నాటి ఆరెస్సెస్‌ ‌కార్యక్రమంలో  ప్రణబ్‌ ‌ముఖర్జీ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ముగింపు కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొనడం దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. మీడియా సంస్థలన్నీ ఒక్కసారిగా నాగ్‌పూర్‌లోని రేశిమ్‌బాగ్‌ ‌సంఘస్థాన్‌పై దృష్టి సారించాయి. మొత్తం ముగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాదు, గంటల కొద్ది సమయం కేటాయించి విశ్లేషించాయి.

ఈ ప్రచారాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కోరుకోలేదు. ప్రచారం కోసం ప్రయత్నించ లేదు. కేవలం ఆరెస్సెస్‌ను నిరంతరం దుమ్మెత్తి పోయడమే ధ్యేయంగా బ్రతుకుతున్న కుహనా సెక్యులర్‌ ‌రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు వారం పది రోజుల ముందు నుంచే విమర్శల వర్షం కురిపించాయి. ప్రణబ్‌ ‌దాను శాపనార్థాలు పెట్టేవారు కొందరైతే, తిట్టి పోసే వారు ఇంకొందరు. వీరందరి ప్రచారం ఫలితంగా ఆరెస్సెస్‌ ‌గురించి పెద్దగా తెలియని వారికి, ఆరెస్సెస్‌ ‌శిక్షణ కార్యక్రమాల గురించి తెలియని వారికి కూడా ఆసక్తి కలిగింది.

ప్రణబ్‌ ‌ముఖర్జీ పరిణితి చెందిన రాజకీయ వేత్తగా, దూరదృష్టిగల నాయకుడిగా వ్యవహ రించారు. ప్రజా జీవనంలో చర్చ కొనసాగాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఆరెస్సెస్‌తో సైద్ధాంతికంగా భిన్నత్వం ఉన్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించారు. తద్వారా ఉన్నత విలువలకు ఆయన ప్రతీకగా నిలిచారు. ఆయన ఒకసారి అంగీకరించిన తరువాత తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోలేదు. తద్వారా ఆయన ప్రజా జీవనంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలున్నా అందరూ కలిసి చర్చించుకోవాలని, సంవాదాన్ని కొనసాగించాలని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. ప్రణబ్‌ ‌ముఖర్జీ పూర్తిగా ఆరెస్సెస్‌ ‌కార్యకర్తలాగా మాట్లాడతారని సంఘం కూడా భావించలేదు. ఆశించలేదు. ‘ఆరెస్సెస్‌ ఆరెస్సెస్సే. ప్రణబ్‌దా ప్రణబ్‌దాయే. ఆరెస్సెస్‌ ‌ప్రణబ్‌దా కాదు. ప్రణబ్‌దా ఆరెస్సెస్‌ ‌కారు’ అని సరసంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు.

ప్రణబ్‌ ‌ముఖర్జీ ఆరెస్సెస్‌ ‌సంస్థాపకులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను గొప్ప దేశభక్తునిగా అభివర్ణించారు. డాక్టర్జీ నివాసాన్ని సందర్శించారు. రేశంబాగ్‌లోని డాక్టర్జీ, గురూజీ స్మృతి చిహ్నాల వద్ద పుష్పాంజలి సమర్పించారు. తన ప్రసంగంలో ప్రణబ్‌దా ప్రజానీకం హింసాత్మక ప్రవృత్తినుంచి దూరంగా ఉండాలని హితవు చెప్పారు. కోపం, ఘర్షణ నుంచి సమరసత, సౌఖ్యాల వైపు వెళ్లాలని, ఈ ప్రయత్నంలో స్వయంసేవకులు వారధులుగా నిలబడాలని హితవు చెప్పారు. సమరసత, సౌఖ్యాల ఆధారంగానే ఒక సంతోషభరితమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమని అన్నారు. జాతి, జాతీయత, దేశభక్తి వంటి అంశాలపట్ల తనకున్న అవగాహనను పంచుకు నేందుకు ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని అందుకున్నట్లు ఆయన చెప్పారు.

ప్రణబ్‌దా ప్రసంగం జాతి, జాతీయత, దేశం, దేశభక్తి విషయాలపైనే ప్రధానంగా సాగింది. భారతజాతి నిర్మాణం, భారత జాతీయవాదం, పాశ్చాత్య జాతి నిర్మాణం, జాతీయవాదాలకన్నా భిన్నమైనదని, ఇది నాగరికతా పరమైన జాతీయతా వాదమని ప్రణబ్‌దా ఉద్ఘాటించారు. రాజులు మారినా, రాజ్యాలు మారినా సాంస్కృతిక సమైక్యత అయిదు వేల ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిందని అన్నారు. ఎంతో మంది జ్ఞానులు, ఋషులు, వ్యాపారుల ద్వారా  భారతదేశం ప్రపంచ దేశాలతో సంస్కృతిని పంచుకుంది. సముద్రాలు దాటి వెళ్లిన హిందూ సంస్క ృతి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. దాదాపు 1800 సంవత్సరాలుగా నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి, సోమాపుర వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నలుమూలల నుంచీ విద్యార్థులు వచ్చి జ్ఞాన సముపార్జన చేశారు. శాంతి, సమరసత, సౌఖ్యాల ఆవశ్యకత మన దైనిక జీవనంతో పాటు పాలక వ్యవస్థలో కూడా మార్పులు తేవాలి. దీనితోనే ఒక జాతీయత కలిగిన సంతోషకరమైన దేశాన్ని సాధించగలుగుతాం అని అన్నారు.

ఆరెస్సెస్‌ ‌కార్యకర్తలను విద్యాధికులు, క్రమశిక్షణా యుతులు, దృఢసంకల్పం కలిగిన వారుగా ఆయన తన ప్రసంగం చివరి భాగంలో అభివర్ణించారు. ప్రణబ్‌దా తాను చెప్పవలసిన విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఒక గొప్పనేతగా ఆయన తన హోదాను నిలుపుకున్నారు. ఆయన తన హుందాతనాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే జాతీయ సామాజిక రాజకీయ జీవనంలో ఆరెస్సెస్‌కి విస్మరించలేని పాత్ర ఉందని గుర్తించారు. సైద్ధాంతికంగా ఆరెస్సెస్‌తో సంవాదం కొనసా గించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా తెలియచెప్పారు.

నిజానికి ఈ దేశంలో నిరంతరం పెరుగుతున్న ఏకైక సంస్థ ఆరెస్సెస్‌ ‌మాత్రమే. ఈనాడు దాదాపు అరవై వేల శాఖలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాల్లో 130కి పైగా అనుబంధ సంస్థలతో ఆరెస్సెస్‌ ‌పనిచేస్తోంది. ఆరెస్సెస్‌ ‌శాఖల్లో 80 శాతం శాఖలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. స్వయంసేవకుల్లో అరవై శాతం మంది యువకులే. వనవాసీ, గిరిజన ప్రాంతాల్లో శరవేగంగా ఆరెస్సెస్‌ ‌విస్తరిస్తోంది. కాబట్టి జాతి నిర్మాణంలో ఆరెస్సెస్‌కి తిరుగులేని పాత్ర ఉందన్నది వాస్తవం. ప్రణబ్‌ముఖర్జీ ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టి అభిప్రాయ భేదాలున్నప్పటికీ ఆరెస్సెస్‌తో సంవాదం కొనసాగించాలని గుర్తించారు.

కృతజ్ఞతలు : మోహన్‌ ‌భాగవత్‌

‌సర సంఘ్‌చాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఆరెస్సెస్‌ ‌సంప్రదాయానికి భిన్నంగా ప్రణబ్‌ ‌ముఖర్జీ కన్నా ముందు మాట్లాడటం విశేషం. ప్రణబ్‌ ‌ముఖర్జీ వంటి మేధావి, అనుభవజ్ఞుడు దేశం నలుమూలల నుంచి వచ్చిన స్వయంసేవకులను ఉద్దేశించి మాట్లాడటానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు అని ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సంఘం భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమనే భారతీయ పరంపరను కొనసాగిస్తోందని, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతవాసులేనని అన్నారు. ఆరెస్సెస్‌ ‌తన శక్తిని సమాజాన్ని విడదీయడానికో లేదా విధ్వంసాన్ని సృష్టించడం కోసమో ఉపయోగించదు. సంఘం మాతృభూమి కోసమే పనిచేస్తుంది. సమాజ ఉన్నతి కోసమే కృషి చేస్తుందని భాగవత్‌ ‌చెప్పారు.

ఆరెస్సెస్‌ ‌కార్యక్రమాలకు ప్రముఖులు హాజరుకావడం కొత్తేమీ కాదు. గతంలో లోకనాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ, జాకీర్‌ ‌హుస్సేన్‌, ఏపీజే అబ్దుల్‌ ‌కలామ్‌, ఎయిర్‌ ‌మార్షల్‌ ‌టిప్నిస్‌లు ఆరెస్సెస్‌ ‌కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆరెస్సెస్‌ ఏనాడూ ప్రచారాన్ని కోరుకోలేదు కాబట్టి వీటిని ప్రచారం చేసుకోలేదు. ఈసారి ప్రచారం కూడా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులే చేశారు. వారి పుణ్యమా అనే గతంలో ఏనాడూ లేని విధంగా సంఘశిక్షావర్గ ముగింపు కార్యక్రమానికి ప్రచారం వచ్చింది.  లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి కుమారుడు సునీల్‌ ‌శాస్త్రి, సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌మనుమడు అర్ధేందు బోస్‌, ‌బ్రేకింగ్‌ ఇం‌డియా పుస్తక రచయిత రాజీవ్‌ ‌మల్హోత్రా, పారిశ్రామిక వేత్త విశాల్‌ ‌మఫత్‌లాల్‌, ‌ప్రముఖ నటుడు, పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ ‌మాజీ డైరెక్టర్‌ ‌గజేంద్ర చౌహాన్‌ ‌తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author

By editor

Twitter
Instagram