకున్నా మైత్రి ధైర్యంగా ప్రసాదరావుగారికి, రాజ్యలక్ష్మిగారికి దగ్గరుండి తనవంతు సహకారం అందించిన విషయం అందరూ కళ్లారా చూశారు. ఆ మంచి పేరున్న కారణంగా ఆమెపై ఉన్న సదాభిప్రాయంతో అందరూ మైత్రి మాటలు ఆసక్తిగా వింటున్నారు.

‘‘నేను, నా మిత్రులం కలిసి ఒక ఆలోచన చేశాం! అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాను.

ఇప్పుడు మిత్రుడు రాహుల్‌ ‌దీనిని వివరిస్తాడు’’ అంది మైత్రి.

‘‘అందరికీ నమస్కారం! రెండువందల కుటుంబాలు నివసిస్తున్న మన కమ్యూనిటీలో ఇప్పుడు భయం కమ్ముకుంది!! అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ సమయంలో మనం ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. అందుకే ఒక ‘వాట్సాప్‌ ‌గ్రూప్‌’‌ను ప్రారంభం చేస్తున్నాము, ఇందులో అందరూ జాయిన్‌ అవ్వండి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా గ్రూప్‌లో పెట్టండి, వెంటనే అందరం స్పందిద్దాము. అందరం సమస్య ఉన్నవారికి తోడుగా నిలబడదాము. అలాగే అందరూ తప్పనిసరిగా రెండు పి.పి.ఇ. కిట్స్ అం‌దుబాటులో ఉంచుకోండి, అందరూ ఒక ‘పల్స్ ఆక్సీ మీటర్‌’ ‌దగ్గర ఉంచుకుంటే మంచిది. దీని ద్వారా మనకు ఇబ్బంది అనిపించినప్పుడు, మన ఆక్సిజన్‌ ‌లెవెల్స్ ‌చెక్‌ ‌చేసుకోవచ్చు. ప్రమాదం మించిపోకముందే తగిన విధంగా జాగ్రత్తపడవచ్చు. ఇవన్నీ బల్క్‌గా కొనుగోలు చేద్దాము, కాస్తా తక్కువ ధరకు వస్తాయి. అలాగే మనకోసం ఒక కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌వారిని కాంటాక్ట్ ‌చేశాము, ఎవరికి ఇబ్బంది వచ్చినా అన్ని సౌకర్యాల అంబులెన్స్ ‌మనకు అందుబాటులో ఉంటుంది. వైద్య సహకారం కూడా మన కమ్యూనిటీకి అందిస్తారు. అలాగే మనకు ఒక డాక్టరును, ఒక నర్సను కేటాయిస్తారు. దానికి తగిన ఫీజ్‌ ‌ప్రతినెలా మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికి పాజిటివ్‌ ‌వచ్చినా లేదా ఎవరు క్వారెంటైన్‌లో ఉన్నా వారికి అవసరమైన ఫుడ్‌ ‌వగైరాలు అందరం మన బాధ్యతగా అందిద్దాము. చేసుకోలేని వారికి మన ఇళ్లల్లో తయారు చేసి అందిద్దాము. అలాగే ప్రతిరోజూ రోగ నిరోధక శక్తిని పెంచే శొంఠి, మిర్యాలు, దాల్చినచెక్క, లవంగాలు, ఎండు ద్రాక్ష, తులసి, నిమ్మరసం తేనెలు కలిపిన కషాయం వంతులవారీగా తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచుదాము. వీలైన వాళ్లు ఇంట్లోనే చేసుకొని తాగితే మంచిది. అలాగే కూరగాయల కోసం మనం ఎక్కడికి వెళ్లకుండా, ఇక్కడే అందుబాటులో ఉండేలా, పక్కనే ఉన్న పల్లెనుండి రోజూ తెచ్చి పూర్తిగా శుభ్రం చేసి ఇచ్చిపోయేలా ఏర్పాటు చేసుకుందాము. కాస్తా ధర ఎక్కువైనా చెల్లించి ఆరోగ్యాలు కాపాడుకుందాము.’’ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.

రఘురామ్‌ ‌గారు కమ్యూనిటీలో సీనియర్‌ ‌సిటిజెన్‌. ‌భార్య, భర్త ఇద్దరే ఉంటారు. ఆయన దీనిని స్వాగతిస్తూ నిజంగా ఇప్పటివరకు భయం భయంగా ఎప్పుడు ఏం జరుగుద్దో, మాలో ఎవరికన్నా ఏదైనా అయితే ఎలా, మా ఇద్దరికీ పాజిటివ్‌ ‌వస్తే ఏం కాను? అని భయపడ్డాము. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది అని కన్నీటి పర్యంతం అయ్యారు.

పరందామయ్య గారు ఈ సమావేశాన్ని లైవ్‌లో విదేశాలలో ఉన్న వారి పిల్లలకు చూపించారు. వారి అబ్బాయి మాట్లాడుతూ..‘‘హాయ్‌ ‌గాయ్స్ ‌థాంక్స్ ఎ ‌లాట్‌, ఇప్పటివరకు అమ్మ నాన్న ఎలా! అని బెంగగా ఉండేది, యూ గాయ్స్ ‌రాక్‌ ‌డ్‌… ఇప్పుడు ధైర్యం వచ్చింది. మీకు అన్నిరకాలుగా సపోర్ట్ ‌చేస్తాము… థాంక్యు.. థాంక్యు సో మచ్‌’’ అన్నాడు.

‘‘అమ్మా…ఈరోజే మా ఊరికి వెళ్లిపోదామని నా భార్య, నేను అనుకున్నాము. కానీ, మీ మాటలు విన్నాక మా నిర్ణయం మార్చుకున్నాము, అని ఎనభై పడిలో ఉన్న సుబ్బారావు గారి దంపతులు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఒక రిటైర్డ్ ఐ.ఏ.ఎస్‌. అధికారి అందరికీ పి.పి.ఇ. కిట్స్ ‌తన స్వంత డబ్బులతో కొనిస్తానని ముందుకొచ్చాడు.మరికొందరు కలిసి అందరికీ పల్స్ ఆక్సో మీటర్స్ ‌కొంటామన్నారు.

మైత్రి సున్నితంగా ఇవన్నీ వద్దని వారించింది. ఇక్కడున్న వారంతా చెల్లించే స్తోమత ఉన్నవారే. మనం చేయాల్సిందల్లా అందరం కలిసి ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నామని నిలబడాలి. వారు ఒంటరివారు కాదనే ధైర్యం కల్పించాలి అది చాలు. కరోనా కన్నా ధైర్యం కోల్పోవడమే పెద్ద ప్రమాదం, కాబట్టి ధైర్యంగా అందరం ఒకరికొకరం తోడుగా ఉందాము. కష్టసుఖాలను కలిసి పంచుకుందాము అది చాలు అంది మైత్రి.

మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే, వారికి సకాలములో వైద్యాన్ని అందిద్దాం, పాజిటివ్‌ ‌వచ్చిన వారికి మనోధైర్యం కల్పించి, వారికి అవసరమైన వైద్యం, ఆహారం అందరం కలిసి అందిద్దాం. వారికి మనమంతా అండగా నిలబడదాము. అది మెడిసిన్‌ ‌కన్నా ఎక్కువగా పనిచేస్తుంది అంది మైత్రి.

హాలు మారుమ్రోగేలా చప్పట్లు వినిపించాయి. అందరి ముఖాలు చంద్రబింబాల్లా వికసించాయి.

ఒంటరిగా ఉన్నవాళ్లు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్లు. ఈ పిల్లల ఆలోచనకు మురిసిపోయారు. వీరిలో వారి పిల్లలను చూసుకున్నట్లు ఆనందపడ్డారు.

ఇప్పుడు అందరూ కాస్త స్థిమితపడ్డారు, మనం ఒంటరివాళ్లము కాదు అన్న నమ్మకం కలిగింది.

ఇది చాలు. కరోనా కావొచ్చు, మరొకటి కావొచ్చు, మన ధైర్యం ముందు మోకరిల్లుతుంది. రోగికి కావాల్సింది ఓదార్పు, ధైర్యం ఆ తరువాతే ఏ చికిత్స అయినా!!

ఇప్పుడా ఓదార్పు లభించింది, ఆ నమ్మకం కలిగింది. ఇప్పుడు వాళ్లు కాదు, కరోనా భయ పడుతుంది.

చందమామకు పట్టిన గ్రహణం విడిచింది. ఈ స్ఫూర్తి మరికొందరికి ఆదర్శం కావాలి. ఈ స్ఫూర్తి కరోనాపై తప్పక గెలుస్తుంది.

About Author

By editor

Twitter
Instagram