– విహారి

వాకాటి పాండు రంగరావు స్మారక  దీపావళి కథల  పోటీకి ఎంపికైనది


చాలా రోజుల తర్వాత నా భార్య అన్నపూర్ణతో కలిసి ఈ ఆశ్రమానికి వచ్చాను. ‘రిటైరయిన నాలుగేళ్లకి ఇప్పుడు తీరింది మీకు’ అన్నది పూర్ణ దెప్పిపొడుపుగా.

గీతామందిరంలో ప్రవచనం. వెళ్లి కూర్చున్నాం. వేల సంఖ్యలో శ్రోతలు.

స్వామీజీ చెబుతున్నారు, ‘‘జీవితంలో మనకు విలువనివ్వని బంధాల్నే ఎక్కువగా పెంచుకుంటాము. చాలా కాలానికి జ్ఞానోదయమవుతుంది. పశ్చాత్తాపం మిగులుతుంది.’’

పూర్ణ పక్కచూపుతో నన్ను చూసింది. ఆ చూపు ‘మీ గురించే చెబుతున్నారు, వినండి’ అన్నట్టున్నది. మా బతుకు గీతల వొంపు వాటాలు ఆమె కళ్లముందు మెదిలినట్లుంది. నా స్వభావపు అద్దాన్ని నా ముందు పెట్టినట్టే అనిపించింది నాకు కూడా. మనుషులెప్పుడూ తమ అనుభవాల్లో తాము బందీలే కదా! –

ముగ్గురు తమ్ముళ్లూ, చెల్లెలూ… నాన్న పోయిన తర్వాత వాళ్ల చదువు సంధ్యలూ, పెళ్లి పేరంటాలూ… ‘బాధ్యత’! ఇవ్వాళ వాళ్లు కనీసం ఫోన్‌లోనన్నా ‘ఎలా ఉన్నావ్‌?’’ అనరు. నేను చేసిన వాటిలో లోపాల లెక్కమాత్రం వాళ్ల దగ్గర చిట్టాల్లో ఉన్నది! ‘పిల్లా పీచూ లేనివాడు. సంపాదనంతా ఏం చేసుకుంటాడు?’ ఇదీ లాజిక్కు!

ఉద్యోగ ధర్మంలోనూ, స్నేహధర్మంలోనూ-ఆతిథ్యాలూ, సహాయాలూ, సహకారాలూ తక్కువేమీ లేవు. కొందరికైతే వారాలూ, నెలలూ మా ఇల్లే వసతి గృహంలా ‘హాయి’నిచ్చింది. అన్నపూర్ణమ్మ ‘చేతివంటే వంట!’ అని ఆమెకి సర్టిఫికెట్‌!

‌పదిమంది సకృత్తుగా చెప్పుకొనే నా ‘మంచితనం’ వెనుక-పూర్ణ రెప్పలకింది అవ్యక్త సంవేదనా ఉంది. నాకు తెలుసు. ఎందుకంటే, అసలైన రెక్కల కష్టం ఆమెదే కదా! నేనూ, ఆమె పరస్పరం విభేదించిన సందర్భాలేం తక్కువ లేవు. అయినా, చివరికి అంతరాంతరాల్లో-సర్దుకుపోవటం-గెలిచేది. నేను ‘ఎడ్జస్ట్మెంట్‌ ఇన్‌ ‌డిజెగ్రిమెంట్‌’ అని జోక్‌ ‌చేసేవాణ్ణి!

హాల్లో నవ్వులు నన్ను ప్రస్తుతంలో పడేశాయి. పూర్ణ కూడా సన్నగా నవ్వుతోంది. స్వామీజీ ఏదో చెప్పినట్లున్నారు. మనసుని మరల్చాను. హాలు మళ్లీ నిశ్శబ్దమైన శ్రద్ధలో మునిగింది.

‘‘జీవితానికి విలువనిచ్చే బంధాల్ని మాత్రం వదులుకోవద్దు’’ అంటున్నారాయన. ‘‘నీవు తృప్తిగా ఉంటే అదే సుఖం కాదు. ఇతరుల్ని తృప్తిపడేట్టు చెయ్యి. మనల్ని అయినవారమనుకొనే వారి జీవితాల్లో వెలుగు నింపటానికి మనమేమీ పెద్ద ధనికులం, సంపన్నులం కానక్కర్లేదు. రవ్వంత కారుణ్యం, గోరంత ధైర్యం ఉంటే చాలు. అదే మనిషితనం. పంచేకొద్దీ అది మన ఆత్మశాంతినీ, ఆత్మతృప్తిని పెంచుతుంది’’

నా చేతిని తన అరచేత్తో తట్టింది పూర్ణ. ‘వెళ్దాం’ అన్నట్టు సైగ చేసింది. ఆమె విసుగుదల ముఖ కవళికల్లో కనిపిస్తూనే ఉన్నది. కారణం- బహుశా స్వామీజీ వాక్యాలు ఇప్పుడు నా పక్షాన నిలిచాయి కాబోలు!

సరిగ్గా అప్పుడే-సైలెంట్‌లో ఉన్నా- నా సెల్‌ ‌ఫోన్‌ ‌సంచలించింది. చూశాను. ‘లావణ్య’! ఆశ్చర్య పోయాను. లేచి పక్కగా నడుచుకుంటూ ఆవరణలోకి వచ్చేశాను. నా పక్కకి వచ్చి నిలబడింది పూర్ణ. సెల్‌ని ఆన్‌ ‌చేసి స్పీకరూ నొక్కాను.

అవతలవైపు నుంచీ పురుషోత్తంట, హైదరాబాద్‌. ‘‘‌మీ చెల్లెలు లావణ్య తరఫున మాట్లాడుతున్నాను. మీరు ఉన్నపళంగా బయల్దేరి రావాలి. ఆమె చెప్పమంటున్నారు’’

ఏమైంది, విషయమేమిటని విచారిస్తే తెలిసింది – లావణ్య భర్త చనిపోయాడు!

నేను అప్రతిభుణ్ణయ్యాను. మనసు కలతపడింది. ఫోన్‌ ఆగింది. ‘సర్రీ…రీ.. రీ’ అని దీర్ఘం తీసింది పూర్ణ. ఆమె మనోభావాలన్నీ ఆ రెండక్షరాల్లోనూ, వాటి ఉచ్చారణలోను వెలువడినై.

నా మిత్రుడు సుధాకర్‌ ‌మనసున మెదిలాడు. కానీ, అతనిప్పుడు ముంబైలో ఉన్నాడు.

చేష్ట దక్కి నిలబడిన నన్ను చేతిమీద తడుతూ- ‘పదండి. కారు తీసుకురండి’ అన్నది. నేను పార్కింగ్‌ ‌వైపు కదిలాను.-

డ్రైవర్‌ ‌రాజు దొరికి బయల్దేరేసరికి రాత్రి పన్నెండు దాటింది.

ఇంట్లో అప్పటి వరకూ-పూర్ణతో నేను ‘అవును’ ‘అంతే’ ‘అలాగే’ ‘సరి’ ‘సరిసరి’ ‘తప్పదు మరి’ వంటి ఏకవాక్య సంభాషణే జరిపాను. తనంతట తానే ప్రయాణమైంది.

కారు విజయవాడ – హైదరాబాద్‌ ‌హైవే మీద వేగంగానే పోతోంది. వెనక సీట్లో పూర్ణ. నిద్రకు ఉపక్రమించింది. ముందు సీట్లో నేను. ఆకాశంలో చందమామ. నన్ను అనుసరిస్తూ ఉన్నాడు.. నా తలపుల్లో లావణ్య.

నా మూడో బాబాయి నాలుగో కూతురు-లావణ్య. ఆరేళ్ల క్రితం అర్ధరాత్రి వచ్చి విజయవాడలో మా ఇంటి తలుపు కొట్టింది లావణ్య. చూస్తే-మెళ్లో మంగళసూత్రం. పక్కన ముస్లిం యువకుడు. నాకూ పూర్ణకూ కాళ్లూ చేతులూ ఆడలేదు. నోట మాట రాలేదు.

దారిస్తే లోపలికొచ్చి గోడవారగా నిలబడ్డారు. అతని పేరు సలీం. ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉన్నాడు. నడివయస్సు.

‘‘ఈ పిల్లేమో ఇరవై రెండు. అబ్బనాకారి. ఇలాంటి కథకీ, గాథకీ కొత్త ఇతివృత్తాలేం ఉండవు. ప్రేమ గద్దిస్తుంది! సలీంకి తండ్రి లేడు. తల్లి హఫ్సా. జీవిక చేపలు అమ్మకం. ఆమే, ఆమె తమ్ముళ్లూ కర్రలూ, కత్తులూ తీసుకుని బాబాయి ఇంటిమీదికి పోయారు. పోస్టల్‌ ఏజెంటుగా ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి అలసిసొలసి మంచంలోనే రోగగ్రస్తుడుగా ఉన్నాడు. పిన్ని నోరులేని జీవం. హఫ్సా-బాబాయి ఇంటిమీద పడితే, వీళ్లిటు మా ఇంటికి – కాందిశీకు లైనారు! లోకరీతిలోనూ, నీతిలో కూడా తిరకాసుంది. ఇదొక సహజ దృశ్యం!

మర్నాడు వివరాలు తెలిశాయి. లావణ్యా వాళ్ల ఇంటి ఎదురుగా కార్ల మెకానిక్‌ ‌షెడ్డులో పని చేస్తున్నాడు సలీం. ఈ అవతారానికి ముందు చాలా చిల్లర మల్లర పనులు చేశాడు. ముప్ఫై రెండేళ్లు వయస్సు అతన్ని ఇప్పటికే చాలా లారీల్లో చాలా ఊళ్లల్లో ఊరేగించింది.

ఆ పగలంతా వాళ్లకీ మాకూ కూడా సమయం ముళ్ల మీదే గడిచింది. ఆ రాత్రి – పూర్ణ నన్ను తీవ్రంగా హెచ్చరించింది.

‘‘ఈ పిల్ల చేసిన పనికి నాకు అసహ్యమేస్తోంది. ‘అయ్యో పాపం… సహాయం, సానుభూతీ అంటూ వీళ్లని నా మెడకు చుట్టకండి. ముందే చెబుతున్నాను. అట్టాంటిదేమైనా చేశారో మర్యాద దక్కదు’’ అనేసింది. ‘‘ఇప్పుడిప్పుడే కాస్త నాకు రవ్వంత ఊపిరి ఉన్న దనిపిస్తోంది. దాన్ని బిగదీయకండి’’ అని అన్నది.

స్థితీ గతీ చాలా స్పష్టంగా ఉన్నై. ‘కింకర్తవ్యం’?

నేను చాలా కలతపడ్డాను. ఆలోచించి ఆలోచించి హైదరాబాద్‌లోని మిత్రుడు సుధాకర్‌ని పట్టుకున్నాను. అతను పంపమన్నాడు. పంపించాను. సలీంని ఒక లారీ ట్రాన్స్‌పోర్ట్ ‌కంపెనీలో చేర్చాడు. కూడూ గూడూ ఒనగూడినై. నెల రోజుల తర్వాత ఫోన్‌ ‌చేసి ‘‘నీ దయవలన అంతా బాగానే ఉందన్నయ్యా’’ అని థాంక్స్ ‌చెప్పింది లావణ్య.

ఇదంతా జరిగి ఐదేళ్లు. ఈ మధ్యలో బాబాయీ, పిన్నీ కాలంచేశారు. లావణ్య కబుర్లేం తెలియలేదు. ఇప్పుడిదీ వార్త!

టీ కోసం కారు ఆపాడు రాజు. నా ఆలోచనా తెగింది. టీ తాగి మళ్లీ బయల్దేరాము. హైదరాబాద్‌ ‌చేరే సరికి భళ్లున తెల్లవారింది.

చాలా పెద్ద ఆవరణ. ఆ ప్రాంగణమంతా ట్రాన్స్‌పోర్ట్ ‌యజమాని అమానుల్లాఖాన్‌ ‌గారిది. ఆవరణంతా కార్లూ, ఒకటి రెండు లారీలు, బస్సులూ. మూలగా రేకుల షెడ్డు. నలుగురైదుగురు నిలబడి మాట్లాడుకుంటున్నారు. పురుషోత్తం ఎదురొచ్చి మమ్మల్ని తీసుకువెళ్లాడు.

మమ్మల్ని చూసి లావణ్య గొల్లుమన్నది.

పూర్ణ వెళ్లి ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చ సాగింది. పక్కన బిక్కుబిక్కుమంటున్నాడు-నాలుగేళ్ల లావణ్య కొడుకు. నేలమీద సలీం శవం. పురుషోత్తంగారూ, లావణ్య కలిసి మరికొన్ని వివరాలిచ్చారు. రెండు నెలల్నుంచీ జ్వరమూ, వాంతులూ, బేదులూ, వచ్చీ పోయే అతిథిలా స్పృహ! అన్నీ ఆ గదిలో మూల- నేలమీదే!

తొమ్మిదింటికి ఖాన్‌ ‌గారూ, మరెవ్వరో ఆయన పరివారం వచ్చారు. పురుషోత్తంగారూ ఆయన గుమాస్తాయే. సలీం ఖననానికి ఏర్పాట్లన్నీ వాళ్లే చేశారు. సాయంత్రానికి ఆ పని అయింది. సలీం తరఫువాళ్లు గానీ, లావణ్య అక్కయ్యల్లో ఏ ఒక్కరు గానీ రాలేదు. పురుషోత్తంగారి భార్య రుక్మిణమ్మే వచ్చి మాకు ఇంత కాచి పోసింది.

నాలుగోరోజు రాత్రి ఖాన్‌ ‌గారు మళ్లీ వచ్చారు. పురుషోత్తంగారూ ఉన్నారు. ‘‘ఆమెకైనా ఇంకెవరు న్నారు. అన్నగా మీరు ఆదుకోవాల్సిందే. ఇలాంటి కొన్ని బాధ్యతలు తప్పవు’’ అన్నారు ఖాన్‌ ‌గారు. సలీం గురించి, లావణ్య గురించీ నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లిపోయారు.

మర్నాడు సాయంత్రం-పూర్ణ ‘మనం కాస్సేపు బయటికి పోదాం’ అంటే, వెళ్లి పార్కులో కూర్చున్నాం.

కొద్ది క్షణాల తర్వాత ఆమె సరాసరి విషయ ప్రస్తావనలోకి దిగింది. ‘‘నిన్న మధ్యాహ్నం రుక్మిణమ్మ గారి మాటల్లో తెలిసింది. ఆ సలీం రోగం గురించి. ఏమేమో అనుకుంటున్నారుట’’ –

‘‘అంటే?’’ రెట్టించాను… ‘‘అంటే…’’ అని సంకోచంగా ‘‘ఎయిడ్స్’’ ‌ట అంటూ నసిగింది.

నేను గతక్కుమన్నాను. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాను. మేధలో ఇదమిత్థంకాని విస్ఫోటనం! ఆ తర్వాత నిబ్బరించుకుని ‘‘అర్థం పర్థం లేని వార్తలకి నాలుక లెక్కువ. లోకులు పలు గాకులు అన్నది ఇందుకే’’ అన్నాను. మొహాన్ని నావైపు తిప్పి, కళ్లల్లో అసహనాన్ని దట్టించి అన్నది, ‘‘ఏమో… నిజమో అబద్ధమో నాకెందుగానీ, మీరు మాత్రం వీళ్లని మనింట్లో పెట్టుకోవాలని జాలిపడకండి. నాకిష్టం లేదు’’ కొట్టినట్టే చెప్పింది. దిక్కులు చూస్తూ, మౌనంగా ఉండిపోయాను. క్షణాల తర్వాత, ‘‘రేప్పొద్దున ఈమెక్కూడా ఆ మాయదారి రోగమేదో వచ్చి మూలపడితే, ఆ ఉచ్చలూ పెంటలూ కడుక్కుంటూ నేను చావలేను. మొగుడితో కాపురం చేసే వాళ్లకి వస్తుందిట’’ అని ప్రశ్నని సంధించింది.

కలవరంగా ఉంది మనసులో. నేను భరించలేని దాడే ఇది. కానీ, ఆమెను ఎదుర్కొనే ఆయుధమేదీ నా దగ్గర లేదు.-

నిశ్శబ్దంగానే – పొద్దుబోయింది. ఇంటికి చేరాము.

రాత్రి – ఆరు బయట మంచంలో పొర్లుతున్నాను. నిద్రలేదు. పరిధిమీద ఎంత వేగంగా పరిగెత్తినా, నిదానంగా నడిచినా, స్పర్శించిన బిందువునే కదా మళ్లీ మళ్లీ తాకుతూ ఉండేది. ఆలోచన తెగటం లేదు. అప్పుడు- హఠాత్తుగా చెవుల్లో మోగింది- స్వామీజీ ప్రవచనం. ‘రవ్వంత కారుణ్యం, గోరంత ధైర్యం… అదే మనిషితనం. మనల్ని అయిన వారమనుకునే వారి జీవితాల్లో వెలుగు నింపటానికి ఆ మనిషితనాన్ని పంచాలి…

ఆధారంలేని అనుమానాలతో మనసుని మధించుకోవటం ఎందుకూ? స్వామీజీ ప్రవచనం, ఖాన్‌ ‌గారి హితవచనం- రెంటినీ అనుసంధానిస్తే? కర్తవ్యం దృఢతరంగా, స్పష్టంగా కళ్లకు కట్టింది.

దీర్ఘంగా శ్వాసించాను. నిద్ర పట్టింది.

  *  *  *

సూటిగా చూసే చూపుల్ని తప్పించుకుంటూ, స్పష్టంగా చెప్పాల్సిన మాటల్ని బయటికి రానీయ కుండా జాగ్రత్త పడుతూ నేనూ, పూర్ణా పన్నెండు రోజులు గడిపాము.

పదమూడో రోజు మధ్యాహ్నం మూడుగంటలకు మా తిరుగు ప్రయాణం. భోజనాలయినై. లావణ్యనీ, పిల్లవాణ్ణీ సిద్ధంకమ్మని చెప్పేశాను. మనస్సు లోలోపల ఏ గాండ్రింపుని ఎలా అణచుకొన్నదో గానీ, ఆ సందర్భంలో మాత్రం గంభీరంగానే ఉండిపోయింది పూర్ణ! రాజూ వచ్చాడు.

  *  *  *

విజయవాడలో నాలుగు రోజులుండి, తిరిగి హైదరాబాద్‌ ‌వెళ్లిపోయింది లావణ్య. ఆమె బయల్దేర బోయే ముందు ‘‘లావణ్యకి పదివేలివ్వండి’’ అన్నది పూర్ణ. నా వద్ద డబ్బు ఉన్నట్టు ఆమెకు తెలుసు. నేను నా ఆశ్చర్యాన్ని కనపడనీయకుండా పదివేలూ పూర్ణకే ఇచ్చాను. ఆమె లావణ్యకిచ్చి భుజం తట్టింది. ఇద్దరి కళ్లలోనూ తొణికిన కన్నీరుకి నేను మౌనసాక్షినై నిలిచాను! అక్కడికా అధ్యాయం ముగిసింది! ఆ రాత్రి- ఏకాంతంలో పూర్ణ చూపులో చూపు నిగిడ్చి చూస్తుంటే పెదవుల కదలిక మధ్య చికిలిస్తున్న నవ్వుతో- ‘చాల్లెండి- సంబడం’ అన్నది గిరుక్కున పక్కకి తిరుగుతూ!

పదిరోజుల తర్వాత ఒకనాడు… ‘‘ఇవిగో లావణ్య వాళ్ల మెడికల్‌ ‌టెస్ట్ ‌రిపోర్టులు’’ అంటూ తన సెల్‌ని నాకందించింది. ‘అదృష్టం బాగుండి అంతా సవ్యంగా ఉంది’ అని అన్నది. మా ఇద్దరి మధ్యనా నిండిన నిశ్శబ్దంలో ఎన్నో వివరణ కందని, అనిర్వచనీయమైన భావాలు నలిగినై. నేను మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకున్నాను!

ఆర్నెల్ల కాలం ఇట్టే గడిచింది. ఇప్పుడు విజయ వాడలోనే లావణ్య తన అంగడిలో అక్షరాలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపాదనలో పడింది. ఈ మొత్తం పరిణామ పక్రియకి-నిర్మాతా, దర్శకు రాలూ కూడా అన్నపూర్ణే! ఏ మాట, ఎవర్ని ఎప్పుడు ఎలా కదిలిస్తుందో ఎవరు చెప్పగలరు!

About Author

By editor

Twitter
Instagram