ప్రజల సాధికారతను కాపాడేందుకు రాజకీయ సిద్ధాంతాలు ఉబికి వచ్చాయి. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రాథమికంగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కాపాడేందుకు పాటుపడాలి. త్యాగాలు చేయాలి. ‘రిపబ్లిక్‌’‌కు ఇవి ప్రథమ సోపానాలు, లక్షణాలు.

విశేషం ఏమిటంటే రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. మావోయిస్టులుగా పేరొందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు రిపబ్లిక్‌ ‌భావనను తుంగలో తొక్కి నిరంకుశంగా వ్యవరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, వారి సంపద, సాధికారతలను కాపాడవలసిన వారే వాటిని హరించడం దారుణం.

ఇంత అనాగరిక ఆలోచనలతో అమానవీయ చర్యలకు పాల్పడుతున్న ఆ పార్టీకీ, నాయకులకూ కొందరు కవులు, రచయితలు, విద్యావేత్తలు, లోకం తెలిసిన పెద్దలు మద్దతునివ్వడం మరింత దారుణం కాక మరేమవుతుంది? మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. రిపబ్లిక్‌ ‌కాన్సెప్ట్‌ను ఎంతో ఉన్నతంగా నిలుపుకోవలసిన సమయంలో ఇలా హత్యా రాజకీయాలు చేయడం, విధ్వంసం సృష్టించడం, రక్తపుటేరులు పారించడం ఏ విధంగా న్యాయ సమ్మతమవుతుంది?

ఇది డిజిటల్‌ ‌యుగం. సాంకేతికత ఉన్నత శిఖరాలకు చేరుకుంది. తాజాగా 5 జి సాంకేతికత గొప్ప విప్లవాన్ని సృష్టించింది. అతి త్వరలో భారతదేశంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 5జి సొల్యూషన్స్ ‌రానున్నాయి. ఇప్పటికే ఉన్న 4 జితో విద్య, వైద్యం, పరిశ్రమ, వ్యవసాయం, వినోదం.. ఇలా  సమస్త రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 5 జి దీని వేగాన్ని, సామర్థ్యాన్ని వందల రెట్లు పెంచనున్నది. అంటే మానవ ‘సమూహ జీవనం’ ప్రారంభమయ్యాక ఇంత ‘అద్భుతం’ ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా కృత్రిమ మేధ, మానవ మేధ పోటీ పడుతూ జమిలిగా జన జీవనాన్ని సుఖవంతం, సౌకర్యవంతం చేసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ప్రపంచం స్వాగతిస్తోంది. క్లౌడ్‌ ‌కంప్యూటింగ్‌ ‌సాంకేతికత ఆధారంగా వర్చువల్‌ ‌వరల్డ్‌ను సృష్టించడమంటే అది మరో ప్రపంచమే. ఆ మరో ప్రపంచం పిలిచినా పట్టించుకోకుండా ఇది పెట్టుబడి దారుల సాంకేతికత, వారికి మాత్రమే ఊడిగం చేసేదని ఈసడించుకుని ఊహాలోకంలో విహరిస్తే ప్రజలకు మిగిలేది రిక్తహస్తాలే!

రోబోలు ఉత్పత్తి రంగంలో, విద్య-విజ్ఞాన, సేవారంగాల్లో విశేష సేవలందిస్తున్న సమయంలో, వాటి ద్వారా ఉత్పత్తి పెరిగి ప్రజల శ్రమ తగ్గి, సౌకర్యాలు పెరిగి సరికొత్త సమీకరణ ఆవిష్కారమైన వేళ మావోయిస్టుల మాటలకు ఇసుమంత కూడా మాన్యత లేదు. ప్రాసంగికత అసలే లేదు. ‘సోఫియా’ అన్న రోబో హైదరాబాద్‌లో చేసిన హల్‌చల్‌ను, అంతర్జాతీయంగా అది సృష్టించిన ప్రకంపనాలను పట్టించుకోక మావోయిస్టులు దండకారణ్యానికే పరిమితమవుతామని భీష్మించి కూర్చుంటే నష్టం ఎవరికి?

గుజరాత్‌ ‌రాష్ట్రానికి చెందిన ప్రణవ్‌ ‌మిస్త్రీ డిజిటల్‌ ‌మానవులను (మర మనుషులను) రూపొందిస్తున్నాడు. తయారు చేస్తున్నాడు. కృత్రిమ మేధ ఆధారంగా రూపకల్పన చేసిన ఈ డిజిటల్‌ ‌మానవులు (మర మనుషులు) సోఫియా రోబో కన్నా ఎన్నోరెట్లు మెరుగ్గా, ఉన్నతంగా, మానవాను కూలతలతో ఉన్నాయి. ఇవి రక్తమాంసాలు గల మనుషులతో కలిసి పనిచేస్తాయి. మనుషుల్లా వ్యవహరిస్తాయి. రానున్న రోజుల్లో డిజిటల్‌ ‌మానవులు – 5 జి (దీని స్థాయి కాలానుగుణంగా పెరుగుతుంది.) తదితర ఉన్నతీకరించిన టెక్నాలజిలతో మానవ జీవనం సాగనున్నది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ ‌ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఇకపై స్మార్ట్ ‌నగరాలు రానున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ ‌థింక్స్ (ఐఓటి) ఆధారంగా దినచర్య సమూలంగా రూపాంతరం చెందనున్నది. దాని ఆనవాలు ఇప్పటికే చాలా చోట్ల కనిపిస్తోంది.

వర్తమానంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సమావేశాలు, సదస్సులు ‘వర్చువల్‌’‌గా జరుగుతున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో ఈ ‘ఆన్‌లైన్‌’ ‌లైఫ్‌లైన్‌గా మారింది. చివరికి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యను బోధిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం అన్న సూత్రీకరణలకు, సిద్ధాంతానికి ‘మాన్యత’ కనిపిస్తోందా? మావోయిస్టుల ప్రకారం ప్రజాస్వామిక శక్తులతో ఐక్య సంఘటనగా ఏర్పడి కమ్యూనిస్టు (మావోయిస్టు) పార్టీ నాయకత్వంలో ఫ్యూడలిస్ట్, ‌సామ్రాజ్యవాద శక్తుల్ని ఓడించి కార్మికవర్గం ఆధిపత్యంలో అధికారాన్ని చేపట్టడమే నూతన ప్రజాస్వామిక విప్లవకీలకాంశం.

ఈ సిద్ధాంతాన్ని 1947కు ముందు చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావోజెడాంగ్‌ ‌రూపొందించాడు. ఇది తృతీయ ప్రపంచ దేశాలకన్నింటికీ వర్తిస్తుందని చెప్పాడు. మావో అందించిన ఆయుధాన్ని భారత మావోయిస్టులు అందుకుని దండకారణ్యం నుంచి నడక ప్రారంభి స్తున్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యమంటున్నారు.

భారతదేశ మావోయిస్టులు ఇంత అమాయకంగా, అజ్ఞానంగా వ్యవహరించడం విడ్డూరం. 1950 సంవత్సరానికి ముందు ప్రవచించిన సిద్ధాంతం, సమీకరణలు, భావజాలం, ఆలోచనలు 2020 సంవత్సరంలోనూ అంతే ప్రాసంగికమని విశ్వసించి‘ లాంగ్‌మార్చ్’‌కు సిద్ధమవడం విషాదం గాక ఏమవు తుంది? రెండవ ప్రపంచ యుద్ధం ముందునాటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడైన ఉన్నాయా? తృతీయ ప్రపంచ దేశాల్లో అయినా కనిపిస్తున్నాయా? ఏదో దేశమెందుకు; భారతదేశం అర్ధశతాబ్దం క్రితంలానే ఉందా?

ఈ ఏడు దశాబ్దాల కాలంలో కొత్త తరాలు వచ్చాయి. ప్రతి కొత్త తరం సమాజానికి కొత్తదనాన్ని, మెరుగైన పద్ధతిని అద్దింది, అద్దుతోంది. కొత్త మిలీనియంలో జన్మించిన వారైతే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. ఈ ప్రపంచం వారిదే. వారి కలలకనుగుణంగా సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎన్నో ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. కాని మావోయిస్టులు మాత్రం చైనా నాయకుడు ఛైర్మన్‌ ‌మావో పెట్టిన ‘భిక్ష’ దగ్గరే ఆగిపోయారు. ఆ భిక్షతోనే కాలం గడపాలని చూడటం కాలాన్ని వెక్కిరించడమే తప్ప మరొకటి కాదు. కనీసం డెంగ్‌జియావోపింగ్‌ ‌మాటను కూడా పట్టించుకోవడంలేదు.

గత తార్కిక భౌతికవాదాన్ని అదే పనిగా వల్లెవేసే మావోయిస్టుల ‘వాదం’లో ఎంత డొల్లతనమున్నదో దీంతో తేటతెల్లమవుతోంది.

ఎక్కడైతే మార్క్సిజం ఆవిష్కృతమైందో అక్కడ ఆ సిద్ధాంతానికి దిక్కు దివాణం లేదు. ఆ సిద్ధాంతం ఆచరణలో పెట్టామని చెప్పుకున్న రష్యా, తూర్పు యూరోప్‌ ‌దేశాలు, చైనాలో ఆ సిద్ధాంతం కుప్ప కూలిపోయి పాతాళానికి జారిపోయింది. కలికానికైనా కానరాకుండాపోయింది. ఇది జరిగి దశాబ్దాలు గడిచినా, ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతున్నదో ‘ఇంటర్నెట్‌’ ‌ద్వారా ప్రజలకు తెలుస్తున్న సమయంలో భారత మావోయిస్టులు మాత్రం వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోం.. విఫలమైన ప్రయోగమైనా మళ్లీ మేం దండకారణ్యం నుంచి ప్రారంభిస్తా మంటున్నారు. ఈ ప్రయాణంలో ‘రిపబ్లిక్‌’ అనే మాట రక్తమోడుతోంది. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, న్యాయం కోసం త్యాగాలు చేయాల్సినవారు వారి తలలనే తెగనరుకుతున్నారు. తమ నియంతృత్వ పాలన కోసం వారి శవాల దిబ్బలపై మెట్లు నిర్మించి అధికారం కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.

ఇది ప్రజాస్వామ్యయుగం, నాల్గవ పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న కాలమన్న సంగతిని తమ సౌకర్యార్థం పూర్తిగా విస్మరించి, కాలమాన పరిస్థితులను అసలు గమనంలోకి తీసుకోకుండా, మావో సూత్రీకరించాడు కాబట్టి ప్రపంచ కమ్యూనిస్టులు అదే ‘వేదం’గా భావించి 2020 సంవత్సరంలో కాకులు దూరని దండకారణ్యంలో గెరిల్లా దళాల నిర్మాణంతో తమ ప్రస్థానం ప్రారంభించామని చెప్పుకోవడం, అదో అద్భుత పరిణామంగా ప్రపంచానికి చాటడం ఎంతటి అజ్ఞానం? గత తార్కిక భౌతికవాద పాఠం ఒంటబట్టించుకున్న ఏ ఒక్కరు ఈ ‘చర్య’ను సమర్థించరు.

భారతదేశం ఇంకా ఫ్యూడలిజం (భూస్వామ్యం)తో తల్లడిల్లుతోందన్న మావోయిస్టుల విశ్లేషణ పూర్తిగా లోపభూయిష్టమైనది. పల్లెల్లోని ప్రజల చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ‌కనిపిస్తుండగా, వారు డిజిటల్‌ ‌సేవలు ఉపయోగిస్తుండగా, ఇంటర్నెట్‌ ఆధారంగా సౌకర్యాలు పొందుతుండగా భారతదేశం ఇంకా ఫ్యూడలిజం బిగి కౌగిలిలో ఉందని వాపోవడం విడ్డూరం. వాస్తవానికి మావోయిస్టులు భూస్వామ్యం, రాచరిక వ్యవస్థ ఆలోచనల నుంచి, భావాల నుంచి బయటపడలేకపోతున్నారు.

రాచరికం బలంగా ఉన్న కాలంలో మావో రూపొందించిన నూతన ప్రజాస్వామిక విప్లవ సూత్రీకరణ – సిద్ధాంతం 5 జి టెక్నాలజీతో ప్రజలు సరికొత్త ప్రపంచంలో, వర్చువల్‌ ‌వరల్డ్‌లో జీవిస్తున్నప్పుడు అమలు చేస్తామనుకోవడమంటేనే వారు ఫ్యూడల్‌ ‌భావజాలం నుంచి బయటపడలేక పోతున్నారని అర్థమవుతోంది.

తమ ఆలోచనల కనుగుణంగానే ఈ ప్రపంచం, ప్రజలు నడవాలనుకోవడం, నడుస్తుందనుకోవడం వల్ల వచ్చిన తిరకాసు ఇది. మార్కస్ – ఏం‌గిల్స్, ‌లెనిన్‌- ‌స్టాలిన్‌, ‌మావో, చారు మజుందార్‌ ‌తదితరుల మానసిక స్థితి ‘రిపబ్లిక్‌’‌కు అనుకూలమైనది కాదు. వారిది నియంతృత్వ మానసిక స్థితి. ఆ స్థితికి ఎప్పుడో కాలం చెల్లింది. హిట్లర్‌, ‌ముస్సోలినీలను విమర్శించిన వారే వారి బూట్లు తొడుక్కుని కదం తొక్కితే ఎలా? తాము ఎవరి బూట్లు ధరించి నడుస్తున్నామో కూడా తెలుసుకోలేనంత ఉన్మత్తతో జాతి జనుల ఉసురుతీస్తే ఎలా?

శ్రమ దోపిడీ కారణంగా ఆర్థిక తారతమ్యాలు, వ్యత్యాసాలు చోటు చేసుకుంటాయన్నది మార్క్సిస్టుల సూత్రీకరణ. కార్మికవర్గం, శ్రమ దోచుకుని పెట్టుబడి దారులు కుబేరులవుతున్నారని వారి వాదన. అందుకే రెండు వర్గాలున్నాయని కలవరిస్తారు. వర్తమానంలో ఆ సిద్ధాంతానికి మాన్యత లేకుండా పోయింది. ఇందుకు కారణం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానమే. ఉత్పత్తి రంగంలో రోబోలు, యంత్రాలు (మిషన్లు) పెరిగాక దోపిడీకి అర్థం సంపూర్ణంగా మారిపోయింది.

సమాజంలో జ్ఞాన వ్యత్యాసాలున్నంత కాలం ఆర్థిక వ్యత్యాసాలు కొనసాగుతాయి. వాటిని పూర్తిగా సమాధి చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ జ్ఞాన వ్యత్యాసాలను తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా వారు ధన్యులు. ఈ కీలకమైన అంశాన్ని మావోలు విస్మరించినంత కాలం వారి ఆశయం నెరవేరడం కల్ల! వారి శ్రమదోపిడీ మాటకు మాన్యత లభించదు.

మొన్న మొన్నటి వరకు అక్షరాస్యతలో వ్యత్యాసాలు, ఆ తరువాత కంప్యూటర్‌ ‌నిరక్షరాస్యత, వర్తమానంలో డిజిటల్‌ ‌నిరక్షరాస్యత గూర్చిన చర్చ జరుగుతున్నది. ఈ అంతరాలు వ్యక్తి సామర్థ్యం, నైపుణ్యం, అవగాహన, ఆలోచన, కృషి తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయి. దీన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడుతున్న అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల వారు కుబేరులయ్యారు, అవుతున్నారు. దీన్ని కాదనలేం కదా? అంటే మావోయిస్టులు చెప్పే ధనవంతుడే మరింత ధనవంతుడవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడవుతున్నాడన్న మాట ‘సత్యం’ కాదని తేలింది. అవసరమైన నైపుణ్యాలు, భాష, భావ వ్యక్తీకరణ తదితర క్షణాలు ఒంటబట్టించుకోకుండా ఎవరూ ఎవరినీ ఆపలేరు కదా? ఆర్థిక అంతరాలను తగ్గించవచ్చు కదా? ఈ కీలకాంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటికీ 150 సంవత్సరాల క్రితం నాటి మార్కస్ ‌మాటలనే మావోయిస్టులు వల్లె వేస్తే ఏమిటి ప్రయోజనం?

అలాగే ‘రాజ్యాధికారం’ కార్మిక వర్గం చేతిలో ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పడం కూడా ‘సత్యం’ కాదు. అసలిప్పుడు మార్కస్ ‌చెప్పిన కార్మికవర్గం ఎక్కడున్నది? ఉత్పత్తి సంబంధాలు సంపూర్ణంగా మారి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతుండగా, సమాజ మంతటా ప్రజలే ఉండగా ప్రజల కేంద్రంగా అభివృద్ధి, పురోభివృద్ధి జరుగుతున్న సందర్భంలో, ప్రజాస్వామ్యం రోజుల్లో మావోలు దండకారణ్యంలో శిబిరాలు వేసుకుని శ్రమ జీవులు- కార్మికుల గూర్చి కలవరించడంలో ఏ మాత్రం నిజాయితీ కనిపించదు.

మార్క్సిజం పేర్కొనే డైనమిక్స్, ‌వైరుధ్యాలు, గతి తార్కికత, ఆర్థిక దోపిడీ, వస్తూత్పత్తి విధానం, మార్కెట్లు, శ్రమ, పెట్టుబడి అన్నీ మారినప్పుడు, ఆ మార్పు స్పష్టంగా కళ్లకు కనిపిస్తున్నప్పుడు అవన్నీ ఇంటర్నెట్‌లో అగుపిస్తున్నప్పుడు మావోయిస్టుల మాటలకు మాన్యత ఎక్కడిది?

కాలం చెల్లిన అవగాహనతో ఆదివాసీలను, హరిజనులను, ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ‘పోలీసు ఇన్‌ఫార్మర్ల’ పేర వందలాది మందిని మావోలు పొట్టన పెట్టుకోవడంలో ఏ రకమైన ‘రిపబ్లిక్‌’ ‌లక్షణం కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ ఊచకోతలకు పాల్పడటం ఏ విధంగా ఆదర్శప్రాయమని పించుకుంటుంది?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ఆయా రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులు, దండకారణ్యంలోని ప్లటూన్‌ ‌కమాండర్లు, దళ కమాండర్లు అసంఖ్యాకులు లొంగిపోయారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాల నైనా పట్టించుకోకుండా పూర్తి పిడివాదంతో ప్రజల ప్రాణాలు తీసేందుకు కంకణం కట్టుకుంటే, దారిపొడవునా వారి రక్తధారలే కనిపిస్తుండగా కమ్యూనిజం స్థాపించే వరకు విశ్రమించం అని నినదించడంలో ఏ మాత్రం విజ్ఞత లేదని మావోలు ఇంకేప్పటికి గుర్తిస్తారు? వారి నాయకత్వం వృద్ధాప్యంలోకి జారుకున్నా ఇంకా తమ భావాజాలాన్నే రుద్దుతామంటే ఎలా? గత నాలుగు దశాబ్దాల్లో ఉత్తర తెలంగాణ అభివృద్ధిని, పెరిగిన ప్రజలు కొనుగోలు శక్తిని పట్టించుకోకుండా ఇంటర్నెట్‌ ‌సౌకర్యంతో ఎంతో చైతన్యం పెంచుతున్న ప్రజల ‘పల్స్’ ‌పట్టించుకోకుండా ఇంకా ప్రజలు పాలేళ్లగానే ఉన్నారని భావించడం పూర్తిగా భావ దారిద్య్రం.

 భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వేలాది మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది బాధపడుతున్నారు. ప్రజల బతుకులు తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ మావోయిస్టులు తమ సాయుధ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండటం ఆశ్చర్యం! ఈ కరోనా మహమ్మారి కాలంలోనూ అటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులలోను, ఇటు ఉత్తర తెలంగాణలో తిరిగి పాగ వేయాలని కాల్పులు జరపడం, కార్యకలాపాలను ముమ్మరం చేయడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు.

ప్రజలు అలవికాని కష్టాల్లో ఉన్నప్పుడు, వారి కష్టాలు మరింత పెరిగేలా ఎవరు వ్యవహరించినా వారు క్షమార్హులు కారు. గత కొన్ని మాసాలుగా ప్రజలలో పూర్తి అభద్రతా భావం ఏర్పడింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆదాయం లేదు. ఈ దశలో ఎందరో స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమకు తోచిన సరుకులు, ఆహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తమ దాతృత్వాన్ని చాలామంది చాటుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో దీన్ని అందరూ తిలకించారు.

మరి మావోయిస్టుల మాటేమిటి? ఈ బృహత్‌ ‌కార్యక్రమంలో ఉడతా భక్తిగానైనా సాయం అందించాలి కదా? అలా అందించకపోగా ఆయుధ భాష మాట్లాడుతూ ఉండటం విడ్డూరం గాక ఏమవుతుంది?

ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు కొందరు ఇటీవల బస్తర్‌ అడవులలో సమావేశమై దండకారణ్య స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ కార్యదర్శిని ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేలమంది ఆదివాసీలతో  బహిరంగసభ నిర్వహించారని వినికిడి. ఇదీ వారి విచక్షణాజ్ఞానం! ఇక వారిని ఎవరూ కాపాడలేరు!

– వుప్పల నరసింహం : సీనియర్‌ ‌జర్నలిస్టు, 9985781799

About Author

By editor

Twitter
YOUTUBE