1857 సంవత్సరం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక మైలురాయి. ఈస్టిండియా కంపెనీ నుంచి భారతావని  బ్రిటిష్‌ ‌రాణి ఏలుబడిలోకి వచ్చింది. సిపాయీలు, సంస్థానాధీశులు, ఎందరో దేశభక్తుల త్యాగాలకు సంబంధించి ఇది నిరాశనే మిగిల్చి ఉండవచ్చు. కానీ అయోధ్య సమరంలో ఆ సంవత్సరంలోనే హిందువుల పోరాటం కొద్దిగా అయినా ముందుకు సాగే అవకాశం వచ్చింది.  1857 నాటి ఆగ్రహజ్వాల అయోధ్యను కూడా తాకింది.


1857 ఘటన అనంతర పరిణామాలలో మొదటిది- చిట్టచివరి మొగల్‌ ‌పాలకుడు బహదూర్‌షా జాఫర్‌ను ఆంగ్లేయులు బందీగా బర్మా పంపడం.అంటే ముస్లిం పాలనకు ముగింపు. కానీ ఆంగ్లేయుల పాలన దేశంలో సుస్థిరం కావడం అత్యంత విషాదకర చారిత్రక పరిణామం. ముస్లింల పాలన ‘ముందు నుయ్యి’ వంటిది. ఆంగ్లేయుల పాలన ‘వెనుక గొయ్యి’. 1857లో అయోధ్యలో హిందువులు, ముస్లింల మధ్య కొంత సంఘీభావం వెల్లివిరిసినా, రామజన్మ భూమి కోసం సాగుతున్న పోరాటం మీద అది పనిచేయలేదు. బాబ్రీ కట్టడంగా పేర్గాంచిన ఆ కట్టడం పక్కనే నాటి హనుమాన్‌ ‌గుడి పూజారి (మహంత్‌) ‌చబుత్రా (వేదిక)ను నిర్మించారు. దీని మీద అప్పటి బాబ్రీ మసీదు ముయిజ్జిన్‌ (‌మతపెద్ద) బ్రిటిష్‌ ‌వారికి ఫిర్యాదు చేశాడు. దాని ఫలితమే చబుత్ర, మసీదు మధ్య గోడ నిర్మాణం. ఈ మేరకు 1861లో జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అమేథ్వీ చర్యకు నిరసనగా 1855లో జరిగినట్టే, 1883లో మరొక బృందం సాధువులు కూడా మసీదు మీద దాడి చేశారు. రామచబుత్రా మీద రామమందిరం నిర్మించాలని వారు యత్నించారు. పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. వీటి గురించి కోర్టులో కేసు నడిచింది. కానీ 1886లో కేసు కొట్టేశారు. అంతకు ముందు సంవత్సరమే 1885లో మహంత్‌ ‌రఘువర్‌ ‌దాస్‌ ‌చబుత్ర వద్ద ఆలయం కట్టుకునేందుకు అనుమతించవలసిందిగా కోరుతూ జిల్లా యంత్రాం గాన్ని కోరారు. ఆ స్థలానికి తానే యజమానిని కాబట్టి ఇందుకు అనుమతించాలని ఆయన వాదన. ముస్లింల అభ్యంతరాలతో అనుమతి రాలేదు. దీనితో ఆయన అదే సంవత్సరం ఫైజాబాద్‌ ‌సబ్‌ ‌జడ్జ్ ‌కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా అనుమతి లభించలేదు. సబ్‌ ‌జడ్జి పండిత్‌ ‌హరికిషన్‌ ‌చబుత్ర మీద హిందువుల హక్కును కాదనలేదు. కానీ, 1855 నాటి ఘర్షణలను బట్టి, గోడ కట్టవలసి వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఆలయ నిర్మాణానికి అనుమతించలేదు. హిందూ ఆలయంలో గంట, శంఖనాదం ఉంటాయి కాబట్టి, ఇక నిత్యం గొడవలు తప్పవని అభిప్రాయపడ్డారు. దీనితో రఘువర్‌దాస్‌ ‌జిల్లా కోర్టుకు వెళ్లారు. కల్నల్‌ ఎఫ్‌ఈఏ ‌షామిర్‌ అక్కడ న్యాయమూర్తిగా ఉన్నాడు. ఇతడు సబ్‌ ‌జడ్జి తీర్పునే సమర్ధించాడు. పైగా చబుత్ర మీద హిందువుల హక్కును కొట్టిపారేశాడు. అయితే ఇతడు చేసిన ఒక వ్యాఖ్యకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. ‘హిందువులు పవిత్రంగా భావించే స్థలంలో మసీదు నిర్మించి ఉండవలసింది కాదు. కానీ 356 ఏళ్లక్రితం జరిగిన ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దలేం’ అన్నాడు.

 ఆంగ్లేయులు తలుచుకుంటే పరిష్కారం జరిగేది. అది హిందువులకు అనుకూలం కావచ్చు. వ్యతిరేకం కావచ్చు. కానీ హిందువులు, ముస్లింల మధ్య వైరం శాశ్వతంగా ఉంచాలన్న దుర్బుద్ధే ఆ న్యాయమూర్తి తీర్పు నిండా ఉంది. అయినా రఘువర్‌ ‌తన ప్రయత్నాలు విరమించలేదు. తనకు చబుత్ర మీద హక్కు లేదనడాన్ని సవాలు చేస్తూ ఆయన జ్యుడిషియల్‌ ‌కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ మళ్లీ రఘువర్‌ ‌వాదన గెలిచింది. కల్నల్‌ ‌షామిర్‌ ‌తీర్పులోని ఆ అంశాన్ని జ్యుడిషియల్‌ ‌కమిషనర్‌ ‌కొట్టేశారు. అంటే హిందువుల హక్కును గుర్తించారు.

1934లో మళ్లీ అయోధ్య బ్రిటిష్‌ అధికారులను కలవరపరిచింది. ఆ పుణ్యక్షేత్రానికి సమీపంలోని ఒక గ్రామంలో గోవధ జరిగింది. ఇందుకు నిరసనగా హిందువులు బాబ్రీ కట్టడం మీద దాడికి దిగారు. అప్పుడు మసీదుకు జరిగిన నష్టానికి తరువాత బ్రిటిష్‌ ‌ప్రభుత్వమే సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించింది. దురాక్రమణదారుడు బాబర్‌ ‌పేరిట ఉన్న మసీదు ఆ చుట్టుపక్కల ఎలాంటి వాతావరణాన్ని, ఉద్రిక్తతలను సృష్టించి పెట్టిందో దీనిని బట్టి అర్థమవుతుంది. దేశానికి స్వాతంత్య్రం కనుచూపు మేరలో ఉన్నదని అంతా ఆనందించారే గానీ, ముస్లింలీగ్‌ ‌రూపంలో పెద్ద ముప్పు పొంచి ఉందని తక్కువ మందే ఊహించారు. దేశ విభజన నినాదం, దాని వెనుకే మత ఘర్షణలు ఉత్తర భారతాన్ని ఉష్ణ రక్తకాసారం చేసేశాయి. మధ్యయుగాల నాటి ముస్లిం మతోన్మాదం మళ్లీ రేగింది. ముస్లింలకు ఎన్నడూ లేని మద్దతు భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నుంచి, నెహ్రూ ప్రభుత్వంనుంచి అయాచితంగా వచ్చింది. 1946 మార్చిలో బాబ్రీమసీదు- రామజన్మభూమి కట్టడం మీద సున్నీ వక్ఫ్‌బోర్డు హక్కును ప్రకటించుకుంది.

అయినా అయోధ్య పోరాటంలో కాస్త కూడా విరామం కనిపించపోవడం నిజంగా అద్భుతం. నిజానికి1946లో హిందూ ముస్లిం ఘర్షణలు తారస్థాయికి చేరిపోయాయి. అయినా అఖిల భారతీయ రామాయణ సభ రామజన్మ భూమి మీద హక్కు తమదేనంటూ కొత్త ఉద్యమం ఆరంభించింది. బాబ్రీ మసీదుగా పిలుస్తున్న ఆ స్థలం రామజన్మభూమి కాబట్టి, వక్ఫ్ ‌బోర్డుది దురాక్రమణే అని చెబుతూ, జన్మభూమి మీద హక్కు హిందువులదే అన్న నినాదంతో ఆ ఉద్యమం ఆరంభమైంది. రామాయణ మహాసభ హిందూ మహాసభ అనుబంధ సంస్థ. 1949లో అయోధ్య ఉద్యమం అతి పెద్ద మలుపు తీసుకోగలిగింది. సంత్‌ ‌దిగ్విజయ్‌నాథ్‌ (‌గోరఖ్‌నాథ్‌ ‌మఠం) రామాయణ మహాసభ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. అదే సంవత్సరం జన్మభూమి దగ్గర తొమ్మిదిరోజులు నిర్విఘ్నంగా రామచరిత మానస్‌ ‌పఠనం చేశారు. చివరి రోజున భక్తులు హఠాత్తుగా ఆ కట్టడంలోకి ప్రవేశించి సీతారాముల (బాల రాముడు, సీతమ్మ) ప్రతిమలు ప్రతిష్టించారని కూడా చెబుతారు.. అవి లోపల వాటికవే ప్రత్యక్షమయ్యాయని ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడి, అదే దావానలంలా వ్యాపించింది. వందల ఏళ్లుగా మసీదు కింద ఉండి పోయిన రామజన్మభూమి విముక్తి పోరాటానికి కొత్త ఊపిరులూదిన చరిత్రాత్మక ఘట్టం అదే.

రాముడు అయోధ్యలో జన్మించాడని చెప్పడానికి ఆధారపత్రాలు లేవంటారు కొందరు. అయోధ్యలోనే రాముడు పుట్టాడన్నది భారతీయుల విశ్వాసం. అనాదిగా వస్తున్న ప్రగాఢ విశ్వాసం. దానిని ప్రశ్నించే హక్కు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. ఇతర మతాల ప్రవక్తలు, ప్రముఖుల బర్త్ ‌సర్టిఫికెట్లు ఎవరైనా ఇవ్వగలరా? రామాయణం, అయోధ్య, రాముడు తమ ఆధ్యాత్మిక మూలాలన్న భావన తరతరాలుగా భారతీయుల రక్తంలో రక్తమై, అణువణువునా సుస్థిరమైన, పటిష్టమైన కొన్ని శతాబ్దాల తరువాతే ఈ దేశంలోకి ముస్లింలు రెండువైపులా పదును కలిగిన కరవాలాల బలంతో ప్రవేశించారు. ఆ కత్తులకు ఒకవైపు మతం పెట్టిన పదును, మరొకవైపు మతం పునాదిగా రాజ్య నిర్మాణ కాంక్ష ఉన్నాయి. ఆత్మహత్యాసదృశమైన కొందరి భారతీయుల వైఖరి ఉన్మాదులకు బాటలు వేసిందన్నదీ నిజమే. కానీ చారిత్రక తప్పిదాలకు చెంపలు వాయించుకుని భారతదేశం మేల్కొంది. తన మూలాలను అన్వేషించే పని మొదలుపెట్టింది. ఆ క్రమంలో తమ మీద, తమ ధర్మం మీద జరిగిన దాడులను చరిత్రరూపంలో వారు గుర్తుకు తెచ్చుకోక తప్పదు. ఆ చరిత్రకే ముసుగు వేసే ప్రయత్నం ఇంతకాలం నిరాఘాటంగా సాగింది.

 భారతదేశ చరిత్రలోని కొన్ని అంశాలను కావాలని గమనించకుండా వదిలేసే ప్రమాదకర విధానం రుద్దారు స్వయం ప్రకటిత మేధావులు కొందరు. దీనినే నెగేషనిజం అంటారు. ఇది యూరప్‌ ‌చరిత్రకు ప్రధానంగా వర్తింప చేస్తారు. అక్కడ నెగేషనిజం అంటే యూదుల మీద, జిప్సీల మీద నాజీలు (రెండో ప్రపంచయుద్ధం సమయంలో) జరిపిన హత్యాకాండను నిర్దాక్షణ్యంగా నిరాక రించడం. అవేమీ జరగనట్టే చూడాలనడం. అదే ధోరణిని ఇక్కడ వామపక్ష చరిత్రకారులు అనుస రించడం పెద్ద వైచిత్రి. ఎవరిని చూపించి ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు బెదిరించారో, సరిగ్గా ఆ నాజీల శైలినే నిస్సిగ్గుగా కమ్యూనిస్టులు, ఆ సిద్ధాంతం ఆధారంగా చరిత్రను వ్యాఖ్యానించే చరిత్రకారులు అనుసరించారు. వీరికి ముస్లిం మేధావులు, ఇంకొందరు రాజకీయనేతలు వత్తాసు పలుకు తుంటారు. ఇంతకీ ఇక్కడ నెగేషనిజం అంటే ఏమిటి? ‘ఇస్లాం దురాక్రమణదారుల చేతులలో హిందువులు చవి చూసిన హత్యాకాండను వారి జ్ఞాపకాల నుంచి తుడిచేసే ప్రయత్నమే’. బెల్జియం చరిత్రకారుడు కొయిన్రాడ్‌ ఎల్స్ ఈ ‌మేధో విధ్వంసం గురించి, కుట్ర గురించి చెబుతారు. నాజీల చేతులలో ఎంతమంది ఘోరమైన చావుకు బలైనారో ముస్లిం దురాక్రమణదారుల చేతిలో హిందువులు కూడా అదే సంఖ్యలో బలైనారని అంటారాయన. డేవిడ్‌ ‌ఫ్రాలే, విల్‌ ‌డ్యూరాంట్‌, ‌ఫ్రాంకాయిస్‌ ‌గాటీర్‌ ‌వంటివారు కూడా ఈ అంశాన్ని లోతుగా చర్చించారు. ఇక్కడి కమ్యూనిస్టులకు, ఆ ముద్రాంకితులైన చరిత్రకారులకు నెగేషనిజం ఎందుకు? ముస్లింలను శాంతిప్రియులుగా, ఈ దేశానికి నాగరికత నేర్పిన వారిగా రేపటితరాల దృష్టిలో నిలబెట్టాలి. భారతదేశానికి ఎప్పటికీ తామే యజమానులమన్న భావన ముస్లింలలో నిలబెట్టాలి. బాధితులైన హిందువుల ఆక్రోశం, ఆవేదన, త్యాగం, ఆత్మగౌరవం కోసం వారు జరిపిన రక్తతర్పణలన్నీ మరుగున పడిపోవాలి. ఒక సమూహానికి తగిలిన గాయాలు ఆ సమూహం మరిచిపోవాలట. అప్పుడే ఆ గాయలు చేసిన దురాక్రమణదారుల వారసులు ఈ దేశంలో నిర్భయంగా జీవించగలరట. ఎంత ఆత్మహత్యా సదృశం! ఈ నీచమైన ధోరణికి ఇప్పుడే అడ్డుకట్ట పడుతోంది. మన కాలపు ఈ అద్భుత పునరుజ్జీవనానికి కేంద్ర బిందువే అయోధ్య.

ఆ గోడ కథ

1858లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నిర్మించిన గోడ రాముడి ఆరాధన నుంచి హిందువులను వేరు చేయలేకపోయింది. ఏడు అడుగుల ఎత్తుయిన ఈ గోడ కేవలం మంచుతెరలా మిగిలిపోయింది. చివరికి బాబ్రీ మసీదుతో పాటు ఇది కూడా నేలమట్టమయింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో వలస ప్రభుత్వం ఈ గోడ కట్టించింది. దీనితో ముస్లింలు మసీదుగా పేర్గాంచిన ఆ కట్టడం లోపల, హిందువులు బయట నుంచి పూజలు చేసుకుంటారని బ్రిటిష్‌ ‌వారు భ్రమపడ్డారు. హిందువులు పూజలు చేసుకోవాలని చెప్పిన చోటు పరిసరాలలోనే సీతా రసోయి, రామచబుత్ర ఉన్నాయి. వీటిలో పూజలు చేసుకునే హక్కు కూడా హిందువులకు ఉంది. కానీ ఈ గోడతో సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఎందుకంటే హిందువులకు ఆ మొత్తం ప్రదేశమంతా పవిత్రమే. రాముడు పుట్టినట్టు  హిందువులు నమ్ముతున్న జన్మభూమి లోపలే ఉంది. అదే గర్భగుడి. ముస్లింలు కట్టడం లోపల ప్రార్థనలు చేసుకోవాలన్నా హిందువుల అధీనంలో ఉన్న భూభాగం మీద నుంచే వెళ్లాలి.

అయోధ్య వివాదంలో 1858లో కోర్టుకు వెళ్లిన బాబ్రీ మసీదు (రామజన్మ భూమి) ప్రధాన పూజారి (ముయిజ్జిన్‌) ‌తెలిసో తెలియకో ఒక వాస్తవాన్ని అంగీకరించాడు. మూడు గుమ్మటాలు ఉన్న ఆ కట్టడంలోనే హిందువులు వందల సంవత్సరాలుగా పూజలు జరుపుకుంటున్నారని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంగతిని కూడా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉదహరించింది. సరిగ్గా జన్మస్థలంలోకి, అంటే గర్భగుడిలోకి వెళ్లకపోయినా, కటకటాలు ఉన్న గోడ దగ్గర నుంచే హిందువులు పూజలు చేసుకున్నారు. ఇక్కడ నమాజ్‌ ఎప్పుడు జరిగింది? ఆ వివాదాస్పద కట్టడంలో తొలిసారి నమాజ్‌ ‌జరిగినది నవంబర్‌ 5, 1860 అని రజబ్‌ అలీ అనే అతడు ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులో రాశాడు. ఈ ఫిర్యాదు రామచబుత్రను తొలగించవలసిందిగా కోరుతూ ఇచ్చినది. ముయిజ్జిన్‌ అజాన్‌ (ఒక వేళలో చేసే నమాజ్‌) ‌చేస్తున్న వేళ చబుత్ర నుంచి హిందువులు శంఖం ఊదుతున్నారని అతడి ఫిర్యాదు. చబుత్ర 1886 నుంచి కూడా హిందువుల అధీనంలో ఉన్నదన్న విషయంతో మేం విభేదించడం లేదని సుప్రీంలో కేసు విచారణ సందర్భంగా ముస్లింల తరఫున వాదించిన జఫార్‌యాబ్‌ ‌జిలాని విస్పష్టంగా చెప్పారు. మరి హిందువులకు అయోధ్యలో హక్కే లేదని వాదించేవారిని ఏమనాలి?

ఓ ప్రత్యక్ష సాక్షి కథనం

1860లో ఫైజాబాద్‌లో పని చేసిన అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌పి.కార్నెగీ రచనల ద్వారా కొన్ని వాస్తవాలు లభిస్తాయి. నాటి అయోధ్య చారిత్రక ఘట్టాలకు ఇతడు ప్రత్యక్షసాక్షి. రామజన్మభూమి కోసం హిందువులు ఆనాటికే ఉద్యమిస్తున్నారు. అంటే 1949లో అందులో బాలరాముడి విగ్రహాలు ప్రత్యక్షం కాకమునుపే ఆ పోరాటం ఆరంభమైంది. ‘ఫైజాబాద్‌’ ‌గురించి రాసిన ఒక వ్యాసంలో 1855లో అయోధ్యలో హనుమాన్‌ ఆలయం మీద ఆధిపత్యం కోసం ఘర్షణలు జరిగే వరకు హిందువుల ఆరాధన, ముస్లింల ప్రార్ధనలు కూడా అదే స్థలంలో జరిగాయంటాడు కార్నెగీ. అయితే బ్రిటిష్‌ ‌రాణి పాలన ఆరంభం నుంచి (1858) ఘర్షణలు నివారించడానికి గోడ నిర్మించారు. ఇది గ్రిల్‌, ఇటుకలు కలిపి నిర్మించిన గోడ. ఎత్తు ఏడడుగులు. మసీదులోపల ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి, బయట నుంచి హిందువులు ఆరాధించడానికి అనుమతి ఇచ్చారు. హిందువులు పూజలు చేసుకునే చోటే రామచబుత్ర.

అయోధ్య ఇరుమతాల వారికి కూడా పూజనీయ స్థలంగానే ఉన్న సంగతిని ఆస్ట్రియా క్రైస్తవ మతబోధకుడు జోసెఫ్‌ ‌టీఫెంథాలర్‌ ‌కూడా ప్రస్తావించాడు. ఇతడు 1770లో అయోధ్య వచ్చాడు. 12 కోటి కసౌటీ స్తంభాలు బాబ్రీ మసీదుకు ఆధారంగా ఉన్నాయని, అక్కడే నలుచదురుంగా ఉన్న ఒక పెట్టె (బేడి, ఊయల)ఉందని, అందులో విష్ణువు అవతారమైన రాముని విగ్రహం శిశువు రూపంలో ఉందని రాశాడు. అయితే రామమందిరాన్ని కూల్చి, దాని మీద మసీదు కట్టించినవాడు బాబర్‌ ‌లేదా అతని సేనాని మీర్‌ ‌బకీ అన్న సిద్ధాంతాన్ని టీఫెంథాలర్‌ ‌పేర్కొనలేదు. జన్మభూమి రామమందిరాన్ని కూల్చి, అక్కడే మసీదును నిర్మించిన ఘనతను ఔరంగ్‌జేబుకు కట్టబెట్టాడు.(ఏ రాయి అయితేనేం? అక్కడ ఉన్న విష్ణు అవతారం రాముడి ఆలయాన్ని  కూలగొట్టిందీ, దాని మీద మసీదు నిర్మించినదీ మొగలులే కదా!) ‘హిందువుల ఆరాధన హక్కును తొలగించడానికి’ ఔరంగ్‌జేబు ఈ పని చేశాడని కూడా టీఫెంథాలర్‌ ‌పేర్కొన్నాడు. టీఫెంథాలర్‌కు ముందు ఎందరో ఈ ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్పారు. ముస్లిం పాలకులు, వాళ్ల సేనానులు వాళ్ల ఆత్మకథలలో ఘనంగా చెప్పుకున్నారు.

1528లో బాబ్రీ మసీదు కట్టినవాడు మీర్‌ ‌బకీ అని చెప్పే ఒక శిలాఫలకం బయటపెట్టిన వాడు ఎఫ్‌సి బుచానన్‌. ఇతడు లార్డ్ ‌వెల్లస్లీ వ్యక్తిగత వైద్యుడు. 1807-1814 మధ్య అయోధ్యకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన తొలి రికార్డు 1822లో బయటపడింది. ఫైజాబాద్‌ ‌కోర్టు సూపరింటెండెంట్‌ ‌హఫీజుల్లా సమర్పించిన ఒక నివేదికలో ఇలా పేర్కొన్నాడు. అది పర్షియా భాషలో ఉంది. ‘బాబర్‌ ‌నిర్మించిన మసీదు జన్మస్థాన్‌ ‌వద్ద ఉంది’ అని దాని సారంశం. ఇది సీతమ్మవారి వంటశాల (సీతా రసోయి)కి సమీపంగా ఉంది అని కూడా ఉటంకించాడు. ఫైజాబాద్‌ ‌జిల్లా ల్యాండ్‌ ‌రెవెన్యూ అధికారి మిల్లెట్‌  1880‌లో ఇచ్చిన ఒక నివేదికలో కూడా 1858కి ముందు కట్టడం లోపల హిందువులు, ముస్లింలు కూడా పూజాదికాలు జరుపుకున్నారనే చెప్పాడు. 1854, 1881, 1891, 1892, 1905నాటి ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా నివేదికలు, 1930 నాటి జనరల్‌ ‌సర్వే నివేదిక ఆలయాన్ని కూల్చిన తరువాతనే మసీదు కట్టారని ఘోషిస్తున్నాయి. అలాగే ఆ స్థలాన్ని తిరిగి గెలుచుకోవడానికి హిందువులు పోరాడుతూనే ఉన్నారని కూడా పేర్కొన్నాయి. 1891 నాటి ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా నివేదికను ఎ. ఫ్యూరర్‌ ఇచ్చాడు. ఇది బుచానన్‌ అభిప్రాయాన్నే పోలి ఉంది. ఫ్యూరర్‌ ‌కట్టడంలోని మూడు శాసనాలను అనువదించాడు. వాటి ఉద్దేశం- బాబర్‌ ఆదేశం మేరకు మీర్‌ ‌బకీయే రామచంద్రుడు ప్రతిష్టితమై ఉన్న జన్మస్థానంలో పురాతన ఆలయం ఉన్న స్థలంలోనే మసీదు కట్టాడు. ఫ్యూరర్‌ అభిప్రాయం ప్రకారం,‘కూల్చిన ఆలయం ఎంతో సుందరమైనదై ఉండాలి.’ మందిరానికి చెందిన చాలా శిథిలాలను ముస్లింలు బాబ్రీ నిర్మాణంలో ఉపయోగించుకున్నారు అని కూడా నిర్ధారించాడు.

                   ది టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా; నవంబర్‌ 10, 2019

 (‌కానీ బుచానన్‌ ‌చూపించిన శాసనం నకిలీదని కిశోర్‌కునాల్‌ ‌రాశారు. ఆయన పోలీసు ఉన్నతాధికారిగా ఉండి, తరువాత చరిత్రకారునిగా మారారు. మరి బుచానన్‌ ఏ ఉద్దేశంతో ఆ శిలాఫలకాన్ని సృష్టించాడు? ముస్లింల హక్కును బలోపేతం చేసే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. అయోధ్య చరిత్ర ఇలా వక్రీకరణల పాలవుతూనే ఉన్నది. అయోధ్యపై తుది తీర్పు సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో చరిత్రకారుల వక్రభాష్యాల మీద వెలువడిన వ్యాఖ్యను చదవడం విభ్రమంగా ఉంటుంది.)

About Author

By editor

Twitter
Instagram