అనూహ్యం కాదు. అనుకున్నదే. అయితే.. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన నిర్ణయం, అందుకు సంబంధించి వినిపించిన ఊహాగానాల నేపథ్యంలో బీజీపీ జాతీయ నాయకత్వం ఆంధప్రదేశ్‌ ‌రాష్ట బీజేపీ అధ్యక్షునిగా పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరును ప్రకటించింది. అయితే ఇదేదో అనూహ్య నిర్ణయంగా కొందరు మీడియా మేధావులు, రాజకీయ నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు.

ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీలో గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రతి మూడు సంవత్సరాలకు సంస్థాగత ఎన్నికలు జరగడం.. మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. వాజ్‌పేయి, అడ్వాణీల నుంచి అమలవుతున్న ఈ విధానమే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడూ అదే జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆయన స్థానంలో సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. నిజానికి, తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని చాలా వరకు రాష్ట్రాలలో గత జనవరి నాటికే సంస్థాగత ఎన్నికల పక్రియ పూర్తయింది. రెండు నెలల క్రితం తెలంగాణలో పార్టీ పగ్గాలను కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌చేపట్టిన విషయం తెలిసిందే.

అలాగని.. ఎలాంటి వ్యూహం, ఎత్తుగడ, లక్ష్యం లేకుండానే బీజేపీ జాతీయ నాయకత్వం వీర్రాజుకు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించిందని కాదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఈసారి అనేక కోణాల్లో ఆలోచించి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్థిరంగా సొంతబలాన్ని పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మ కంగా ముందడుగు వేసింది. అందుకే, అధ్యక్షుని మార్పు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయంగా మారింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు.

నిజానికి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో బీజేపీ ఎదగవలసిన స్థాయిలో ఎదగలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు, తెగతెంపుల కారణంగా సొంతబలం పెంచుకోవడంలో అవరోధాలను ఎదుర్కొంది. పరిమిత స్థానాల్లో పోటీ చేయడం వలన రాష్ట్రంలో పార్టీ విస్తరణ పక్రియ చాలా వరకు నిలిచిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 21 శాతం ఓట్లు, ఆరు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 18 శాతానికి పైగా ఓట్లతో మూడు లోక్‌సభ స్థానాలలో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత టీడీపీతో సాగిన శత్రుమిత్ర సంబంధాల ఒడిదుడుకులు, దాగుడు మూతల కారణంగా, చంద్రబాబునాయుడు నైజం కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. తెలుగుదేశంతో పొత్తు రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా చేసింది. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిజం. ఈ అన్ని అంశాలను, ప్రస్తుత పరిస్థితిని అన్నికోణాల్లో ఆలోచించే బీజేపీ జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పార్టీని ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా బలోపేతం చేసే లక్ష్యంతోనే వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది. ఇదేమీ రహస్యం కాదు, తప్పు అసలే కాదు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ‌స్పష్టంగా చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యమ్నాయంగా ఎదిగే ప్రయత్నం సాగిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు, సొంత బలం పెంచుకు నేందుకు అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు తప్పక పాటిస్తామని రామ్‌మాధవ్‌ అన్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు తాము బలైపోయామని, ఇకపై అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని రామ్‌మాధవ్‌ ‌గుర్తుచేశారు. 2024లో తాము అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

రెండు ప్రాంతీయ పార్టీలు- వైసీపీ, టీడీపీ బలంగా ఉన్న రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందా? అంటే, అవుననే రాజకీయ విశ్లేషకులు సమాధానం చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటుశాతం కూడా పెద్దగా నమోదు కాలేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఓటర్ల తీర్పు అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు. ఇందుకు చరిత్రలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి.

తెలంగాణ విషయాన్నే తీసుకుంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆరు సిట్టింగ్‌ ‌స్థానాలకు గానూ ఒకే ఒక్క స్థానాన్ని నిలుపుకుంది. కానీ, సంవత్సరం తిరగకుండా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంది. నిజామాబాద్‌లో తెరాస సిట్టింగ్‌ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుమార్తె కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ‌చేతిలో ఘోర ఓటమిపాలయ్యారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు వినోద్‌కుమార్‌ ‌కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ‌చేతిలో ఓడిపోయారు. కాబట్టి ఒక ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా పార్టీ భవిష్యత్‌ను అంచనా వేయడం సరికాదు.

నిజానికి, 2019 ఎన్నికల ఫలితాలను, బీజేపీ బలాన్ని ప్రామాణికంగా తీసుకోరాదని సోషల్‌ ‌మీడియాలో పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఆ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. బీజేపీ, మోదీ లక్ష్యంగా ధర్మపోరాటం పేరిట దిగజారుడు రాజకీయం సాగించారు. తమ ప్రభుత్వ తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో ‘యూటర్న్’‌లు తీసుకున్నారు. ఈ కారణంగా బీజేపీని అభిమానించే వారు కూడా టీడీపీని ఓడించడమే లక్ష్యంగా చేసుకుని వైసీపీకి అనుకూలంగా ఓటువేశారు. ఈ కారణంగానే, టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో పార్టీ కొంత నష్టపోయినా తెలుగుదేశం బలహీనపడడం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిలదొక్కుకునేందుకు అనుకూలిస్తుందని పార్టీ నాయకులే కాదు, సాధారణ ప్రజలు కూడా భావిస్తున్నారు.

మరోవైపు 2019 ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ, కుటుంబ పార్టీల ధోరణి, పనితీరు చూస్తున్న ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన చంద్రబాబు అరాచకం, అప్పులు మిగిల్చి పోతే.. ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్‌రెడ్డి సంవత్సర కాలంలోనే అరాచకాన్ని, అప్పుల్ని పెంచుకుంటూ పోతున్నారు. చంద్రబాబునాయుడు కుల రాజకీయాలను పతాకస్థాయికి తీసుకుపోతే, జగన్‌ ‌కులాలను మతాలతో ముడివేసి రాష్ట్రాన్ని ముక్కలయ్యేలా చేస్తున్నారు. ఇటు అంతరించిపోతున్న తెలుగుదేశం పార్టీ, అటు వైసీపీ అసలు రంగు బయటపడడంతో ఆ రెండు పార్టీలకు దూరమవుతున్న మెజారిటీ ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిలో పార్టీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు తెలుగుదేశం, వైసీపీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు నిర్వహించి గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. నలభై ఏళ్లకు పైగా ఒకే బాటలో నడుస్తున్న సోము వీర్రాజుకు సహజంగానే పార్టీలో అందరి సహకారం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే, జనసేనతో పొత్తును మరింతగా పటిష్ట పరచుకుంటూ ముందుకు సాగాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో వీర్రాజు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. జనసేనతో కలసి నడుస్తామని చెప్పారు. అలాగే, జగన్మోహన్‌రెడ్డి పాలనలో నిత్యకృత్యంగా సాగుతున్న మతమార్పిడుల విషయంలోనూ వీర్రాజు స్పష్టతతో ఉన్నారు.

 కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం గురించి ప్రజలకు తెలియచెప్పడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడటం వంటి వ్యూహాలతో ముందుకు సాగితే రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా తిరిగి పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

– రాజనాల బాలకృష్ణ : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram