ఓం శాంతి.. ఓం శాంతి.. ఓం శాంతి… ఈ శాంతిమంత్రంతో దక్షిణ అమెరికాలో సూరినామ్‌ అనే బుజ్జి దేశం కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. జూలై 16వ తేదీన కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం కరోనా నిబంధనలకు లోబడి క్లుప్తంగా జరిగింది. అధ్యక్షునిగా ఎన్నికైన వారు ప్రమాణం చేస్తారు. అది కూడా ఆయా దేశాల జాతీయ భాషలలో చేస్తారు. సూరినామ్‌లో అత్యధికులు మాట్లాడేది డచ్‌. ‌కానీ కొత్త అధ్యక్షుడు వేద గ్రంథాలు చేతపట్టి, సంస్కృత భాషలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. వేద పండితులతో కలసి ఆ శాంతి మంత్రాన్ని కొత్త అధ్యక్షుడు కూడా పలికారు. అదీ సంగతి. ఆ మధ్య మన ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్‌ ‌కీ బాత్‌’‌లో ఈ సంగతిని వేదాలు పుట్టిన ఈ దేశ ప్రజలతో పంచుకున్నారు. అలాగే సూరినామ్‌ ‌కొత్త అధ్యక్షునికి అభినందనలు కూడా తెలియచేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటూ శాంతిమంత్రంతో పదవీ ప్రమాణం చేయడం వెనుక పెద్ద నేపథ్యమే ఉందనిపిస్తుంది. ఆ చిన్న దేశం ప్రస్తుతం కోరుకుంటున్నది శాంతి. అవసరమైనవి కూడా శాంత వచనాలే. కొత్త అధ్యక్షుడి పేరు చంద్రికా పెర్సాద్‌ ‌సంతోఖి. చాన్‌ ‌సంతోఖిగా ఆ దేశ రాజకీయాలలో ప్రఖ్యాతుడు. ఆయన భారత సంతతికి చెందిన వారు. మే 25న నేషనల్‌ అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలో సూరినామ్‌ ‘‌స్ట్రాంగ్‌ ‌మేన్‌’, ‌ప్రతిష్ట కలిగిన రాజకీయ నాయకుడు, సైనిక ప్రముఖుడు డేసి బౌటెర్సె నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఓటమి చవి చూసింది. చాన్‌ ‌సంతోఖి నాయకత్వంలోని పోగ్రెసివ్‌ ‌రిఫార్మ్ ‌పార్టీ మెజార్టీగా అవతరించింది. మే 30వ తేదీన తాను అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్నట్టు చాన్‌ ‌ప్రకటించారు. జూన్‌ 29‌న ఆయన సొంత పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికలను అంతిమంగా పార్లమెంట్‌ ‌ధ్రువీక రిస్తుంది. ఆ లాంఛనం జూలై 13న పూర్తయింది. చాన్‌ ‌సూరినామ్‌ ‌తొమ్మిదో అధ్యక్షుడు.

61 సంవత్సరాల చాన్‌ ‌గతంలో సూరినామ్‌ ‌న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2005లో పోగ్రెసివ్‌ ‌రిఫార్మ్ ‌పార్టీ (దీనినే డచ్‌ ‌భాషలో ఉరుస్టయెరెండె హెర్‌వోమింగ్స్ ‌పార్టీ- వీహెచ్‌పీ అంటారు) తరఫున న్యాయ, పోలీసు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2010 వరకు ఆ పదవిలో ఉన్నారు. భారత సంతతికి చెందిన వారు అధికంగా ఉన్న పార్టీ ఇది. మొదట దీనినే యునైటెడ్‌ ‌హిందుస్తానీ పార్టీ అని పిలిచేవారు. నేరాలను కఠినంగా అణచివేసి, ముఖ్యంగా మత్తు మందుల అక్రమరవాణాను సమర్థంగా అరికట్టి చాన్‌ ‌మంచి పేరు తెచ్చుకున్నారు. శాంతి భద్రతలకు అడ్డంకిగా మారిన శక్తులను తుడిచి పెట్టేశారు. ఆయన ఎంత ఘనుడంటే సైనిక నేత, దేశానికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్న బౌటెర్సె మీద వచ్చిన హత్యారోపణ మీద దర్యాప్తు జరిపి, 20 ఏళ్లు శిక్ష పడేటట్టు చేశారు. కానీ బౌటెర్సె మీద అరెస్టు వారెంట్‌ ‌జారీ కాలేదు. జైలుకు వెళ్లలేదు. అధికారంలో ఉన్నప్పుడు చైనా, వెనుజులా దేశాలతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. బాక్సయిట్‌, ‌చమురు నిల్వలు ఉన్నప్పటికీ సూరినామ్‌ ‌దాదాపు మూడు దశాబ్దాలు రాజకీయ అనిశ్చితికి గురికావడానికి కారణం బౌటెర్సియే అనిపిస్తుంది. అవినీతి, హత్యా రాజకీయాలు, సైనిక దర్పం కలగలసిన ‘స్ట్రాంగ్‌ ‌మెన్‌’‌నే చాన్‌ ఎన్నికలలో ఓడించి, అధ్యక్షుడయ్యారు.

జనరల్‌ ‌లిబరేషన్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌పార్టీ నాయకుడు, ఒకనాటి తిరుగుబాటు నాయకుడు రోనీ బ్రన్‌స్విక్‌ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇది ఇవాల్టి సూరినామ్‌ ‌రాజకీయాలలో కొత్త మలుపు. 51 స్థానాలు ఉన్న సూరినామ్‌ ‌పార్లమెంటులో చాన్‌ ‌పార్టీ, రోనీ పార్టీ, నేషనల్‌ ‌పార్టీ ఆఫ్‌ ‌సూరినామ్‌, ‌పెర్టిజాఝా లుహుర్‌ ‌పార్టీలు 38 స్థానాలు సాధించి, కూటమిగా అవతరించాయి. వీహెచ్‌పీ లేదా చాన్‌ ‌పోగ్రెసివ్‌ ‌రిఫార్మ్ ‌పార్టీ సొంతంగా 20 స్థానాలు గెలిచింది. బౌటెర్సె పార్టీకి 16 స్థానాలు మాత్రమే వచ్చాయి. సైనిక తిరుగుబాటుతో భారత సంతతికి చెందిన రామ్‌ ‌సేవక్‌ ‌శంకర్‌ ‌పదవీచ్యుతుడైన మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఇన్నాళ్లకు భారత సంతతికి చెందిన నాయకుడు అధ్యక్షుడయ్యారు. 2011లో చాన్‌ ‌వీహెచ్‌పీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన పోలీసు ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. చాన్‌ ‌నెదర్లాండ్స్‌లోని అపెల్‌ ‌జూమ్‌ ‌పోలీసు అకాడెమిలో నాలుగేళ్లు చదువుకున్నారు. 1982లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 3, 1959లో ఆయన పుట్టారు. ఇక బ్రన్‌స్విక్‌ ఎన్నిక ఇవాల్టి సూరినామ్‌ ‌రాజకీయాలలో కొత్త మలుపు. అటు చాన్‌, ఇటు రోనీ ఇద్దరూ బౌటెర్సెకి బద్ధశత్రువులే. 1980లో సైనిక తిరుగుబాటు తరువాత బౌటెర్సెకి వ్యతిరేకంగా బ్రన్‌స్విక్‌ ‌సూరినామిస్‌ ‌లిబరేషన్‌ ఆర్మీని స్థాపించారు. దీనికే జంగిల్‌ ‌కమాండో అని పేరు.

అసలు స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తరువాత నుంచి ఇప్పటి దాకా రాజకీయ అనిశ్చితిలోనే సూరినామ్‌ ఉం‌డిపోయిందంటే అతిశయోక్తి కాదు. సూరినామ్‌ ఒకనాటి డచ్‌ ‌వలస రాజ్యం. ఇంతకు ముందు డచ్‌ ‌గయానా అనేవారు. దక్షిణ అమెరికా లోని అతి చిన్న దేశాలలో ఇది కూడా ఒకటి. బాక్సయిట్‌ ఎగుమతి చేసే దేశాలలో సూరినామ్‌ ‌ప్రముఖమైనది. కొన్ని చమురు నిక్షేపాలు కూడా ఉన్నాయి. అలాగే పలు జాతుల వారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఆఫ్రికా నుంచి వచ్చి స్థిరపడిన వారికి నిలయం. ఇంకా భారత్‌, ‌జావా సంతతి వారు కూడా ఉన్నారు. డచ్‌ ‌వారు ఇక్కడ 1863లో బానిస వ్యవస్థను నిషేధించారు. దీనితో ఒప్పందం ప్రాతిపదికన దేశానికి భారతీయులను తీసుకువెళ్లారు. కానీ దశాబ్దాలు గడిచిపోయినా జనాభాకు తగ్గ రాజకీయ ప్రాధాన్యం లేదు. ఆ దేశ జనాభా 5,87,000. అందులో 27.4 శాతం భారత సంతతి వారు ఉన్నారు. వందేళ్ల నుంచి సూరినామ్‌తో భారత్‌కు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నాలుగు లేదా ఐదో తనం భారత సంతతి వారు మంచి ఉన్నతికి వచ్చారు. ఇంకా చిత్రం ఏమిటంటే అక్కడ సుర్మాని అనే భాష మాట్లాడతారు. అది బిహార్‌కి చెందిన భోజ్‌పురి మాండలికమే.

ఓడిన బౌటెర్సె (ఎడమ), కొత్త ఉపాధ్యక్షుడు రోని (కుడి)

నవంబర్‌ 25, 1975‌న డచ్‌ ‌సూరినామ్‌కు పూర్తి స్వాతంత్య్రం ప్రకటించింది. జోహాన్‌ ‌పెరీరి తొలి అధ్యక్షుడు. ఎక్కడా లేని ఒక వింత పరిస్థితి అప్పుడు ఆ దేశం ఎదుర్కొన్నది. స్వతంత్ర సూరినామ్‌కు మనుగడ లేదని మూడింట ఒక వంతు జనాభా నెదర్లాండ్స్ ‌వలసపోయారు. ఈ జోస్యం నిజమేనేమో అన్నట్టు 1980, ఫిబ్రవరిలోనే సైనిక కుట్ర ద్వారా ప్రభుత్వం పతనమైంది. 2015 వరకు ఈ అనిశ్చితి సూరినామ్‌ను వీడలేదు. ఇందుకు కారకుడే బౌటెర్సె. పదహారు మంది సార్జెంట్లు కలసి బౌటెర్సె నాయకత్వంలో 1980 నాటి ఆ తిరుగుబాటు నిర్వహించారు. అక్కడితో ఆగలేదు. అదే సంవత్సరం ఆగస్టు, 1981 మార్చిలలో కూడా సైన్యంలోనే మరొక వర్గం కూడా తిరుగుబాటుతోనే బౌటెర్సె నాయకత్వాన్ని తప్పించాలని ప్రయత్నించింది. 1980 నుంచి 87 వరకు పాలించిన సైనిక సమితికి బౌటెర్సెయే అధిపతి. 1987లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త రాజ్యాంగం ఏర్పడింది. దీని ప్రకారం బౌటెర్సెని సైనిక కార్యకలాపాలకు పరిమితం చేశారు. కానీ ఈ ప్రభుత్వంతో తృప్తి పడని బౌటెర్సె 1990లోనే మరొక సైనిక కుట్ర జరిపి ప్రభుత్వాన్ని కూల్చాడు. ఈ కుట్రకు బలైన వారే రామ్‌ ‌సేవక్‌ ‌శంకర్‌. ‌దేశానికి నాలుగవ అధ్యక్షుడు. ఈయన కూడా పోగ్రెసివ్‌ ‌రిఫార్మ్ ‌పార్టీకి చెందినవారే. మంత్రులంతా ఇళ్లకు వెళ్లిపోవచ్చునని బౌటెర్సె ఫోన్‌ ‌ద్వారానే చెప్పాడు. అందుకే దీనికి టెలిఫోన్‌ ‌సైనిక కుట్ర అని పేరు. మళ్లీ 2010లో ఎన్నికల విధానంతో బౌటెర్సెయే అధ్యక్షుడయ్యాడు. ఆ ఎన్నికలలో బౌటెర్సె ప్రత్యర్థి చాన్‌ ‌కావడం విశేషం. 2015లో మరొకసారి ఎన్నికల ద్వారానే బౌటెర్సె అధ్యక్షుడయ్యాడు.

1980, ఫిబ్రవరిలో బౌటెర్సె నాయకత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటును విమర్శించిన 15 మంది రాజకీయ ప్రత్యర్థుల హత్యకు ఇతడు ఆదేశించాడన్న ఆరోపణ ఉంది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో ఇది జరిగింది. కార్మిక నాయకులు, జర్నలిస్టులు కూడా హతులలో ఉన్నారు. హత్యల సంగతి ఇతడు 2007లో అంగీకరించినా, అందులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకున్నాడు. దీనికే గడచిన నవంబర్‌లోనే బౌటెర్సెకి ఆ దేశ న్యాయస్థానం 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. కొకైన్‌ అ‌క్రమ రవాణా కేసులో బౌటెర్సెకి నెదర్లాండ్స్ ‌కోర్టు 11 సంవత్సరాల కారాగారం విధించింది. ఇంతటి రాజకీయ ప్రాబల్యం, నేర చరిత్ర ఉన్న నాయకుడి మీద చాన్‌ ‌విజయం సాధించారు.

భారత సంతతికే చెందిన కృష్ణ మాథోయెరా సూరినామ్‌ ‌రక్షణ మంత్రిగా పనిచేశారు. ఈమె కూడా పోలీసు విభాగంలో పని చేసి, తరువాత రాజకీయాల లోకి వెళ్లి నేషనల్‌ అసెంబ్లీ సభ్యులయ్యారు. ఈమె శీశీశ్రీ రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌భక్తురాలు. ఈమె కూడా వీహెచ్‌పీ సభ్యురాలే. తాజా అధ్యక్ష ఎన్నికల పర్యవేక్షకురాలిగా మాథోయెరా బాధ్యతలు నిర్వర్తించారు. అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత టీవీ చానళ్లలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చాన్‌, ‘‌సూరినామ్‌ ఆర్థిక పతనం అంచుకు చేరింది’ అంటూ వాస్తవాన్ని అంగీకరించారు. తాము ఏర్పరిచిన ప్రభుత్వం సూరినామ్‌ను గాడిలో పెట్టడమనే ఏకైక లక్ష్యంతో అందరి సహకారంతో కలసి పనిచేస్తుందని కూడా అన్నారు. ఇంతకీ ఈ తాజా ఎన్నికలను బౌటెర్సె గుర్తించడానికి సిద్ధంగా లేరనీ, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా కొత్త కూటమి ప్రభుత్వానికి, బౌటెర్సెకి మధ్య ఘర్షణ అనివార్యంగా కనిపిస్తున్నది. అతడి నేర చరిత్రను శోధించి కోర్టుకు ఎక్కించి 20 ఏళ్లు శిక్ష పడేటట్టు చేసిన చాన్‌ ఆ ‌కేసును తిరగతోడతారా, సయోధ్యకు వెళతారా? అనేది అర్థం కాని విషయంగానే ఉండిపోయింది. ఒకవేళ చాన్‌ ‌మౌనం దాల్చినా ఉపాధ్యక్షుడు రోనీ తన వ్యతిరేకతను దాచుకుంటాడా? ఏమైనా కొన్ని క్లిష్ట పరిస్థితులలో దేశాధ్యక్షుడైన చాన్‌ ‌తన బాధ్యతలో విజయం సాధించాలని భారతీయులంతా కోరుకోవాలి. చాన్‌ ‌శాంతిమంత్ర జపం అందుకే అని భావించవచ్చు. శాంతిని ప్రవచించే చింతన పుష్కలంగా ఉన్న మూలాలు కలిగిన ఆయన ఈ యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram