మెట్లు ఎందుకేస్తారు?

ఎక్కడానికంటాడు నాన్న!

దిగడానికంటోంది అమ్మ!!

*       *      *

మన ఆడవాళ్లు ఎంత ఎదిగినా వాళ్ల ఆలోచనలు మాత్రం వంటింటిని దాటి ముందుకెళ్లవు. అందుకు తిరుగులేని ఉదాహరణ మా అమ్మే!!

అమ్మ మంచిదే. కాదన్ను. కానీ ఆవిడ ఆలోచనలు మాత్రం తను గీసుకున్న గిరిని దాటి ముందుకెళ్లవు. లేకపోతే పాతరోజుల్లోనే ఉంటూ, కొత్త జీవితాన్ని రూపు దిద్దుకోవాలనడం ఏమిటి? విచిత్రం కాకపోతే? మనం జీవించాల్సింది వర్తమానంలోనా? గతంలోనా? ఎంత చెప్పినా అర్థం చేసుకోదేం! ఏమైనా అంటే గతం లేకుండా వర్తమానం, వర్తమానం లేకుండా భవిష్యత్తూ ఉండ వంటుంది. ఈ సామాజిక పరిణామక్రమానికి సంబంధించిన పాఠాలు చెప్పడానికి బాగుంటాయి గానీ, నిజ జీవితంలో ఆచరించడానికి పనికొస్తాయా?

ఈ లెక్చరర్లు ఇంట్లో పిల్లల్ని కూడా కాలేజీ విద్యార్థులనే అనుకుంటారు. ఏం చేస్తాం సర్దుకుపోవడమే. అలాగని అన్నింటికీ సర్దుకుపొమ్మంటే ఎలా?

*       *      *

కరణ్‌ ‌నన్ను ప్రేమించినమాట వాస్తవమే కావచ్చు. కానీ నేనూ అతన్ని ప్రేమించాలిగా? ఈ మాట అడగ్గానే ‘‘చరణ్‌ని మాత్రం నువ్వు ప్రేమించావా?’’ అంటూ వితండవాదం పెట్టుకుంటుంది. ఈ విషయంలో నాన్న చాలా నయం. వాదాలూ, చర్చలూ ఉండవు. ఏది మంచనిపిస్తే అది చెయ్యడమే. అందుకే చరణ్‌ని చేసుకోమంటున్నాడు నాన్న.

చరణ్‌ అన్ని విధాలా నాకు తగినవాడు. ఆ విషయాన్ని నాన్నే కాదు, అమ్మకూడా ఒప్పుకుంటుంది. కానీ పెళ్లి దగ్గరకి వచ్చేసరికి కరణే నాకు సరిపోతాడంటుంది.

*       *      *

కరణ్‌ ఓసారేం చేశాడో తెలుసా? నేను ప్రేమించలేదని తన చెయ్యి కోసుకున్నాడు. రక్తంతో నాకో ఉత్తరం కూడా రాశాడు. నిజం చెప్పద్దూ, ఆ ఉత్తరానికి నేను కూడా ఐసైపోయాను. అలాగని రక్తం చిందించిన కుర్రాళ్లందరినీ పెళ్లి చేసుకోలేం కదా! నిజానికి ఆ రక్తాన్ని ఉత్తరాలు రాయడానికి వృధా చెయ్యకుండా ఏ బ్లడ్‌ ‌బ్యాంకుకో దానం చేసుంటే ఎంత బాగుండేది? కనీసం ఒకరి ప్రాణాలైనా నిలబడేవి. ఈ ఆలోచన వచ్చాక అతను నా కంటికి ప్రేమికుడిలా కాకుండా అమాయకుడిలాగానూ, పిచ్చివాడిలాగానూ కనపడుతున్నాడు. అలాంటి అమాయకుణ్ణి కట్టుకుని జీవితాంతం అతనితో వేగడం ఎంత కష్టమో మీరే ఆలోచించండి.

*       *      *

అమ్మల ఆలోచనలు వంటింటిని దాటవని నేను ఊరికే అనడంలేదు. పుట్టినప్పటినించీ చూస్తున్నాను. అమ్మ వంట అమ్మే చేసుకుంటుంది. అమ్మ బట్టలు అమ్మే ఉతుక్కుంటుంది. అమ్మ పనులు అమ్మే చేసుకుంటుంది. అన్నీ చక్క బెట్టుకున్నాక గానీ కాలేజీకి వెళ్లదు. ఆ కాలేజీలో సామాజిక శాస్త్రాన్ని బోధించీ, బోధించీ అలిసిపోతుంది.

నిజం చెప్పొద్దూ, అమ్మ లెక్చర్‌ ‌చాలా బాగుంటుంది.

కానీ చదువుమీద శ్రద్ధలేని ఆర్టస్ ‌స్టూడెంట్సుకి ఎంత చెప్పినా ఏం లాభం? అలాంటి ఆసక్తి లేని వాళ్లకి ఇష్టం కలిగించి, వారికి అర్థమయ్యేలా చెప్పడం అంటే ఎంత కష్టమో తెలుసా? అయినా సరే, ఏమాత్రం సహనం కోల్పోకుండా పాఠాలు చెప్పి చెప్పి ఎంతో నీరసంగా ఇంటికి వచ్చేది.

కోడలు అలిసిపోయి వచ్చింది కదాని బామ్మ టీ పెట్టిచ్చేది. కానీ అమ్మ తాగేది కాదు. అయినా సరే అమ్మని చూసి బామ్మ బాధపడేది కాదు, జాలిపడేది. ఎందుకంటే అమ్మదంతా చాదస్తం.

అయినా కులాన్ని వదులుకొచ్చినదానికి ఆచారాలు మాత్రం ఎందుకంటాడు నాన్న.

అమ్మ వినేది కాదు. దాంతో క్రమంగా నాన్న పట్టించుకోవడం మానేశాడు. బామ్మా పట్టించుకోవడం మానేసింది. తాతయ్య మాత్రం అప్పుడప్పుడూ పట్టించుకుంటూ ఉంటాడు. ఇంక నేనంటారా, పట్టించుకున్నా ఒకటే! పట్టించుకోకపోయినా ఒకటే!

అమ్మ దృష్టిలో ఆచారాలనేవి క్రమ శిక్షణనీ, పద్ధతులనీ, పరిశుభ్రతనీ నేర్పడానికే!

పని మనుషులు కడిగిన గిన్నెలకి అరకొర శుభ్రతే తప్ప పూర్తి పరిశుభ్రత ఉండదంటుంది అమ్మ. అందుకే తన గిన్నెలు మరోసారి కడుక్కుంటే తప్ప అమ్మకి తృప్తి ఉండదు. అమ్మలు సంతృప్తులైనప్పుడు చేసే వంట అమృతానికి ఏమాత్రం తీసిపోదు.

బామ్మా, తాతయ్యా పెద్దవాళ్లవుతున్నకొద్దీ అందరికీ అమ్మే వండి పెట్టడం మొదలుపెట్టింది. నిజం చెప్పాలంటే, అమ్మ చేతి వంటకీ, బామ్మ వంటకీ చాలా తేడా ఉంటుంది. బామ్మ వంట కారం. అమ్మ వంట తీపు. తీపు అంటే తియ్యగా ఉండేదని కాదు. అందులో తీపిని మించిన మాధుర్యం ఏదో ఉంటుంది. ‘‘అది వచ్చింది ఆప్యాయత వల్ల’’ అంటాడు నాన్న. ‘‘కాదు, ఆచారాలవల్ల వచ్చింది’’ అంటుంది అమ్మ. అదింక ఎప్పటికీ తెమలదు. ‘‘దేనివల్ల వస్తే ఎవడిక్కావాలి గానీ ముందు నాకు వడ్డించమ్మా ఆకలేస్తోంది’’ అంటాడు తాతయ్య.

ఒక్కోసారి అమ్మ మాటల్లో కూడా నిజం ఉందనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆహార విషయంలో.

సాత్వికాహారం మనిషికిచ్చే ప్రశాంతత గొప్పది. ముఖ్యంగా కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్టిక్‌ ‌సమస్యలు రావు. చిన్నప్పటినించీ నాకు చికెన్‌ ‌తందూరీ అంటే చాలా ఇష్టం. అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ ‌చేసినప్పుడు డాక్టర్‌ ‌కొన్నాళ్లు నాన్‌వెజ్‌కి దూరంగా ఉండమన్నాడు. ఆ అవకాశాన్ని అలుసుగా చేసుకుని నాకు బలవంతంగా ఉప్పూ-కారాలు తగ్గించి వండిపెట్టడం మొదలు పెట్టిందమ్మ. చెప్పానుగా అమ్మ చేతి వంట చాలా బాగుంటుందని. ఆ రుచులు మరిగి క్రమంగా నాన్‌వెజ్‌ ‌తగ్గించేసి ప్రస్తుతం నేనూ పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాను.

మన ఆహారం కోసం ఇతర ప్రాణులని చంపాల్సి వస్తోందనే బాధ నాలో ఏమూలో ఉండేది కాబోలు. అందుకే ఈ మధ్యన మాంసాహారం హింసని ప్రేరేపిస్తుందనే భావన కలుగుతోంది. హింస ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే కదా! ప్రస్తుతం శాకాహారం ద్వారా కనీసం నా పరిధిలో అయినా హింసని ఆపగలుగుతున్నందుకు సంతోషం కూడా కలుగుతోంది. వీలైతే మీరు కూడా ప్రయత్నించి చూడండి. సంతోషించే విషయంలో పూచీ నాది.

ఇదిగో మీలా చెప్పించుకోవలసిన అవసరం కలుగుతుందనే మా బామ్మా, తాతయ్యా నేను చెప్పక ముందే మాంసాహారం మానేశారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో అందరం శాకాహారులమే.

మాకు వండి పెట్టడంతోబాటు మా ఆలనా- పాలనలు చూడ్డం కోసం అమ్మ ఉద్యోగం మానేసింది.

అప్పటికి నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. కాబట్టి అమ్మ జీతాన్ని నా జీతం సరిపెట్టింది. జీవితం లెక్కల్లో ఏ తేడాలూ రాలేదు. కాబట్టి నాన్నకూడా పెద్దగా పట్టించుకోలేదు.

*       *      *

అమ్మంటే సామాన్యురాలు కాదు. ఆవిడకి మెట్లెక్కడం తెలుసు. ఎక్కించడం కూడా తెలుసు. నాన్నని మొదటి మెట్టు ఎక్కించింది అమ్మే!

నాన్నని ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. చివరికి మా నాన్న గురించి తన కుటుంబాన్నీ, కులాన్నీ కూడా వదులుకుని వచ్చేసింది. అందుకే మా ఇంట్లో అందరూ అమ్మని ఎంతో గొప్పగా చూస్తూంటారు. మామ్మకీ, తాతయ్యకీ అమ్మని పొగడకుండా ముద్ద కూడా దిగదు. ఇంక నాన్న విషయానికొస్తే అమ్మని ఎదురుగుండా పొగడడన్నమాటేగానీ వెనక మాత్రం అందరి దగ్గరా పొగుడుతూనే ఉంటాడు. నిన్న మీ దగ్గర కూడా అమ్మని పొగడ్తలతో ముంచెత్తాడట కదా, మీరు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నారా?

ఎవరు పొగిడినా, పొగడకపోయినా మా అమ్మ చాలా గొప్పది. ఆ గొప్ప దనాన్ని సాధించడం అందరివల్లా కాదు.

అమ్మ గొప్పదికదా అని అమ్మ చెప్పే ప్రతి మాటా గొప్పదే కావాలనే సిద్ధాంతం ఏమీ లేదు కదా! అమ్మ గొప్పదనానికి గుర్తింపు ఎవరివల్ల వచ్చింది? దాన్ని గుర్తించిన వాళ్లవల్ల వచ్చింది. ఆ విషయం అమ్మకి అర్థమైతే ఎంత బాగుంటుంది!

*       *      *

మనిషి ఎదగాలంటే ఏం చెయ్యాలి?

ఓ మెట్టు పైకెక్కి తనకంటే ఎత్తున ఉండేవారి సరసన చోటు సంపాదించుకోవాలి. వీలైతే ఇంకో మెట్టు పైకెక్కి అంతకంటే ఎత్తున ఉండేవాళ్లని కూడా దాటి ఎదగాలి. నాన్న ఈ రోజు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఏమిటి? ఎదగడానికి ప్రయత్నించడం. ఎదిగాక కూడా ప్రయత్నాన్ని కొనసా గించడం. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ చెప్పినట్టు విన్నాడు. సమాజంలో అమ్మ గౌరవాన్ని పెంచడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నా పెళ్లి విషయంలో కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ విషయం అమ్మకి ఎందుకు అర్థం కావడం లేదు?

ఏ విషయమైనా అర్థం కాకపోవడానికి కారణం, కేవలం ప్రయత్నలోపమే అంటాడు నాన్న. అమ్మని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.

ఒక విధంగా చూస్తే అమ్మ చెప్పేదీ నిజమే. చరణ్‌ ‌కంటే కరణ్‌ అం‌దగాడు. మృదుస్వభావి. ఎంతమాత్రం తొణకడు. బెణకడు. తొందరపాటు అస్సలు లేదు. చూడ్డానికి మాడ్రన్‌ ‌డ్రెస్‌ ‌వేసుకున్న తాతల కాలంనాటి హీరోలా ఉంటాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా వ్యక్తం చేశాడు కూడా. రుధిరాక్షరాల ప్రేమలేఖే కాదు, ఓసారి వాళ్లమ్మని మా అమ్మ దగ్గరకి రాయబారం కూడా పంపాడు. అమ్మ నాకు మాటమాత్రం కూడా చెప్పకుండా నన్ను ఒప్పించే భారం నెత్తిన వేసుకుంది.

అంతటి అందగాడూ, అందమైన మనసున్న వాడూ లభించడం నా అదృష్ట మంది. చిన్నప్పటినించీ తెలిసిన కుర్రాడు. మన మాట కాదనడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అంది. అంతేనా, అలాంటివాడిని చేసుకుంటే నేను కూడా అమ్మలాగే సంతోషంగా ఉంటానంటూ మొదలెట్టింది.

అమ్మ సంతోషం నాకు తెలియనిదా? నాన్నతో ఎప్పుడూ విభేదిస్తూనే ఉంటుంది. నాన్న ఇంకా, ఇంకా పెరగాలంటాడు. అమ్మ ‘‘పెరుగుట విరుగుట కొరకే’’ అంటుంది. నాన్న ఇంకా, ఇంకా సంపాయించా లంటాడు. అమ్మ అవసరానికి మించి సంపాదించడం మంచిది కాదంటుంది. దాంతో అమ్మ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకమ్మా అంతగా మనసు బాధపెట్టుకోవడం? ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో అయినా సర్దుకుపోవచ్చుకదా అంటారు తాతగారు. కానీ అమ్మ ఒప్పుకోదు.పోరాటం చేయడంలో ఉండే సంతృప్తి రాజీపడడంలో ఉండ దంటుంది. కొంపతీసి నేను కూడా నా సంతోషాన్ని ఆ పోరాటాల్లోంచే అంటే మనుగడ కోసం పోరాటం అనా?! పొందాలనేది అమ్మ అభిప్రాయమేమో! హారీ భగవంతుడా! నావల్ల కాదు!!

*       *      *

అయినా నాకు తెలియక అడుగుతానూ, కేవలం అందం, వినయ విధేయతలుంటే చాలా?

పెద్దలని గౌరవించడం మంచిదే. అలాగని గౌరవం పెంచే పెద్దరికాన్ని తోసిరాజనడం కరెక్ట్ ‌కాదు కదా!

జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించాలనే పట్టుదల, దీక్ష ఉండాలి. హేతువాద దృక్పథంతో ఆలోచించే నేర్పుండాలి. ఆత్మస్యైర్థంతో ధైర్యంగా అడుగులు వేయగలిగే కౌశలం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆలోచన ఉండితీరాలి. అవన్నీ చరణ్‌లో ఉన్నాయి. కరణ్‌తో పోలిస్తే రెండాకుల అందం తక్కువన్నమాటేగానీ అతను నాకు తగిన జోడీనే.

బామ్మేం చెబుతుందంటే, భార్యకంటే భర్త ఎక్కువ అందగాడైతే వాడిని కాపలా కాసుకోవడమే భార్యకి అన్నింటికంటే ముఖ్యమైన సమస్యగా మారిపోతుం దని. అదావిడ స్వానుభవం. మా తాతయ్య అందగాడని పేరులెండి!!

అమ్మా నాన్నల విషయానికొస్తే, నాన్న కంటే అమ్మ చాలా అందంగా ఉంటుంది. అందం విషయంలో నాది మా నాన్న పోలిక.

నాన్నలాగా ఆలోచించినప్పుడు మనిషి ఎదగడానికి కేవలం డబ్బుంటే చాలదు. డబ్బుతో బాటు సామాజికస్థాయి కూడా ఉండాలి. అది అందరికీ ఉండదు. చరణ్‌ ‌తండ్రి ఎమ్మెల్యే. అందుకు కారణం సమాజంలో అతని కులానికి ఉండే పట్టు. దాన్ని పెంచుకున్నకొద్దీ అతను ఉన్నత శిఖరాలని చేరవచ్చు. అదీ కాకుండా వాళ్లు మాకంటే ఉన్నత కులస్థులు. మా కులం.., అంటే మా అమ్మ కులం కాదు, నాన్న కులం!

అమ్మని పెళ్లి చేసుకోవడంద్వారా మా నాన్న సమాజం దృష్టిలో ఉత్తముడయ్యాడు. ఇప్పుడు నా పెళ్లి చేసి ఉన్నతుడౌతాడు.

ఇంక నా విషయానికొస్తే అటు చరణ్‌ని చేసుకున్నా ఇటు కరణ్‌ని చేసుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవర్ని చేసుకున్నా నాది కులాంతర వివాహమే అవుతుంది. అలాగని కేవలం కరణ్‌ ‌లాంటి పప్పుసుద్దకోసం నాలుగు మెట్లు దిగి వెళ్లి అతనితో జీవితాంతం వేగలేం కదా! నేను చరణ్‌ని చేసుకుంటే ఓ మెట్టు పైకెక్కుతాను. అందుకే నాన్న చరణ్‌ ‌సంబంధానికి ఓకే చెబుతాననగానే నేనూ ఓకే అన్నాను.

అదిగో అప్పట్నించీ మొదలైంది అమ్మలో అసంతృప్తి. నేను ఒక మెట్టు పైకెక్కినందుకు కాదు. నాలుగు మెట్లు కిందకి దిగనందుకు.

*       *      *

‘‘పైకొచ్చినవాడెప్పుడూ తనకంటే కింద ఉన్నవాడికి చెయ్యందించాలి’’ అంటుందమ్మ.

‘‘కిందుండేవాళ్లకి చెయ్యందిస్తే వాళ్లు మనల్ని కూడా కిందకి లాగేస్తారు’’ అంటాడు నాన్న. నాన్న విజయ రహస్యం అదే. ఎప్పుడూ ఎదిగే ప్రయత్నం చెయ్యడం. ఇది నా మాట కాదు. నాన్నని దగ్గరనించీ పరిశీలించిన ప్రతి ఒక్కరిమాటా ఇదే. ఇప్పుడు మీకూ మా నాన్నే సరనిపిస్తోంది కదూ?

ఏంటో.., ఈ అమ్మలెప్పుడూ ఇంతే. అందర్నీ శాకాహారులుగా మార్చినంత సులభంగానే సాత్వికులుగా మార్చెయ్యాలని ప్రయత్నిస్తూంటారు.

*       *      *

ఏమిటో ఈ మెట్లు?

ఎక్కడానికో దిగడానికో అర్థం కావట్లేదు!

– జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE