చేతివృత్తుల దుస్థితి మీద కత్తులు దూసిన కలాలు

స్వాతంత్య్రానికి పూర్వం, తరువాత కూడా ఇక్కడ వ్యవసాయమే ప్రధానవృత్తి. 20వ శతాబ్ది ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో నాగలి పట్టిన రైతు పొలంలో అరక దున్నే దృశ్యం తెలుగు ప్రాంతాలతో పాటు, దేశమంతటా సర్వసాధారణం. వ్యవసాయానికి అనుబంధంగా కమ్మరి, కంసాలి, కుమ్మరి, చేనేత వంటి వృత్తులు కుటీర పరిశ్రమలుగా, పలువర్గాల వారికి జీవనోపాధి మార్గాలుగా ఉండేవి.

జాతీయోద్యమంలో గాంధీజీ ప్రవేశించకముందు సంఘ సంస్కరణోద్యమం, రాజకీయోద్యమం రెండూ విడివిడిగా సాగేవి. అప్పట్లో సాహిత్యంలో సంఘ సంస్కరణకు కవులూ, రచయితలూ ప్రాధాన్య మిచ్చేవారు. గాంధీజీ ఆ రెండు ఉద్యమాలను సమన్వయం చేశారు. వీటిలో బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఒక పార్శ్వమైతే, దేశ పునర్నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమం మరొకటి. ఖద్దరు ప్రచారం, మహిళాభ్యుదయం, గ్రామాభ్యుదయం, మతసామరస్యం, అస్పృశ్యతా నిరసన, మద్యపాన నిషేధం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు ఇందులో భాగమే. ఇవి ప్రజానీకంలో ఆర్థిక స్వావలంబననూ, సాంస్కృతిక సంక్షేమ స్ఫూర్తినీ పెంపొందించేవి.

జాతీయోద్యమం కాలంలో ప్రధానంగా ఖద్దరు ధారణ, ఖద్దరు ప్రచారం కేవలం దేశభక్తికి చిహ్నాలేకాక, ఆర్థికపరమైన స్వయంసమృద్ధిని కలిగించేవి. జాతీయోద్యమ కవి గరిమెళ్ల సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే పాట ఆంగ్లేయుల మీద కలం ఎగరేసిన తిరుగుబాటు బావుటా.  గాంధీజీ ఆశయాల మీద బ్రిటిష్‌ ‌ప్రభుత్వ  నిషేధం ఎంత తీవ్రంగా ఉండేదంటే-‘గాంధీ టోపీ పెట్టి పాఠశాలలోకి రావద్దు రావద్దంటాడు/రాజద్రోహమంతా రాట్నములోనున్నదంటాడు’. అప్పట్లో రాట్నం విదేశీ వ్యతిరేకతకూ, స్వదేశీ ప్రీతికీ చిహ్నం. ఆత్మ గౌరవ ప్రతీక. విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్రధారణకు ఆటపట్టు రాట్నమే. స్వదేశీ ఉద్యమానికి మూలమైన రాట్నాన్ని మరుగు పరచాలని బ్రిటిష్‌ ‌జాతి అన్ని విధాలా ప్రయత్నించింది.

కొండపల్లి జగన్నాథదాసు ఖద్దరు ప్రచారం కోసం రాసిన పాట అప్పట్లో బాగా ప్రచారం పొందింది. ఇందులో ‘నూలు వడికే విధము తెలియండి / సాలుకరువది కోట్ల రూపాయలు వ్యర్థముగాను / పరదేశాలపాలు సేయబోకండి’ అంటాడు కవి. విదేశీ వస్త్రాలకు అప్పట్లో సాలుకు రూ.60 కోట్లు ఖర్చు చేసేవారు. స్వదేశీ ఖద్దరు వస్త్రాలను ధరించి ప్రయోజనం పొందమన్న ఈ గేయం బాగా ప్రచారం పొందింది. ఖద్దరు ప్రాధాన్యాన్ని వివరించింది.

కవికొండల వేంకటరావు ‘మాతృదేశ సంకీర్తనం’ పేరుతో వెలువరించిన గీతాలలో ‘రాట్నం’ అనే గేయం (1924) ‘పల్లె పల్లెకు చేరి ఖద్దరు ఉద్యమానికి ఉద్యుక్తులని చేసింద’ని డా।।మద్దూరి సుబ్బారెడ్డి ‘జాతీయోద్యమ కవిత్వం’ సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నాడు. జాతీయోద్యమంలో మంగిపూడి వే•ంకటశర్మ సీమబట్టలు కట్టేవారిని ‘‘సీమబట్టలు మానవెందుకురా, సిగ్గురా’ అంటూ అధిక్షేపించాడు. గరికపాటి మల్లావధాని ‘విదేశీ వస్త్రాలు వద్దనీ / స్వదేశీ వస్త్రాలు ముద్దు’ అనీ ఖద్దరు వంటి చేనేత వృత్తులను, కుటీర పరిశ్రమలను దెబ్బ తీసిన విదేశీ వస్త్రాలు తగదని హితవు పలికాడు.

నెల్లూరి వెంకట్రామానాయుడు గాంధీజీ ఆశయాల ప్రచారంలో భాగంగా నూలు వడకమన్న ప్రబోధంతో ‘పెట్టరే రాట్నము / ఓ తల్లులారా! మీరింకనైనను’ అంటూ రాట్నంపై నూలు వడికేందుకు సంసిద్ధులు కావాలన్న ప్రబోధం చాలామందిని ప్రభావితం చేసింది. రాట్నం పెట్టి నూలు వడకడం అప్పట్లో వ్యక్తిత్వ గౌరవానికి సంకేతం. బట్టలు నేయడం ఉన్నత పౌరసత్వ భావన. భరతమాత కట్టుకొనేందుకు బట్టలు లేక  పేదరికంతో అలమటిస్తున్నదనీ, ఆమెకు ఊరట కలిగించేందుకు రాట్నం వడకమనీ చెప్పే ఈ రచన చాలామంది మహిళల్లో చైతన్యాన్ని కలిగించి, నూలు వడికేందుకు సంసిద్ధులను చేసింది.

 మహాకవి జాషువా జాతీయోద్యమంలో రాట్నపు శక్తిని వర్ణిస్తూ ‘రాటపు ఝాంకృతుల్‌ ‌భరత రాజ్యమునిండ ప్రతిధ్వనింపగా/ రాటమునందెనుగ్ర సమర స్థిర సీమనృపాల సంహముల్‌, ఆటమబాంబు గోళ చటులాగ్నికి జంకని మేటి శక్తి మా పేటల పల్లెలందు ప్రభవించె’ అంటాడు కవి. ఆటంబాంబుకు సైతం జంకని సీమ నృపాల సింహాలు స్వరాజ్య జయాభిరామ రాట్నపు ఝంకార ధ్వనితో  తల్లడిల్లాయట. జాషువా స్వరాజ్య జయాభిరామగా రాట్నాన్ని వర్ణించడం ఔచిత్యంగా ఉంది. విదేశీ వస్త్రదహనంతో, రాట్నంతో నూలు వడికి స్వదేశ వస్త్రాలు నేయించడంతో బ్రిటిష్‌ ‌వారి కోట్లాది ఆదాయం తరిగిపోయింది. అందుకే రాట్నం స్వరాజ్య జయాభిరామని పేర్కొన్నాడు మహాకవి. అప్పట్లో ఖద్దరు వస్త్రాల్లో చాలా నాణ్యమైన, నాజూకైన వస్త్రాలు నేయగల నిపుణులు దేశ విదేశీయుల మెప్పు పొందినవారుండేవారని చరిత్ర. చేనేత గ్రామీణ ప్రాంత ఆర్థిక స్వావలంబనకు ఆధారమైంది. అందుకే స్వరాజ్య సాధనకు మూలకారణమైంది. జాషువా ‘స్వరాజ్యదాయిని నమోవాకంబు ఖాదీరమా’- అంటూ ప్రశంసించాడు. గాంధీజీ స్మృతికావ్యంలో ‘రాట్నము చేత నిమ్నజుల కాహారంబు’ కల్పించిన అభ్యుదయవాదిగా గాంధీజీని పేర్కొన్నాడు. అప్పట్లో గాంధీజీ ప్రబోధంతో ఖద్దరు ఉద్యమంలో అట్టడుగువర్గాల వారు పాల్గొని రాట్నంపై నూలు వడకడం, బట్టలు నేయడం వృత్తులుగా జీవనోపాధిని సాగించారు. ఖద్దరును గాంధీ మునీంద్రుని ప్రియపుత్రికగా సంబోధించి ‘ఖద్దరు రాణీ కేల్మోడ్పుల్‌’ అం‌టూ ప్రశంసించాడు.

స్వాతంత్య్రానంతరం యాంత్రీకరణ ప్రభావంతో మరమగ్గాలు రావడంవల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. అన్ని రంగాలో ఆవరించిన అవినీతి చేనేత పరిశ్రమలో కూడా ప్రవేశించింది. డా।। సి.నారాయణరెడ్డి ఈ విషయాన్ని కవిత్వీకరిస్తూ ‘స్వాతంత్య్ర దినోత్సవం నాడు / అమ్మ కట్టిన ఖద్దరు చీర గాంధీ జయంతి నాటికి / మాసికలు పడింది’ అంటూ అధిక్షేపించాడు. చేనేతకు అనుబంధంగా ఉన్న అద్దకం వంటి కుటీర పరిశ్రమలు కూడా యాంత్రీకరణ ప్రభావంతో ఆదరణ కోల్పోయాయి.

యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ప్రభావాలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి, జీవనోపాధి. యాంత్రీకరణ ప్రభావంతో ఎడ్లబండ్లు, గొర్రు వంటి  వ్యవసాయ పనిముట్ల స్థానాల్లో ట్రాక్టర్లు, మరనాగళ్లు, పంట కోత యంత్రాలు వచ్చాయి. వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి పరిశ్రమల్లో కూలీలుగా చేరారు. వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మత్తులు వృత్తిగా జీవించే కమ్మరి, కంసాలి వృత్తుల వారు జీవనోపాధిని కోల్పోయారు. కుమ్మరి వృత్తి కూడా దయనీయంగా మారింది. స్వర్ణకార వృత్తిలో గౌరవంగా జీవించిన స్వర్ణకారుల పరిస్థితి దైన్యంగా తయారైంది. ‘కుటీర’ పరిశ్రమలుగా విలసిల్లిన ఈ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. వారికి జీవనోపాధి కష్టమై కొందరు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. కొందరు దుఃఖాన్ని దిగమింగు కొని బతుకులను అతికష్టం మీద సాగిస్తున్నారు. ఆధునిక కవులు అనధికార శాసనకర్తల్లా స్పందించి ఆయా వృత్తుల వారి దైన్యస్థితిని కవిత్వీకరించిన విధానాన్ని పరిశీలిద్దాం.

ప్రపంచీకరణ ఆధిపత్యం వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చేనేత పనివారి బతుకులు ఎంత ఛిద్రమయ్యాయో డా।। రాధేయ ‘మగ్గం బతుకు’ కావ్యంలో వర్ణిస్తూ, ‘పత్తిని పండించినవాడు / పాడెమీద ఊరేగుతున్నాడు / ఆ పత్తిని వస్త్రంగా నేసినవాడు / మగ్గం గిలకకు ఊరేసుకుంటున్నాడు’ అంటాడు.

పత్తిని పండించే రైతులు దళారీల దోపిడికి గురై గిట్టుబాటు ధర రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్తిని వస్త్రంగా నేసిన నేతన్న నిరాశా నిస్పృహలతో మగ్గం గిలకకు ఉరేసుకొని ఉసురు తీసుకుంటున్న స్థితి  మనసులను కలచివేస్తుంది. ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా విలసిల్లిన చేనేత మరమగ్గాల ప్రభావంతో కుదేలైంది. వారి బతుకులు ఛిద్రమయ్యాయి. వారి ఆత్మహత్యల దైన్యస్థితిని ‘మగ్గం శాలలన్నీ మార్చురీ గదులుగా / రూపాంతరం చెందుతున్న దీనాతిదీన స్థితి నేతగాడిది’ అంటాడు. దానికి కారణాలను కవిత్వీకరిస్తూ ‘ఈ విధ్వంస విషాదానికి / పల్లవి ప్రపంచీకరణది / చరణం సామ్రాజ్యవాదానిది / పాపం పాలనా యంత్రాంగానిది’ అంటాడు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద దుర్మార్గాలను ఉపేక్షిస్తున్న పాపం పాలనా యంత్రాంగానిదేనని అధిక్షేపించాడు. ‘మగ్గమే జీవితమైన చోట / మరణానిదే అంతిమ విజయా?’ అంటూ ప్రశ్నించాడు. ‘నేతగాళ్ల తలరాతలన్నీ / చిక్కువడిన దారపు ఉండలేనా?’ అంటూ స్వానుభవంతో చేనేత వారి కష్టాలూ, బాధలూ దర్శించిన కవి వాస్తవికతతో చిత్రించాడు. చేనేతతో కవికి ఉన్న అనుబంధం వల్ల నేతన్నల జీవితగాథలను ఆర్ద్రంగా వర్ణించాడు. మరో కవి సజ్జా వెంకటేశ్వర్లు ‘మగ్గాల శాలిలంటేనే / ఒక సామూహిక నేతన్నల బందెఖాన / ఒక జీవించే హక్కు సైతం కోల్పోయిన / ఒక చిట్టచివరి మజిలీ / ఒక గురి చూసి నిర్మించిన ఆరుబయలు జైలు’- అంటూ స్వేచ్ఛారహితమైన నేతన్నల దుర్భరస్థితిని స్వీయానుభూతితో వర్ణించాడు.

కుమ్మరి వృత్తి గ్రామీణ ప్రజోపయోగమైన కుటీర పరిశ్రమగా ఎన్నో తరాలుగా విలసిల్లుతున్నది. నవనాగరిక యాంత్రీకరణ ప్రభావం వల్ల కుమ్మరి పరిస్థితి దయనీయంగా మారింది. కుమ్మరి వృత్తి పట్ల సానుభూతితో టి.రాజారామ్‌ ‘‌తాను మాత్రం బతుకు బానలోని / దారిద్య్రం మూయలేని మూకుడు అవుతున్నాడు / ప్లాస్టిక్‌, ‌జర్మన్‌ ‌సిల్వర్‌, ‌కూలర్‌, ‌ఫ్రిజ్‌ / ఇవన్నీ అతని బతుకును / భళ్లున పగిలిన బానను చేశాయి / నాణ్యమైన అమ్ముడు పోని కుండ /’ అంటూ అతడి జీవన పోరాటాన్ని అక్షరసత్యంగా కవిత్వీకరించాడు. కవి చెప్పినట్లు ప్లాస్టిక్‌, ‌జర్మన్‌ ‌సిల్వర్‌ ‌వంటి పాత్రల• మట్టిపాత్రలకు బదులుగా వచ్చి అతని బతుకును భళ్లున పగిలిన కుండగా మార్చాయి. అతడి దారిద్య్రం బట్టబయలవు తున్నందున ‘మూయలేని మూకుడు’ అనే పద ప్రయోగంతో వర్ణించడం బావుంది. ప్రస్తుతం అతడి వృత్తి నైపుణ్యం, పనితనం ‘పాడె ముందు నిప్పుల కుండైందని’ ఆవేదనతో చెప్పాడు. మరో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఆదరణ కోల్పోయిన కుమ్మరి దంపతుల దైన్యాన్ని వర్ణిస్తూ ‘ఇప్పుడు ఇల్లు గడువక / ఆ దంపతులిద్దరికీ / ప్రతిదినము తగాదే / అతడు పనితనం నేర్చాడుగానీ / బతుకు నేర్వలేదు / కుండ పగుళ్లు కనిపెట్టిండు / కానీ బతుకు పగలు కనిపెట్టలేకపోయిండు’- అంటూ ‘పైసల లోకాన్ని తిట్టుకుంటూ / మనసు చంపుకోలేక మళ్లీ మళ్లీ / మట్టి పిసుకుతూనే ఉన్నాడు’ అన్నాడు కవి. కులవృత్తిగా అలవాటైన పనికి ఆదరణ తగ్గినా మరే పని చేతగాక, చేయలేక అదే పని చేయడం ఆనవాయితీనే. కుమ్మరి దైన్యాన్ని వాస్తవికత ఉట్టిపడేట్లు కవి వర్ణించాడు.

గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయానికి అనుబంధంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన కమ్మరి వృత్తి ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైంది. మర నాగళ్లు, ట్రాక్టర్లు వచ్చాక కమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. నేడు కమ్మరి వృత్తి దైన్యాన్ని వజ్ఘల శివకుమార్‌ ‌కవిత్వీకరిస్తూ ‘కమ్మరి పనిముట్లన్నీ వారికే / దీనస్వరాలు వినిపిస్తున్నాయి / వాళ్లకు వారసత్వం కొలిమ / వాళ్లకు సర్వస్వం కొలిమి / సౌకర్యాలు సంక్షేమ పథకాలు / అంటని అవశేషాలు వాళ్లు’ – వృత్తి ఆదరణ కోల్పోయి బతుకు భారమైనా ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు వాళ్లకు అందడంలేదని సానుభూతితో ప్రభుత్వ యంత్రాంగాన్ని అధిక్షేపించాడు.

కన్ను చెదిరే రీతిలో బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుడు తన ఇంట్లో కూర్చొని ఎంతో ఆదాయాన్ని గడించి సుఖమయ జీవనాన్ని సాగించేవాడు.  ప్రపంచీకరణ ప్రభావంతో బంగారు, వెండి వస్తువులూ, ఆభరణాలన్నీ యంత్రాలతో తయారై రెడీమేడ్‌గా రావడంతో అతడి పరిస్థితి అధోగతై ఆత్మహత్యకు పాల్పడుతున్న స్థితిని స్త్రీవాద కవయిత్రి మందరపు హైమావతి ‘పూలమ్మిన చోట / కట్టెలమ్మలేక / బంగారాన్ని కరిగించే యాసిడ్‌ / ‌ప్రాణాల్ని కరిగించే మృత్యుధాతువై / రుణం తీర్చుకుంటుంది’- అతడి ఆత్మహత్యకు కారణమైందని ఆర్ద్రతతో అధిక్షేపించింది.

మరో కవి సూదారపు రామచంద్రరావు స్వర్ణకారుడి పట్ల సానుభూతితో ‘దయనీయమైన నీ తలరాతను / నువ్వు నమ్మిన వీరబ్రహ్మం మార్చేస్తాడా!/ ఈ ప్రపంచీకరణ బారి నుంచి నిన్ను రక్షిస్తాడా!’ అంటూ ప్రశ్నిస్తాడు.

ప్రపంచీకరణ, యాంత్రీకరణ ప్రభావాలు జీవనోపాధి వృత్తులైన కుటీర పరిశ్రమలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అందుకే కవులు వారి పట్ల సానుభూతితో ప్రభుత్వ పాలనా యంత్రాంగపు నిర్లక్ష్యాన్ని అధిక్షేపించారు. ప్రభుత్వ కర్తవ్యాన్ని గుర్తుచేశారు.

– డా।। పి.వి.సుబ్బారావు,  9849177594,

రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram