న్యూఢిల్లీ : ఆగష్టు 30న లక్షలాది కుటుంబాల సభ్యులు ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌పర్యావరణ పరిరక్షణ విభాగం, హిందూ ఆధ్యాత్మిక సేవాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుండి 11 వరకు ప్రకృతి వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వర్చువల్‌ ‌రూపంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులందరూ ఇంట్లో, సమీపంలోని తోటలో, చెట్టు, మొక్క ముందు కూర్చుని హారతి సమర్పించి నమస్కరించారు. భారతదేశంలోని 582 చోట్లా ప్రకృతి వందన కార్యక్రమం జరిగింది. ఇవే కాకుండా ప్రపంచంలోని 15 దేశాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రకృతి వందన కార్యక్రమానికి 12 లక్షలకుపైగా కుటుంబాలకు చెందినవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిష్ట్రేషన్‌ ‌లేకుండా నేరుగా అదే రోజున వేలాది కుటుంబాలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వివిధ సోషల్‌ ‌మీడియా వేదికలపై ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ప్రధాని సందేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతి మౌలిక సూత్రం అని అన్నారు. ఈ సందర్భంగా 130 కోట్లమంది భారతీయుల కృషిని ఆయన కొనియాడారు. ప్రజలలో అవగాహన కలిగించేందుకు నిరంతరంగా చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను, నిర్వాహకుల చొరవను ప్రధాని ప్రశంసించారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమ తీరును, కృషిని ప్రశంసిస్తూ నిర్వాహకులను ప్రధాని అభినందించారు.

మనం ప్రకృతిని దేవుడిగా భావిస్తాం. ఇతర దేశాల్లో అలా కాదు !

– మహమండలేశ్వర్‌ ‌స్వామి అవేదశానంద గిరిజీ మహారాజ్‌

‌సస్యశ్యామలమైన, మోక్షాదాయిని, భారతదేశపు రుషులను ధ్యానిస్తూ, అందరిని హృదయపూర్వకంగా అభినందించారు. మనం ప్రకృతిని దేవుడిగా భావిస్తాం. ఇతర దేశాల్లో అలా కాదు. అగ్ని, గాలి, నీరు, భూమి, అంతరిక్షం, ఆకాశం, నక్షత్రాలను దేవతలుగా కొలుస్తాం. ఇక్కడ చెట్టు దేవతే. గణపతి పూజలో గడ్డి (గరిక)తో మొదట పూజిస్తాం. పండ్లు, పువ్వులు, మూలికలు, వనంలో లభించే ఔషదాలు, తులసి అవి లేకుండా మన జీవితం సాగదు. మన పండుగలు, ఉత్సవాలు, పుష్కర స్నానాలు నదుల ఒడ్డున చేస్తాం. మన సంస్కృతిలో తర్పణాలు, అర్పించడం, సమర్పించడం అనే ఈ మూడు పదాలు ఉన్నాయి. అవన్నీ నదీ తీరాల్లోనే జరుగుతాయి. మనం ప్రకృతిని ప్రేమిద్దాం. అది మనకు ప్రాణాధార శక్తిని ప్రసాదిస్తోంది. జీవితాలను నిలబెడుతుంది. ఔషదాలు ఇస్తుంది. ఇవేవీ లేకుండా మానవ జీవనాన్ని ఉహించలేం. నియమాలు కేవలం భక్తులకు మాత్రమే కాదు. భగవంతుడు కూడా అనేక నియమాలను అనుసరించాడు. నేడు మనమందరం వాటిని గౌరవిద్దాం. సమస్త మానవాళికి అన్ని విధాలుగా మేలు చేయాలనీ భగవంతున్ని ప్రార్థిస్తూ, మీ అందరికి శుభాశీస్సులు అంటూ ముగించారు.

భారతదేశం శతాబ్దాలుగా ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది

– ఆధ్యాత్మిక ధర్మ గురువు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌

‌పరమాత్ముడు ప్రకృతిలో లీనమై ఉన్నాడని అన్నారు. ఏ విధంగానైతే నువ్వులలో నూనే ఉంటుందో అలాగే విశ్వ వ్యాప్తంగా పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రకృతిని పూజించడం అంటే పరమేశ్వరుడిని పూజించడమే అని తెలిపారు. మనమందరం ప్రకృతిని సంరక్షించుకోవడం అత్యంత అవసరమన్నారు. శతాబ్దాలుగా భారతదేశం ప్రపంచానికి ఒక సందేశాన్నిచింది. ఇక్కడి పర్వతాలు, నదులు, వృక్షాలలో భగవంతుడు ఉన్నాడు. సూర్యుడు, చంద్రుణ్ణి దేవతలుగా కొలుస్తాం. జీవ జంతువుల్లో, తోటి మానవుల్లో భగవంతుణ్ణి దర్శించాలి. ఈ సుందరమైన ప్రకృతి మన అందరిది. దీన్ని సంరక్షించే బాధ్యత కూడా మనదే. కనుక ప్రతీ ఒక్కరం ప్రకృతిని సంరక్షించేందుకు ప్రతిన పూనుదాం. ఇలా పర్యావరణ దృష్టికోణంతో ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా భారత్‌ ఉద్భవిస్తుంది. మూఢ• నమ్మకాలతో కాదు. ఆరాధన భావంతో ప్రకృతిని పూజిస్తాం. ప్రకృతి పట్ల మనకు గల భావాత్మక బంధాన్ని హృదయంలో నిలిపి ఉంచుదాం. దాని స్వచ్ఛతకు భంగం వాటిల్లకుండా చూద్దాం. అప్పుడే ప్రకృతిని రక్షించగలం. మన దేశంలో లక్షలాది గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోని చెరువులు స్వచ్ఛమైన, పవిత్రమైన నీటి వనరులుగా మారితే, దేశంలో ఎక్కడా నీటి సమస్యలు తలెత్తవు. ఆత్మగౌరవాన్ని మేల్కొల్పడానికి స్వావలంబనను సాధించాలి. అది పొందాలంటే మనం ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాలి. ఆత్మగౌరవం భారతీయ సంస్కృతిలో ఒక భాగం, దానిని మనం గుర్తించి గౌరవించాలి. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కను పెంచుతాం.

అదేవిధంగా ఐదు మొక్కలను నాటండి. ఇవి మన జీవితకాలం సమాప్తం అయిన తర్వాత కూడా బతుకుతాయి. అప్పుడు మనం అమరత్వాన్ని పొందుతాం. ప్రతి గ్రామాన్ని పవిత్రంగా చేయండి. అభివృద్ధి పరచండి. నగరంలోని ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచండి. మొక్కలను సంరక్షించండి. ప్రకృతి పరిరక్షణకు మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.

ప్రకృతిని సంరక్షించుకుందాం

– రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌సంఘచాలాక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌

‌మన పూర్వీకులు మనం కూడా ప్రకృతిలో భాగమేనన్న సత్యాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు.  ఈ సృష్టిని సంరక్షించడం అందరి కర్తవ్యం. మనం ప్రాణాధారం కోసం సృష్టి నుండి ఏదో కొంత స్వీకరిస్తాం. మన పూర్వీకులు ఈ జీవన విధానాన్ని అర్థం చేసుకున్నారు. దానిని ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయలేదు.  జీవితాంతం దాన్ని భాగంగా చేసుకొన్నారు సంరక్షించారు. ఆధునిక విజ్ఞాన పరిజ్ఞానం ఇంకా వృద్ధి చెందక ముందే ఇక్కడ వేల సంవత్సరాల క్రితం సాయంత్రం వేళ చెట్టుని తాకవద్దని దేశంలోని నిరక్షరాస్యులకు కూడా తెలుసు. ఇక్కడ నాగ పంచమి, గోవర్ధన పూజలు చేస్తాం. తులసి వివాహం ఉంది. నేటికి వీటిని నమ్మకంగా నిర్వహించుకుంటాం. ఈ సంస్కారాలను మనం పునరుద్ధరించుకోవాలి. భావి తరాలకు అందించాలి. అప్పుడే దీన్ని నూతన తరాలకు చెందినవారు నేర్చుకొంటారు. ఆ అనుభూతిని ఆస్వాదిస్తారు. మేం కూడా ఈ ప్రకృతిలో అవిభాజ్య అంగాలమని, ప్రకృతిని జయించడం కాదు. దాన్ని సంరక్షిస్తూ సజీవంగా ఉంచాలని గ్రహిస్తారని మోహన్‌ ‌జీ ఉద్భోదించారు.

About Author

By editor

Twitter
Instagram