– సుజాత గోపగోని

దేశవ్యాప్తంగా రోజురోజుకి కొవిడ్‌-19 ‌కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా మీదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తోంది.  ఒకవైపు కరోనా మహమ్మారి గ్రామాలకు కూడా పాకి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఏ అంశం గురించి చర్చిస్తారో, ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు  ఏవో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదట్లో కరోనా వైరస్‌ను కాస్త సీరియస్‌ ‌గానే తీసుకున్న సీఎం,  ప్రస్తుతం ఈ దిశలో సరైన చర్యలు తీసుకోవడంలేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.  విపక్షాలు కూడా ఈ విషయంలో ఆరోపణలు చేయడం తప్పితే నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.

ఇటీవల సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరం చేసిన ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యల మాదిరిగా న్యాయస్థానం ఆదేశాలను పాటించినట్లు సమాజానికి చూపించింది. తర్వాత కేబినెట్‌ ‌సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి డీపీఆర్‌ ‌విడుదల చేయడం, రూ. 400 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం శరవేగంగా జరిగి పోయాయి. కరోనాతో ప్రజలంతా అల్లాడిపోతున్నా, వైద్యసేవల్లో రాష్ట్ర ప్రభుత్వ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా సచివాలయం నిర్మాణం సహా ఇతర అంశాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతోంది.

అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టయినా సరే కరోనాను తరిమికొడతామని మొదట్లో కేసీఆర్‌ ‌స్వయంగా చెప్పారు. కానీ, ఆచరణలో మాత్రం పాటించడం లేదు. ఇప్పటికి కేవలం 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అవి కూడా దేనికి ఖర్చవుతున్నాయో, అసలు విడుదల చేశారో లేదో కూడా స్పష్టత లేదు. కానీ, కొత్త సచివాలయం నిర్మాణం కోసం మాత్రం అప్పటికప్పుడు 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల పక్రియకు కూడా రంగం సిద్ధమైంది. రేపో మాపో నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.

పాత సచివాలయం కూల్చివేత అనే అంశం ఏడాది కాలంగా నడుస్తోంది. న్యాయస్థానాలు ముకు తాడు వేయడంతో ఆ పక్రియ మందగించింది. అయినా పరిపాలనలో గానీ, ఇతర ఏ కార్యకలాపాల్లోనూ ఆటంకాలు చోటు చేసుకోలేదు. అంటే, ఇప్పటికిప్పుడు పాత సచివాలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం అసలే లేదు. మరో ఏడాదికి, రెండేళ్లకు కూల్చివేసినా ఏం ఫరవాలేదు. అలాగే, కొత్త సచివాలయం నిర్మాణం కూడా అంతేవేగంగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. హడావుడిగా కేబినెట్‌ ‌సమావేశం ఏర్పాటు చేసి మరీ నిధులు మంజూరు చేయాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఏం లేదు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు రోజుకి రెండు వేలు దాటిపోయాయి. అలా అని గతంలో కంటే పరీక్షల సంఖ్య పెంచిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. వీటితో పాటు మరణాలు కూడా రోజూ నమోదవుతున్నాయి. వీటిలో 90శాతానికి పైగా సర్కారు ఆసుపత్రుల్లో సకాలంలో వైద్యం అందక నమోదవుతున్నవే అని గణంకాలు చెబుతున్నాయి. మొదట్లో ప్రధానంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లా కేంద్రాల్లో గానీ, పల్లెల్లో గానీ అడపా దడపా తప్పితే అంతగా ప్రమాదకర పరిస్థితులు లేవు. కానీ, ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోనూ రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. కరోనా మండల కేంద్రాలకూ పాకింది. గ్రామాలకూ చొచ్చుకెళ్లింది. ఫలితంగా రాష్ట్రమంతా ఆ మహమ్మారి గుప్పిట్లో విలవిల్లాడిపోతోంది.

లాక్‌డౌన్‌ ‌సమయంలో ఈ రంగం, ఆ రంగం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభావిత మయ్యారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా వ్యాపారాలన్నీ మందగించాయి. చాలామంది ఉద్యోగులకు ఉపాధి లేకుండాపోయింది. ఫలితంగా హైదరాబాద్‌ ‌వంటి నగరాలకు వలస వచ్చిన వాళ్లంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఊళ్లో అయితే ఏదో ఒకటి తిని కాలం గడపవచ్చన్న అభిప్రాయం. అదే నగరంలో ఉంటే ఇంటి అద్దె మొదలుకొని ప్రతీదీ ఖర్చుతో కూడుకున్నదే. దీంతో చాలామంది పల్లెల వైపు చూశారు.

మరోవైపు హైదరాబాద్‌లో ఇంకోసారి లాక్‌డౌన్‌ ‌విధిస్తారంటూ కొద్దిరోజుల పాటు విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ఒకవేళ లాక్‌డౌన్‌ ‌మళ్లీ విధిస్తే ఎప్పటి దాకా ఉంటుందో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా తిరిగి పల్లెల బాట పట్టారు. అయితే, వాళ్లలో చాలా మందితో కరోనా మహమ్మారి కూడా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు వచ్చిందని రోజూ నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా తెలుస్తోంది. అసలు రెండో విడత లాక్‌డౌన్‌ అన్న ప్రచారమే తప్పు అని, అలాంటి ఆలోచన తాము చేయడం లేదని సరైన సమయంలో ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత కూడా ప్రజలకు అర్థమయ్యేట్లు చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్నాళ్లుగా ఉపాధి లేక భవిష్యత్తు ఏంటో అర్థంకాక అయోమయంలో ఉన్న ప్రజలకు స్పష్టత లేకుండా పోయింది. ఫలితంగా పట్టణాలన్నీ ఖాళీ అయి పల్లెల్లో జన సందోహం పెరిగింది. అక్కడ కూడా కరోనా మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది.

మరోవైపు సర్కారు ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సల్లో లోపాలు నిత్యం బయటపడుతున్నాయి. వసతులు సరిగా లేవని బాధితులు తీసుకున్న సెల్ఫీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇలాంటి విషయాలపై విచారణ జరపకుండా, ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి.. కొత్త సచివాలయం నిర్మాణంపై ఎందుకు దృష్టి పెడుతోందని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram