సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి శ్రావణ బహుళ త్రయోదశి – 17 ఆగస్టు 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


ఎర్రకోట నుంచి డెబ్బయ్‌ ‌నాలుగో స్వాతంత్య్ర దిన వాణి వినిపించారు, ప్రధాని నరేంద్ర మోదీ. మనకు స్వరాజ్యం వచ్చినదే సంక్షుభిత క్షణాలలో. స్వరాజ్య భారతి తొలి అడుగులన్నీ ఎగుడు దిగుళ్ల మీద సాగినవే. మారే కాలంతో పాటు సంక్షోభాలు కూడా కొత్త కొత్త రూపాలతో దేశానికి సవాళ్లు విసిరాయి. విసురుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌, ‌చైనాలతో యుద్ధాలు, సరిహద్దు సంఘర్షణలు వాటిలో ఉన్నాయి. అంతర్గత కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, కరువు కాటకాలు, సామాజిక ఘర్షణలూ ఉన్నాయి. శతాబ్దాల పరాయి పాలన వదిలి వెళ్లిన హిందూ-ముస్లిం ఘర్షణలు, నిరుద్యోగం, అసమానత్వం, అవిద్య వంటి వాటినీ దేశం ఎదుర్కొంటున్నది. వీటి గురించి గత ప్రధానులు ఆయా కాలాలలో ఎర్రకోట ప్రసంగాలలో ప్రస్తావించారు. కానీ ఈ స్వాతంత్య్ర దిన సందేశం ప్రత్యేకం, ఏ విధంగా చూసినా చరిత్రాత్మకం. సమస్యలను ప్రస్తావిస్తూనే, సాధించినదేమిటో గుర్తు చేస్తూనే, దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితిని చెబుతూనే ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపడానికే ప్రధాని సందేశంలోని ప్రతి మాట ప్రయత్నించిందనిపించింది. ఇప్పుడు కావలసింది ఆత్మ విశ్వాసమే. నేటి పరిస్థితి అలాంటిదే. కనీవినీ ఎరుగనిది.

గడచిన మార్చి 24 ముందునాటి భారతావనికీ, తరువాతి భారతదేశానికీ ఎంతో తేడా ఉంది. కొవిడ్‌ 19‌తో దేశంలో లాక్‌డౌన్‌ అప్పుడే అమలులోకి వచ్చింది. ఆ విశ్వవ్యాప్త అంటువ్యాధి, ఫలితంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ ‌సామాజిక, ఆర్థిక వ్యవస్థను పెను సంక్షోభంలోకి నెట్టాయి. ఈ కష్టకాలంలోనే చైనా సరిహద్దులలో రగడ ఆరంభించింది. పాకిస్తాన్‌ ‌దానికి వంత పాడుతోంది. కరోనా, చైనాలకి మోదీ ఎక్కువ మాటలు కేటాయించడం అందుకే. ఇటు విస్తరణ కాంక్షనీ, అటు ఉగ్రవాదాన్ని కూడా దిగ్విజయంగా ఎదుర్కొన్నామని మోదీ దేశ ప్రజలకీ, అంతర్జాతీయ సమాజానికి చెప్పడం ఎంతో సమంజసం.

సంక్షోభాలూ, సవాళ్లనూ కూడా అనుకూలంగా మలుచుకోవాలన్నది మోదీ ఆశయం. ఏడు దశాబ్దాల క్రితం స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశాన్ని ఇక స్వావలంబన వైపు నడిపించాలన్న దృఢ నిశ్చయాన్ని కూడా ప్రధాని సుస్పష్టంగా వెల్లడించారు. అందుకే ఆత్మనిర్భర భారత్‌ ‌గురించి గొప్పగా చెప్పారు. ఓకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌, ‌మేకిన్‌ ఇం‌డియా టు మేక్‌ ‌ఫర్‌ ‌వరల్డ్, ‌నేషనల్‌ ‌డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్ల గురించి చెప్పి మోదీ, తన నిర్మాణాత్మక దృక్పథం ఏమిటో జాతి ముందు ఆవిష్కరించారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) నుంచి వాస్తవ నియంత్రణ రేఖ (ఎస్‌ఈసీ) వరకు దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు విసిరిన వారికి, అంటే చైనాకు మన సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయని ప్రధాని ఘంటాపధంగా చెప్పగలిగారు. ఈ మాట ద్వారా మోదీ ఆ ఇరుగు పొరుగులకు తీవ్ర హెచ్చరిక చేసినట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. అటు కరోనాతో ప్రపంచం తల్లడిల్లిపోతూ ఉంటే, దానిని విశ్వవ్యాప్తం చేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకున్న చైనా దురాక్రమణను ఆశ్రయించింది. దేశ సరిహద్దులలోని లద్ధాఖ్‌ ‌రగడ దాని ఫలితమే. మొత్తానికి అక్కడ నుంచి చైనా సేనలు వెనుదిరిగాయి. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది అమర జవాన్లకు ఎర్రకోట నుంచే మోదీ మరొకసారి వందనం చేయడం శ్లాఘనీయమే. భారత భూభాగాలను విస్తరణ కాంక్షతోను, పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, నేపాల్‌ ‌భూభాగాలను రుణాల గాలంతోను బుట్టలో వేసుకున్న చైనాను మన సరిహద్దులు దాటకుండా కట్టడి చేయడానికి ఇప్పుడు ఏ నేత అయినా చేయవలసింది భద్రతా బలగాలకు మద్దతుగా నిలవడమే.

కరోనా వంటి భయానక పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలం ముందు ఓడిపోయాయని ప్రధాని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్‌ అం‌టే దిగుమతులు తగ్గించుకోవడం కాదు, మన సామర్ధ్యం, నైపుణ్యం ప్రపంచం గుర్తించేటట్టు చేయగలగడం అన్నారు. మన భద్రతా బలగాల శక్తియుక్తులు ఏపాటివో ప్రపంచం మొత్తం లద్ధాఖ్‌ ‌వేదికగా చూసిందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో కూడా స్వావలంబన సాధించాలని ఆత్మ స్థయిర్యంతో ఆయన చెప్పడం స్ఫూర్తిదాయకంగా ఉంది. తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, తుపాకులు, యుద్ధ రవాణా విమానాలు ఇక్కడే తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. వంద వరకు ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతులను నిషేధించిన సంగతిని కూడా వెల్లడించారాయన. ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్‌ ‌చేసే పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. నేషనల్‌ ‌డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా హెల్త్ ఐడీ నెంబర్లు ఇస్తారు. వేయి రోజులలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ ‌సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పురోగతి, దేశ భద్రత వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం సరే. ఈ దేశ ప్రజలను కలిపి ఉంచే అంతస్సూత్రం కూడా ఒకటి ఉండాలి. తామంతా ఈ దేశ ప్రజలమని భావన ఇవ్వాలి. తాను అయోధ్యలో చేసిన భూమిపూజ వెనుక అసలు ఉద్దేశం అదేనని మోదీ ఎర్రకోట నుంచి వెల్లడించారు. బయటి శక్తుల నుంచి రక్షణ ఎంత అవసరమో, అంతర్గతంగా శాంతిభద్రతల సాధన కూడా అంతే అవసరం. ఇది జాతీయ సమైక్యతతోనే సాధ్యం. అందుకు శ్రీరాముని ఆరాధన అక్కరకు వస్తుందన్న మోదీ నమ్మకం భ్రమ కాదు. చారిత్రక వాస్తవం.

About Author

By editor

Twitter
Instagram