అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చిన తరువాత మధ్యవర్తిత్వం, కోర్టు బయట పరిష్కారం గురించి కొంత ప్రయత్నం జరిగింది. 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో విశ్వహిందూ పరిషత్‌, ‌బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం మధ్య జరిగిన చర్చల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ తరువాత హిందువులు, ముస్లింల మధ్య సయోధ్యకు నాలుగు గట్టి ప్రయత్నాలు జరిగాయి. 2003లో ఆరంభమైన ఈ చర్చలు, సయోధ్య ప్రయత్నం 2019 వరకు జరగడం విశేషం. కట్టడం పతనం తరువాత అటు న్యాయస్థానాలలోను, ఇటు న్యాయస్థానాల బయట ప్రతిపాదించిన చర్చల పక్రియలోను వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి అంశమే కీలకంగా మారింది.


కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి 2003లో అయోధ్య వివాదానికి మధ్య వర్తిత్వం నెరపారు. ఆయన ఆధ్వర్యంలో చర్చలకు రావడానికి ముస్లింలు కూడా అంగీకరించారు. కానీ జూలై 1, 2003న జయేంద్ర సరస్వతి అఖిల భారత ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డుకు ఒక లేఖ రాశారు. కాశీ, మధుర, అయోధ్య- ఈ మూడు క్షేత్రాలు కూడా హిందువులకే చెందుతాయని పీఠాధిపతి ఆ లేఖలో పేర్కొనడం వివాదాస్పదమైంది. ఇప్పుడు కాకున్నా, భవిష్యత్తులో అయినా ఆ మూడు క్షేత్రాలను హిందువులకు అప్పగించవలసి ఉంటుందని జయేంద్ర చెప్పడంతో ముస్లింలు వెనక్కి తగ్గిపోయారు.

2010లో అలహాబాద్‌ ‌హైకోర్టు (లక్నో బెంచ్‌) ‌తీర్పు వచ్చింది. దీని ప్రకారం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలి. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు 14 అప్పీళ్లు వచ్చాయి. అంటే ఈ తీర్పు వాస్తవికత దగ్గరగా లేదని పలువురు అభిప్రాయపడ్డారు. మళ్లీ కొద్దికాలం స్తబ్దత నెలకొంది. మార్చి 21, 2017న మరొకసారి చర్చల పక్రియ తెర మీదకు వచ్చింది. సుప్రీంకోర్టు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సిజె కేహర్‌ ‌మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు రావడం విశేషం. అయోధ్య లోని 2.77 ఎకరాల భూమి వివాదాన్ని త్వరగా పరిష్కరించవలసిందిగా బీజేపీ ఎంపీ డాక్టర్‌ ‌సుబ్రమణ్య స్వామి చేసిన విన్నపం మేరకు జస్టిస్‌ ‌కేహర్‌ ఈ ‌విధంగా స్పందించారు. ఇచ్చి పుచ్చుకునే తీరులో చర్చలు ఉండాలనీ, ఇందుకు ఇరు పార్టీలు సిద్ధం కావాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. కానీ ఎవరైనా కోరితేనే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన అన్నారు. జస్టిస్‌ ‌కేహర్‌ ‌మధ్యవర్తిత్వం ప్రతిపాదనకు పెద్దగా స్పందన రాకపోవడం విశేషం.

ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌ప్రబోధకుడు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ 2017‌లోనే చర్చల కోసం ముందుకు వచ్చారు. వక్ఫ్ ‌బోర్డ్ ‌చైర్మన్‌ ‌వాసిమ్‌ ‌రిజ్వితో ఆయన చర్చలు ప్రారంభించారు కూడా. ఈ చర్చలు కూడా విజయవంతం కాలేదు. కానీ చర్చల పక్రియ సాగాలని సుప్రీంకోర్టు, కొందరు ప్రముఖులు కూడా ఆనాడు గట్టిగా కోరుకున్నారు. మార్చి8, 2019న భారత అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం దాని ఫలితమే ఐదుగురు సభ్యుల ధర్మాసనం చర్చల పక్రియ కోసం ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించింది. మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఫ్‌ ఎం ‌ఖలీవుల్లా, శ్రీరాం పంచు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ ఇం‌దులో సభ్యులు. ఈ నిర్ణయాన్ని నిర్మోహి అఖాడా తప్ప మిగిలిన ఏ హిందూ సంస్థ కూడా ఆమోదించలేదు. దీనితో తాము నియమించిన బృందం లక్ష్యాన్ని సాధించలేకపోయిందని అదే సంవత్సరం జూలై 31న సుప్రీంకోర్టు ప్రకటించవలసి వచ్చింది. చిత్రంగా సుప్రీంకోర్టు ఇలాంటి ప్రకటన చేసిన తరువాత వక్ఫ్‌బోర్డ్ ‌చర్చలకు సిద్ధమని ప్రకటించింది. దీనితో చర్చలు సాగించేందుకు సుప్రీంకోర్టు ఆ త్రిసభ్య కమిటీకే అధికారం ఇచ్చింది. అలాగే అప్పుడే వచ్చిన రోజువారీ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ సంవత్సరం అక్టోబర్‌ 16‌న వక్ఫ్‌బోర్డ్ ‌తన నిర్ణయాన్ని కోర్టుకు నివేదించింది. కోర్టుకు తెలియచేసిన ప్రకారం వక్ఫ్‌బోర్డ్ ‌వివాదాస్పద స్థలంలోని కట్టడం మీద హక్కును వదులుకుంటుంది. అయితే అయోధ్యలోనివే కొన్ని మసీదులు పునరుద్ధరించాలని కోరింది. దేశంలో ఉన్న ఇంకొన్ని మసీదులను కూడా విడిపించాలని ఆశించింది. ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు కట్టుకోవడానికి అంగీకరించినది కూడా అప్పుడే.

ఎట్టకేలకు నవంబర్‌ 9,2019‌న అయోధ్య స్థలం మీద సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అక్కడి 2.77 ఎకరాల స్థలం రామలల్లాకే చెందుతుందని తీర్పు చెప్పింది. అంటే అది రాముడి ఆస్తే. ఈ భూముని మూడుగా చీల్చాలంటూ గతంలో అలహాబాద్‌ ‌హైకోర్టు (లక్నో బెంచ్‌) ఇచ్చిన తీర్పు సరికాదని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఆ భూమి మొత్తం రామునిదేనని చెప్పింది. అయోధ్య హిందువులదేనని చెప్పడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగొయ్‌ ‌నాయకత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో ఇంకా జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌, ‌జస్టిస్‌ ఎస్‌ఏ ‌బాబ్డే, జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ఉన్నారు. 1045 పేజీల సుదీర్ఘ తీర్పులో సుప్రీంకోర్టు చాలా అంశాలు పేర్కొన్నది.

అలహాబాద్‌ ‌హైకోర్టు బెంచ్‌ ‌తీర్పు, దాని మీద అప్పీళ్ల ఆధారంగానే 2019, అక్టోబర్‌లో రోజువారీ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నలభయ్‌ ‌రోజుల పాటు విచారణ సాగింది. ఎట్టకేలకు తీర్పు వచ్చింది. పురావస్తు శాఖ తవ్వకాలలో వెలువడిన ఆధారాలను, శతాబ్దాలుగా అదే స్థలంలో హిందువులు పూజాదికాలు చేసుకుంటున్న వాస్తవాన్ని కోర్టు పరిగణనలోనికి తీసుకుంది. కట్టడం కింద వలయా కారంలో కొన్ని శిథిలాలు కనిపించినా అవి ముస్లిం కట్టడానికి సంబంధించినవి కావని కూడా కోర్టు అభిప్రాయపడింది. మరొక విషయం కూడా కోర్టు చెప్పింది. తాము ఈ కేసును సివిల్‌ ‌దావాగానే పరిగణించినట్టు చెప్పింది. సున్నీ వక్ఫ్‌బోర్డ్, ‌హిందూ సంస్థ నిర్మోహీ అఖాడా, రామలల్లా విరాజమాన్‌ అనే మూడు పక్షాల ఆస్తి వివాదంగానే దీనిని సుప్రీంకోర్టు స్వీకరించి, ఆ ప్రాతిపదికనే తీర్పు ఇచ్చింది. అలాగే ఆ భూమి మీద ఎవరికీ కూడా నేరుగా అధికారం ఇవ్వలేదు. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రిసీవర్‌ ‌ట్రస్ట్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కేంద్రం కూడా మూడు మాసాలలో ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి అప్పగించాలి. ఆ మేరకు ఏర్పడినదే తీర్థక్షేత్ర ట్రస్ట్.

అయోధ్య విముక్తి కోసం 1528 ప్రాంతం నుంచి హిందువులు చేస్తున్న పోరాటం ఫలించింది. వివాదాస్పద కట్టడం స్థానంలో భవ్య రామమందిరం నిర్మించాలన్న కోరికకు ఆ రోజు పునాది పడింది. ఇందులో సంఘ్‌ ‌పరివార్‌ ఉద్యమమే కీలకం. విశ్వహిందూ పరిషత్‌కు బీజేపీ ఇచ్చిన చేయూత, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన మద్దతు అంతిమంగా హిందువుల కలను సాకారం చేయడానికి దోహదం చేశాయి. వీరి ఆధ్వర్యంలో, సాధుసంత్‌ల పర్యవేక్షణలో మూడు దశాబ్దాలు జరిగిన పోరాటమే మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. నిజానికి రామమందిర నిర్మాణంలో చూడవలసింది కేవలం ఇటుకలు, సిమెంట్‌ ‌కాదు, స్తంభాలు, శిల్పాలు కాదు. అదొక స్వాభిమాన ప్రకటన. అంతటి మహత్కార్యం కరోనా నేపథ్యంలో కొద్దిమంది సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 5, 2020‌న శంకుస్థాపన చేశారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి హిందువులను కదిలించడం కీలక పాత్ర పోషించిన లాల్‌ ‌కృష్ణ అడ్వాణీ వృద్ధాప్యం, కరోనాల కారణంగా తన ఇంటి నుంచే శంకుస్థాపన ఉత్సవాన్ని తిలకించారు. ఆయన నిర్వహించిన అయోధ్య రథయాత్రకు సారథి నిజానికి నరేంద్ర మోదీయే. ఈ కేసును అద్భుతంగా వాదించి, 2.77 ఎకరాల స్థలం రాముని పరం చేసిన ప్రఖ్యాత న్యాయవాది పరాశరన్‌ ‌కూడా ఇంటి నుంచే ఈ శుభకార్యాన్ని వీక్షించారు. అయోధ్య శ్రీ రామ మందిరమనే భవ్య స్వప్నం సాకారం కావడానికి ఎందరో త్యాగాలు చేశారు. వారిలో కొందరు ఈ ఉత్సవాన్ని చూసి ఆనందించారు. కన్నుమూసిన వారు ఎందరో. వారి కుటుంబీకులను కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. వారందరిని ప్రధాని స్మరించారు.

175 మందిని మాత్రమే తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో 135 మంది సాధువులు, మత పెద్దలే. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సరసంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌మోదీతో పాటు వేదికను అలంకరించారు. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ‌మహంత్‌ ‌నృత్యగోపాల్‌ ‌దాస్‌ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి గుర్తుగా నలభయ్‌ ‌కిలోల స్వచ్ఛమైన వెండితో చేసిన ఇటుకను ప్రధాని భూమిలో ఉంచారు. సుప్రీంకోర్టులో రామ జన్మభూమి విషయంలో ముస్లింల తరఫున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ కూడా ఆహ్వానితులలో ఉన్నారు. ఆయన ఉత్సవానికి హాజరయ్యారు. జరిగిందంతా ఇక గతం అంటూ చక్కని వ్యాఖ్య కూడా చేశారు.

నిజమే శ్రీరామ జన్మభూమి విముక్తి ఉద్యమం మొదట ఉత్తరప్రదేశ్‌లోనే ఫైజాబాద్‌ ‌జిల్లాకు పరిమితమై ఉండవచ్చు. తరువాత అది ఆ రాష్ట్రంలో హిందువులను విశేషంగా కదిలించి ఉండవచ్చు. కానీ అనతికాలంలోనే అది ఈ దేశ హిందూ హృదయా లను కదిలించింది. ఒకే బాటలో నడిపించింది. మళ్లీ హిందువులంతా ఏకమయ్యారు. ఇది కొన్ని శతాబ్దాల తరువాత చోటు చేసుకున్న శుభ పరిణామం. దేశంలో ఒక సాంస్కృతిక ఐక్యతను, చైతన్యాన్ని అయోధ్య ఉద్యమం తట్టి లేపింది. అందుకే ఇది కేవలం మట్టి, ఇటుకలు, సిమెంట్‌ ‌కాదు. అదొక జాతీయ సమైక్యతా చిహ్నం. హిందూ ఆధ్యాత్మిక కేంద్రం. అయోధ్య ఈ దేశ రాజకీయాలను మార్చింది. సెక్యులరిజం పేరుతో హిందువులను ద్వితీయ శ్రేణిపౌరులుగా చూసే విధానం మీద అదొక తిరుగుబాటు సంకేతంగా పరిఢవిల్లింది. ముస్లింలు మతం పేరుతోనే ఏకమవుతూ ఉంటే తప్పు లేదన్నట్టు మాట్లాడేవారికి, మరుగున పడిన తమ ఆధ్యాత్మిక సంపదను అన్వేషిస్తూ హిందువులు కదలడం ఇప్పటికీ రుచించడం లేదు. అలాంటి వారికి అయోధ్య ఉద్యమం విషయంలో, మందిర నిర్మాణం విషయంలో హిందువులు చూపించిన ఐక్యత గొప్ప సమాధానంగా నిలిచిపోయింది. అయోధ్య ఇప్పుడు ఆధునిక హిందూ సంప్రదాయాలకు చిహ్నం. భారతీయుల జాతీయ స్పృహకు కేంద్ర బిందువు. ఇప్పటికీ కొందరు ముస్లింలు అయోధ్యలో రామమందిరాన్ని వ్యతిరేకిస్తూ ఉండవచ్చు. కానీ ఎందరో ముస్లింలు అయోధ్య తదితర ప్రాంతాలలో మందిర నిర్మాణాన్ని మనసారా స్వాగతించారు. ఏకాత్మత కలిగిన కొన్ని కోట్ల మంది అడుగులో అడుగు వేసి నడిస్తే ఎలాంటి విజయం లభిస్తుందో అయోధ్య ద్వారా భవిష్యత్తు తరాలకు నేటి తరం హిందువులు చెప్పగలిగారు. నిజానికి రాముడు ఈ దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక. ఆయన శబరి అనే ఆదివాసి స్త్రీ ఎంగిలి తిన్నవాడు. గుహుడిని ఆలింగనం చేసుకున్నవాడు. సుగ్రీవునితో కలసి పనిచేశాడు. ఒక పక్షికి అంత్యక్రియలు జరిపిన మహోన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. అలాంటి సమున్నత మానవ రూపంలోని ధర్మానికి నిర్మించిన మందిరమే అయోధ్యలో రాములవారి గుడి. భారతదేశంలో రాముడి గుడి లేని ఊరు ఉండదు. రామ కథను ఎన్నో దేశాలు ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాయి. అందులో చెప్పిన కుటుంబ విలువలు, మానవ సంబంధాలు ఇందుకు కారణం. రామునికి ఆలయం కట్టించడం అంటే, ఆరాధించడం అంటే అలాంటి విలువలను పూజించడమే.

‘శతాబ్దాల నుంచి జరుగుతున్న నిరీక్షణకు ఇవాళ్టితో ముగిసింది. భారత్‌ ‌తన చరిత్రలో అయోధ్యతో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించు కుంటున్నది’ అన్నారు మోదీ. దశాబ్దాలుగా గుడారాలలో ఉండిపోయిన బాలరాముడికి ఇప్పుడు భవ్య మందిరం సిద్ధం కాబోతోంది. ఇవాళ రామ జన్మభూమికి అడ్డంకులు తొలగిపోయాయి అని కూడా ప్రధాని చెప్పారు. ఈ ఉత్సవాన్ని భారతదేశంలోని రామభక్తులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, ఇతరులు కూడా వీక్షించారు. మోదీ అదే సభలో చెప్పినట్టు ఆ రోజు రామనామం కేవలం భరతఖండంలోనే కాదు, ప్రపంచమంతా మారుమోగింది.

జైశ్రీరామ్‌

(‌సమాప్తం)

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram