ధ్యాన గానం… నాద సుందరం

సంగీతం ఓ అనుభూతి. ఎదలో మెదిలి, పదంగా కదిలే గంధర్వ గీతి. అందులోనూ భారతీయ గాన కళ ఓంకార జనితం. వీనుల విందైన కర్ణాటక సంగీతమైనా, వేద సంబంధ హిందుస్తానీ అయినా దేనికి అదే సాటి. ప్రత్యేకించి భక్తి సంప్రదాయ సరిగమపదని.. సప్తస్వరాలే గాయనీ గాయకుల జీవన సర్వస్వాలు. ఆ సడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైత, నిషాదాలన్నింటికీ ప్రధాన మూలాధారాలు రాగం, తాళం. అదే స్వరధారతో అనంత జైత్రయాత్ర సాగించిన ధ్రువతార మన ఎం.ఎస్‌. ‌సుబ్బులక్ష్మి. దేశ పరమోన్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ సాధించిన పప్రథమ సంగీత రంగ కళాకారిణి ఆమె.

తమిళనాట పుట్టి, కర్ణాటక స్వర పక్రియ చేపట్టి, ఆసియా ఖండ నోబెల్‌గా విశ్వవిఖ్యాతి గడించిన రామన్‌ ‌మెగాసెసె బహూకృతినీ సొంతం చేసుకున్న విదుషీమణి ఎంఎస్‌! ‌గీత సామ్రాజ్య అధినేత్రిగా తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ నుంచి ప్రత్యక్ష ప్రశంస, అలాగే, సుబ్బులక్ష్మీ నైటింగేల్‌ అం‌టూ భారత కోకిల సరోజినీ నాయుడు కితాబునూ అందుకున్న ఘనాపాఠి. బాల్యం నుంచీ ఆమెపైనే నా ఆరాధన అని బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ అంటే, సాటిలేని మేటి విద్వాంసురాలన్న ప్రత్యేక మెప్పు సాక్షాత్తు పశ్చిమ బెంగాల్‌ ‌మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు నుంచే లభించడం నిస్సంశయంగా మదురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి ఘనత.

సంగీత సారస్వత సమలంకృత

దాదాపు 88 ఏళ్ల జీవితకాలం ఆమెది. పాట, మాట ఎప్పుడూ విలక్షణమే. ఏడు దశాబ్దాలకు పైగా సంగీత లక్ష్మిలా వెలుగొందారు. తెలుగు, తమిళం సహా పదకొండు భాషల్లో చేసిన కచేరీలు మొత్తంమీద 2,200. సంపాదన వైపు చూపు ఎన్నడూ లేదు. దానాలు, ధర్మాలు, విరాళాలు, ప్రజల మేలు కోసం కార్యక్రమాలతోనే సంవత్సరాలు గడిచాయి. అత్యంత విశిష్టత తన ఆహార్యంలోనే ఉంది. కనువిందైన నిండు రూపం, పెద్దరికానికి ప్రతీకగా పట్టుచీర, నుదుట చక్కటి కుంకుమబొట్టుతో గాన సరస్వతిలా భాసించే వారు. కృతులు, కీర్తనలు, దేశభక్తి గేయాలు, లలిత గీతాలు, జానపద పాటలు, భజనలు.. ఏవి పాడినా తనదైన ముద్ర ఆసాంతం ఉండేది. ఉచ్చారణ, నుడికారం, పలుకుబడి, ఆరోహ అవరోహణలు అన్నీ ఆమెకు మాత్రమే సాధ్యం. పాడుతున్నంతసేపూ వదనంలో ప్రశాంతత, గళంలో ప్రసన్నత. స్వరకల్పన ఏమైనా, రాగాలాపన ఏదైనా అందులోని అందం, కలిగించే ఆనందం అనుభవైక వేద్యం. ఎంతో లయ సంపన్నత, అసాధారణ ధారణ… ఆ మహనీయురాలి కీర్తికిరీటాన్ని ధగధగలాడించాయి.

పాటకు దీటైన నటన

ఆ ఒకే ఒక్క స్వరం అసంఖ్యాక జనవాహినిని మహదానంద తరంగితం చేసింది. అసలే తనది సంగీత కుటుంబం. అమ్మమ్మ వాయులీన నిపుణురాలు. అమ్మ వీణావాదనలో మిన్న. ఇంట్లో అన్నివేళలా గాత్ర, వాద్య చర్చలే. మాతృమూర్తితో కలిసి వెళ్లి వేదిక నుంచి గొంతు వినిపించినప్పుడు, ఎంఎస్‌కు (అప్పట్లో కుంజమ్మ అని ముద్దుగా పిలిచేవారు) పట్టుమని 12 ఏళ్లయినా లేవు. పదహారేళ్ల ప్రాయంలోనే మద్రాస్‌ ‌మ్యూజిక్‌ అకాడమీ వేదికపైనా ఆమె గీత మాధురి అందరికీ వీనుల విందు అందించింది. కాలక్రమంలో వెండితెర మీదా గానప్రతిభ పరిమళించింది. మీరా, సావిత్రి, శకుంతల, సేవా సదన్‌- ఒకటా రెండా అనేక చిత్రాలు. అన్నట్లు మీరాబాయిగా ప్రధాన పాత్రలో; ఇతర సినిమాల్లో మునికన్య, అత్యాధునిక లలనగా కూడా ఆ సౌందర్యవతి నటనను చూసితీరాల్సిందే. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సభావేదికపై సుబ్బులక్ష్మి గాన స్రవంతి చరిత్రాత్మకం. లండన్‌లో కచేరీ ద్వారా గాత్ర పరిపక్వతతో ఏకంగా ఇంగ్లండ్‌ ‌రాణినే ఆకట్టుకున్నారు.

సదా స్మృతిపథంలోనే…

కానీ, విధి విసిరిన కరవాలం ఆ బంగారుతల్లి మదిని కర్కశంగా తాకింది. అయిదున్నర దశాబ్దాలుగా సదా వెన్నంటి ఉండిన జీవిత భాగస్వామి శాశ్వతంగా వీడివెళ్లడంతో, సంగీత ప్రపంచానికి తానూ దూర మయ్యారు. పాట లేకుండా, ఏదీ మాట్లాడకుండా.. క్షణమొక యుగంగా గడుస్తుండగా.. పదహారేళ్ల కిందట ఒక రోజున తానూ గాన గంధర్వలోకానికి చేరు కున్నారు. భౌతికంగా సుబ్బులక్ష్మి లేకున్నా, సంగీతాత్మక ఆపాత మధురాలైన ఆ స్వర ఝరులున్నాయి. ఎన్నని చెప్పగలం, ఆ గళ పాండితికి ఎన్నెన్నో మెచ్చుతునకలు. అవి: సుప్రభాతం, భజగోవిందం, సహస్రనామ పారాయణం, కనకధారా స్తవం, దాసు-పురందరదాసు – కనకదాసు-సూరదాస్‌ల కీర్తనలు; మీరా- తులసీదాస్‌ ‌భజనల మేళవింపు. అప్పట్లోనే అమెరికా, రష్యా, జపాన్‌, ‌బ్రిటన్‌, ‌మరెన్నో దేశాల్లో పర్యటించిన కళానిధి ఆమె. మన భారత సంగీత కళా పతాకను ఖండాంతరాల్లో రెపరెపలాడించిన స్వర పారిజాతం ఎంఎస్‌ ‌సుబ్బులక్ష్మి ప్రతి ఒక్కరికీ ప్రాతః స్మరణీయురాలు.

– జంధ్యాల శరత్‌బాబు : సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram