– రవీంద్ర రావెళ్ల (చైతన్యశ్రీ)

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఇంటిమీద పిచుకలు అరుస్తున్నాయి. పొలిగట్టు భూమితో ఏదో మాట్లాడుతుంది పెద్దపెద్దగా. ఇవి అలవాటైన మాటలే చోటుకి. కానీ ఎప్పుడూ పొలిగట్టే మాట్లాడాలి, భూమి ఎందుకు మాట్లాడదు? పెద్ద ప్రశ్న. చోటు చిన్నబుర్రలో ప్రశ్నలు వేసుకున్నాడు. కానీ పక్క మీద నుంచి ఇంకా లేవలేదు. చెద్దరిని ఇంకా దగ్గరికి తీసుకుంటూ అందమైన నిద్రలో అందంగా మునకలేస్తున్నాడు.

‘‘డాడీ..లే. చాలా సమయం అయిపోయింది.’’

అమ్మ ఆరు దాటితే ఒక్క క్షణం కూడా పడుకోనివ్వదు. చోటు మనసులో ఏదో కోల్పోయిన బాధ. దుప్పటిని లాక్కుని మడత పెడుతుంది అమ్మ. చాలా చిరాకు చోటు మొహంలో.

‘‘మమ్మీ.. ఇలా చిన్నపిల్లల నిద్రను పాడుచెయ్యడం పాపం’’ కళ్లను తుడుచుకుంటూ అన్నాడు. ఆ గొంతు కొంచెం బొంగురుగా ఉంది.

‘‘ఆహా! నువ్వు తెచ్చుకున్న లెప్రో దిగాలుగా ఉంది. నువ్వు ఇంకా లేవకపోతే అది బాధపడదా?’’ నవ్వుతూ చెప్పింది అమ్మ, ముడుచుకున్న పువ్వులా నడి మంచంలో కూర్చున్న చోటు నుదిటిపై ముద్దు పెడుతూ..

‘‘మర్చిపోయా, మమ్మీ’’ అంటూ లెప్రో దగ్గరకు పరుగుతీసాడు చోటు.

లెప్రో కుక్క పేరు. చోటుకి కుక్కలంటే ఇష్టం. కాదు, ప్రేమ. పసిపిల్లల ఆశల వెనకాల స్వచ్ఛత ఉంటుంది. అందుకే వాళ్లు దేవుళ్లతో సమానం అంటాం. చోటువాళ్ల ఇల్లు ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది. స్నేహితులతో ఆడుకోవడం కష్టం. అందుకే చోటు మనసు కుక్కవైపు మళ్లింది. వాళ్ల డాడీతో గొడవ పడి మరి తన స్నేహితుడ్ని (లెప్రో) ఇంటికి తెచ్చేసుకున్నాడు.

బంతి విసరడం. దాన్ని తీసుకొచ్చే లెప్రోని చూసి చప్పట్లు కొట్టడం. లెప్రోతో పరుగెత్తడం. గొడవ పెట్టుకోవడం. కౌగిలించుకోవడం. దానికి డాన్స్ ‌నేర్పించడం.. ఓహ్‌.. ఇలా చాలా…

లెప్రోతో ఆడుకోవడం చోటుకి చాలా సరదా.

‘‘డాడీ స్కూలుకి టైం అయ్యింది. రా త్వరగా.’’ మళ్లీ అమ్మ, చోటు ఆనందానికి అవరోధం కలిగిస్తూ. కాసేపు లెప్రోతో ఆడుకోవాలని చోటు మనసులో ఉన్నా అమ్మ మాట మీద కదిలాడు. తయారై స్కూలుకు ప్రయాణమయ్యాడు.

బాల్యం ఖాళీ కాగితం లాంటిది. చేసే అల్లరిపనులే పాఠాలవుతాయి. ఆ కాగితంపై నేర్చుకున్న విషయాలవుతాయి. అదే బాటలో ఎంతో అల్లరి చేస్తూ వెళ్తున్నాడు చోటు.

సొంతూరిలోనే స్కూలంటే సొంతింటిలో మామిడిచెట్టులా అన్నమాట. కాకపోతే కోతుల్లా భయపెట్టడానికి అప్పుడప్పుడు ఉపాధ్యాయులు ఉంటారు. చిన్నతనంలో ఉన్నప్పుడు చాలామందికి చదువు మోయలేని భారం. స్కూల్‌ ‌వదిలించుకోవాలి అనుకునే బంధం. ఉపాధ్యాయుడంటే ఇంకేంటి కోతితో సమానమే. కానీ స్కూల్‌ ‌దాటి వచ్చినప్పుడే తెలుస్తుంది అది ఒక గుడని, ఉపాధ్యాయుడు సప్తసముద్రాల్లాంటి కష్టాలను దాటడానికి మార్గంచూపే హనుమంతుడని.

చోటుకి స్కూల్‌ ‌సొంతూరిలో ఉందన్న ఆనందమున్నా అప్పుడప్పుడు హెడ్‌మాస్టర్‌ ఎప్పుడొచ్చి చాడీలు.. కాదు కాదు చేసే అల్లరి నిజాలు చెపుతాడో అన్న భయం కూడా కూసంత ఉండేది.

బడి దగ్గరికి వచ్చాడు. దరిద్రం ఏంటో మరి, అప్పుడే ఆ రంగా బ్యాచ్‌ ‌కూడా వచ్చారు. వాళ్లు స్కూల్‌ ‌గోడమీద రాసున్న ‘‘ఇచ్చట మూత్రం పోయరాదు’’ అన్న దగ్గరే పాస్‌ ‌చేశారు. ఇది కొత్త కాదు వాళ్లకి. ప్రతిరోజూ ఇదే పని. ఊరందరికి తెలిసిన విషయమే.

కానీ ఏడో తరగతి చదువుతున్న చోటు దీనిని సహించలేకపోతున్నాడు. చాలా కోపం వచ్చింది. కానీ మింగేసాడు. మింగక.. రంగా ఆరడుగులుంటాడు. భారీ భుజాలు. వాడికింద జుట్టోడు, వాడికింద బుగ్గన్న .. మాటకు ముగ్గురేకాని ఊరినే ఆడేసుకుంటున్నారు. అందుకే వాళ్లను ఏమనలేకపోయాడు.

 *   *   *

సమయం ఏడయ్యింది. టీవీ చూస్తున్నాడు చోటు. కానీ తను అక్కడ లేడు. తన మనసు ఇంకా ఆ స్కూల్‌ ‌దగ్గరే ఉంది.

‘‘వాళ్లు అలా చేస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు?’’

‘‘నేను మాట్లాడానా? నాలానే అందరూ’’

‘‘నాలానా…కాదు!.. నేను చిన్నవాడ్ని. నేను ఎలా మాట్లాడగలను. నాకంటే పెద్ద వాళ్లందరూ చూస్తూనే ఉన్నారు.. ఉంటున్నారు..’’

‘‘ఏదైనా చెయ్యాలి….ఏం చెయ్యాలి…నేను చిన్నవాడ్ని, ఏం చేయగలను. అయినా పెద్దవాళ్లకే లేనిది నాకెందుకు..’’

చోటు… ప్రశ్నలనుండి బయటకు రాకముందే.. లెప్రో చోటు చేతులను విడిపించుకొని బయటకు పరుగెత్తింది. ఉలిక్కిపడి దాని వెనుకనే చోటు కూడా పరుగెత్తాడు.

‘‘లెప్రో.. లెప్రో.. ఎక్కడికి వెళ్తున్నావ్‌…’’

‌లెప్రో బయట ఒక గోడ దగ్గర పాస్‌

‌చేస్తుంది. చోటుకి ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న కుక్కపిల్లకి ఉన్న జ్ఞానం మనిషికి లేదా? దానికి తెలిసిన నీతి ఈ రంగా బ్యాచ్‌కి ఎందుకు తెలియట్లేదు? మళ్లీ ప్రశ్నలు చోటులో. కానీ ఈసారి కోపం తాలూకు భావోద్వేగం కూడా చోటుని తాకింది..

లోపలకి వచ్చి పడుకున్నాడు. కానీ నిద్రపట్టడం లేదు. మనసులో ఏదో కలత. అది తనని సెల్స్‌లేని రిమోట్‌ ‌కార్‌లా చేసింది, చేస్తుంది.

అప్పుడే వచ్చింది అమ్మ.

‘‘ఏంటి డాడీ ఇంకా పడుకోలేదా..’’

‘‘నిద్ర రావట్లే మమ్మి. వచ్చి కథ చెప్పు ప్లీజ్‌’’ అమ్మ చోటు దగ్గరకు వచ్చి దగ్గరకు తీసుకుంది..

‘‘నేను కథ పూర్తిచెయ్యగానే నువ్వు పడుకోవాలి సరేనా…’’ షరతు విధించింది.

‘‘హా.. సరే మమ్మీ, పక్కా పడుకుంటా…’’ ఒప్పుకున్నాడు.

‘‘అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతన్న. అతను పదెకరాల జొన్న వేసాడు. ఒకరోజు తను పొలానికి వెళ్లేసరికి పంటను తింటున్న పక్షులన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం చూశాడు, రైతు. చూస్తే కొంత పంట నాశనం అయింది. చాలా బాధేసింది, పాపం ఆ రైతన్నకి. ఎదుగుతున్న పంట అలా కావడంతో దుఃఖం వచ్చింది. అలా పంటను నాశనం చేసిన పక్షుల మీద రైతన్నకు కోపం వచ్చింది..’’

‘‘పాపం..మమ్మీ ఆ పక్షులన్నీటిని చంపెయ్యాలి’’ చోటు రైతన్న మీద సానుభూతితో అన్నాడు.

‘‘డాడీ.. అవి కూడా ఆకలితోనే తిన్నాయి కదా. వాటికి తెలియదు కదా ఆ పంట కోసం ఆ రైతన్న పడిన శ్రమ..’’

‘‘హా అవును మమ్మి.. అదీ నిజమే. పాపం వాటిని చంపడం కూడా తప్పే అవుతుంది. మరి అప్పుడు ఏం జరిగింది మమ్మీ?’’ ఆతృతగా అడిగాడు చోటు.

‘‘తర్వాత రోజు ఆ రైతన్న తను లేనప్పుడు తన పొలాన్ని చూసుకోవడానికి ఒక బొమ్మను కాపలాగా పెట్టాడు’’

‘‘బొమ్మనా.. బొమ్ముంటే పక్షులు వస్తాయిగా అమ్మ’’

‘‘రావు నాన్న పక్షులు బొమ్మను కూడా మనిషే అనుకుంటాయి. అందుకే రావు. అలా ఆ బొమ్మ వల్ల పక్షులు పంట తినలేదు. పంట బాగా పండింది. ఆ రైతన్న సంతోషంగా తర్వాత సంవత్సరం కూడా వ్యవసాయమే చేసాడు..’’

‘‘ఓహ్‌, ‌సూపర్‌ ‌మమ్మీ..’’

‘‘హా…డాడీ కూడా సూపర్‌ ‌బాయ్‌. ‌కాబట్టి ఇప్పుడు పడుకుంటాడు..’’ నుదిటిమీద ముద్దుపెట్టి అమ్మ బయటకు వెళ్లింది…

కానీ చోటు పడుకోలేదు. పక్షులు బొమ్మను మనిషనుకున్నాయి. అందుకే పంటను ఏం చెయ్యలేదు.. నేనూ ఏదో ఒక మ్యాజిక్‌ ‌చెయ్యాలి…’’ అనుకున్నాడు చోటు.

తెల్లవారింది. పొలిగట్టు ఏదో అంటుంది. భూమి మాత్రం ఏమి మాట్లాడటం లేదు, ఎప్పటిలా గానే…కానీ ఇవాళ్ల చోటు అమ్మ లేపకముందే లేచాడు. తన పనులు అన్ని చకచకా తనే పూర్తి చేసుకున్నాడు.

‘‘మమ్మీ.. నాకు ఇరవై రూపాయలు కావాలి..’’ అడిగాడు

‘‘పోపుల డబ్బాలో ఉన్నాయి తీసుకో డాడీ’’ ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేవు.

డబ్బులు తీసుకొని బయటకి వచ్చాడు. ఖాదర్‌ అన్న కిరాణంలో నాలుగు నిమ్మకాయలు, రెండు ఎండుమిరపకాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు తీసుకున్నాడు. స్కూలుకి వెళ్లి ‘‘ఇచ్చట మూత్రం పోయరాదు’’ అని రాసున్న దగ్గర నిమ్మకాయల మీద కుంకుమ, పసుపు చల్లి, మిరపకాయలు పెట్టాడు.

కాసేపటికి రంగా బ్యాచ్‌ ‌వచ్చింది. అక్కడే పాస్‌ ‌చెయ్యడానికి వెళ్లారు. కింద వాటిని చూసి అరుస్తూ పరుగెత్తారు. మనిషిని భయపెడితే మంచి, చెడులు తెలుస్తాయని చోటు మనసులో అనుకున్నాడు… ‘ఒకవేళ భూమి మాట్లాడటం మొదలుపెడితే, ఈ భూమ్మీద ఎవరూ బ్రతకలేరు..’ కావాలని కాదు, ఏదో అనుకోకుండానే చోటు నుంచి జారిపడింది ఆ మాట..

About Author

By editor

Twitter
YOUTUBE