హైదరాబాద్‌ ‌నగర కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం చివరిరోజు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా వచ్చారు. నవంబర్‌ 29‌న ఆయన నగరంలో ప్రచారం చేశారు. అక్కడితో ఆగలేదు. విమర్శల బంతిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కోర్టులో పడేసి మరీ విమానం ఎక్కారు. విలేకరుల సమావేశంలో అమిత్‌షా చెప్పిన ప్రతిమాట చాలా పదునుగానే ఉంది. ఎంతో లోతుగా కూడా ఉంది. అటు తెలంగాణ రాష్ట్ర సమితికే కాదు, ఇటు మజ్లిస్‌కు కూడా తగిలే విధంగా రెండువైపులా రాజకీయ పదును ఉన్న మాటలను ఆయన సంధించారు. అయినా ఆయన ఎక్కడా దిగజారి మాట్లాడలేదు. ఎవరినీ కించ పరిచి మాట్లాడలేదు. ఎంతో హుందాగా తన పర్యటన ముగించుకుని వెళ్లారు. కానీ ఆయన పర్యటన బీజేపీ శ్రేణుల మీద, తర్వారా ఓటింగ్‌ ‌మీద ప్రభావం చూపిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారంటే అదేమీ సత్య దూరం కాదు. అసహజం కూడా కాదు.

ఇవి ఒక కార్పొరేషన్‌ ఎన్నికలే అయినా బీజేపీ రాష్ట్ర శాఖ మహామహులను రప్పించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, జావడేకర్‌, ‌యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ‌మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, ‌బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య వంటివారు వచ్చి ప్రచారంలో తమదైన శైలిని ప్రదర్శించారు. కార్పొ రేషన్‌ ఎన్నికలే అయినా ఇంతమందిని దించడాన్ని ఆ పార్టీ సమర్థించుకుంది. దీని మీద అవతలి వారి విమర్శలకు నీళ్లు నమలలేదు కూడా.

 రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ప్రచారాన్ని ఏకఛత్రాధిపత్యంగా నిర్వహించిన ఆయన కుమారుడు, మంత్రి కె. తారకరామారావు నగర ప్రజానీకానికి నిజాలు చెప్పలేదా? వరద సాయం విషయంలో, డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో వాస్తవాలు వెల్లడించలేదా? కేంద్రం నుంచి పదిపైసలు కూడా రాలేదన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆరోపణలో వీసమెత్తు నిజం కూడా లేదా? అమిత్‌షా తన పర్యటన ముగించుకుని వెళ్లిన తరువాత వాటిని ఖండిచడానికి తగిన సమయమే ఉంది. కానీ తెరాస ప్రభుత్వ పెద్దలు ఆ పని చేయలేదు. నిజానికి అమిత్‌షా పర్యటనకు ఒక్కరోజు ముందే జరిగిన కేసీఆర్‌ ‌ప్రచార సభలో, ఆయన తన సహజ శైలిని నిలువరించారన్న అభిప్రాయం కూడా ఉంది. నిజం చెప్పాలంటే, తాను అప్పుడు ఏమి మాట్లాడినా మరునాడు అమిత్‌షా అంతటి దిగ్గజం దాని మీద వ్యాఖ్యానిస్తారు కాబట్టి ఆయనే సంయమనం పాటించారా? ఇదే నిజమని తరువాతి పరిణామాలను బట్టి అనిపిస్తుంది. అన్నింటికి మించి బీజేపీ మీద తెరాస, మజ్లిస్‌ ‌పార్టీలు మత ఆరోపణలకు దీటుగానే అమిత్‌షా స్పందించారు.

కేటీఆర్‌ ‌తన ప్రసంగంలో బీజేపీ మీద ప్రధానంగా ప్రస్తావించిన ఆరోపణ హిందూ-ముస్లిం విభజనకు ప్రయత్నిస్తున్నదనే. వారికి హిందువులు, ముస్లింలు, పాకిస్తాన్‌, ‌భారత్‌ ‌వైరం తప్ప మరొక ప్రచారాంశమే లేదని పదే పదే ఆరోపించారు. అలాగే వీటిని ఖండించడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం తన వంతు ప్రయత్నం చేసింది. చేయక తప్పదు కూడా. దీని మీద మళ్లీ కేటీఆర్‌ ‌ప్రతి విమర్శకు దిగేవారు. దీనికి అమిత్‌షా, నేను ఇప్పటి వరకు ఈ ప్రచారంలో హిందువు, ముస్లిం అన్న పదాలను ఉపయోగించలేదన్నారు. అంతేకాదు, 1947లో నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్‌కు అప్పగించాలని శతథా ప్రయత్నించిన వారు ఎవరో తెరాస చెప్పాలని సవాలు కూడా విసిరారు. నిజమే, ఎన్నికల వేళ దూరంగా ఉన్నట్టు నటిస్తూ, మిగిలిన రోజులలో మజ్లిస్‌ ‌తమ మిత్రపక్షమని, కలసి పని చేస్తున్నామని బాహాటంగా చెప్పే తెరాస, బీజేపీ మీద హిందూ మతోన్మాదం ముద్ర వేస్తున్న ఆ పార్టీ నేతలు ఇందుకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అసలు  తెరాస, మజ్లిస్‌ ‌మధ్య ఉన్న చీకటి ఒప్పందం గురించి చెప్పడానికి భయం ఎందుకని అమిత్‌షా నిలదీయడం అసహజం కాదు కదా!

హైదరాబాద్‌ ‌నగరంలో  రోహింగ్యాలు ఉంటే వారిని తిప్పి పంపించవచ్చు కదా అంటూ కేటీఆర్‌, ‌మజ్లిస్‌ ‌నాయకుడు అసదుద్దీన్‌ ‌పలుమార్లు విమర్శలు చేశారు. రోహింగ్యాల విషయంలో వారు ముందు నుంచి ముక్తకంఠంతోనే మాట్లాడుతున్నారు. రోహింగ్యాలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రయత్నిస్తే పార్లమెంట్‌లో రగడ సృష్టించినవారు ఎవరు అంటూ సూటిగానే అమిత్‌ ‌షా ప్రశ్నించారు. నిజానికి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న దాదాపు ఆరువేల మంది రోహింగ్యాల నేర కథనాలను ప్రముఖ తెలుగుపత్రికలు కూడా ప్రచురించిన సంగతిని విస్మరించడం సరికాదు. నగరంలో రెండుమూడు చోట్ల అక్రమంగా నివాసం ఉంటున్న సంగతినీ, వారితో పోలీసులకు ఎదురవుతున్న సమస్యల గురించి కూడా పత్రికలు రాశాయి. అయినా పాతబస్తీలో ఎవరూ విదేశీయులు లేరని చెప్పడం సత్యదూరమే అవుతుంది. దీనిని ప్రజలు కూడా బలంగానే విశ్వసిస్తున్నారు. లేకుంటే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పాత బస్తీ మీద సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌చేస్తామని సంచలన ప్రకటన చేసినా ప్రజల నుంచి ఎలాంటి ప్రతికూలత రాలేదు. పైగా దానిని సంయ్‌తో పాటు కేంద్రమంత్రి ఇరానీ కూడా సమర్ధించుకున్నారు. రోహింగ్యాలు ఉన్నారని ఆరోపిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి వారిని ఎందుకు వెనక్కి పంపించడం లేదని చాలా గడసరిగా ప్రశ్నించినవారికి అమిత్‌షా సమాధానం కళ్లు బైర్లు కమ్మేటట్టు చేసింది. రోహింగ్యాలను పంపేయమని మీరు లిఖిత పూర్వకంగా రాసివ్వండి. వాళ్లని ఎలా పంపాలో మాకు తెలుసు అన్నారాయన. కానీ, ఈ సవాలుకు అవతల నుంచి స్పందనే లేదు. హైదరాబాద్‌ ‌పాతబస్తీకి చెందిన మజ్లిస్‌ ఎంఎల్‌ఏ ఒకరు ప్రచార సభలో ఎంత తెంపరితనం ప్రదర్శించారో జనం గమనించారు. పాతబస్తీలో జనం కరెంటు బిల్లులు కట్టరట. మంచినీళ్ల కుళాయిల బిల్లులు కట్టరట. ఎంత వేగంగా వెళ్లినా పోలీసులు చలాన్లు రాయడానికి వణికి పోతారట? ఇదేమి సంస్కృతి, దీనికి మీరు ఏమంటారు అని కేటీఆర్‌ (‌పట్టణాభివృద్ధి శాఖమంత్రి కదా)ను ఒక టీవీ చానల్‌ ‌ప్రశ్నిస్తే, ఆయన కనీసం జవాబు ఇవ్వలేదు. అది ఇప్పుడెందుకు అని నిష్కర్షగా కొట్టి పారేశారు. కానీ ఆ బకాయిలు వందల కోట్లు. ఇది ఎవరి సొమ్ము? ఒక వర్గం తప్పిదాలను ఇలా ఓట్ల కోసం చూసీ చూడనట్టు వదిలేస్తే, అది ఎప్పటికైనా పీకకు చుట్టుకోదా? దీనిని బట్టి మజ్లిస్‌ అరాచకాలకు తెరాస ఊతం ఇస్తున్నదని ఎవరైనా విమర్శిస్తే అది అసహజమా?

ఇటీవలి భారీ వర్షాలు, వరదలు తెరాసను బురదలో కూరుకుపోయేటట్టు చేశాయంటే అతిశయోక్తి కాదు. దుబ్బాక పెనుగాలి నుంచి తప్పించుకోబోయి తెరాస ఈ బురదలో కూరుకుపోయింది. వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఏడు లక్షల కుటుంబాలవారు పడరాని పాట్లు పడ్డారు. దీనికి కారణం మజ్లిస్‌ ‌కనుసన్నలలో జరిగిన ఆక్రమణలేనని అమిత్‌షా సూటిగానే బాణం విసిరారు. ఈ ‘బక్కోడిని’ డీ కొట్టడానికి ఢిల్లీ నుంచి అంతమంది రావాలా అంటూ కేసీఆర్‌ ‌తన పాత పాటను ఇప్పుడు కూడా వినిపించడం ఎంతో వెగటు కలిగించే విషయం. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఆయన బయటకు రాలేదు అన్నమాట అక్షరసత్యం కాదా? పైగా ఒక్కమాట కూడా మాట్లాడరు. ఆ వరదల సమయంలో కూడా జనం పడరాని పాట్లు పడుతూ ఉంటే కేసీఆర్‌ ‌గానీ, అసదుద్దీన్‌ ‌గానీ పరామర్శించిన పాపాన పోలేదన్నది నిజం. కనీసం కార్పొరేషన్‌ ‌సమావేశమైనా ఎందుకు నిర్వహించలేదని అమిత్‌ ‌షా వేసిన ప్రశ్నకు వారి దగ్గర సమాధానం ఉందా?

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌కింద రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇచ్చామని అమిత్‌షా కుండబద్దలు కొట్టారు. కానీ ఇంతవరకు కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌రాష్ట్రానికి కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదనే చెబుతూ వచ్చారు. మరొక ప్రధాన విమర్శ- లక్షల ఇళ్లు. అంటే డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లు. పేదల కోసం లక్ష ఇళ్లు నిర్మించామని తెరాస చెబుతూనే ఉంది. రెండు మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ ‌నేత భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఈ అం‌శం మీద బాహాబాహీ తలపడిన సంగతి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అమిత్‌షా దీనికి రంజైన ముగింపే ఇచ్చారు. లక్ష ఇళ్లని చెప్పినా కట్టినవి దాదాపు 1100 అని తేల్చి చెప్పేశారు. కేంద్రం ఎంత మంజూరు చేసినదీ తెలియాలంటే సచివాలయానికి వెళితేనే సాధ్యమని కర్రు కాల్చి వాత పెట్టారు అమిత్‌షా. నిజానికి తెరాస పూర్తి చేయలేకపోయిన అనేక పథకాల గురించి అమిత్‌షా ఏకరువు పెట్టారు. పదికోట్లతో డంపింగ్‌ ‌యార్డుల అభివృద్ధి ఏమైంది? మూసీ తీరం వెంట ఆరు రోడ్లు ఏమైనాయి? నగరం కోసం ఏటా పదివేల కోట్లు ఇచ్చారా? గాంధీ, ఉస్మానియాలలో రోగుల ఒత్తిడి తగ్గించడం కోసం అలాంటివే మరొక నాలుగు నిర్మిస్తామన్న హామీ ఎంత వరకు నెరవేర్చారు? అని ప్రశ్నించిన అమిత్‌షా, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్, ఈఎస్‌ఐ ‌వైద్యకళాశాల ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ను రాజకీయాల కోసం రాష్ట్రంలో అమలు చేయలేదని కూడా కేంద్ర హోం మంత్రి విమర్శించారు. అందువల్ల రూ. 5 లక్షల వైద్య బీమా సౌకర్యం పేదలకు లేకుండా పోలేదా అని ఆయన ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్లతో 30 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ఇచ్చింది కేంద్రం కాదా అని నిలదీశారా యన. పట్టణాలో చిరు వ్యాపారులకు కేంద్రం రుణ పథకం కింద రుణాలు ఇచ్చాం. మూడు లక్షల మంది దీనితో లబ్ధి పొందితే అందులో తెలంగాణ వారు ముప్పయ్‌ ‌వేల మంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు.  వందరోజుల ప్రణాళిక, సిటిజన్‌ ‌చార్టర్‌, ‌నల్లా కనెక్షన్లు… ఇవన్నీ ఏవీ, ఎక్కడ అని కూడా ఆయన ప్రశ్నలు గుప్పించారు.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మిస్తానంటూ రెండోసారి మళ్లీ ప్రకటించడం కూడా వికృతంగానే ఉంది. కాంగ్రెస్‌, ‌బీజేపీ లేని కూటమి నిర్మిస్తారట. ఇది సాధ్యమా? అసలు దేశంలో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ పంచన చేరని పార్టీలు ఎన్ని మిగిలి ఉన్నాయి? ఇది కేసీఆర్‌కు తెలియదనే అనుకోవాలా? లేక, తాటాకు చప్పుళ్లుగా వదిలేయాలా? ఇలాంటివి ఆయన ప్రతిష్టను వరసగా మసకబారుస్తున్నాయి. ఒకటి నిజం, రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఇదీ కేసీఆర్‌కు కరతలామలకమే.

కరోనా, లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మోదీ విధానాల వల్ల భారత్‌కు పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఎక్కువ ఐటీ పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చాయి అని కూడా కేంద్ర హోంమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ను మినీ ఇండియాగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ఆయన ప్రకటించడం ఆహ్వానించదగినది కాదా? ఎన్నికలు చిన్నవీ పెద్దవీ కాదు, బీజేపీ అన్నింటిని పోరాట పంథాతోనే ఎదుర్కొంటుందని, ఇలాంటి ఎన్నికలకు గతంలోను మా పార్టీ నాయకులు వెళ్లారని కూడా అమిత్‌షా నిర్మొహమాటంగా చెప్పారు. గల్లీ ఎన్నికలంటూ వీటిని ఎద్దేవా చేయడం గురించి ఇది దీటైన జవాబే. దక్షిణాదిన కర్ణాటక తరువాత అధికారం చేపట్టే అవకాశం తెలంగాణలో కనిపిస్తున్నది. అందుకు మా పార్టీ శ్రమిస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఇప్పుడు జీహెచ్‌ఎం‌సీ గెలుస్తాం, రేపు రాష్ట్రంలో అధికారం చేపడతాం అని ఆయన ఎలాంటి శషభిషలు లేకుండానే ప్రకటించారు. దీనిని ఎవరైనా ఎందుకు తప్పు పట్టాలి? నవాబుల పాలన నుంచి, కుటుంబ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తాం. నిజమైన ప్రజా తెలంగాణను నిర్మిస్తాం అని ఘంటాపథంగా అమిత్‌షా ప్రకటించి సాధారణ ప్రజానీకాన్ని తట్టి లేపారు. తెరాస మీద ప్రజా వ్యతిరేకతకు అంకురం ఎక్కడ అంటే, కుటుంబ పాలన విషయంలోనే.

కేసీఆర్‌లో నాయకత్వ లక్షణాలను ఎవరూ కాదనలేరు. కానీ మజ్లిస్‌ ‌వంటి పార్టీ ఆడమన్నట్టల్లా ఆడతారనే అభిప్రాయం ఆయన కలిగించుకోవడం ఆయన తిరోగమనానికి బాట వేయడం లేదా? కొన్ని విషయాలలో ఆయన కేంద్రంలోని బీజేపీకి కూడా మద్దతు ప్రకటించారు. కానీ మంచి పనుల కంటే తప్పటడుగులే ఎక్కువగా కనిపించేటట్టు చేసుకుంటు న్నారు. రెండుసార్లు శాసనసభలో ఘనమైన మెజారిటీ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌, ఇప్పటికీ బక్కోడిని, నా మీద ఇంతమంది దాడా? అంటూ మాట్లాడడం తనను తాను దిగజార్చుకోవడమేనని ఎందుకు అనుకోవడం లేదు?

అమిత్‌షా విసిరిన సవాళ్లు, వేసిన ప్రశ్నలు కేవలం ఎన్నికలకు సంబంధించినవి కావని అర్ధమయి ఉంటుంది. అభివృద్ధి గురించి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రికి విసిరిన సవాళ్లు. ఏ విధంగా చూసినా ఇప్పుడు విమర్శల పోటీలో బంతి కేసీఆర్‌ ‌కోర్టులో ఉంది. ఆయన ఏం చెబుతారో, ఆయన తరువాతి అడుగు ఎటో చూడాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram