సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి శ్రావణ బహుళ సప్తమి – 10 ఆగస్టు 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


కరోనా తెచ్చిన తంటాను ఎదుర్కొనడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారు… ఆర్థికరంగ సమస్యలను పరిష్కరించడంలో మరీ అత్తెసరు మార్కులు కూడా రాలేదు… ఇక చైనాతో ఘర్షణకు సంబంధించి వాస్తవాలు దాచి పెడుతున్నారు… ఇవన్నీ విపక్షాలు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తున్న, చేసిన విమర్శలని వేరే చెప్పనక్కర్లేదు. కరోనా కట్టడిలోను, చైనా వ్యవహారంలోను మోదీ ఏమీ చేయలేక పోయారన్నది కాంగ్రెస్‌ ‌వారి ఆరోపణ. సరే, ఆర్థికరంగం గురించి అవపోశన పట్టేశామని, తాము తప్ప మరెవ్వరూ ఆ అంశం గురించి నోరెత్తరాదని కమ్యూనిస్టుల నమ్మకం. ఆర్థిక రంగం గురించి వీళ్లు ఏదంటే అది పత్రికలు, టీవీ చానళ్లు అక్షరం పొల్లుపోకుండా జాతికి అందిస్తూ ఉంటాయి. బడ్జెట్‌, ‌వ్యవసాయం, పారిశ్రామికరంగం వంటి అన్నింటి సమాచారం తమ నాలుక చివరే మైకుల్లోకి ఉరికేందుకు వేచి ఉంటుందని వారి నమ్మకం. కానీ ఆ మూడు విషయాలలోను మోదీకి ప్రథమ శ్రేణి కాదు, ఏకంగా డిస్టింక్షన్‌ ఇచ్చారు భారత ప్రజలు. ప్రధాని మోదీ మీద మీడియాలో, మరీ ముఖ్యంగా వామపక్షవాదులు చేసే చర్చలకీ, వాటి సారానికీ; ఇచ్చే తీర్పులకీ, అందులోని విశ్వసనీయతకీ; ప్రజాభిప్రాయానికి ఎప్పుడూ పొంతన కనిపించదు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్‌ ‌మూడ్‌ ఆఫ్‌ ‌ది నేషన్‌ ‌పేరుతో జరిపిన సర్వే ఇదే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం మోదీకి 78 శాతం ప్రజామోదం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 316 సీట్లు ఆయన నాయకత్వంలోని బీజేపీకి తథ్యమట. ప్రజామోదంలో మోదీకి దరిదాపులలో ఎవరూలేని మాట నిజమే అయినా, ఇప్పుటికిప్పుడు ఎన్నికలు రావు. ఆ అవసరం లేదు. కానీ ఈ సర్వే పేరుతో కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయి. ప్రజల నాడి ఏమిటో తెలుసుకునే వీలు కలిగింది-దేశవాసులకి.

మోదీ పనితీరు అద్భుతమని 30 శాతం, బావుందని 48 శాతం సమాధానం ఇచ్చారని సర్వే చెబుతోంది. సాధారణమేనని చెప్పినవారు 17 శాతమట. పెదవి విరిచినవారు కేవలం ఐదు శాతం. 2016-2020 మధ్య అంటే నాలుగేళ్ల కాలపరిమితిలో జరిపిన ఇలాంటి పది సర్వేలలో వచ్చిన ఫలితాల కంటే ఎక్కువ సానుకూల ఫలితం ఈసారి రావడం విశేషమే. ఇంకో అంశం ఏమిటంటే ఇద్దరు బీజేపీ ప్రధానులు- అటల్‌ ‌బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ – ప్రథమ ప్రధాని పండిట్‌ ‌నెహ్రూను, ఆయన కుమార్తె ఇందిరా గాంధీని వెనక్కి నెట్టడం. అత్యుత్తమ ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు 44 శాతం మోదీనే పేర్కొన్నారు. వాజపేయికి 14 శాతం దక్కింది. ఇందిరకు 12 శాతం, నెహ్రూ, మన్మోహన్‌లకు 7 శాతం వంతున మార్కులు వేశారు భారతీయులు.

కరోనా విజృంభణ, ఆర్థికరంగ మందగమనం ఇప్పుడు విడదీయలేని అంశాలు. కరోనా కట్టడి అనేది భారతదేశానికి పరిమితమైన ప్రశ్న మాత్రమే కాదు. మనవరకు కేంద్రం పరిధిలోనిది మాత్రమే అనడమూ సరికాదు. సరైన సమయంలో లాక్‌డౌన్‌ ‌విధించి మోదీ ప్రాణాలు కాపాడారని ఇప్పటికీ అత్యధిక ఆలోచనాపరులు అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల సమస్య, ఉత్పత్తి పతనం, పరిశ్రమల మూత, నిరుద్యోగం ఇవన్నీ ఇప్పటికైతే కరోనా కారణంగానే చోటు చేసుకున్నాయంటే అది సత్యదూరం కాదు. కరోనా కట్టడిలో కెనడా వంటి ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచంలో అత్యధిక దేశాలు ఇప్పటికీ సంపూర్ణ విజయం సాధించలేకపోయిన మాట నిజం. కొన్ని స్వయంకృతాపరాధంతో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. ఇంకొన్ని దేశాలు దేశ పరిస్థితులను బట్టి కట్టడిలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో అయితే ఆ రెండు సమస్యలతో పాటు కొన్ని విపక్షాల, ప్రజా సంఘాల, కేరళలో అయితే ఇస్లామిక్‌ ఉ‌గ్రవాద ముఠాల సమస్యలు అదనం. వలస కార్మికులను ప్రేరేపించి రోడ్డెక్కించిన ఘనత వీటిలో కొన్ని సంస్థలు మూట కట్టుకున్నాయి. కానీ కరోనా కట్టడిలో భారతదేశం ఒక్కటే విఫలమైనట్టు చాలామంది నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు.

లద్ధాఖ్‌లో చైనా దూకుడు గురించి కూడా మోదీని బోనులో నిలబెట్టాలన్న కుత్సిత బుద్ధి కాంగ్రెస్‌, ఇం‌కొన్ని విపక్షాలు ప్రదర్శించాయి. చైనాతో రాజీ లేకుండా పోరాటం అనివార్యం. అయినా ఒకటి నిజం. చైనా విషయంలో వాస్తవాలు తెలిసి కూడా, దాని చేతిలో మోసపోవడమనే చారిత్రక తప్పిదం మోదీ చేయలేదు. మోదీ వ్యూహం ఫలితంగా వాస్తవాధీన రేఖ నుంచి చైనా దూరంగా జరగవలసి వచ్చింది. డ్రాగన్‌ను పూర్తిగా అదుపులో పెట్టడానికి ఎంత చేయాలో అంతా భారత్‌ ‌చేసింది. చేస్తోంది.

అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే శత్రువు వీగిపోతాడన్న వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేద్దామంటే నేటి కాల పరిస్థితులలో సాధ్యం కాదు. కాంగ్రెస్‌ ‌వారు, కమ్యూనిస్టులు ఏ వివాదం వచ్చినా ప్రజలే నిర్ణయిస్తారనీ, ప్రజా కోర్టులోనే తేలుతుందనీ ముక్తాయింపు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు భారత ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న ఏకైక జాతీయ నాయకుడు మోదీ ఒక్కరే. ప్రజలు సర్వే ద్వారా ఇచ్చిన తీర్పు ఇదే. అంటే అబద్ధాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలంటే సాధ్యం కాదు. అబద్ధం ఎప్పటికీ సత్యంగా చలామణీ కాలేదు. సత్యమేవ జయతే.

About Author

By editor

Twitter
Instagram