మా ఊరి చెరువును చూస్తుంటే నవాబుల పాలనలో సేద్యగాళ్లు ఎలాంటి పరిస్థితులు చవిచూడవలసి వచ్చిందో చెప్పగలదని అనిపిస్తుంది. అది కాకతీయుల కాలంలో తవ్వారు. మా కుటుంబం శంకరుని కుంటను నిర్మించింది. దీనివల్ల వర్షాకాలంలో పద్దెనిమిది ఎకరాల వరిపంటను కాపాడుకోవచ్చు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా మా తాతగారికి పదిహేడు రూపాయలు ఇచ్చేది. కానీ పది ఎకరాల మీద పన్ను రూపంలో 150 రూపాయలు వసూలు చేసేది. ఈ భూమి చెరువు కింద సాగులో ఉండేది.

చిత్రం ఏమిటంటే ఆ చెరువు కోసం నిజాం ప్రభుత్వం ఏనాడూ ఒక్క పైసా కూడా ఖర్చు చేసింది లేదు. నిజానికి ఈ చెరువులకు అవసరమయ్యే మరమ్మత్తులు చేసి, సక్రమంగా నిర్వహించి ఉంటే ఆ ప్రాంతంలోని సేద్యం అసలు ఒడిదుడుకులకు గురయ్యేదే కాదు.

ఈ ప్రాంత గ్రామాలలో రెండు రకాల పంటలు పండిస్తారు. ఒకటి తడారు పంటలు. రెండు మెట్ట పంటలు. తడారు పంటలు చెరువుల మీద ఆధారపడి ఉంటాయి. వీటిలో వరి పంట వేస్తారు. నీరు కూడా ఎక్కువ కావాలి.పైగా తడారు పంటల మీద పన్ను కూడా 9-10 రూపాయలు అధికం. అయితే చెరువుల మీద ఆధారపడి చేసే సేద్యం దాదాపు వేయి ఎకరాలే. మెట్టపంటల సాగు బావుల మీద ఆధారపడి ఉంటుంది. బావులు తవ్వుకుని, ఎద్దుల ద్వారా నీరు తోడి వినియోగించు కుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, ఇక్కట్లతో కూడుకున్నది కూడా. వీటి మీద పన్ను మాత్రం ఆనాడు సంవత్సరానికి అర్ధరూపాయి. మెట్టపంటలలో సాధారణంగా మొక్కజొన్న, కాయధాన్యాలు, కూరగాయలు ఉండేవి. వాణిజ్య పంటలు చెరకు, పత్తి 1930లలో వచ్చాయి.

సామాజిక పరిస్థితులు దుర్భరం. ఆర్థిక పరిస్థితి అంతా ఎగుడు దిగుళ్లు. విశ్వాసాల పరంగా అణచివేత. ఇలాంటి రోజులలో ఆనాటి మెజారిటీ ప్రజలతో పాటు మా కుటుంబం నమ్ముకున్న విశ్వాసాలను కనిపెట్టుకుని ఉంటూ జీవనం సాగించడమంటే, ఊహకు కూడా అందదు. కాఠిన్యానికీ, అసహనానికీ మారుపేరుగా ఉండే ఆరువందల ఏళ్ల ముస్లిం పాలనలో నెగ్గుకు రావడమంటే వారి ఆత్మస్థయిర్యం ఎంత గొప్పది! ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా ఏ సమాజమూ ఎదుర్కొని ఉండకపోవచ్చు. క్రీస్తుశకం 632లో మహమ్మద్‌ ‌ప్రవక్త కన్నుమూశారు. తరువాత నాలుగు సంవత్సరాలలోనే పర్షియా మొత్తం ఇస్లాంలోకి మారింది. అంటే 636 నాటికే ఇది జరిగింది. మరో మూడేళ్లకి అంటే 639 నాటికి ఈజిప్ట్ ‌సహా, తూర్పు ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా తీరం ఇస్లాం ప్రాబల్యంలోకి వచ్చాయి.  మనకు కూతవేటు దూరంలోనే ఉన్న అఫ్గానిస్తాన్‌, ‌మాల్దీవులు, మలేసియా, ఇండోనీసియా కూడా ఇలాగే శరవేగంతో ఇస్లాం ప్రభావంలోకి వచ్చాయి. కానీ నిజాం సంస్థానంలో హిందువులే  మెజారిటీ ప్రజలు. తానాషా వంటి వారు ఏ ఒకరిద్దరో తప్ప మిగిలిన అంతా పరమత సహనం అనే పదానికి అర్ధం తెలియనివారే. మా గ్రామంలో ముస్లిం కుటుంబాలు కేవలం మూడు. ఇది చాలు తెలంగాణలో ఎంత మత సహనం ఉన్నదో చెప్ప డానికి. అలాగే అలాంటి కాలంలో కూడా తెలుగును, తెలుగు సాహిత్యాన్ని, హిందూ మత విశ్వాసాలను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం జరిగిందో చెప్పడానికి మా తాతగారే మంచి ఉదాహరణ.

జంగంపల్లి ఖల్సా గ్రామం. పక్కనే ఉంది దోమకొండ. అది సంస్థానం. అది ‘రావు’ల ఆధిపత్యంలో ఉండేది. నిజాం ‘రావు సాహెబ్‌’ ‌బిరుదు ఇచ్చినప్పటి నుంచి వారు అలా ప్రఖ్యాతు లయ్యారు. అలా కొందరు రెడ్ల పేరు కూడా రావుగా మారింది. ఈ సంస్థానాల ప్రజల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ నుంచి పెద్దమొత్తంలో నిజాంకు వెళ్లేది. కొన్ని సందర్భాలలో ఆ ఊరి ప్రజలు గూండాల సాయంతో మా ఊరొచ్చి ఇక్కడి పంటలు తీసుకుపోతూ ఉండేవారు. అలాంటి దాడేదో జరుగుతుందని అనుమానం వస్తే మా ఊరి వారు ఆగమేఘాల మీద ఇంకా చెప్పాలంటే, రాత్రికి రాత్రే పంట కోసి ఇంటికి తరలించుకునేవారు. అలా ధాన్యం దొంగతనం జరగకుండా చూసుకునేవారు. సంస్థాన గ్రామాల ప్రజలు కట్టవలసిన భూమిపన్ను ఎంత అనేది స్థానిక అధికారుల దయాదాక్షిణ్యాల ఆధారపడి ఉండేది. వాళ్ల దయాదాక్షిణ్యాలు ఎలా ఉన్నా, అక్కడి పన్నులు కచ్చితంగా ఖాల్సా గ్రామాల పన్నుల కంటే హెచ్చుగానే ఉండేవి. జాగీర్లు, సంస్థానాలలో పన్నులు ఎక్కువే. అలాగే నవాన్‌గర్‌లో వివిధ రకాల పేర్లతో 41 పన్నులు ప్రజలు చెల్లించేవారు. ఇంట్లో పెళ్లి జరిగితే పన్ను. అంతేనా, పునర్‌ ‌వివాహానికైనా పన్ను కట్టుకోవలసిందే. పశువులను అమ్ముకున్నా పన్ను కట్టాల్సిందే.

కాకతీయుల తరువాత దక్కన్‌, ‌తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం బహమనీ వంశం. ఒకటో మహమ్మద్‌ ‌షా ఈ వంశీకుడే. ఇతడి ఘనత ఏమిటో ‘ఫెరిస్టా’ (మహమ్మద్‌ ‌ఖాసిం ఫెరిస్టా) ద్వారా తెలుస్తుంది. ఆయన పుస్తకం భారత్‌లో ముస్లిం పాలన విస్తరణ చరిత్రలో ఆ మహమ్మద్‌ ‌షా గురించి రాశాడు. అతడు కనీసం వందమంది అవిశ్వాసులను (ఇస్లాంకు బయటివారు) నరికితే తప్ప కత్తిని ఒరలో పెట్టేవాడు కాదట. ఆ నరకడంలోను ఎలాంటి వివక్ష కూడా లేవు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, బానిసలు, బానిసలు కానివారు ఎవరైనా బలి కావలసిందే. అలా ఎందరు? డెబ్భయ్‌వేల మంది. ఇంకొక బహమనీ వంశీకుడు ఒకటో అహ్మద్‌ ‌షా ఘనత కూడా తక్కువేమీ కాదు. ఇరవై వేల మంది అవిశ్వాసులను చంపిన తరువాత మూడు రోజుల విరామం ఇచ్చేవాడట. ఎందుకు? ఈ హత్యాకాండకు విజయసూచకంగా పండగ చేసుకోవడానికి. మా ఊరు కౌలా కోటకు దగ్గర దగ్గరగా 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

 ఇది కూడా జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇది బహమనీలదే కూడా. ఏనుగుల వీరాస్వామయ్య చెన్నపట్నం (నేటి చెన్నయ్‌) ‌నుంచి కాశీ క్షేత్రానికి వెళ్లిన దారి ఇదే. 1687లో గొల్కొండ కోట మీద దాడి కోసం ఔరంగజేబ్‌ ‌కూడా ఇదే దారిలో సైన్యంతో వచ్చాడు. మొగల్‌ ‌దండు ఎలా వెళ్లిందో మా ప్రాంతం పెద్దవారు వారికి తెలిసిన విషయాలు చెబుతుంటే చిన్నప్పుడు విన్నాను. సైనికులు వస్తుంటే, ఊళ్లు ఖాళీ అయ్యేవట. జనం అడవులలోకి వెళ్లేవారట. పశువులను మిగిల్చేవారు కాదు. కానీ చాళుక్యులు, కాకతీయుల సైన్యాలు వెళుతుంటే వారికి భోజన వసతి వంటివి కల్పించేవారట.

హిందువులు అనాగరికులని ముస్లిం పాలకుల ప్రగాఢ నమ్మకం. వీళ్లకి నాగరికత నేర్పాలన్న అత్యుత్సాహం వాళ్లకి చాలా ఉండేది. వాళ్లు ఎంతో నాగరికత తెలిసినవాళ్లమని నమ్మేవారు (ఇదే పంథా ఆంగ్లేయులు కూడా అనుసరించారు. తెలంగాణలో నేరుగా ఆంగ్ల పాలన లేదు). దీనికి పెద్ద సాక్ష్యం – జుల్ఫికర్‌ అలీ భుట్టో. ఇతడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ హిందువుల మీద, భారత్‌ ‌మీద ఆ ధోరణికి అద్దం పట్టే వ్యాఖ్యలే చేశాడు.

 నేను పుట్టినప్పుడు ఆ సంవత్సరం, ఆ సమయంలోని తిథివార నక్షత్రాల గురించి మా తాతగారు నమోదు చేశారు. సన్నగా పొడువుగా ఉండే రైతు ఆయన. హిందూ పంచాంగం ప్రకారం బహుధాన్య సంవత్సరంలో నేను పుట్టాను. ‘జగదాంబ (మా అమ్మ) మగశిశువుకు జన్మనిచ్చింది’ అని ఆయన రాశారు. ఆయనతో నాకున్న ఒకే ఒక్క జ్ఞాపకం- ఆయన గిలిగింతలు పెట్టారు. నేను నేల మీద చతికిల పడిపోయి గలగలా నవ్వుతున్నాను. సరిగ్గా అప్పుడే పొలం నుంచి వచ్చిన మా నాన్నగారు తలుపు తెరుచుకుని ఇంట్లోకి వచ్చారు. నాకు మూడేళ్ల వయసులోనే మా తాతగారు కన్నుమూశారు, వెన్నులో సమస్యతో.

నేను వైద్యశాస్త్రం చదివాను. ఇంగ్లండ్‌, ఆ‌స్ట్రేలియాలలో కూడా చదువుకుని వచ్చాను. పెద్ద పెద్ద ఆసుపత్రులలో పనిచేశాను. ఇవేవీ మా తాతగారు చూడలేదు. నేను వైద్య శాస్త్రానికే పరిమితం కాలేదు. చరిత్ర అధ్యయనంలో భాగమైన నాణేల పరిశోధన అనుకోకుండా నా జీవితంలో ప్రవేశించింది. మా పూజ గదిలో కొన్ని పాత నాణేలు ఉన్నాయి. వాటిని చూసిన తరువాత వాటిని అధ్యయనం చేయాలని అనిపించింది. భారతీయ నాణేల మీద కాశీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఒక గోష్టికి నేను అధ్యక్షత వహించాను కూడా. నల్లగొండ ప్రాంతాన్ని, ఆంధప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలని వేధిస్తున్న ఫ్లోరోసిస్‌ ‌వ్యాధి గురించి కూడా నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అయినా నియంతల పాలనలో స్వాభిమానంతో బతుకుతూ మా తాతగారు నాటి సమాజానికి అందించిన సేవలతో ఇవి సమానం కావేమో!

– డా।। దేమె రాజారెడ్డి, వ్యాసకర్త : న్యూరో సర్జన్‌, అపోలో

About Author

By editor

Twitter
YOUTUBE