సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి శ్రావణ పూర్ణిమ
03 ఆగస్టు సోమవారం

నిత్యం పిడుగు వంటి వార్తలే. కొవిడ్ 19 అనుదినం తన రికార్డును తనే బద్దలు కొడుతూ భయానకమైన వార్తలకు కేంద్రమవుతూనే ఉంది. తాజాగా బీజేపీని మరింత కలవరపెట్టే వార్తలు వెలువడినాయి. తెలుగునాట బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు (59) దేహయాత్ర చాలించినట్టుగా ఈ ఆగస్ట్ ఒకటో తేదీన వచ్చిన వార్త చాలామందిని కలచివేసింది. మరునాడే అంటే, ఆగస్ట్ 2న మరొక రెండు వార్తలు. ఒకటి ఉత్తరప్రదేశ్ మంత్రిమండలి సభ్యురాలు కమలారాణి వరుణ (62) కన్నుమూసినట్టు వార్త వచ్చింది. ఈ ఇద్దరు కూడా కరోనాతోనే తనువు చాలించారు. కలతపెట్టే మరొక వార్త, ఆగస్ట్ రెండు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా లక్షణాలతోనే గుర్గావ్ ఆసుపత్రిలో చేరారు.
కొవిడ్ 19 కరాళనృత్యం గురించి అనునిత్యం కొత్త విశేషణాలు వెతుక్కోవలసిందే. దాని తీవ్రత అలాంటిది. దేశంలో కేసులు ఇప్పుడు రోజుకు యాభయ్ వేలు దాటిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలను దాటిపోయింది. ఇంకా వెళ్లిపోతూనే ఉంది. ముప్ఫయ్ ఏడు వేలమంది అసువులు బాశారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లక్షన్నర కేసులతో వణుకు పుట్టిస్తున్నది. తెలంగాణ అరవై అయిదు వేల కేసుల దగ్గర ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మరణాల సంఖ్య రెండు వేలు దాటింది. మహారాష్ట్ర నాలుగున్నర లక్ష కేసులు నమోదు చేసుకుంది. తమిళనాడు రెండున్నర లక్షలకు చేరుకుంది. ప్రపంచం రెండు కోట్ల కేసు దిశగా ఉరుకులూ పరుగులూ తీస్తున్నది. దాదాపు ఏడులక్షల మంది కరోనాకు బలయ్యారు. ఈ దూకుడు వెనుక కారణాలను చూస్తే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న నానుడి గుర్తుకు వస్తుంది. దక్షిణ భారతదేశంలోనే బీజేపీ బలం తక్కువ. అందులోను ఆంధ్రప్రదేశ్లో మరీ పలచగా ఉన్న పార్టీ. అలాంటి శాఖకే ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది. మాణిక్యాలరావు వంటి నిజాయితీపరుడు, నిరాడంబరుడు, గొప్ప సంయమనంతో మాట్లాడే నేతను రాష్ట్రం కోల్పోవడం బాధాకరం. తీరని నష్టం కూడా. పరిణతి కలిగిన నేతగా అవతరించే వయసులో ఆయన కన్నుమూయడం పెద్ద వెలితి. దేవాదాయ శాఖామాత్యునిగా ఆయన నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనది. ఆయన సౌమ్యుడు. కానీ పార్టీ మీద ఎదుటివారు బురద చల్లే యత్నం చేస్తే ఆయన మాటలు ఈటెలుగా మారేవి. బీజేపీ-టీడీపీ బంధం బెడిసిన తరువాత ఒకనాటి మిత్రపక్షానికి మాణిక్యాలరావు శాసనసభ సాక్షిగా ఇచ్చిన జవాఋ పదవికీ, చట్టసభకీ కూడా వన్నె తెచ్చేవిగా ఉండేవి. నిండైన స్వయంసేవక్గా, నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా, నిరాడంబరతను పాటించిన అమాత్యునిగా ఆయన స్థానం చెదరనిది. మాణిక్యాలరావు గురించి ఒక వాస్తవం చెప్పాలి. అది ఈనాటి రాజకీయాలలో అరుదు. ఈ మాజీమంత్రికి, అందునా దేవాదాయ శాఖ మంత్రికి సొంత ఇల్లు కూడా లేదు. జాగృతితో వారి బంధం సుదీర్ఘమైనది.
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యా శాఖను నిర్వహిస్తున్న కమలారాణి వరుణను కూడా కరోనా బలితీసుకుంది. జూలై 18న కరోనా లక్షణాలతో లక్నోలోని ఒక ఆస్పత్రిలో చేరిన కమలారాణి ఆ వైరస్తో జరిపిన పోరాటంలోనే కన్నుమూశారు. ఈ మరణం ఆదిత్యనాథ్ను బాగా కలవరపెట్టింది. రెండు రోజులలో అయోధ్యలో భూమిపూజ జరగవలసి ఉండగా ఇది జరగడం ఆయనను ఇబ్బందికి గురి చేసింది. కమలారాణి మరణంతో ఆగస్టు రెండున జరగవలసిన యోగి అయోధ్య పర్యటన కూడా వాయిదా పడింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని ప్రాథమిక లక్షణాలతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. నా ఆరోగ్యం బాగానే ఉంది, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే ఆసుపత్రిలో చేరాను అని షా ట్విట్ చేశారు. అలాగే ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కూడా తక్షణం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. అయోధ్య భూమిపూజ ఆహ్వానితులలో అమిత్ షా ఉన్నారు. అయోధ్య అర్చక బృందంలో కొందరికి వైరస్ సోకినట్టు మూడు నాలుగు రోజుల కింద వార్త రావడం, ఇప్పుడు కేంద్ర హోంమంత్రికి కూడా సోకడం కలవర పెట్టే అంశమే. భూమిపూజ ఆగకపోవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆ మహా ఘట్టంలో పాలుపంచుకుంటే ఆ శోభ వేరు. తద్వారా వెళ్లే సందేశం వేరు. కానీ ఇప్పుడు మరొక శంక అందరినీ పీడిస్తున్నది. కొత్త విద్యావిధానం గురించి జరిగిన చర్చలో మోదీ, షా ఉన్నారా? కేంద్ర హోం మంత్రి హోదాలో ఇటీవల కాలంలో షా పలువురు సహచర మంత్రులను, ఎందరో ప్రముఖులను కలుసుకున్నారు. ఇప్పుడు వారిలో ఎవరికి బయటపడుతుందోనన్న బెంగ ఉంది. అయోధ్య ఉద్యమం వెనుక ఉన్న దీప్తికి, స్ఫూర్తికి ఇలాంటి అవరోధాలను అధిగమించడం ఏమాత్రం కష్టం కాదు. కరోనా సమయంలో ఎంత ప్రమాద పరిస్థితు ఉన్నప్పటికీ సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా బయటకు వచ్చి సేవలు అందించారు. ఏమైనా అమిత్ షా త్వరలోనే కోలుకుంటారని భావించవచ్చు.
తెలుగు ప్రాంత బీజేపీ దిగ్గజం మాణిక్యాలరావు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నాయకురాలు కమలారాణి ఆత్మకు శాంతి చేకూరాలని జాగృతి ప్రార్ధిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram