– డా।। అక్కిరాజు రమాపతిరావు

తెలుగునాట అభ్యుదయ సాహిత్యానికి అబ్బూరివారే పితామహుడనీ, సామ్యవాదాన్ని సాహిత్యవాదంగా రూపొందించాడనీ వారి అభిమానుల నమ్మకం. తానీయన అనుంగు ఛాత్రుడనని శ్రీశ్రీ అంటాడు. వీరే తనకు లండన్‌ ‌పోగ్రెసిన్‌ ‌రైటర్స్ ‌వారి మేనిఫెస్టో (ఆశయ పత్రం) ఇచ్చాడనీ, దీనిని తాను ‘ప్రతిజ్ఞ’ పేరిట పొలాలనన్నీ, హలాల దున్నీ, ఇలా తలంలో హేమం పిండగ, పరిక్రమించే, పరిశ్రమించే… ఇత్యాది ఆ అభ్యుదయ రచయితల మేనిఫెస్టోను దించేశాననీ శ్రీశ్రీ రాసుకున్నాడు. అబ్బూరివారే నా విశ్వవిద్యాలయం అని నివాళి సమర్పించాడు. అబ్బూరి నూటకి నూరుపాళ్లు కమ్యూనిస్టు కారు. నవ్య మానవతావాది అని ఎం.ఎన్‌. ‌రాయ్‌ ‌దార్శనిక సిద్ధాంతాన్ని ఉపాసించినట్లు కనపడుతుంది. భారత స్వాతంత్య్రోద్యమంలో ఎం.ఎన్‌. ‌రాయ్‌కి అంత మంచిపేరు లేదు. ఆయన బ్రిటిషు ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని యుద్ధ ప్రచారం చేశాడని భోగరాజు పట్టాభి సీతారామయ్యగారంటారు. ఇప్పుడు, అది ముఖ్యం కాదు. ఇక కుందుర్తి.. అబ్బూరి అసలు సిసలైన అభ్యుదయ కవితావేత్త అంటాడు, భవతు. ‘విశ్వాసాల దృష్ట్యా, ఆచరణ దృష్ట్యా, ఆయన (అబ్బూరి) అభ్యుదయ భావుకుడు. తన తరువాత ప్రవర్తిల్లిన అభ్యుదయ కవితాయుగ దర్శనం ఆయనకు తప్ప ఆ యుగంలోని భావకవులెవ్వరికీ లేదు’ అని కుందుర్తి జేజేలు చెప్పాడు అబ్బూరివారికి.

అబ్బూరి సంస్మరణ సంపుటంలో కుందుర్తి ఇంకా ఇట్లా కైవారం చేశాడు. ‘‘జీవిత ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకూ అభ్యుదయవాదిగా కాలం గడిపిన రామకృష్ణారావు ఆంధ్రులకే కాదు, దేశంలోని అభ్యుదయవాదులందరికీ ప్రాతఃస్మర ణీయులు’.

ఇక 1936లో లక్నోలో జరిగిన అభ్యుదయ రచయితలలో పాల్గొన్న అబ్బూరివారి ప్రతిభా సామర్థ్యాల గురించి రాయ్‌ ‌వాకబు చేసి ఆ తర్వాత ఆయనను తన ముఖ్య అనుయాయిగా ఎంచి పట్టం కట్టినట్లు అబ్బూరివారి కుమారులైన వరద రాజేశ్వర రావు పుత్రోత్సాహం సంస్మరణ సంచికలో కనపడుతుంది. ఎం.ఎన్‌. ‌రాయ్‌ ‌పార్టీ ప్రచారం కూడా చేశారట అబ్బూరి.

రవీంద్రనాథ్‌టాగూర్‌ ‌పట్ల అబ్బూరికి ఆరాధనా భావం ఉండేది. శాంతినికేతనంలో అబ్బూరివారు చదువుకున్నారు కూడా. సమస్త ప్రపంచ వామపక్ష రాజకీయ సాహిత్యం, ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్యం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నేర్పించిన ఘనత అబ్బూరిదేనని ఆయన పుత్రుడు వరద రాజేశ్వరరావు అంటున్నాడు. తరువాత దానినంతా తొలగించినట్లూ ఆయనే అంటున్నాడు. అంతేకాదు ‘కవిత్వ పరంగా శ్రీరంగం శ్రీనివాసరావుని మా నాన్నగారు పెంచుకున్నారు’ అని కరతాళ ధ్వని చేశాడు వరద.

‘అప్పటికి మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరవటం, అందులో విశ్వాసం సడలి నవ్య మానవతావాదిగా మారిపోవటానికి రమారమి రెండు దశాబ్దాలు పట్టిం ద’ని స్మరించు కున్నాడు వరద. శ్రీశ్రీ ఏమో యుద్ధా నంతరం కాని కమ్యూనిస్టు కాలేదట. అంతకుముందే దానికి తర్పణాలు వదిలారుట అబ్బూరివారు. గురుశిష్యులలో ఎవరు గొప్ప?

ఇది అబ్బూరి రామకృష్ణారావు ఒక సాహిత్య పార్శ్వం.

ఆయన దార్శనికతలో రెండో పార్శ్వమూ ఉంది. అది ఇలా ఉంది.. ఆయన ఇరవై ఏళ్ల వయసుననే కలకత్తా వెళ్లారుట, చదువుకుందామని. అప్పటి అనుభవాలు ఇట్లా రాశారు..

వంగదేశంతో పోల్చి చూస్తే తెనుగు దేశంలో సంస్కార దారిద్య్రం స్ఫుటంగా కనిపిస్తున్నదని వారంటూ ఉండేవారట. (ఉమాకాంత విద్యా శేఖరులు – ఈయన కొన్నాళ్లు కలకత్తాలో చదువుకున్నారు. ఈ కారణం అబ్బూరివారు ఇట్లా విశ్లేషిస్తున్నారు.

‘వంగదేశంలో చాలాకాలం క్రిందటనే ఆంగ్లభాషా సంస్కృతుల సంపర్కం కలగడం వల్లా, అచ్చటి ఆంగ్ల విద్యాశాలల్లో ప్రవేశపరీక్షకు సంస్కృత భాషా పఠనం నిర్బంధం కావటం వల్లా, అక్కడి పట్టభద్రులకు కొంత సంస్కృత వ్యాకరణంలో ప్రవేశమూ, వాల్మీకి రామాయణంతోనూ, కాళిదాసాది మహాకవుల కావ్యాలతోనూ అంతో ఇంతో పరిచయం కలగడం వల్ల సంస్కృత భాషలో గుప్తమై ఉన్న భారతీయ విజ్ఞానం వారికి సన్నిహితంగా ఉండేదనీ’ ఉమాకాంతం గారి అభిప్రాయమట. దీనిని కాదనటం లేదు అబ్బూరివారు.

ఇక వంగదేశపు గొప్ప నాటక రచయిత అయిన ద్విజేంద్రలాల్‌ ‌రాయ్‌ ‌గూర్చి అబ్బూరివారిట్లా అన్నారు. ‘ద్విజేంద్రుడు భారతీయ చరిత్రలో నుంచి వీరాగ్రేస రులను నాయకులుగా గ్రహించి నాటకౌచిత్యాన్ని పాటిస్తూ, పరదాస్య విమోచనకు పాటుపడాలనే ఉత్కంఠ సామాజికుల్లో రేకెత్తించే శక్తిమంతాలైన సంభాషణలతో నాటకాలు రాశారు.  మేవాడు పతనం, షాజహాను, చంద్రగుప్త వంటివి. (షాజహాను భారతదేశం గర్వించవలసిన అధిపుడేమో తెలియదు.)

మేవాడు పతనంలో ప్రేక్షకులను పులకింపజేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. పదహారో శతాబ్దంలో పరిపాలించిన రసపుత్ర సార్వభౌముడు రాణా ప్రతాపుడికి యావజ్జీవితమూ అతనికి శత్రువులైన మొగలు చక్రవర్తులతో, అక్బరు సార్వభౌమునితో పోరాటం తప్పలేదు. తన ఐశ్వర్యమంతటినీ విసర్జించి తన రాజప్రాసాదంలో జరిగే భోగాలన్నిటికీ స్వస్తి చెప్పి, తన దేశం స్వతంత్రం కానంతవరకూ తృణశయ్య మీద పవళిస్తూ, పత్రపుటాల్లో భోజనం చేస్తూ ఉంటానని కఠోరమైన ప్రతిజ్ఞ చేసి జీవితాంతం వరకు అచంచలమైన సంకల్పంతోనే దాన్ని సాధించినవాడు రాణాప్రతాపుడు. అతి కరుణమైన ఒక సన్నివేశంలో రాణా తన భార్యాబిడ్డలతో ఒక వృక్షచ్ఛాయలో విశ్రమించి ఉండగా ఆకలి కోర్వలేక ఒక బిడ్డ ఆహారాన్ని కోరినప్పుడు, నాటకాన్ని చూసే సామాజికుల కన్నులు చెమ్మగిల్లటం నేనెరుగుదును.

ఆగష్టు 1947లో మన దేశానికి స్వాతంత్య్రం లభించినంతవరకూ, రసపుత్ర రాజులందరూ రాణాప్రతాపుడి ప్రతిజ్ఞను స్మరిస్తూ తాము శయనించే పట్టుపాన్పుల కిందా భుజించే స్వర్ణరజిత పాత్రల కిందా కొన్ని తృణాంకురాలుంచుకునేవారు (పుట 247).

ఈ రచన 1963లో రేడియో ప్రసంగంగా విన్పించారుట అబ్బూరివారు. ఈ మాటలు వింటే కమ్యూనిస్టులు (ఉగ్ర, అగ్రేసర కూడా) నాలుకలు పీక్కుంటారు. నానా రభస చేస్తారు. కాషాయీ కరణమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుట్ర అని చిందులే స్తారు. అశ్శరభా శరభా దశ్శరభా అని వీరభాద్ర పిళ్లేలు ప్రదర్శిస్తారు. ఇవి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావాలు, తాత్త్విక సిద్ధాంతాలు అయితే మహా పరాభమేమిటో వారికే తెలియాలి. హృదయ విదారకమైన ఏడుపు ఏమిటో ఈ సెక్యులరిస్టులను, కమ్యూనిస్టులను అడగాలి.

రాజశేఖర శతావధానిగారి రాణాప్రతాప చరిత్రకు పరిచయం రాస్తూ విశ్వనాథవారిట్లా అన్నారు ‘ప్రతాప సింహ చరిత్ర మన ధర్మమునే కాక, మన పరిస్థితులు కూడా చెప్పును. అక్బరు చక్రవర్తితో పాతికేళ్లు హోరాహోరి పోరాడి స్వదేశం వదలి కొండలలో, గుట్టలలో నివసించి తిండి లేక సద్దె రొట్టెలు తిని దైవవశమున మరల స్వాతంత్య్రమును సంపాదించిన మహాపురుషుడు రాణాప్రతాపుడు. ఆయన కన్న ధర్మరాజాదులేమియు ఎక్కువ కారు. భారతమునకే గ్రంథము తీసిపోదు’ ఈ అభిప్రాయం వింటే ఎర్రదండు, సెక్యులర్‌ ‌దండు లబలబ లాడుతారు. ఏ దేశానికైనా జాతీయ తాదాత్మ్యం ఉండాలనటం కన్న ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ ప్రవచించే నేరం ఏమిటి? ఈ భావాలు దుస్సహాలా! మరి అయితే అభ్యుదయ ప్రవక్త అబ్బూరి చలివేందరలో దాహం తీర్చుకోండి. రాణాప్రతాప్‌, ‌శివాజీ, కృష్ణదేవరాయల మీద పోస్టల్‌ ‌స్టాంపులు స్వతంత్ర భారతదేశం ఎందుకు తేలేదు? రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీల స్టాంపులు తొలగిస్తే కాంగ్రెసు సెక్యులరిస్టులకు గగ్గోలు ఎందుకు?

శ్రీశ్రీ రాసిన హలాలనన్నీ… గీతంలో ఆయన ఘర్మ జాలానికి, ధర్మజలానికి అని ఆయన యమకాలంకారం కూర్చాడట. ఇది మొదటిసారి శ్రీశ్రీ.. అబ్బూరికి విన్పించినప్పుడు ‘ధర్మజలం’ ఏమిటి అని ప్రస్తావించాడుట. తరువాత ఆయనే మనకు ‘ధర్మోదకాలు’ అనే పదం ఉంది కదా! అని మనసు కుదుర్చుకొని శెబాస్‌ అన్నాడుట. రష్యాలో మార్క్సిజానికి ముప్పై ఏళ్ల కిందట ధర్మోదకాలు విడిచినా మన దేశంలో మాత్రం ఇంకా తర్పణాలు విడువలేదు, మన మార్క్సిస్టు మేధావులు. సెక్యులర్‌ ‌గణాచారులు.

వ్యాసకర్త : ప్రఖ్యాత పరిశోధకుడు, రచయిత

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram