ప్రపంచ వ్యవసాయ రంగం మీద గత పది సంవత్సరాలుగా పర్యావరణ మార్పులు పెను ప్రభావమే చూపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫయ్‌ ‌నాలుగు దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయంటే అతిశయోక్తి కాదు.

భారతదేశంలో సుమారుగా డెబ్బయ్‌ ‌శాతం మంది ప్రజలు వ్యవసాయమే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారు. అందులోనూ చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాల (కరవు, అకాల వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, ఈదురు గాలులు) కారణంగా చాలామంది రైతులు తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారు. దీంతో ఈ నష్టమంతా హెచ్చుస్థాయిలో కౌలు రైతులే మోయాల్సి వస్తున్నది.

ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ఇచ్చినా, మద్దతు ధరలు పెంచినా వ్యవసాయం లాభసాటిగా మారకపోవడానికి అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, జనాభా పెరుగుదల, పడిపోతున్న భూగర్భ జలాలే కారణమని అనేక సర్వేలు వెల్లడించాయి. అయితే ఇందుకు పరిష్కార మార్గాలు కూడా లేకపోలేదు.

పై పట్టికను ఒకసారి గమనిస్తే.. ఏడాది మొత్తంలో కురిసిన వర్షపాతం చూస్తే సాధారణంగానే నమోదైనట్లుగా కనిపిస్తున్నది. కానీ, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే, మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఆరు లేదా ఏడు రోజులలోనే కురుస్తున్నది. ఇది వ్యవసాయానికి ఏమాత్రం మంచిది కాదు.

మరొకవైపు ఏడాదిలో మూడు నుంచి నాలుగు నెలల వరకూ అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అలాగే 30-35 డిగ్రీలు ఉండవలసిన రోజువారీ ఉష్ణోగ్రతలు చాల చోట్ల 40-50 వరకు 10 నుంచి 15 రోజుల పాటు ఉంటున్నాయి. ఇవి భూగర్భ జలాలు, విత్తనం మొలకెత్తే విధానం, ఎరువుల వాడకం మీద ఎంతో ప్రభావం చూపి రైతులను అప్పుల పాల్జేస్తున్నాయి. కాలం ఏదైనా 1 నుండి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగడం వలన కూడా వర్షాధార పంటలకే కాక అన్ని పంటలకూ నష్టంవాటిల్లే ప్రమాదం ఉంది. దీనివలన చాలా మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారు.

పంటకు ఎరువు వేసి నీరు పెట్టినప్పుడు సాధారణంగా మూడు లేదా నాలుగు రోజులలో ఆ ఎరువు అంతా కరిగిపోయి మొక్క పెరుగుదలకు దోహదం చేస్తుంది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆ ఎరువు కరగకముందే భూమిలోని తేమను పీల్చేస్తున్నాయి. అందువలన మొక్క పెరగడం లేదు. దీంతో రైతు మళ్లీ ఎరువులు వేస్తున్నాడు. ఈ విధంగా రైతుకు పెట్టుబడి భారం కూడా పెరుగుతున్నది. అలాగే చీడపురుగుల (తెగుళ్ల) నివారణకు వాడే మందులు కూడా వృథా అవుతున్నాయి. అంతేకాదు, సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందంటే చాలు, 5 నుండి 8 శాతం పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితులలో విత్తనాలు మొలకెత్తే అవకాశం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటలు, చెరకు వంటి అధిక నీరు కావలసిన పంటల సాగు కూడా సాధ్యపడదు.

అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భజలాలు ఇంకిపోవడం, అకాల వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి ప్రకోపాలు ఇటీవల రైతును కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, పర్యావరణ మార్పుల కారణంగా వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయని, రైతుల పెట్టుబడికి దిగుబడికి మధ్య వ్యత్యాసం పెరుగుతున్నదని, దీంతో పండిన పంటకు, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు పొంతన ఉండటం లేదని, ఈ కారణంగా ఎందరో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస కూలీలుగా పోతున్నారని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అయితే, ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే, వాతావరణ మార్పులకు కళ్లెం వేయాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో 30 నుండి 50 శాతం వరకు కరవు, వరదలు, నీటికొరత, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో నష్టపోతున్న  రైతులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు దేశ పౌరులందరి మీద ఉంది. స్థానిక యువత తలుచుకుంటే రైతుల్ని ఈ పరిస్థితుల నుంచి కాపాడవచ్చు. ఆయా గ్రామాల్లోని యువకులందరూ ఏకమై రైతులను చైతన్యపరచేందుకు శిక్షణ/అవగాహనా తరగతులు నిర్వహించాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకునేలా వారిని చైతన్యపరచాలి. పర్యావరణ మార్పులను తట్టుకొని నిలబడే పంటలు సాగుచేసేలా వారిని ప్రోత్సహించాలి. అన్నదాతల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల గురించి అవగాహన కల్పించాలి. ఈ చర్యల ద్వారా రైతు నష్టాన్ని కొంతైనా నివారించే వీలుంది.

– కె.వి. నాగేశ్వరరెడ్డి

About Author

By editor

Twitter
Instagram