‘ఈ ‌దేశం మొత్తం కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మావోయిస్టులు మాత్రం మన శత్రుదేశం సాయంతో మావోయిస్టు మృతుల సంస్మరణ వారం జరుపుతున్నారు. మావోయిస్టుల ఈ చర్య అత్యంత గర్హనీయమైనది. మావోయిస్టు మృతుల సంస్మరణ వారాన్ని వ్యతిరేకించాలి.’ ఒడిశా, ఆంధప్రదేశ్‌ ‌సరిహద్దులలో ఉన్న మల్కన్‌గిరి గిరిజన ప్రాంతంలో లాక్‌డౌన్‌, ‌కొవిడ్‌-19 ‌నేపథ్యంలో కనిపించిన ఒక వాల్‌పోస్టర్‌ ఇది. వీటిని ఐఎన్‌పిపిఎఫ్‌ (‌కోరాపుట్‌ ‌జిల్లా) వేయించింది. మావోయిస్టు కార్యకలాపాలలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఒక వారం పాటు గిరిజన ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించడానికి మావోయిస్టు పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. తుపాకీ చేతిలో ఉంది కాబట్టి, పంథా హింసాత్మకం కాబట్టి కొన్నిచోట్ల ఆ ప్రయత్నం విజయవంతం కూడా అయి ఉండవచ్చు. కానీ, దేశంలో అత్యధికులు కొవిడ్‌ 19‌న బారిన పడిన సమయంలో ఇలాంటి సంస్మరణల సభలు ఏమి•న్నదే, శాంతిభద్రతల సమస్యను మరింత జటిలం చేయడం ఏమిటి అన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉంటారు కాబట్టి వారికి ప్రధాన స్రవంతి ప్రజానీకం బాధల గురించి అవసరం లేదా?

మార్చి 23న భారతదేశం కొవిడ్‌ 19 ‌వైరస్‌తో ప్రత్యక్ష యుద్ధం ఆరంభించింది. సరిగ్గా అదే రోజున పత్రికలలో పతాకశీర్షికగా వచ్చిన ఒక వార్త భారత్‌లో మావోయిస్టు పార్టీ తీవ్రతరం చేసిన యుద్ధం గురించి వెల్లడించింది. సుక్మా (ఛత్తీస్‌గఢ్‌) ‌జిల్లాలోని మిన్పా అడవులలో 17 మంది కేంద్ర రిజర్వు పోలీసు బలగాలను మావోయిస్టులు చంపారు. నక్సల్స్ ‌లేదా మావోయిస్టు నెత్తుటి కాండకు దాదాపు పదిహేనేళ్ల నుంచి బలిపీఠంగా అలరారుతున్నదే సుక్మా జిల్లా. మార్చి 21 శుక్రవారం ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. 300 నుంచి 350 మంది వరకు మావోయిస్టులు బలగాల కంటపడినట్టు తెలియ వచ్చింది. కాల్పులు జరిగాయి. 14 మంది కనిపించకుండా పోయినట్టు, మరొక 15 మంది గాయపడినట్టు మొదట ప్రకటనలు వెలువడినాయి. తరువాత తెలిసింది, కంటపడకుండా పోయినవారు పదిహేడు మంది. వారంతా కూడా మావోయిస్టుల చేతిలో అమరులయ్యారు. ఈ వార్తే మార్చి 23న వెలువడింది. సుక్మా జిల్లాతో పాటు పలు చోట్ల మావోయిస్టులు సాగించిన నెత్తుటి విధ్వంసం గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 2017 ఏప్రిల్‌లో 25 మంది కేంద్ర రిజర్వు పోలీసులను సుక్మా జిల్లాలోనే చంపారు. 2010 ఏప్రిల్‌లో ఇద్దరు రాష్ట్ర పోలీసులు సహా 76 మంది భద్రతాబలగాలను దంతేవాడ దగ్గర మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారు. మే 1, 2019న మహారాష్ట్రలోని గడ్చిరోలి దగ్గర ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్‌ ‌డివైస్‌ (ఐఈడీ) మందుపాతర పేల్చి 15 మందిని బలి తీసుకున్నారు. గడ్చిరోలి దాడి నిరుడు మావోయిస్టుల చేసిన 53వ దాడి. అప్పటివరకు జరిగిన ఆ దాడులలోనే 107 మంది చనిపోయారు.

మళ్లీ ఈ ఏడాది మండుటెండలలోనే మావోయిస్టుల కలకలం ఛత్తీస్‌గడ్‌, ఒడిశా-ఆంధ్ర సరిహద్దులలో ఊపందుకుంది. ఇప్పుడు ఊపందుకోవడానికి కారణాలు వేరు. ఈ సంవత్సరం మార్చిలో దేశంలో మొదలయిన కరోనా కలకంతో తాము బలపడాలన్న ఒక అమానవీయ వ్యూహంతో మావోయిస్టులు కార్యకలాపాలకు ఉపక్రమించారు. దాని పర్యవసానమే ఒడిశాలోని మల్కన్‌గిరిలో కనిపించిన ఆ పోస్టర్‌. ‌బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం త్యాగాలు చేస్తున్నామని చెప్పే మావోయిస్టులు, దారుణమైన కరోనా కష్టకాలంలో నిజంగా చేస్తున్నదేమిటో ఆ పోస్టరు వివరించింది. అనేక జాతీయ స్థాయి పత్రికలు వెల్లడించిన నివేదికలు కూడా మావోయిస్టుల ఘనకార్యాలను వెల్లడిస్తూ, ఆ పోస్టర్‌లోని అంశం సత్యమేనంటూ సాక్ష్యం చెబుతున్నాయి. నక్సల్‌బరీ యాభయ్‌ ఏళ్ల సందర్భాన్ని అడ్డం పెట్టుకుని, చనిపోయిన మావోయిస్టులను స్మరించుకోవడమనే నెపంతో మావోయిస్టులు హడావుడి చేస్తున్నారు. నిజానికి అదొక సాకు మాత్రమే. వారి అసలు ఉద్దేశం కొవిడ్‌ను అవకాశంగా తీసుకుని మరొకసారి బలపడడమే. భారతదేశానికి శత్రుదేశం, అంటే చైనా మద్దతుతో మావోయిస్టులు కరోనా కాలాన్ని తమ విస్తరణకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారని గిరిజనులలో ఒక వర్గం గట్టిగానే నమ్ముతున్నది. ఆ పోస్టర్‌లోనే ఉన్న ఇంకొక అంశం కూడా గమనించవలసిన అవసరం ఉంది. మావోయిస్టుల ‘సంస్మరణ’ పిలుపులోని వాస్తవమెంతో ఆ అంశం ధ్రువీకరిస్తుంది.

‘చనిపోయిన మావోయిస్టులు మృతవీరులు కానేకాదు. ఎందరో అమాయక గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్ల ముద్రవేసి చంపినవారు’ అని కూడా ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఒక వర్గానిదే కావచ్చు, కానీ ఇది గిరిజనుల ఆక్రోశమే. మావోయిస్టులు సాగిస్తున్నది ముమ్మాటికీ విధ్వంసమే. గిరిజనుల కోసం నిర్మించిన పాఠశాల, కళాశాల భవనాలు, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలను కూడా మావోయిస్టులు ధ్వంసం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయ భవనాలను కూడా పేల్చివేస్తున్నారు. ఇది కూడా గిరిజన ప్రాంతాలలో తరచూ వినిపించే ఆరోపణ.

 ఆంధ్ర-ఒడిశా సరిహద్దులలోని మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కోలాహలం వాస్తవం. జూలై 28 నుంచి మావోయిస్టులు ‘మృతవీరుల స్మృతి’ కార్యక్రమం వారం పాటు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులను సమర్థించే గిరిజనలు దీనికి స్పందించి అండపల్లి అనేచోట పెద్ద ఎత్తున ప్రజామేళాను నిర్వహించారు. ఇది స్వాభిమాన్‌ ‌ప్రాంతంలో ఉంది. మరణించిన మావోయిస్టులకు ఆ కొందరు గిరిజనులు అక్కడ నివాళి కూడా ఘటించారు. అయితే మరణించిన మావోల నివాళి వారం నిర్వహించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న మరొకవర్గం గిరిజనలు కూడా ఉన్నారు. వీరు పోటీగా జూలై 30 నుంచి నిందా సప్తాహం ఆరంభించారు. ఇదంతా భద్రతాబలగాలు మోహరించి ఉన్నప్పుటికీ జరగడమే విశేషం. దీనికి ముందే మావోయిస్టులు తాత్కాలిక స్మారక స్తూపాలు కూడా ఆ ప్రాంతంలో పలుచోట్ల నిలబెట్టారు.

గిరిజనులను నమ్మించడానికి మావోయిస్టులు చెప్పే మాటలు తమాషాగా ఉంటాయి. మోళీ కట్టే మాంత్రికుడు కూడా అంతగా మాటలతో మాయ చేయలేడు. మీ (గిరిజనుల) జల్‌, ‌జమీన్‌, ‌జంగిల్‌ ‌హక్కు కోసం మేం పోరాడుతూ ఉంటే పోలీసులు కాల్చి చంపుతున్నారని చెబుతారు. బులెట్లతో మా గుండెలను ఛిద్రం చేస్తున్నారని కవిత్వం రంగరించి చెబుతారు. గడచిన యాభయ్‌ ఏళ్లుగా మావోయిస్టులు ఇదే ప్రచారం చేస్తున్నారు. దీనికే కొందరు గిరిజనులు వారికి అండదండలు ఇస్తున్న మాట నిజం. ఈ వర్గం నాయకులు మావోయిస్టుల వెంటే మనం ఉండాలని గిరిజనులకు చెబుతున్నారు. ప్రభుత్వాలనీ, ప్రజాస్వామ్యాన్నీ దుమ్మెత్తి పోస్తుంటారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలంతా దోపిడీకి గురి అవుతున్నారని, పేదవాడు మరింత పేదవానిగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని చెబుతారు. పెట్టుబడిదారులను అందలం ఎక్కిస్తున్నారని విమర్శిస్తారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఒకటిన్నర శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా తయారైన ఒక రాజకీయ సిద్ధాంతం వల్లించిన భాష ఇది. అక్కడ అడవులలో మావోయిస్టుల నోటి నుంచి, నగరాలలో అర్బన్‌ ‌నక్సల్స్ ‌నోటి నుంచి కూడా సరిగ్గా ఇదే భాషను వింటూ ఉంటాం. వారు రాసే వ్యాసాలలోను ఇదే కనిపిస్తుంది. అయితే ఈ ఊకదంపుడును ఇప్పుడు మావోయిస్టు వ్యతిరేక గిరిజన వర్గం కొట్టిపారేస్తున్నది. ఈ వాదనలలోని వాస్తవం గుర్తించమని కోరేందుకే ఆ వర్గం గిరిజనులు పలుచోట్ల పోస్టర్లు వేశారు. ఇలా ఉండగా మావోయిస్టులు పనసపుట్టు, జంత్రి, అండపల్లి తదితర ప్రాంతాలలో షహీద్‌ ‌స్తూపాలు నిలబెడుతున్నారు. ఇదంతా చింతకొండ ప్రాంతంలోకి వస్తుంది.

శత్రుదేశంతో కలసి మావోయిస్టులు పనిచేస్తున్న సంగతిని గిరిజనులు గుర్తించారంటే అది ‘ప్రత్యర్థుల’ కల్పన అని కొట్టిపారేయడం అహంకార వైఖరే అవుతుంది. అవి ఎవరో పలికించిన చిలకపలుకులు కూడా కావు. గడచిన యాభయ్‌ ఏళ్లుగా మావోయిస్టులను గమనిస్తున్నవారిగా గిరిజనులే ఆ అభిప్రాయానికి వచ్చారని కచ్ఛితంగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ ‌సమయంలో వారి వైఖరి గిరిజనులను మరింత బాధించేదిగా ఉన్నమాట మరీ నిజం. దోపిడీని నివారించడమే ధ్యేయంగా ఆవిర్భవించిన రాజకీయ సిద్ధాంతంతో నడుస్తున్న పార్టీ మళ్లీ దోపిడీనే ఆశ్రయించడం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.

ఏప్రిల్‌ 15, 2020‌న ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఇచ్చిన ఒక విశ్లేషణను మొదట గమనిద్దాం. దాని సారాంశం ఇది. కొవిడ్‌ 19‌తో తలెత్తిన పరిస్థితులు, లాక్‌డౌన్‌ ‌బస్తర్‌లో మావోయిస్టుల చేత చుక్కలు లెక్కపెట్టిస్తున్నది. నిత్యావసరాల కోసం తిప్పలు పడుతున్నారు. ఆ కొండలలో వారం వారం జరిగే దాదాపు 480 సంతలు గడచిన మూడు వారాలుగా (ఏప్రిల్‌ 15 ‌నాటికి) లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ దీనిని అధిగమించడానికి మావోయిస్టులు ఒక విధానం ఆరంభించారు. తమ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రామాధికారులను సమావేశ పరచి, కరోనా కాలానికి గాను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం, సరుకులలో తమకు వాటా ఇవ్వమని ఆదేశించారు. ఇది జరగడానికి కాస్త ముందే ఛత్తీస్‌గడ్‌ ‌ప్రభుత్వం రెండు నెలలకు సరిపడ బియ్యం ఉచితంగా గిరిజనులకు అందచేసింది. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారేనని వేరే చెప్పక్కరలేదు. నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతాలలో తరచూ సమావేశాలు జరుపుతూ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం అందించే బియ్యంలో సగం తమకు ఇవ్వాలని మావోయిస్టులు ఆదేశిస్తున్నారని దంతేవాడ పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ అభిషేక్‌ ‌పల్లవ కూడా చెప్పారు. ఏప్రిల్‌ 18‌న ‘ఎనమిక్‌ ‌టైమ్స్’ ‌కూడా ఇలాంటి వార్తే ఇచ్చింది. మావోయిస్టులకు నిత్యావసరాలు సంతల నుంచి తెచ్చి పెట్టే కొరియర్‌ ‌వ్యవస్థ నిరుపయోగంగా మారింది. ఎందుకంటే సంతలే లేవు. తమ అవసరాలు తీరడానికి వారు గిరిజనుల మీద ఒత్తిడి తెస్తున్నారని బస్తర్‌ ‌రేంజ్‌ ‌పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌చెప్పారు. బస్తర్‌ ‌ప్రాంతం ఏడు జిల్లాలో విస్తరించి ఉంది. ఆ జిల్లాలు- బస్తర్‌, ‌నారాయణపూర్‌, ‌కొండగావ్‌, ‌సుక్మా, కంకర్‌, ‌దంతేవాడ, బిజాపూర్‌. ఇం‌త విశాలమైన భూభాగంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు తమకు వచ్చిన బియ్యంలో సగం వారికి ఇస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. మరి గిరిజనుల ఆకలి మాటేమిటి?

కరోనా వాతావరణాన్ని కచ్ఛితంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న నిశ్చయం కూడా మావోయిస్టులలో సుస్పష్టం. కాల్పుల విరమణను ప్రకటించి, ఆ విధంగా పోలీసు బలగాలను ఏమార్చి తమ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలన్న వ్యూహం కూడా పన్నారు. సీనియర్‌ ‌మావోయిస్టు నాయకుడు జలంధర్‌ ‌రెడ్డి అనే కృష్ణ (ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ ‌కమిటీ సభ్యుడు) ఏకపక్షంగా కాల్పుల విరమణకు ప్రతిపాదించాడు. కొవిడ్‌ 19 ‌నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడినంత కాలం తాము కార్యకలాపాలు నిలిపివేస్తామని ఒక ఆడియో సందేశంలో పేర్కొన్నాడు (ది హిందు, ఏప్రిల్‌ 7). ‌భద్రతాదళాలు దాడికి దిగితే మాత్రం తాము మౌనంగా ఉండలేమని ఆయన హెచ్చరించారు కూడా. ఈ కమిటీ కార్యదర్శి కైలాసం కూడా ఇలాగే ఒక లేఖ రాశారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలకు పోలీసులు రాకుండా చేసి కొత్త నియామకాలకు అడ్డం లేకుండా చేసుకోవడానికేనని, మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికేనని ఆంధప్రదేశ్‌ ‌పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్టే ఆ శాఖ వ్యవహరిస్తున్నది. ఇటు కొవిడ్‌ ‌మాటున తమ భవిష్యత్‌ ‌కార్యాచరణను రచించుకోవాలని మావోయిస్టులు తొందరపడుతున్నారు. ఇలాంటి తరుణంలోనూ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడానికి జగదల్పూర్‌, ‌దంతేవాడ, సుక్మా జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించడం ఈ ఉద్దేశంతోనే అని నిఘావర్గాలు వెల్లడించాయి కూడా. లాక్‌డౌన్‌ ‌కారణంగా నగరాలలో పనులు కోల్పోయి స్వస్థలాలకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు డబ్బు ఎర వేసి మావోయిస్టులు వల వేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. గతం నుంచి మావోయిస్టులు ఏటా నిర్వహించే కార్యక్రమం ఒకటి ఉంది. ఫిబ్రవరిలో మొదలు పెట్టి జూలై వరకు గిరిజన ప్రాంతాలలో తమ పట్టును భద్రపరిచేందుకు వారు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కొత్తవారిని చేర్చుకునే పని కూడా ఇందులో భాగంగా సాగుతుంది. కాబట్టి కరోనా కష్టాలు ఉన్నప్పటికి ప్రభుత్వం మావోయిస్టు నిరోధానికి కార్యకలాపాలను ఈ సమయంలో నిలిపివేయడం సరికాదన్న అభిప్రాయం కూడా ఉంది.

భద్రతాబలగాల మీద దాడుల కోసం ఇటీవలే ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన సాయుధ మావోయిస్టులు బస్తర్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న మావోయిస్టు దళాలతో చేరారని సమాచారం ఉంది. వీళ్లే ఈ మధ్య రోడ్ల నిర్మాణం కోసం తెచ్చిన భారీ యంత్ర పరికరాలను ధ్వంసం చేసి, వేసిన రోడ్లను కూడా పాడు చేస్తున్నారు. తవ్వేసిన రోడ్లన్నీ వ్యూహాత్మకంగా ఉన్న పోలీసు శిబిరాలకు దారి తీసేవే కావడం విశేషం. అలాగే పోలీసు బలగాలే లక్ష్యంగా మందుపాతరలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. తొండ్మ, దంతేవాడ- కాటేకల్యాణ్‌ ‌ప్రధాన రహదారుల మీద వారు జరిపిన ఆకస్మికదాడులే కరోనా సమయంలో వారి కార్యకలాపాలు ఎంత విస్తరించాయో సాక్ష్యం చెబుతున్నాయి.

నిజానికి అనేక సమస్యలతో కొవిడ్‌ ‌సమయంలో భద్రతాబలగాలు కూడా బస్తర్‌ ‌ప్రాంతంలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. వైరస్‌ ‌వ్యాప్తి భీతి, సిబ్బందికి చాలినన్ని ఆహార పదార్థాలు అందు బాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. కానీ పెద్ద సంఖ్యలో బలగాలతో కాకుండా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి, కీలకమైన చోట్ల వారు గాలింపు సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర భద్రతా బలగాలక• కొన్ని ప్రాంతాల గిరిజనులలో కొవిడ్‌ ‌గురించిన అవగాహన పెంచే బాధ్యత అప్పగించారు. ఏ విధంగా చూసినా భద్రతాబలగాలలో అధిక శాతం ప్రస్తుతం శిబిరాలకే పరిమితమై ఉన్నాయి. ఇది మావోయిస్టులకు వరంగా మారింది. లాక్‌డౌన్‌కు ముందు బస్తర్‌ ‌ప్రాంతంలో భద్రతాబలగాలు ‘ప్రహార్‌ 2020’ ‌పేరుతో పెద్ద ఎత్తును గాలింపు చర్యలు చేపట్టాయి. ఇవి ఏకకాలంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దులలో ఆరంభమైనాయి. అలాగే ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాలైన సుక్మా, నారాయణ పూర్‌, ‌బిజాపూర్‌, ‌దంతేవాడ జిల్లాలో కూడా జల్లెడ పట్టే కార్యక్రమం చేపట్టారు. బలగాలు చేపట్టిన ఈ పటిష్ట గాలింపు చర్యలతో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు పోలీసుల అధీనంలోకి వచ్చాయి. కొత్త సభ్యుల నియామకం కోసం జరుగుతున్న సమావేశాల సంగతి తెలుసుకుంటూ పోలీసులు వాటిని భగ్నం చేస్తున్నారన్న వార్తలు వెలువడినాయి.

వైరస్‌ అం‌దరినీ వణికిస్తున్న సమయంలోనే తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులలో కూడా మావోయిస్టుల అలజడి వినిపించింది. ఏప్రిల్‌ ‌నెల చివర గడ్చిరోలి జిల్లా కోయర్‌పత్తి-కోపర్శి వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పులలో ఒక ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌ ‌మరణించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాలలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అక్కడ మావోయిస్టుల కదలికలు సరే, కరోనా జాడ దండకారణ్యంలో కూడా కనిపించినట్టు వెల్లడైంది. ఒకవేళ తమ సభ్యులు ఎవరికైనా వైరస్‌ ‌లక్షణాలు కనిపిస్తే వైద్యం కష్టమే. ఆస్పత్రుల అవసరం వస్తే మరీ కష్టమవుతుంది. దీనికి తోడు బయట ప్రపంచం నుంచి వెళ్లిన వారు అక్కడ వ్యాధుల బారిన పడడం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. దళాలలో చేర్చుకుంటున్న కొత్తవారి వల్ల మావోయిస్టులకు కూడా వ్యాధి లక్షణాలు కనిపించడంతో భయం నెలకొంది. అందుకే ముందు జాగ్రత్తతో విటమిన్‌ ‌టాబ్లెట్లు, పారాసిటామాల్‌ ‌వంటి మందులను సేకరించు కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు లేదా చిన్న చిన్న పట్టణాలలో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున మందులు కొనుగోలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణల వెనుక ఉన్నది కూడా ఇదే. ఇలా తెలంగాణలో సేకరించిన మందులు ఛత్తీస్‌గఢ్‌కు కూడా సరఫరా అవుతున్నాయని నిఘావర్గాలు కనుగొన్నాయి.

చైనా చైర్మన్‌ ‌భారత్‌కు చైర్మన్‌ అం‌టూ గోడల మీద అలనాడు నినాదాలు రాసిన ‘ఎర్ర’తాను ముక్కలే ఇవాళ కూడా కొండలలో విప్లవిస్తున్నారు. విప్లవం అంటే వేగంగా ఫలితాలను ఆశిస్తుంది. పెనుమార్పుకు బాటలు వేస్తుంది. కానీ గడచిన ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో నక్సల్స్ ‌పేరుతోనో, మావోయిస్టుల పేరుతోనో, ఇంకా అనేక నక్సల్స్ ‌ముఠాల పేరుతోనో ‘విప్లవం’ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఆ నెత్తుటి కాండలో, విధ్వంసంలో సాధించిన ఫలితం ఏమిటి? విప్లవం పేరుతో వారు తెచ్చిన ‘మార్పు’ ఏది? కాబట్టి దీనిని విప్లవం అనే కంటే రక్తదాహం అంటే సరిపోతుంది. కరోనా వంటి ఒక విశ్వవ్యాప్త ఉపద్రవంతో మానవాళి తల్లడిల్లిపోతున్న సమయాన్ని ఆసరా చేసుకుని మరొకసారి పెచ్చరిల్లిపోవాలన్న ఆలోచనలో ఆశయం కంటే, కుతంత్రమే ప్రధానంగా కనిపిస్తుంది. దేశ సరిహద్దులలో ఆ పని మావోయిస్టుల పుణ్యభూమి చైనా చేస్తోంది. రాష్ట్రాల సరిహద్దులలో మావోయిస్టులు చేస్తున్నారు. ఒక వైరస్‌ను అడ్డం పెట్టుకుని సిద్ధాంతమనే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram