– కలవల గిరిజారాణి

సియాటిల్‌.. ‌టకోమా విమానాశ్రయం.

అరైవల్‌ ‌లాంజ్‌లో స్టార్‌ ‌బక్స్ ‌కాఫీ తాగుతూ,

కాసేపట్లో లాండ్‌ అవబోయే విమానం స్టేటస్‌ ‌ఫోన్‌లో పదే పదే చూస్తూనే ఉన్నాను. ఇంకా రెండుగంటలు చూపిస్తోంది. ఆత్రుత ఆపుకోలేక నేను చాలా ముందుగానే వచ్చేశాను. నేను రిసీవ్‌ ‌చేసుకునే వ్యక్తి కోసం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్లి ఆకాశంలోనే స్వాగతం పలకాలనిపిస్తోంది.

చేతిలో ఫ్లవర్‌బొకేని ఆప్యాయంగా తడుముతున్నాను. ఆ స్పర్శ.. ఎన్నేళ్ల నుండో నేను ఎదురుచూస్తున్న అమ్మ స్పర్శలాగా అనిపించింది. ఇంకెంతసేపు ఒక్క అరగంటలో అదే అమ్మ గాఢపరిష్వంగంలో ఆ మధురానుభూతిని పొందబోతున్నాను… ఆ తలపే ఎంత హాయిగా ఉందో!

సోఫాలో తల వెనక్కివాల్చి.. అమ్మ తలపులలోకి జారుకున్నాను.

 * * *

అప్పుడు ఇంటర్‌ ‌ఫస్టియర్‌ ‌చదువుతున్నాను.. ఆ రోజు బాగా గుర్తు నాకు. మెడలో పూలదండలతో, నాన్న చేయి పట్టుకుని తను… వాకిట్లో పనమ్మాయి రాజీ హారతి ఇచ్చి దిష్టి తీసాక కుడికాలు లోపలపెట్టి దేవుని గదిలో దీపం వెలిగించి, హాల్లో ఉన్న మా అమ్మ నిలువెత్తు ఫోటో ముందు మౌనంగా నిలబడ్డారు ఇద్దరూ.

తను ఆంటీ. భారతి ఆంటీ. మరణించిన నా కన్నతల్లి సుధకి ప్రాణ స్నేహితురాలు. అమెరికాలో ఉండేది. అప్పుడప్పుడు అమ్మకి చేసే వీడియో కాల్స్‌లో అమ్మ వెనకాలే ఉండి నేను చూస్తూ ఉండేదాన్ని. ‘దీపూ!’ అని నన్ను పలకరిస్తే సిగ్గుతో అమ్మ చీరకొంగులో మొహం దాచుకునేదాన్ని… నా పుట్టిన రోజులకి అమెరికా నుంచి బహుమతులు పంపేది. అప్పుడు భారతి ఆంటీ అంటే ఇష్టమే.

కానీ, ఇప్పుడు ఇలా మా అమ్మ స్థానంలోకి, నాన్నకి భార్యగా, ఈ ఇంటి యజమానురాలిగా ఈ రోజు వచ్చింది. ఇది నాకెంతమాత్రం ఇష్టం లేదు. ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న నన్ను ఒక్కమాట కూడా అడగలేదు. నా అనుమతి తీసుకోలేదు. భార్యపోయిన మూడునెలలకే, మరో భార్య కావలసివచ్చిందీయనకి. అమ్మ మీద చూపించిన ప్రేమ, అమ్మ చనిపోగానే మాయమైపోయిందా? కోపం అణుచుకోలేకపోతున్నాను.

‘‘దీపూ! ఇలారా తల్లీ! నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకు ఇష్టమైన అరిటాకుపచ్చ కలర్‌ ‌డ్రస్‌. ఇదిగో ఈ పగడాల సెట్‌.’’ అం‌ది భారతి ఆంటీ.

బహుమతులిచ్చి నన్ను తనబుట్టలో వేద్దామను కుంటోంది నంగనాచి. కోపం తమాయించుకోలేక, తనకేం జవాబు ఇవ్వకుండా టీపయ్‌ ‌మీదున్న గాజు ఫ్లవర్‌వాజ్‌ని బలంగా నేలకేసి కొట్టి, రివ్వున నా రూమ్‌లోకి వెళ్లిపోయాను.

నా చేష్టలకి నాన్న ఏదో సంజాయిషీ ఇస్తున్నట్టున్నారు.

‘‘ఫ•ర్వాలేదు శేఖర్‌. ‌దీపూ కోపానికి, ఆవేశానికి అర్థం ఉంది. సుధ స్థానంలో నన్ను ఊహించు కోలేకపోతోంది. నాలుగు రోజులుపోతే నాకు చేరిక అవుతుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది. వర్రీ అవకు..’’ భారతి ఆంటీ మాటలు వినపడ్డాయి.

కసితో పళ్లు నూరుకున్నాను.

 ‘నేను చచ్చినా నీకు చేరువ అవను. ఈ ఇంట్లో నువ్వు నాకు శత్రువువి. డాక్టర్‌గా నాన్న బిజీగా ఉండి నన్ను పట్టించుకోలేకపోతున్నా, ఫర్వాలేదు నా గురించి నేను చూసుకోగలను. నీ అవసరం నాకేమీ లేదు’ అనుకుంటూ, ‘అమ్మా! నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు? నువ్వు లేకపోబట్టే కదా ఆంటీ నాన్న పక్కన నీ స్థానం ఆక్రమించింది.’ అంటూ చనిపోయిన అమ్మని తలచుకుంటూ రోదిస్తూ ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రపోయాను.

మూసుకున్న నా కళ్ల మీదకి ఒక్కసారిగా వెలుతురు పడేసరికి మెలకువ వచ్చేసింది. కిటికీ కర్టెన్‌ ‌పక్కకి జరుపుతున్న భారతి ఆంటీ నన్ను చూసి చిరునవ్వుతో దగ్గరకి వచ్చి, నా తల నిమిరి, ‘‘గుడ్‌ ‌మార్నింగ్‌ ‌దీపూ! స్నానం చేసి కిందకిరా. మీ నాన్న నీ కోసం వెయిట్‌ ‌చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ‌చేద్దురు గాని. కాలేజ్‌ ‌టైము అవుతోంది నీకు.’’ ఆ చేయిని విసురుగా తోసేసి, మంచం దిగి బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాను.

డైనింగ్‌ ‌టేబుల్‌ ‌దగ్గర రాజీ పెట్టిన టిఫిన్‌ ‌తినేసి, నాన్న ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్లిపోయాను.

కాలేజీలో మూడీగా కూర్చున్న నన్ను చూసి, నా క్లోజ్‌ ‌ఫ్రెండ్స్ ‌విజ్జీ, బబ్లూ ‘‘దీపూ! నిజమేనా! మీ డాడీ ఇంకో పెళ్లి చేసుకున్నారట కదా? ఇలా వచ్చిన కొత్త మమ్మీలు పరమ గయ్యాళిగా ఉంటారట. మా అమ్మనాన్న అనుకుంటున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.’’ అంటూ నాలో అగ్నికి ఆజ్యం పోసారు.

‘‘ఈరోజు దీపూ మూడ్‌ ‌బాగాలేదు. క్లాస్‌ ‌డుమ్మా కొట్టి సినిమాకి పోదాం పదండి’’ బబ్లూ అనేసరికి నాకూ కొంత రిలీఫ్‌ ‌కావాలనిపించి లేచాను. సినిమా అయ్యాక అక్కడ నుంచి హోటల్‌కి వెళ్లి తినేసాక, ఇంటి దగ్గర డ్రాప్‌ ‌చేసాడు.

హైస్కూల్‌లో చదువుకున్నప్పటి నుండి కూడా మేము ముగ్గురం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. అమ్మనాన్న ఎప్పుడూ అడిగినంత డబ్బు పాకెట్‌ ‌మనీగా ఇవ్వడంతో విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ ఉండేదాన్ని. దాంతోనే వీళ్ల సరదాలు కూడా తీరుతూ ఉండడంతో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అది చాలా గొప్పగా ఫీలయేదాన్ని.

నా కోసమే కాబోలు గేటు దగ్గర నిలబడివున్న భారతి ఆంటీని నిర్లక్ష్యంగా చూస్తూ, లోపలకి వెళ్లిపోయాను. నా ఆలస్యానికి కారణం, బబ్లూ గురించి అడుగుతుందేమో అనుకున్నా. అడిగితే, ‘నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నువ్వెవరు నన్ను అడగడానికి.’ అనే సమాధానం రెడీగా ఉంచుకున్నాను. కానీ ఒక్క మాట కూడా అడగలేదు. పైగా, ‘‘గులాబ్‌జామూన్‌ ‌చేసాను దీపూ! త్వరగా ఫ్రెష్‌ అయి రా.’’ అనేసరికి  ఏదైనా అడిగితే గొడవ పెట్టుకుందామని చూస్తే, ఇలా శాంతంగా ఉండడం నాకు కొరుకుడు పడలేదు.

‘‘నాకు ఆకలి లేదు. నేను బయట తినేసాను. డిన్నర్‌ ‌కూడా అక్కర్లేదు. నన్ను పిలవకు’’ అంటూ రూమ్‌లోకి వెళ్లిపోయాను.

మర్నాడు నాన్నని ఐదువేలు కావాలని అడిగాను. ఎప్పుడూ ఎందుకు అని అడగకుండానే ఎంత కావాలంటే అంత ఇచ్చే నాన్న ఆరోజు మాత్రం, ‘‘ఇప్పుడు అంత డబ్బు ఎందుకు? ఏం కొనాలి?’’ అని అడిగేసరికి, ‘‘విజ్జీ బర్త్ ‌డే.. నాన్నా గిఫ్ట్ ‌కొనాలి’’ అన్నాను. ‘‘అమ్మతో మాట్లాడు. తను చెపుతుంది నీకు’’ అంటూనే చెబుతున్నది వినిపించుకోకుండా లేచి వెళ్లిపోయారు.

 కోపం పట్టలేక ఆ తర్వాత నానా రచ్చ చేసాను.. ఆంటీని అనరాని మాటలు అన్నాను. తనేమాత్రం కోపం తెచ్చుకోకుండా, ‘‘కూల్‌. ‌దీపూ. ఇదంతా నీ మంచి కోసమే చేసాను. ఇకనుంచీ నీకు పాకెట్‌ ‌మనీగా ఏదీ ఇవ్వదలచుకోలేదు. నీకు ఏం కొనుక్కోవాలన్నా నాకు చెప్పు. నేను తీసుకుంటాను.

నెలకి రెండుసార్లు మనం ముగ్గురం కలిసి సినిమాకో, హోటల్‌కో వెళదాం. నీకు డబ్బు విలువ తెలీడం లేదు. పైగా నీ స్నేహితుల ఎంపిక సరైనది కాదు.

వాళ్లు నీ మీద ప్రేమతో కాదు. నువ్వు వాళ్లకి ఖర్చు పెడుతున్న సరదాలకోసం నీ వెంట తిరుగుతున్నారు. అది నీకు తెలీడం లేదమ్మా!’’ అంటూ నా స్వేచ్ఛకి బ్రేక్‌ ‌వేసింది.

నేను అలిగి అన్నం మానేసినా కూడా నాన్న కరగలేదు. నాన్నని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుందనే అభిప్రాయంతో, తన మీద నాకు అంతకంతకు కక్ష పెరిగిపోసాగింది. ఏం చేయలేకపోతున్నాను.

నా దగ్గర వాళ్ల సరదాలు తీరకపోవడంతో విజ్జీ, బబ్లూ నన్ను తప్పించుకుని తిరగడం మొదలెట్టారు. ఎక్కడికి వెళ్లినా వాళ్లిద్దరే వెళ్లేవారు. నన్ను పిలవడం మానేసారు. దీనికంతటికీ కారణం ఆంటీయే. నాకు చాలా ఉక్రోషంగా ఉండేది. ఇదిలా ఉండగా, ఒకరోజు ఉదయమే నా క్లాస్‌మేట్‌ ‌రూప ఫోన్‌ ‌చేసింది. ‘‘బబ్లూ మూలంగా విజ్జీకి ప్రెగ్నెన్సీ వచ్చిందనీ, తను సూసైడ్‌ ‌చేసుకోబోయిందనీ. విజ్జీ పేరెంట్స్ ‌బబ్లూ మీద పోలీసు రిపోర్టు ఇచ్చారు’’ అనీ చెప్పింది. షాక్‌ అయ్యాను నేను.

బబ్లూతో స్నేహం ఇలా దారి తీసిందా? అమ్మో. విజ్జీ ప్లేస్‌లో నేనుంటేనో. ఆ ఊహకే  ఒళ్లు జలదరించింది. మనసులో భారతీ ఆంటీ మీద మొదటిసారిగా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏదైనా నాకు ఇటువంటి స్నేహం దూరం అవడానికి కారణమయిందని మాత్రమే. అమ్మస్థానం ఆక్రమించుకున్న కోపం అలాగే ఉంది. నన్ను, తన గ్రిప్‌లో పెట్టేసుకుంది. ఎదురుతిరిగి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను. అయితే ఎక్కడా నాకు లోటు లేకుండానే, నాకెటువంటి ఇబ్బంది కలగకుండానే చూసుకునేది. నా మనసుని ఎరిగే తాను ప్రవర్తించేది. కానీ నా మనసుకి మాత్రం దగ్గర కాలేకపోయింది.

ఇలా మా ఇద్దరి మధ్య ఏమాత్రం అనుబంధం పెరగకుండానే కొన్ని సంవత్సరాల కాలం గడిచి పోయింది. నేను నా చదువు పూర్తి అయి,  క్యాంపస్‌ ‌సెలక్షన్‌లలో మైక్రోసాఫ్ట్ ‌కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవడం, ఏడాది తర్వాత కంపెనీ వాళ్లు ఆరునెలల ప్రాజెక్టు పనిమీద నన్ను సియాటిల్‌కి పంపడానికి నిర్ణయం తీసుకోవడంతో, ఆంటీ అంతకు ముందు సియాటిల్‌లోనే ఉద్యోగం చేసేది కాబట్టి, అక్కడ నాకు తన ఫ్రెండ్‌ ఇం‌ట్లోనే వసతి ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లినా కూడా తన ఆంక్షలు ఏంటి? అక్కడ కూడా నాకు కేర్‌ ‌టేకర్‌లని పెడుతోంది.  ‘నేను అక్కడ ఉండను. వేరేచోట ఉంటాను.’ అన్నా కూడా వీల్లేదని ఖరాఖండిగా చెప్పింది.

 నాన్న కూడా ‘‘ఇదే మొదటిసారిగా అమెరికా వెడుతున్నావు. అక్కడ తెలిసినవారి హెల్ప్ అవసరం కదా! ఆరునెలలేగా. అమ్మ చెప్పిన ఫ్రెండ్‌ ఇం‌ట్లోనే ఉండు. అన్నీ వారు చూసుకుంటారు.’’ అనేసరికి ‘సరే’ అనక తప్పలేదు.

ఎయిర్‌పోర్ట్‌లో నన్ను రిసీవ్‌ ‌చేసుకోవడానికి సుమారు ఆంటీ వయసే ఉంటుంది. ఆంటీ ఫ్రెండ్‌ ‌మిస్‌ ‌మాధ్యూ. గులాబీల బొకేతో నాకు స్వాగతం పలికారు. ఇంటికి వెళ్లేటపుడు కారులో ఆంటీ గురించి చెబుతూ ‘‘తనకి చాలా మంచి స్నేహితు రాలనీ, మంచివ్యక్తి అనీ, ఎవరికి సహాయం కావాలన్నా మంచి మనసుతో చేసేదనీ, తను నిలవనీడ లేని సమయంలో తనని ఆదుకుని, తన జీవనోపాధికి ఓ మార్గం చూపించిన దేవత భారతి’’ అని పొగడడం నాకు చేదుమాత్ర మింగినట్టు అనిపించింది.

‘‘ఇప్పుడు ఇండియా నుంచి తన స్నేహితురాలి కూతురు వస్తోందీ. తనకి ఉండడానికి వసతి ఇవ్వమని ఫోన్‌ ‌చేయగానే. తన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని సంతోష పడ్డాను.’’ అని అంది మాధ్యూ.

‘‘కెరీర్‌లో స్థిరపడుతున్న సమయంలో, అప్పటికే ఎదిగిన కూతురు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం, మంచి పొజిషన్‌లో ఉన్న తాను జాబ్‌ ‌రిజైన్‌ ‌చేసి ఇండియా వెళ్లిందనీ, ఇప్పుడు ఉద్యోగం చేస్తూంటే కనుక, చాలా ఉన్నతస్థానంలో ఉండేద’’ని చెప్పింది. ఆ మాటలని బట్టి ఆంటీ ఇండియాకి వెళ్లడానికి గల కారణం, తను పెళ్లి చేసుకున్నది మా డాడీనే అనీ అర్థమయింది. అయితే నేను ఎవరినో?!

ఆంటీ చేసుకున్న పెళ్లి ద్వారా ఏర్పడిన నాతో బంధుత్వం బహుశా మిస్‌ ‌మాధ్యూకి చెప్పలేదు కాబోలు అనిపించింది. నేను కూడా చెప్పకూడదనే నిర్ణయించుకున్నాను.

అది మరీ పెద్ద ఇల్లు కాదు కానీ రెండు బెడ్‌రూమ్‌లూ, హాలూ, కిచెన్‌ ఉన్న ఒక ప్లాట్‌. అన్నీ అనువుగా చక్కగా అమర్చుకుంది మాధ్యూ. భారతీ ఆంటీ ఉన్న రోజులలో ఇద్దరు కలిసి ఉండేవారట. ఇప్పుడు ఈవిడ ఒకరే ఉంటున్నారు. ఆంటీ వాడుకున్న రూమ్‌లో నాకు వసతి ఏర్పాటు చేసింది. తనని మాధ్యూ అనే పిలవమని చెప్పింది. స్నానం చేసి ఫ్రెష్‌ అయి రాగానే, వేడిగా ఇడ్లీలు, చట్నీ ఉన్న ప్లేట్‌ అం‌దించింది. ఆ టిఫిన్‌ ‌చూసి నేను ఆశ్చర్య పోతోంటే, ‘‘ఇవన్నీ భారతి దగ్గర నేర్చుకున్నాను. అంతేకాదు, కొంచెం తెలుగుకూడా వచ్చు నాకు.’’ అంటూ అమెరికన్‌ ఇం‌గ్ల్లిషు యాసలో ‘ఇడిలీ బావుందా?’ అని అడిగేసరికి నాకు నవ్వు ఆగలేదు.

మర్నాడు తన కారులో నన్ను ఆఫీసుకి తీసుకువెళ్లి, ‘‘అయిపోగానే ఫోన్‌ ‌చేస్తే వచ్చి పికప్‌ ‌చేసుకుంటాను. కాస్త అలవాటయితే ఆఫీసు బస్సులో వెళ్లవచ్చు’’ అంటూ దింపి వెళ్లింది. నెమ్మదిగా ఆఫీసు పనికీ, అమెరికా వాతావరణానికీ అలవాటు పడ్డాను. మాధ్యూకి ఇంటి పనులు, వంటపనులలో చేతనైన సాయం చేస్తూండేదాన్ని. ఆంటీ ఫోన్‌చేసి నా యోగక్షేమం అడిగినప్పుడల్లా ముక్తసరిగా మాట్లాడే దాన్ని. ఆరునెలలు అనుకున్న నా ప్రాజెక్టు పని మరో ఏడాది కాలం పొడిగించారు.

మాధ్యూ, నేనూ మాట్లాడుకునే మాటల మధ్యలో తను తరచు ఆంటీ ప్రసక్తి తీసుకువచ్చేది నాకు ఆ మాటలు ఇష్టంలేక దాటేసేదాన్ని.

ఒకరోజు మాధ్యూ దూరపు బంధువు ఎవరో చనిపోతే, వేరే ఊరికి వెళ్లింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే. త్వరగా భోంచేసి పడక ఎక్కేసాను. కానీ, ఎంతకీ నిద్ర పట్టకపోయేసరికి, ఏదైనా బుక్‌ ‌చదువుదామని బుక్‌షెల్ఫ్ ‌తలుపు తీసాను. తెలుగు, ఇంగ్లిషు నవలలు వరుసలో నీట్‌గా సర్దిఉన్నాయి. ఆ బుక్‌ర్యాక్‌ ‌భారతి ఆంటీదే అని మాధ్యూ చెప్పింది. ఆంటీ వస్తువులు చాలానే వదిలేసిందట ఇక్కడ. తెలుగు నవలల్లో నుంచి చేతికి వచ్చిన ఓ బుక్‌ ‌తీసుకుని పేజీలు తిప్పుతూ హాల్లోకి వచ్చాను. ఆ పుస్తకం మధ్యలో నుండి కొన్ని ఫొటోలు మరేదో కాగితం జారి కిందపడ్డాయి. ‘అరే.. ఏమిటివి?’ అనుకుంటూ వంగాను తీద్దామని. ఆశ్చర్యం. అవి నా ఫొటోలే. చిన్నప్పుడు తీసిన ఫొటోల నుంచి, అమ్మ చనిపోయే ముందు దాకా తీసిన ఫోటోలు రకరకాల ఫోజులతో ఉన్నాయి. ఇవేంటీ ఇక్కడ ఉన్నాయీ? బహుశా అమ్మ భారతి ఆంటీకి పంపి ఉంటుంది అనుకుంటూ, కిందపడిన పేపర్‌ ‌కూడా తీసాను. అది ఏదో ఉత్తరం అనుకుంటాను. ఒకరి ఉత్తరాలు చదవడం సభ్యత కాదనిపించి తిరిగి ఆ బుక్‌లో పెట్టేయబోతూ ఆ చేతివ్రాత చూసి అరే! ఇది అమ్మ దస్తూరీ నాకు బాగా గుర్తు. అమ్మ ఏదో లెటర్‌ ‌రాసినట్టుంది. సభ్యత మాట పక్కన పెట్టి అందులో ఏం రాసిందో అనే కుతూహలంతో అక్కడే నేల మీద కూర్చుండిపోయి చదవడం మొదలెట్టాను.

 ‘‘ప్రియ నెచ్చెలి భారతికి,

ఎందుకో నీకు ఉత్తరమే వ్రాయాలనిపించింది.. ఇలా అక్షరాల రూపంలో నీ కనులలోనూ, మనసులోనూ స్థిరంగా ఉండిపోవాలని. ఎన్నాళ్లు అయిందే మనం లెటర్స్ ‌రాసుకునీ. ఫోన్‌లు వచ్చాక మాట్లాడుకుంటున్నాం కానీ, ఏదో అడ్డుగోడ కట్టినట్లే ఉంటుంది ఆ మాటల మధ్య. ఇప్పుడు నేను రాయబోయే సంగతులు చెప్పడానికి నాకు గొంతు పెగలదు. వీడియోకాల్‌ ‌చేసినా నీ కళ్లలోకి చూస్తూ మాట్లాడలేను. అందుకే ఇక్కడ నా మనసు విప్పుతు న్నాను. ముందుగానే నిన్నో కోరిక కోరుతున్నాను. కాదనకు. కాదంటే నా మీద ఒట్టే గుర్తుంచుకో.

త్యాగమూర్తి అనే బిరుదు నీకు సరిగ్గా సరిపోతుంది. నాకోసం నీ జీవితం త్యాగం చేసావు. నువ్వు కోరుకున్న శేఖర్‌ని నేను ఇష్టపడుతున్న సంగతి తెలుసుకుని శేఖర్‌ని ఒప్పించి తనని నాకు జతచేసావు. మీరిద్దరూ ఒకటి కావాలనుకుని చేసుకున్న బాసలు నాకు తెలీకుండా చేసి, ఒంటరిగా మిగిలిపోయావు. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి, నిన్ను అన్యాయం చేసానని ఎంతబాధ పడ్డానో. నా మనసుకే తెలుసు. మనసుపడ్డ మిమ్మల్ని ఇద్దరిని మళ్లీ ఒకటి చేయడం కోసమే కాబోలు దేవుడు నాకో దారి చూపించాడు. త్వరలోనే తన దగ్గరకు వచ్చేయ మన్నాడు. లంగ్‌ ‌కాన్సర్‌. అన్ని స్జేజ్‌లు దాటిపోగా చివరి స్టేజ్‌కి వచ్చేసాను. అందుకే నిన్ను నా కోరిక తీర్చమని అడుగుతున్నాను. కాదనకు. శేఖర్‌తో పాటు నీకు దీపూ బాధ్యత కూడా అప్పచెపుతున్నాను. దానికి మా ఇద్దరి గారాబం కొంత మొండితనాన్ని ఇచ్చింది. ఆడింది ఆట పాడింది పాట అయింది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్నేహాలు పెరిగిపోతున్నాయి. కాదంటే బాధ పడుతుందని అడిగినంత డబ్బులు ఇచ్చేస్తున్నాం. దాంతో డబ్బు విలువ కూడా తెలీడం లేదు. నా ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోవడంతో దీపూ మీద ఎక్కువ కాన్సంట్రేషన్‌ ‌చేయలేకపోయాం నేను, శేఖర్‌. ఈ ‌బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నీ పెంపకంలో దీపు క్రమశిక్షణతో పెరగగలదని నాకు పూర్తి నమ్మకం ఉంది. అది మంచి చదువు, సంస్కారంతో పాటుగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా అభిలాష. దీపూకి అమ్మస్థానంలోకి నా తరువాత నిన్ను తీసుకురావాలని శేఖర్‌ ‌దగ్గర మాట తీసుకున్నాను. శేఖర్‌ ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఒప్పుకుని తీరాలి. నా వలన నువ్వు కోల్పోయిన జీవితం తిరిగి నావల్లే పొందాలి. ఇదే నా ఆఖరి కోరిక. నువ్వు నన్ను చూడడానికి వచ్చేసరికే నేను వెళ్లి పోయుంటాను. రోజుల్లోకి వచ్చేసాను. ఇదే నేను నీకు చెప్పదలచుకున్న ఆఖరిమాటలు. ఉంటాను ఇక.

 ఎప్పటికీ నీ ప్రియ నెచ్చెలి.. నీ సుధ.’’

ఉత్తరం ఆసాంతం చదివాక. నా కంటివెంట ధారాపాతంగా ఆశ్రువులు తెలీకుండానే కారసాగాయి.

ఒకప్పుడు స్నేహితురాలి కోసం తన ప్రేమని త్యాగం చేసి,  ఇప్పుడు అదే నెచ్చెలి ఆఖరి కోరిక మేర నాన్నని పెళ్లి చేసుకుని, అది కూడా కేవలం నా కోసం, నా ఉన్నతి కోసం నేను పెడతోవ పడకుండా నా బాధ్యత తీసుకున్న భారతి ఆంటీ. తన జీవితంలో తన ఎదుగుదలని కాదనుకుని, నా ఎదుగదల కోసం నన్నింత స్థాయికి తీసుకు రావడానికి నా వెన్నంటి ఉండి, నేను ఎంత ఈసడించుకున్నా, ఎదిరించి మాట్లాడినా, అమ్మలా కాకపోయినా, ఒక మనిషిగా కూడా చూడక పోయినా తను మాత్రం నన్నెంతో ప్రేమించి, అభిమానిస్తే…

 భగవంతుడా!  నేను ఎంత తప్పు చేసాను. ఆంటీని. కాదు కాదు, అమ్మే. నా కన్నతల్లి తాను మరణించినా, తన స్థానంలోకి తిరిగి అమ్మనే తీసుకువచ్చింది. ఇన్నాళ్లూ గ్రహించలేకపోయాను. ఆ త్యాగమూర్తి పాదాలు నా అశ్రువులతో కడిగి క్షమాపణలు అడగాలి. ఇన్నాళ్లూ కడుపున కంటేనే అమ్మ అవుతుంది అనుకున్నాను కానీ,  కనకపోయినా ఇలా కంటికి రెప్పలా కాచుకొనేదీ.. ఇలాంటి అమ్మలేనిదే నాకు అస్తిత్వమే లేదని నిరూపించిన ఈ అమ్మ, ఎన్ని జన్మలకైనా ఈ అమ్మే కావాలి నాకు. కంటివెంబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకుని వెంటనే అమ్మని చూసేయాలనే ధృడ నిశ్చయంతో  అమ్మకి, నాన్నకి నా దగ్గరకి రావడానికి విమానం టికెట్లు బుక్‌ ‌చేసేసాను. ఇదిగో ఇంకాసేపట్లో అమ్మ గుండెలో గువ్వపిట్టలా దూరిపోతాను.

 ‘‘దీపూ! దీపూ..’’ పిలుపుతో కళ్లు తెరిచి ఈ లోకంలోకి వచ్చాను. ఎప్పుడు ఫ్లైట్‌ ‌లాండ్‌ అయిందో మళ్లీ స్టేటస్‌ ‌గమనించనేలేదు. ఇంతసేపూ నా ఊహా ప్రపంచంలో ఉన్న అమ్మ ఇప్పుడు నా కంటికెదురుగా కనపడేసరికి, అమ్మ పాదాల మీద పడి క్షమించమని అడగాలా? గుండెలో గువ్వలా దూరిపోవాలా? అనేది తేల్చుకోలేకపోయాను.

ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో అమ్మ తన రెండు చేతులూ చాచి పిలిచేసరికి ఉద్వేగంతో ఒక్క ఉదుటన అమ్మ బాహువులలో ఇమిడిపోయి, ‘‘అమ్మా’’, ‘‘అమ్మా’’ ఆర్తిగా పిలుస్తూ, దారి తప్పిన లేగదూడ తిరిగి తల్లిని చేరి ఎలాంటి అనుభూతి పొందుతుందో అలాగ. నేను కూడా తన గాఢ పరిష్వంగంలో ఇన్నాళ్లూ దూరం చేసుకున్న అమ్మ ప్రేమామృతాన్ని తనివితీరా రుచి చూసాను. ఈ అమ్మ లేనిదే నాకు అస్తిత్వమే లేదని తెలుసుకున్నాను.

About Author

By editor

Twitter
Instagram