– క్రాంతిదేవ్‌ ‌మిత్ర

నూతన జాతీయ విద్యావిధానం-2020లోని త్రిభాషా సూత్రాన్ని అంగీకరించేది లేదని చెప్పడం ద్వారా జాతీయ సమైక్యత కన్నా సంకుచిత ప్రాంతీయ రాజకీయాలే తమకు ముఖ్యమని మరోసారి చాటుకున్నాయి తమిళనాడుకు చెందిన పార్టీలు. వాస్తవానికి ఈ విధానం ద్వారా రాష్ట్రాల మీద ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిశాంక్‌ ఇప్పటికే చెప్పారు. తుది ముసాయిదా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కానీ తమ రాష్ట్రంపై హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణతో ఏఐఏడీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకించారు. ఇక ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌ ‌కేంద్రం తమిళనాడుపై మనువాద సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ) ప్రకటించగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని కాంగ్రెస్‌, ‌వామపక్షాలు సహా ఇతర ప్రతిపక్షాలన్నీ సన్నాహాలు చేసుకున్నాయి. కానీ వారు ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి. దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇందులోని అంశాలను స్వాగతించారు. విమర్శల కన్నా ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి. ఎన్‌ఈపీని గట్టిగా వ్యతిరేకించేందుకు సహేతుక కారణాలేమీ కనిపించకున్నా భాజపా మీద ఉండే సహజమైన వ్యతిరేకతను వ్యక్తంచేసేలా విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

కొత్త విద్యావిధానంలో ప్రాథమిక మానవాభివృద్ధి లక్ష్యం, జ్ఞాన విస్తరణ లేదని కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చించకుండా, నిపుణుల సలహాలు లేకుండా కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సలహాలు తీసుకొని తయారు చేశారని ఎద్దేవా చేశారు. ఈ పాలసీ మధ్యతరగతి కుటుంబా లకు అందదని, సమాజానికి నిరుపయోగమని పేర్కొన్నారు. విద్య కేంద్రీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణను అడ్డుకుంటామని ఆ పార్టీ విరుచుకుపడింది. మరోవైపు ఈ విధానాన్ని అడ్డుకుంటామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టంచేశారు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయ పార్టీలు తమదైన కోణంలో నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ

నూతన విద్యావిధానం మాతృభాష పరిరక్షణను గుర్తించింది. అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. వీలైతే ఎనిమిదవ తరగతి వరకు గానీ, ఆపై తరగతుల వరకు గానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని రాష్ట్రాలకు నిర్దేశించారు. త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఐచ్ఛిక భాషగా ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని నూతన విద్యావిధానం స్పష్టం చేసింది. ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకొనే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని చెప్పింది. అయితే విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది. భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది. పలు విదేశీ భాషలు నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది. బధిరుల కోసం దేశవ్యాప్తంగా ఇండియన్‌ ‌సైన్‌ ‌లాగ్వేంజ్‌ను ప్రామాణీకరించాలని పేర్కొంది. వారి కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలని సూచించింది. భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యావిధానం పేర్కొంది. ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. ఈ అంశాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలకు భిన్న భాషలు నేర్చుకునే సౌలభ్యం కల్పించడం నూతన విద్యా విధానంలో మెచ్చదగ్గ అంశం.

కస్తూరి రంగన్‌ ‌సిఫార్సుల్లో మార్పు

2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టగానే దేశంలో విద్యావ్యవస్థ ప్రక్షాళనపై దృష్టిపెట్టింది. ఇందుకోసం 2015లో టీఎస్‌ఆర్‌ ‌సుబ్రమణియన్‌ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ 2016లో నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఇస్రో మాజీ చైర్మన్‌ ‌కస్తూరి రంగన్‌ ‌సారథ్యంలో 8 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ 2018 డిసెంబర్‌లో సమర్పించిన నివేదికపై అనేక చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సూచనలను ఆహ్వానించింది. మొత్తం 2 లక్షలకు పైగా వచ్చిన సూచనల ఆధారంగా తుది ముసాయిదాను రూపొందించారు. కస్తూరి రంగన్‌ ‌నివేదిక త్రిభాషా సూత్రం కింద హిందీ బోధనను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ఈ నిబంధనను తొలగించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిశాంక్‌

ద్రవిడ పార్టీల వ్యతిరేకత

తమిళనాట సంకుచిత ప్రాంతీయ భావోద్వేగాలు కొత్తేమీ కాదు. అక్కడి రాజకీయ పార్టీలన్నీ పేరుకు ద్రవిడవాదం, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు అంటూ కబుర్లు చెప్పినా కేవలం కూపస్థ మండూకాల మాదిరిగానే వ్యవహరిస్తారు. అక్కడ మొదటి నుంచి ద్విభాషా విధానంలో తమిళం, ఇంగ్లిషు తప్ప ఇతర భాషలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. సాటి దక్షిణాది రాష్ట్రాల భాషలపై కూడా దశాబ్దాలుగా అణచివేత విధానం అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని ప్రకటించగానే సహజంగానే వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిపై దాడి అనే వాదనను మొదలు పెట్టాయి.

కేంద్రం నూతన విద్యావిధానాన్ని ప్రకటించగానే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. త్రిభాషా విధానం అంటే హిందీ, సంస్కృతాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నమంటూ ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ‌పేర్కొన్నారు. ఎన్‌ఈపీ ద్వారా విద్యావిధానంలో సంస్కరణల పేరిట పాత అణచివేత మనుస్మృతిపై నిగనిగలాడే కోటు వేశారని వ్యాఖ్యానించారాయన. పిల్లలకు వృత్తివిద్యను అందించడంపై ఆయన స్పందిస్తూ వారిపై అది మానసిక దాడిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. ఈ అంశంలో సారుప్యత గల రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

ప్రధాన ప్రతిపక్షం ఎన్‌ఈపీలోని త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడంతో తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి (ఏఐఏడీఎంకే) అప్రమత్త మయ్యారు. కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించ లేమని, తమ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. ద్విభాషా(తమిళం, ఇంగ్లిష్‌) ‌విధానాన్నే కొనసాగిస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. మూడు భాషల విధానాన్ని పునఃసమీక్షించాలని, దీని అమలుపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. కాగా తాము ఏ రాష్ట్రంపై, ఏ భాషను రుద్దే ప్రయత్నం చేయడంలేదని కేంద్ర మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌ట్వీట్‌ ‌చేసిన మరుసటి రోజే పళనిస్వామి తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి కూడా ఎన్‌ఈపీపై అసహనం వ్యక్తంచేశారు. ఇది అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యా నించారు. ‘ఇది ప్రజలకు ప్రయోజనం చేకూర్చని విద్యా విధానం. కొత్త విద్యా విధానంతో పాండి చ్చేరిలో ఎలాంటి మార్పు రాదు’ అని పేర్కొన్నారు. కొత్త విద్యా విధానంపై ప్రజలు, మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.

మరోవైపు నూతన విద్యావిధానానికి కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మద్దతు తెలిపారు. తన అభిప్రాయం పార్టీ వైఖరికి భిన్నమైదని కూడా స్పష్టంచేశారు. ఒక పౌరురాలిగా మాత్రమే ఈ అభిప్రాయాన్ని ప్రకటించినట్టు ఖుష్బూ తెలిపారు. ఇందుకు రాహుల్‌ ‌గాంధీకి క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిదానికి తలాడించే రోబోలా కాకుండా నిజం మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ప్రతీది మన నాయకుడి అంగీకారం గురించి కాకూడదు.. పౌరుడిగా మన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలగాలి అని ఆమె పేర్కొన్నారు. ఖష్బూ సోషల్‌ ‌మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు కంగుతిన్నారు.

హిందీ వ్యతిరేకతకు ద్రవిడవాద ముసుగు

తమిళనాడులో హిందీ వ్యతిరేకతకు సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందే దీనికి పునాది పడింది. భారతదేశంలో భిన్న భాషలు ఉన్న నేపథ్యంలో స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఒక అనుసంధాన భాష ఉండాలని మహాత్మగాంధీ సహా నాటి జాతీయ నాయకులు భావించారు. సహజంగానే దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే హిందీని ఇందుకోసం ఎంచుకున్నారు. వాస్తవానికి గాంధీజీ సహా ప్రముఖ నాయకుల మాతృభాష హిందీ కాదు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీ (నేటి తమిళనాడు అందులో భాగం)లో ప్రాంతీయ నాయకులు మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆనాటి కాంగ్రెస్‌ ‌పార్టీ దిగ్గజం చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) దక్షిణాదిన హిందీ భాషకు బలమైన సమర్థకుడు.

1937 ఎన్నికల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌ ‌విజయం సాధించడంతో రాజగోపాలాచారి ముఖ్య మంత్రి అయ్యారు. 1938 ఏప్రిల్‌ 21‌న ప్రెసిడెన్సీ లోని 125 మాధ్యమిక పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయాన్ని ఎ.టి.పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని ప్రతిపక్ష జస్టిస్‌ ‌పార్టీ, ఇ.వి.రామస్వామి నాయకర్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే క్రమంగా హిందీ వ్యతిరేకోద్యమంగా మారింది. ఉద్యమం హింసాత్మ కంగా మారడంతో ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పం దించింది. ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందగా, ఎంతో మంది అరెస్టయ్యారు. 1939లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాజీనామా చేశాక, 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్‌ ‌గవర్నర్‌ ‌నిర్బంధ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు.

తమిళనాట ద్రవిడవాదానికి బలమైన పునాది వేసిన నాయకుడు ఇ.వి. రామస్వామి నాయకర్‌. ‌పెరియార్‌గా ప్రసిద్ధి పొందారు. కొంత కాలం కాంగ్రెస్‌లో పని చేసి తర్వాత జస్టిస్‌ ‌పార్టీలో చేరారు. జస్టిస్‌ ‌పార్టీ 1944లో పెరియార్‌ ‌నాయకత్వంలో ‘ద్రవిడ కజగం’ అయ్యింది. మొదట ఉద్యమంగా ప్రారంభమై రాజకీయ పార్టీగా మారింది. ద్రవిడ కజగం పార్టీ ద్రవిడవాదం పేరుతో తమిళాధిక్యత ప్రాంతీయ భాషాధిపత్యాన్ని సమర్థించింది. స్వతంత్ర ‘ద్రవిడనాడు’ సాధన వారి లక్ష్యం. ద్రవిడవాదం, సామాజిక సంస్కరణల ముసుగులో పెరియార్‌ ‌రామస్వామి సాగించిన హిందూ వ్యతిరేకత ఉద్యమాలు అన్నీ ఇన్నీ కాదు. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్‌ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది. అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కజగం బలమైన పక్షంగా రూపుదిద్దుకుంది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా చేయాలని ప్రయత్నాలు చేయగా చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తమిళనాడులో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అప్పటికే ద్రవిడ కజగం నుంచి విడిపోయి ఏర్పడ్డ రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం హిందీ వ్యతిరేకతకు నేతృత్వం వహించింది. వారి భయాందోళనలు తొలగించేందుకు ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ 1963 – అధికారిక భాష చట్టాన్ని 1965 తర్వాత కూడా ఆంగ్లం వినియోగం కొనసాగించేలా చేశారు. అయినా డీఎంకె సంతృప్తి పడలేదు.

హిందీని ఏకైక అధికారిక భాషగా మార్చే 1965 జనవరి 26 తేదీ నాటికి హిందీ వ్యతిరేకోద్యమం మద్రాసు రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. జనవరి 25న మదురైలో డీఎంకే సమర్ధకులకు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్త హింసాత్మక ఆందోళనకు దారితీసింది. రెండు నెలల పాటు లూటీలు, గృహదహనాలు, పోలీసు కాల్పులు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి. ఆందోళనను అణచివేయడానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇద్దరు పోలీసులు సహా 70 మంది మరణించారు. పరిస్థితిని శాంతపరచడానికి నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లిష్‌ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

1965 ఆందోళనలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ మార్పులకు కారణమయ్యాయి. డీఎంకె 1967లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా అధికారానికి దూరమైంది. అన్నాదురై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్‌.‌జి. రామచంద్రన్‌ ‌పార్టీ నుండి విడిపోయి ‘అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం’ (ఏఐఏడీఎంకే) స్థాపించారు. అప్పటి నుంచి తమిళనాడులో డీఎంకే లేదా ఏఐఏడీఎంకే పార్టీల మధ్యే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే అధికార బదిలీ కొనసాగుతోంది. ఎంజీఆర్‌ 1987‌లో మరణించడంతో పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఆయన భార్య జానకి రామచంద్రన్‌ ‌నాయకత్వంలోని గ్రూపు తెరమరుగు కావడంతో జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే గట్టిగా నిలబడింది.

తమిళనాడులో పెరియార్‌ ఏనాడో తెరమరుగైనా ఆయన నాటిన ద్రవిడవాదం ముసుగులో చాలా వేర్పాటువాద గ్రూపులు, పార్టీలు ఏర్పడి అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మద్రాసు స్టేట్‌ ‌నుంచి తెలుగు, కన్నడ, మళయాల ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో చేరిపోయి, మిగతా ప్రాంతం తమిళనాడుగా రూపుదిద్దుకున్న తర్వాత అక్కడ భాష, ప్రాంతీయ వేర్పాటువాద ధోరణలు మరింతగా పెరిగాయి. కరుణానిధి, జయలలితలు తమ పార్టీల్లో ద్రవిడవాదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకున్నా సైద్ధాంతిక ముసుగును కొనసాగించారు. కరుణానిధి, జయలలితల మరణం తర్వాత అంతటి ప్రజాధరణ ఉన్న నాయకులు ఇప్పుడు తమిళనాడులో లేరు. దీంతో డీఎంకే, ఏఐఏడీఎంకేలకు రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారడంతో ఆ పార్టీల వారసులు స్టాలిన్‌, ‌పన్నీరు సెల్వం రాష్ట్రంలో ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. త్రిభాషా సూత్రం తమిళానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యార్థులు తాము కోరుకున్న భాషను ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశం ఉంది. నూతన విద్యా విధానంలో మాతృభాషకు పెద్ద పీట వేసినా ద్రవిడ పార్టీలు దీన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram