షెహ్లా రషీద్‌- ఈ ‌పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ యువతి జేఎన్‌యు విద్యార్థి నాయకురాలు. అంతకు మించి ‘ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం’ అని రంకెలు వేసిన కన్హయకుమార్‌ ‌మూకలో సభ్యురాలు. అక్కడి విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా గతంలో పనిచేశారు. పేరుకు ఆ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ పరిశోధక విద్యార్థి. చేసేవన్నీ విద్రోహ చర్యలే. ముస్లిం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఈమె చేస్తున్న పనులలో ఒకటి. ఈ మాట అంటున్నది రిపబ్లిక్‌ ‌టీవీ చానెల్‌ ‌లేదా ఇతర హిందూ సంస్థల పత్రికలు కానే కాదు. సాక్షాత్తు ఆమె తండ్రే ఇంత తీవ్ర ఆరోపణలు చేశారు.

2020, నవంబర్‌ 30‌న షెహ్లా తండ్రి అబ్దుల్‌ ‌రషీద్‌ ‌షోరా జమ్ముకశ్మీర్‌ ‌పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌దిల్‌బాగ్‌ ‌సింగ్‌కు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో విషయాలు ఇలా ఉన్నాయి. ముస్లిం ఉగ్రవాదులకు నిధులు అందిస్తారన్న ఆరోపణలు ఉన్న జహూర్‌ ‌వతాలి, రషీద్‌ ఇం‌జనీర్‌ అనే వాళ్ల నుంచి షెహ్లా మూడు కోట్ల రూపాయలు తీసుకుంది. అలాగే ఆమె నుంచి (కూతురు నుంచి) తనకు ప్రాణహాని ఉందని కూడా ఆరోపించారు. నా ఇంట్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అని కూడా ఆయన ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు.
నా కూతురు షెహ్లా రషీద్‌ ‌షోరా, నా పెద్ద కూతురు ఆస్మా రషీద్‌, ‌నా భార్య జుబేదా షోరా, షెహ్లా అంగరక్షకుడు సాకిబ్‌ అహ్మద్‌ల నుంచి కూడా నాకు ప్రాణహాని ఉంది అని అబ్దుల్‌ ‌రషీద్‌ ఆరోపించారు. జాతీయ మీడియాలో విరివిగా ప్రసారమైన ఆ ఫిర్యాదు సారాంశం:
ఇదంతా 2017లో షెహ్లా హఠాత్తుగా జమ్ముకశ్మీర్‌ ‌రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత ఇదంతా జరిగింది. షెహ్లా మొదట నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌లో చేరారు. తరువాత జమ్ముకశ్మీర్‌ ‌పీపుల్స్ ‌మూవ్‌మెంట్‌ ‌పార్టీలో చేరారు. ఈ పార్టీని మాజీ ఐఎఎస్‌ అధికారి షా ఫైయాసల్‌ ‌స్థాపించాడు. ఇంకా ఆశ్చర్యం, తాను జమ్ముకశ్మీర్‌ ‌రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినప్పుడు ఆమె సీపీఎం సభ్యురాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసుకు సంబంధించి జహూర్‌ ‌వతాలిని యుఏపీఏ చట్టం కింద అరెస్టు చేయడానికి రెండుమాసాల ముందు 2017 జూన్‌లో అతడు షెహ్లా తండ్రిని శ్రీనగర్‌లోని తన ఇంటికి పిలిచాడు. ఇతనితో పాటే రషీద్‌ ఇం‌జనీర్‌ (‌మాజీ శాసనసభ్యుడు) కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు షెహ్లా తన పరిశోధన చివరి సెమిస్టర్‌లో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ ‌పీపుల్స్ ‌మూవ్‌మెంట్‌ ‌పార్టీ ఆరంభిస్తున్నామనీ, అందులో షెహ్లాను చేర్చి మద్దతు ఇవ్వవలసిందని వతాలి కోరాడు. నిజానికి ఇదొక గేమ్‌ప్లాన్‌ (ఇది జరిగిన కొద్దికాలానికే జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ- ‌రంగ ప్రవేశంచేసింది. 2017లోనే ఇతడిని అరెస్టుచేశారు. పాక్‌ ‌గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ‌నుంచి డబ్బు తీసుకుని దానిని కశ్మీర్‌ ఉ‌గ్రవాదులకు అందచేయడమే ఇతడి పని. ఇతడు హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకుడు అబ్దుల్‌ ‌గనీ లోన్‌కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అప్పుడే ఐఎస్‌ఐ ‌ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 2019 ఆగస్ట్‌లో వతాలి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌స్వాధీన పరుచుకుని, రెండు దఫాలుగా 6.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. 2019లోనే రషీద్‌ ఇం‌జనీర్‌ను కూడా అరెస్టు చేశారు). ఆ సమావేశంలోనే షెహ్లాకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వజూపారు. అది అక్రమ మార్గాలలో వచ్చిన డబ్బు, అలాగే అకృత్యాల కోసం వినియోగించే డబ్బు కాబట్టి తీసుకోనని షెహ్లా తండ్రి చెప్పారు. షెహ్లాను తీసుకోవద్దని, అలాంటి మనుషులకు దూరంగా ఉండమని కూడా ఆయన చెప్పాడు. అయితే షెహ్లా అక్క ఆస్మా, తల్లి జుబేదా ఆ ఒప్పందంలో భాగస్వాములు కావడానికి మద్దతు పలికారు. షెహ్లా అంగరక్షకునిగా పరిచయం చేసిన సాకిబ్‌ ‌కూడా అందులో చేరాలని భావించాడు. ఇది జరిగిన వారం తరువాత షెహ్లా ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ ‌వచ్చినప్పుడు ఆ డబ్బు తనకు అందిన సంగతిని తండ్రికి తెలియచేసింది. ఈ విషయాలలో ఏ ఒక్కటి కూడా బయటకు చెప్పవలసిన అవసరం లేదని కూడా పరోక్షంగా హెచ్చరించింది. ఆ డబ్బును తాను తీసుకున్నానని, భవిష్యత్తులో ఇంకా వస్తుందని కూడా ఆమె తండ్రికి చెప్పింది. కానీ అలాంటి వ్యక్తులతో కలవడం పట్ల షెహ్లా తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే తన ఇంటిలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని బలంగా నమ్ముతున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో సాకిబ్‌ ఎప్పుడు ఒక పిస్తోలు వెంట తీసుకువెళుతూ ఉంటాడు. షెహ్లా తండ్రి కూతురి కార్యకలాపాలకు నిరంతరం అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. దీనితో ఇల్లు వదిలి పోవాలని ఆ ముగ్గురు స్త్రీలు, సాకిబ్‌ల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఆయనను ఇంటి నుంచి గెంటివేయడానికి షెహ్లా, ఆమె తల్లి ఒక కుట్ర పన్నారు. గృహహింస చట్టం కింద శ్రీనగర్‌ అడిషనల్‌ ‌మునిసిఫ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దీనితో ఇంటి నుంచి దూరంగా ఉండాలని షెహ్లా తండ్రిని కోర్టు ఆదేశించింది. అయితే రెండో అదనపు సెషన్స్ ‌న్యాయమూర్తి (శ్రీనగర్‌) ‌నుంచి ఆయనకు కొంత సాంత్వన లభించింది. ఆ ఇంటిలో ఉండడానికి ఈ న్యాయ మూర్తి కొన్ని షరతులతో అనుమతించారు. కానీ పోలీసులు ఆ ఆదేశాలను అమలు చేయడానికి సహకరించలేదు. అయినా కోర్టు ఆదేశాలను పట్టుకుని ఆయన ఇంటికి వెళ్లారు. దీనితో సాకిబ్‌ ‌చంపుతానని బెదిరించడంతో కశ్మీర్‌ ‌నుంచి జమ్ము పారిపోయారు. అందుకే తన ఇంటిలో తాను ప్రవేశించడానికి పోలీసులు సహాయం ఇవ్వవలసిందిగా కూడా ఫిర్యాదులో కోరారు.
షెహ్లా అంటే వామపక్ష ఉదారవాద మీడియాకు ఆరాధన. ‘ఇలాంటి యువ గళాలే ఈ దేశానికి కావాలం’టూ ‘ది వైర్‌’ ‌వెబ్‌సైట్‌ ‌ఘనంగా వ్యాఖ్యా నించింది. ఈ తరహా ప్రచారం, ఇందులోని కుట్రలను కొందరు ఇప్పటికే గ్రహించారు. అసలు ఆ షెహ్లా తలలో ఏమీ లేదు. ఆ అమ్మాయి కేవలం మీడియా సృష్టి అని జస్టిస్‌ ‌మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించడం విశేషం. కన్హయ కుమార్‌, ఉమర్‌ ‌ఖాలిద్‌ (ఇతడు కూడా ఇప్పుడు దేశద్రోహం కేసు విచారణలో ఉన్నాడు)లు కూడా ఇలాగే మీడియా వత్తాసుతో పేరు తెచ్చుకున్నవాళ్లేనని కూడా ఆయన చెప్పారు. వాళ్ల వాచాలత మూర్ఖత్వానికి పరాకాష్ట అని కూడా ఆయన కొట్టిపారేశారు. వాళ్లే మేధావులయితే ఇస్లాంలో ఉండే షరియా, బుర్ఖా, మదరసాల గురించి ఎందుకు మాట్లాడరు అని జస్టిస్‌ ‌కట్జూ ప్రశ్నించారు. ఇలాంటి వికృత రూపాలు ఈ దేశానికి అవసరం లేదని కూడా అన్నారు. మీడియా ఎంత ఘోరంగా ఉందంటే బర్ఖాదత్‌ అనే జర్నలిస్ట్ ‌జామియా మిలియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆయేషా రెన్నా, లాదీదా ఫర్జానాలను ‘షీరోలు’గా వర్ణించింది. వీళ్లంతా తరువాత ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్లిపోయారు. ఇందులో రెన్నా అనే యువతి, ముంబై పేలుళ్ల నేరగాడు యాకూబ్‌ ‌మెమెన్‌ను ఉరి వేసి నందుకు భారత్‌ను ఫ్యూడల్‌ ‌దేశంగా విమర్శించింది. లాదీలా జీహాద్‌ను బాహాటంగా సమర్ధించింది.
ఈ ఆరోపణల గురించి ఏమంటారు అంటూ ఏబీపీ న్యూస్‌ ‌చానల్‌ ‌షెహ్లాను ఫోన్‌ ‌ద్వారా నిలదీసింది. అయితే దీనికి సమాధానం ఇవ్వకుండా షెహ్లా తన మీద ఉన్న కోర్టు కేసుల గురించి ఏకరువు పెట్టడం ఆరంభించింది. అయినా వదలకుండా యాంకర్‌ ‌భదౌరియా మళ్లీ ప్రశ్నించాడు. తాను కోర్టులోనే ఏదైనా మాట్లాడతానని చెప్పి ఏమీ చెప్పకుండా లైన్‌ ‌కట్‌ ‌చేశారు. తన తండ్రి పరాన్నజీవి అని, తన తల్లిని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని, తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణం ఏమిటో చెప్పాలని మరొక సందర్భంలో షెహ్లా ఎదురు ప్రశ్నించింది.
టుక్టేటుక్డే మూకకు ఇదొక గీటురాయి. జేఎన్‌యులో వీళ్లు చేసిన అరాచకాలు బయటకు రావడం లేదు. మెస్‌, ‌వసతి రుసుములు పెంపుకు నిరసన పేరుతో వీళ్లు పరమ అప్రజాస్వామికంగా ఆందోళన మొదలుపెట్టినప్పుడే చాలా విషయాలు దేశం దృష్టికి వచ్చాయి. కసబ్‌ను ఉరి తీసినందుకు వీళ్లంతా తీవ్రంగా మనస్తాపం చెందారట. అందుకే ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. షర్జిల్‌ ఇమామ్‌ అనే వాడు కూడా ఈ యూనివర్సిటీ ఉత్పత్తే. వీళ్లందరికీ అక్కడి కొందరు ఆచార్యుల సంపూర్ణ మద్దతు ఉంది. అలాగే రాహుల్‌గాంధీ, సీతారామ్‌ ‌యేచూరి, యోగేంద్ర యాదవ్‌, ‌స్వర భాస్కర అనే గాయని ఇంకా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి పరామర్శించి, వాళ్ల అలజడికి మద్దతు తెలిపి వచ్చారు. ప్రకాశ్‌రాజ్‌ అనే ఒక నటుడికి షెహ్లా రషీద్‌లో భావి మహానేత కనిపించింది. ఈ దేశ యువతకు ఆదర్శనీమైన వ్యక్తిత్వం కనిపించింది. ఇవన్నీ జరిగారూ విశ్వవిద్యా లయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివేకానంద ప్రతిమకు అపచారం జరిగింది.

టర్కీ తెంపరితనం

కశ్మీర్‌ అం‌శంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న ఒకటి రెండు అమాంబాపతు దేశాలలో టర్కీ ఒకటి. ఈ దేశానికి ఐరోపా జబ్బు మనిషి అన్న బిరుదు ఉంది. ఈ మధ్య కాలంలో ఆ జబ్బు ఎలాంటిదో మన దేశానికి కూడా తెలుస్తున్నది. ఇప్పుడు ఈ జబ్బు మనిషి ఇంకో అడుగు ముందుకు వేసింది. తూర్పు సిరియాకు చెందిన కిరాయి మూకలను కశ్మీర్‌ ‌పంపే పని భుజస్కంధాల మీద వేసుకుంది. ఎఎన్‌ఎఫ్‌ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ విషయం వెల్లడించింది. సిరియా కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ సులేమాన్‌షా బ్రిగేడ్స్ ‌త్వరగా కశ్మీర్‌లో ప్రవేశించాలని దాని నాయకుడు అబు ఇమ్షా సూచించాడట. కశ్మీర్‌ ‌వెళ్లే ఉగ్రవాదుల జాబితా త్వరలో తయారై, అది టర్కీ అధికారుల ముందుకు వెళుతుందట కూడా. పేరు నమోదు చేయించుకున్న వాళ్లందరికీ తలా రెండు వేల డాలర్ల వంతున వేతనం కూడా ఇస్తారట. ఇదంతా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ‌కుట్రేనట. ఆండ్రియాస్‌ ‌మౌంట్‌జొరాలియస్‌ అనే గ్రీక్‌ ‌జర్నలిస్ట్ ఇదంతా వెల్లడించాడట. కానీ భారత్‌లో టర్కీ రాయబారి యథాప్రకారం ఇవన్నీ అబద్ధాలని ఖండించాడు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram