– షేక్‌ అహమద్‌ ‌బాష

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందినది


యామిని వంట పనిలో తలమునకలై ఉంది. ఆమె తెల్లవారి ఐదు గంటలకు లేస్తేగానీ భర్త, పిల్లలకు టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం క్యారియర్లు తయారు కావు. భర్త శ్రావణ్‌ ఆరు గంటలకు లేచాడు. భార్య ఇచ్చిన టీ తాగుతూ దినపత్రిక తిరగేసాడు. అదవుతూనే టాయిలెట్లో దూరాడు. పిల్లలు సమీర్‌, ‌సిరి, ఒక్కొక్కరు వచ్చి తమ కప్పు టీ తీసుకుని పైన వాళ్ల గదుల్లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో యామినిని ఎవరూ విసిగించే ప్రయత్నం చేయరు. వంట గదిలో అష్టావధానం చేస్తున్న తల్లి శరీరంలో అప్పుడు 220 వాట్స్ ‌కరెంటు ప్రవహిస్తుంటుందని వారికి తెలుసు. ఆమెను ఎవరైనా విసిగిస్తే ఏ గరిట రూపంలోనో తమకు షాక్‌ ‌కొడుతుందని కూడా తెలుసు. టీ తాగిన కప్పును తెచ్చి సింక్‌లో వేస్తూ సిరి తల్లిని ఏదో అడగబోయి, ఆమె ముఖం చూసి వెళ్లిపోయింది. ఏడున్నర గంటలకు శ్రావణ్‌ ‌తన క్యారియర్‌ ‌తీసుకుని వెళ్లిపోయాడు. అతను అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పట్టణంలో పనిచేస్తాడు. ఏడు ముప్పావుకు బయలుదేరే ట్రైన్‌ను అతను పట్టాలి. పిల్లలు కూడా టిఫిన్లు తిని తమ క్యారియర్లు పట్టుకుని బయటపడ్డారు. ఇల్లు ఒక్కసారి నిశ్శబ్దంగా మారింది. యామిని పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంది. ఎనిమిదిన్నర గంటలకు పనిమనిషి వచ్చింది.

యామిని తన గదిలోనికి వెళ్లి పడకపై పడి ఉన్న తడి టవల్‌ ‌తీసి ‘ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా అంతే’ అనుకుంటూ దాన్ని తెచ్చి బయట ఆరేసింది. మేడ మీది సమీర్‌ ‌గది చూస్తూనే ఉస్సూరుమంది. ఎక్కడి పుస్తకాలు చిందరవందరగా అక్కడే, పరుపుపై రాత్రి కప్పుకున్న దుప్పటి కింద వేలాడుతూ, ఆఫ్‌ ‌చేయని కంప్యూటర్‌, ‌టేబుల్‌ ‌పై తాగిన టీ కప్పు ఆమె అసహనాన్ని పెంచేశాయి. ‘ఈ వెధవకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు’ అని విసుక్కుంటూ సర్దడం మొదలెట్టింది. సిరి గది కాస్త ఫర్వాలేదు, కాకపొతే పుస్తకాలు మంచంపైనే పడేసి వెళ్లిపోయింది. ఇది ప్రతిరోజూ ఆ ఇంట్లో జరిగే తంతు. ఒక్క ఆదివారం రోజు మాత్రం యామిని కాస్త తీరిగ్గా లేస్తుంది. సమీర్‌, ‌సిరిలు ఇంజనీరింగ్‌ ‌మూడవ, మొదటి సంవత్సరం చదువుతున్నారు.

 ఆ రోజు ఆదివారం. పిల్లలిద్దరూ తమ గదుల్లో ఉన్నారు. యామిని, శ్రావణ్‌ ‌బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ‘‘ఈ మధ్య పిల్లలను గమనిస్తు న్నారా, ఎప్పుడు చూసినా మీరు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్లోనో లేక కంప్యూటర్‌ ఎదురుగానో ఎక్కువ సమయం గడుపుతున్నారు. చదవడం తక్కువ, చూడడం ఎక్కువ అయిపోయింది. ఫేస్‌బుక్‌, ‌వాట్సాప్‌లోనే తమ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారనిపిస్తుంది.’’

‘‘అందరు పిల్లలూ అలాగే ఉన్నారు, మనపిల్లలే నయం. కనీసం మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. కానీ వారిపై మనం ఓ కన్ను వేసి ఉంచాలి. నేనేమో తెల్లవారి పోతే రాత్రికి వస్తాను. కాబట్టి ఆ పనేదో నువ్వే చేయాలి’’

‘‘అంటే మీకు చాకిరీ చేయడమే కాక ఇక పిల్లల్ని కూడా నేనే గమనించాలా?’’

‘‘యామీ, అలా ఎందుకనుకుంటావు, నువ్వు ఇంట్లో పని చేస్తే, నేను బయటకి వెళ్లి పనిచేస్తున్నాను. దాన్ని చాకిరీ అనుకుంటే ఎలా? నా సంపాదన లేకుండా ఎలా ఈ కుటుంబం నడవదో, నీ సేవలు లేకపోతే కూడా ఈ కుటుంబం నిలబడదు. మనిద్దరం సమానంగా పనిని పంచుకుంటున్నాం. ఇది మన కుటుంబం, వాళ్లు మన పిల్లలు. వాళ్లు ఒక పటిష్టమైన స్థితిని చేరేవరకు మనం వారికి తోడుంటూ, సరైన దిశానిర్దేశం చేయాలి. పిల్లల్ని కనడం, చదువు చెప్పించడం వరకే మన బాధ్యత అనుకుంటే కుదరదు. ఒకప్పుడు, అంటే మనం చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు అలా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. సాంకేతికత పెరిగేకొద్దీ జ్ఞానం ఆర్జించే సౌలభ్యం పెరిగింది. కానీ దాంతో సమానంగా బుద్ధిని వక్ర మార్గాన్ని పట్టించే దారులు కూడా తెరుచుకున్నాయి. పిల్లలు కొన్ని అనవసర ఆకర్షణలకు లోను కావడం సహజం. ఈ నాటి తల్లి దండ్రుల బాధ్యత లేదా సవాలు అక్కడే మొదలౌతుంది. వారు అనవసర ఆకర్షణల వైపు మళ్లకుండా, వారిలో పరిపక్వత, సమతుల భావనలు కల్పించాలి. దానికి ముందు మనం ఆ అర్హత సాధించాలి. సరిగ్గా చదవని తల్లితండ్రులు, లేదా చదువుకున్న తల్లితండ్రులు కూడా తమ జ్ఞానాన్ని ఈ కాలంతో సమానంగా పెంచుకోకుండా సలహాలిస్తే పిల్లలు స్వీకరించరు. ఆ పిల్లలతో సమానంగా మనం కూడా ఈ అంతర్జాలంలో ఈదాలి, తప్పదు. అప్పుడే వారు మన సలహాలను గౌరవిస్తారు’’.

‘‘ఇంత తెలిసీ మరి వారికి ఆ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ఎందుకు కొనిచ్చారు, తీసేయండి’’

‘‘అలా అంటే ఎలా, వాటి వల్ల ఉన్న లాభాలను అందిస్తూనే నష్టాలవైపు పోకుండా చూసుకోవాలి, అంటే కత్తి మీద సాము లాంటిది. ఒక వేళ మనింట్లో ఇవి లేకపోతే వారు స్నేహితులింటికో, ఇంటర్నెట్‌ ‌సెంటర్లకో వెళ్లవచ్చు. కనీసం వాళ్లు ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నారు, అప్పుడు అది కూడా ఉండదు. ఈ కాలపు పిల్లలు చాలా సున్నిత మనస్కులు. నాకు మార్కులు సరిగ్గా రాకపోతే మా నాన్న తుక్కుతుక్కుగా కొట్టాడు. నేను చచ్చినట్లు ఓ మూల కూర్చుని ఏడుస్తూ చదువుకున్నాను. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అలాంటి శిక్షలు మన నుంచి పిల్లల్ని దూరం చేయడమే కాకుండా, వారేమైనా చేసుకుంటే ఆ తర్వాత పశ్చాత్తాపపడితే లాభం లేదు. ఇది ఈ కాలపు తల్లితండ్రుల కర్మ. భరించాల్సిందే. వాళ్లను నాకంటే ఎక్కువ సమయం గమనించేది నువ్వే కనుక ఈ బాధ్యతను కూడా నువ్వే నిర్వహించక తప్పదు’’

‘‘నన్నేం చేయమంటారు, నాకు ఆ కంప్యూటర్‌ ‌రాదే’’ దిగులుగా అంది.

శ్రావణ్‌ ‌భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా చెప్పాడు ‘‘యామీ, నువ్వు ఒక సైన్స్ ‌గ్రాడ్యుయేట్‌, ‌చాలా తెలివైన దానివి కూడా. ఈ ఇంటి బాధ్యతను ఒంటిచేత్తో నిర్వహిస్తున్నావు. నువ్వు చూసే ఉంటావు, ఈ రోజుల్లో ఐదో తరగతి చదివే పిల్లలు కూడా చాలా సులువుగా ఫోన్లు, కంప్యూటర్లు వాడేస్తున్నారు. మరి నువ్వు మనసు పెడితే నేర్చుకోలేవా? నువ్వు కాస్త ఆ సీరియల్స్ ‌మానేస్తే ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించవచ్చు. నువ్వు ఒక్కసారి ఇంటర్నెట్‌కు అలవాటు పడితే ఇక టెలివిజన్‌ ‌వైపు తిరిగి కూడా చూడవు. నీకు కావలసినంత వినోదం, స్వామి కార్యం, స్వకార్యం రెండూ జరిగినట్లే.’’

‘‘మరి నాకు కంప్యూటర్‌ ‌నేర్పుతారా?’’

‘‘అంతకంటేనా, నేనెప్పటినుంచో చెబుతున్నాను, రేపటి నుంచే సెలవు పెడతాను. దేవీ గారికి గురువునవుతాను’’ చిలిపిగా చెప్పాడు శ్రావణ్‌. ఆ ‌మరుసటి రోజు నుండే శ్రావణ్‌ ‌యామినికి కంప్యూటర్‌ ‌నేర్ప సాగాడు. శ్రావణ్‌ ‌చెప్పినట్లు ఆమె మూడు రోజుల్లో ఎలా ఆపరేట్‌ ‌చేయాలో నేర్చుకుంది. తన ఇ మెయిల్‌ ‌సృష్టించుకుంది. ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ‌కూడా తెరిచింది. తన ఫోన్లో వాట్సాప్‌ ‌కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక ఆ రోజు నుండి భర్త, పిల్లలు ఇల్లు వదలగానే ఆమెకు కంప్యూటరే లోకమైపోయింది. ఆమె ముఖ్యంగా పిల్లల అభివృద్ధికి కావలసిన సైట్లు చూడసాగింది. అనేక నిపుణుల అభిప్రాయాలు, వాటిపై ఇతరుల అభిప్రాయాలు ఆమెకు తెలుస్తున్నాయి. ఒక విషయంపై ఏవైనా అనుమానాలు వస్తే వికిపీడియా ద్వారా నివృత్తి చేసుకుంటుంది. కొన్ని నెలలలోనే ఆమె అనేక విషయాలపై అవగాహన పెంచుకుంది. శ్రావణ్‌ ‌చెప్పింది నిజమే, పట్టుదల ఉంటే సాధించ లేనిది ఏదీ లేదు. సమీర్‌, ‌సిరిలు వారి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్‌ అయ్యారు.

ఒకరోజు సమీర్‌ అడిగాడు ‘‘అమ్మా, నా స్నేహితులు ట్రీట్‌ అడుగుతున్నారు’’ అని.

‘‘అలాగే, వాళ్లను రేపు ఆదివారం భోజనానికి పిలువు.’’

ఆదివారం సమీర్‌ ‌స్నేహితులంతా వచ్చేశారు. మొత్తం ఐదుమంది. సాకేత్‌, ‌శ్రీనివాస్‌, ‌షారూక్‌, ‌ఢిల్లీ బాబు, దీపక్‌. ‌వారు తరచూ ఆ ఇంటికి వచ్చిపోయేవారే. యామిని అంటే వారికి అభిమానం, గౌరవం కూడా. వంటలో తల్లికి సమీర్‌, ‌సిరిలు కూడా సహాయపడ్డారు. శ్రావణ్‌ ‌కూడా భోజన సమయానికి వచ్చేసాడు. అందరూ భోజనానంతరం డ్రాయింగ్‌ ‌రూంలో చేరారు. యామిని గొంతు సవరించుకుని చెప్పింది ‘‘పిల్లలూ, మీరందరూ ఇంజనీరింగ్‌ ‌చివరి సంవత్సరానికి వచ్చేశారు, గత మూడేళ్లలో మంచి మార్కులే సంపాదించారు. కానీ మీలో నాకు కొన్ని కొరతలు కనబడుతున్నాయి. మార్కులైతే కనబడుతున్నాయి కానీ, మీలో సబ్జెక్ట్ ‌పై ఎంత అవగాహన ఉంది, నైపుణ్యాల వైపు మీ దృష్టి సారించారా, లేదు కేవలం పుస్తకాలు తిరగేసి మార్కులు సాధించారా అనేదానిపై స్పష్టత కావాలి. ప్రతి సంవత్సరం లక్షలమంది కాలేజీల నుండి బయటకు వస్తున్నారు. వారిలో ఎంత మందికి నిజమైన నైపుణ్యం ఉంది?’’

‘‘అమ్మా, ఏంటిది, మంచి భోజనం పెట్టి దాన్ని ఇలా అరగదీస్తున్నావు?’’ నవ్వుతూ అడిగాడు సమీర్‌.

‘‘అవునురా, నీతోబాటు మరో ఇద్దరు కంప్యూటర్‌ ‌సైన్స్ ‌చదువుతున్నారు, నేను అడిగే ప్రశ్నలకు జవాబివ్వగలరా?’’

‘‘అడగండి ఆంటీ, మేం జవాబిస్తాం’’ అన్నాడు సాకేత్‌.

‘‘ఆం‌డ్రాయిడ్‌ అం‌టే, క్లౌడ్‌ ‌టెక్నాలజీ అంటే ఏమిటి, సెర్చ్ ఇం‌జిన్‌ ‌గురించి మీకేం తెలుసు?’’

‘‘ఆంటీ, ఆండ్రాయిడ్‌ ఒక మొబైల్‌ ఆప్‌. ‌క్లౌడ్‌ ‌టెక్నాలజీ అనేది ఒక ప్లాట్‌ఫాం. సెర్చ్ ఇం‌జిన్‌ అం‌టే…అంటే’’ నసిగాడు సాకేత్‌.

‘‘ఇం‌కా వివరంగా ఎవరన్నా చెప్పగలరా?’’ అడిగింది యామిని. అంతకుమించి ఎవరూ చెప్పలేక తల వంచుకున్నారు.

‘‘చూశారా, మీరు చదివే కంప్యూటర్‌ ‌సైన్స్ ‌గురించే మీకు పూర్తిగా అవగాహన లేదు. ఆండ్రాయిడ్‌ అనేది గూగుల్‌ ‌తీసుకొచ్చిన ఒక అప్లికేషన్‌. అది మొబైల్‌ ‌ఫోన్లలో టచ్‌ ‌స్క్రీన్‌ ‌ద్వారా అనేక అవసరాలు తీర్చగల ఒక అద్భుతమైన సాంకేతికత. ఇప్పుడు దాన్ని టీవీలలో, నోట్‌బుక్స్‌లలో, గేమ్స్, ‌కెమెరాలలో ఉపయోగించుకుంటున్నారు. ఇక క్లౌడ్‌ అనేది లక్షల విలువగల హార్డ్‌వేర్‌ అవసరం లేకుండా, విలువైన సమయం వృధా కాకుండా క్షణాల్లో మనకు కావలసిన డాటాను అందివ్వగలది. ఇక సర్చ్ఇం‌జిన్ల గురించి మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందు వెయ్యిమంది పనిని పది కంప్యూటర్లు చేసేవి. ఇప్పుడు వంద కంప్యూటర్ల పనిని ఒక్క సెర్చ్ ఇం‌జన్‌ ‌చేసేస్తుంది. దీనివల్ల అనేక మంది కంప్యూటర్‌ ఉద్యోగాలు కోల్పోతారు. ఎవరు టాప్‌ ‌టెన్‌లో ఉంటారో వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటేనే దానికి తగ్గట్టు నైపుణ్యాలను సంపాదించుకోగలుగుతారు. లేదంటే గుడ్డిగా డిగ్రీలు తీసుకుని క్యూలలో నిలబడి ఎదురుచూడాల్సి వస్తుంది.’’ సమీర్‌తో సహా అందరూ ఆమె చెప్పింది నోరు తెరుచుకుని విన్నారు.

‘‘సరే, దీపక్‌, ‌నువ్వు ఎలెక్ట్రికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చదువుతున్నావు. మరి మన దేశంలో అటామిక్‌ ‌పవర్‌ ‌లేదా థర్మల్‌ ‌పవర్‌ ‌కావాలా అనే చర్చ జరుగుతూ ఉంది, మరి నీ అభిప్రాయం చెప్పగలవా?’’ దీపక్‌ ‌తల వంచేసాడు.

‘‘చూసావా, కాబోయే ఒక ఇంజనీరుకు ఈ విషయంపై అవగాహన ఉండాలా వద్దా? అది లేకుండా నువ్వెలా ఈ దేశానికి సేవ చేయగలుగు తావు?’’ ఆమె గొంతు ఖంగుమంది. అందరూ బిత్తరపోయారు.

‘‘ఒక థర్మల్‌ ‌ప్లాంట్‌లో ఏడువేల టన్నుల బొగ్గుతో తయారుచేసే విద్యుత్తు కేవలం 62 కేజీల యురేనియంతో తయారు చేయవచ్చు. బొగ్గు ఉత్పత్తిలో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది, అంతేకాదు, అది సృష్టించే కాలుష్యం వల్ల మానవాళికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. అణు విద్యుత్తులో ఆ నష్టం ఉండదు. కానీ అణు రియాక్టర్లో చిన్న పొరబాటు జరిగినా పదింతలు నష్టం జరుగుతుంది. రష్యాలోని చెర్నోబిల్‌, ‌జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రాల ప్రమాదాలు మనం మరవకూడదు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని మీకెందుకు తట్టడం లేదు. ఈ మధ్య మీరు పంపుకునే ఎస్‌ఎంఎస్‌లు చూసాను. తెలుగు భాషను ఆంగ్లంలో పంపే కర్మ ఏమొచ్చింది. అంటే మీకు ఆంగ్ల భాష మీద ఎటువంటి పట్టు లేదనే కదా. భాష మీద పట్టు లేనిదే మీరెలా విజయం సాధిస్తారు. నేను చెప్పిన విషయాలన్నీ మీరు రోజూ చూసే కంప్యూటర్లోనే ఉంటాయి. మరి మీరు దాన్ని ఎందుకు వినియోగించ లేకపోయారు. ఎప్పుడో పాతిక సంవత్సరాల ముందు డిగ్రీ చదివిన నాకు తెలిసిన విషయాలు కూడా మీకు తెలియ లేదంటే మీ పరిస్థితి అర్ధం అవుతుందా? కనీసం ఆ చైనా వాడిలా ఒక దోమలు చంపే బ్యాట్‌ ‌కనుక్కున్నా నేను సంతోషిస్తాను.’’ ఆమె తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ఆపింది.

పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. శ్రావణ్‌.. ‌భార్య ఇచ్చిన ఉపన్యాసానికి ఉబ్బితబ్బిబ్బౌ తున్నాడు.

సాకేత్‌ ‌చెప్పాడు ‘‘చాలా థాంక్స్ ఆం‌టీ, మంచి భోజనంతో పాటు మా జీవితాలను మార్చే పక్రియ మొదలెట్టే ఒక దార్శనికత కలగచేసారు. మీ ప్రతి మాటా విలువైంది, మేం వాటిని తప్పకుండా ఆచరిస్తాము. మీలాగా మేం ఆలోచించనందుకు సిగ్గుపడుతున్నాం’’ అందరూ సెలవు తీసుకున్నారు.

 అందరూ వెళ్లిన తర్వాత సమీర్‌ అడిగాడు ‘‘అమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. మరి ఇంత తెలిసిన దానివి నాకు వచ్చిన పర్సనల్‌ ఎస్‌ఎంఎస్‌లు ఎందుకు చూసావు?’’

యామిని నవ్వింది, ‘‘ఒరే సామ్‌, ‌నిన్ను తొమ్మిది నెలలు మోసి నరకయాతన అనుభవించి కన్నాను. నువ్వు వేసే ప్రతి అడుగూ పర్యవేక్షించాను. నువ్వు తినే ప్రతి ముద్దా రుచికరంగా ఉండేట్లు చేసాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఏడవ తరగతి వరకు నేనే నీ గురువును. ఆ తర్వాత నీ ప్రతి అవసరం గమనించి సహాయం చేస్తూనే ఉన్నాను. నేను ఒక్క రోజు ఇంట్లో లేకపోతే మీరెలా తల్లడిల్లి పోతారో ఆలోచించావా? ఇవన్నీ నీ పర్సనలా లేక నా పర్సనలా? నీ శరీరం మీద నాకు పూర్తి పేటెంట్‌ ‌హక్కు ఉంది. నువ్వు నేను తయారు చేసిన ప్రాడక్ట్. ఈ ‌రోజు నాకంటే ఒక అడుగు ఎత్తు ఎక్కువ పెరిగావని ‘అమ్మా నా పర్సనల్‌ ‌విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నావు’ అని అడిగే సమయం ఇంకా రాలేదు. మీరేం చేస్తున్నారు, ఏ దిశలో పోతున్నారో ఒక తల్లిగా నాకు తెలుసుకునే పూర్తి బాధ్యత ఉంది. అలా అని నిన్ను ఎప్పుడూ పీడిస్తానని అనుకోవద్దు. నేను తయారుచేసిన ప్రాడక్ట్ ‌చక్కగా పనిచేస్తుందని నమ్మకమొస్తేనే నీకు పూర్తి స్వాతంత్య్రం వస్తుంది. నిన్ను మార్కెట్లో అమ్మకానికి పెట్టే ఆశ కానీ ఆలోచన కానీ నాకు లేదు. మీరు మీ దార్లను వెతుక్కుని వెళ్లిపోతారని నాకు తెలుసు. బహుశా వారానికో, నెలకో ఒకసారి ఫోన్‌ ‌చేసి ఎలా ఉన్నావని అడుగుతారు, బాగానే ఉన్నానని చెబుతాను. మీ నుంచి అంతకుమించి ఏమీ ఆశించడంలేదు’’ యామిని స్వరం గద్గదమయ్యింది.

తల వంచుకుని వింటున్న పిల్లలు తల్లిని చూసారు. వారి కళ్లలో నీళ్లు. ఇద్దరూ తల్లి చేతులను తమ చేతుల్లోనికి తీసుకున్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE