హిందువులు జరిపే ప్రతీ పండుగ, పర్వంలో అర్ధం పరమార్ధం ఉంది. కాలానుగుణంగా వచ్చే వాతావరణం లోని మార్పులకు తగ్గట్టుగా తీసుకోవల్సిన జాగ్రత్తలను పండుగ రూపంలో ఆచారంగా భావితరాలకు మన పెద్దలు అందించారు. రోగ నిరోధక శక్తిని పెంపోందించేందుకు ఆహార నియమాలు విధించి అది దైవానికి నివేదించి, ప్రసాదంగా స్వీకరించమన్నారు. రోగాలకు విరుగుడు మందులు మాత్రమే కాదు. నమ్మకం, విశ్వాసం కూడాను. అవి కల్పించేందుకే సనాతన సంప్రదాయంలోని పండుగలు. శివసత్తుల నృత్యాలు, సున్నం, పసుపు, కుంకుమల పవిత్రత, వేపమండల తోరణాలు, గుగ్గీలం, మైసాచి పొగల గుమగుమలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు, ఘటం, రంగంతో ఆధ్యాత్మిక పరిమాళాలు మొత్తం మీద తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా జరిగే అతిపెద్ద పండుగ బోనాలు.
అన్ని పండుగలలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఇదే. ముఖ్యంగా భాగ్యనగరం (హైదరాబాద్‌), ‌లస్కర్‌ (‌సికింద్రాబాద్‌) ‌జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారం భమై తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహిస్తారు. చివరగా లాల్‌ ‌దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల జరుపుతారు. ఆషాడమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. భక్తులు దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు పుట్టింటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే గాక, ప్రేమానురాగాలతో ఆహారం నైవేద్యంగా భోజనం సమర్పిస్తారు. భోజనానికి వాడే మరో పదమే బోనం. ఈ తంతును ఊరడి అని కొన్నిచ్లో అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊర (ఊరు) పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
వర్షాకాలం ఆషాడ మాసంలో మొదలై శ్రావణం, బాద్రపద మాసంలో ముగుస్తుంది. ఈ కాలంలో కలరా, మలేరియావంటి ప్రమాదకర అంటు వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. సాధారణంగా ఈ వ్యాధులు క్రిమి కీటకాలతోపాటు ఇతర జంతువులతో వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల అమ్మవారిని ఈ రోగాల బారి నుండి రక్షించమని వేడుకుంటూ బోనాల పండుగ జరుపుతారు. ఈ పండుగనాడు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధికి వేపాకు మండలు కడతారు. పసుపు, కుంకుమలతో గడపలను ఆలంకరి స్తారు. వేపాకులో ఉండే చేదుగుణం, పసుపులోని క్రిమినాశక కారకం కీటకాలను దూరం చేస్తుంది. కనుక బోనాల పండుగలో వేపాకులు, పసుపు ప్రదానంగా వాడుతారు.
బోనాన్ని మట్టి కుండలో వండి, ఆ కుండకి సున్నం, పసుపు, కుంకుమ, వేపాకులు పెడతారు. పైన ఒక దీపాన్ని ఉంచుతారు. దానివల్ల బోనం ఎత్తుకొని వెళ్లే దారి చీకటిగా ఉంటే, ఆ దీపమే దారి చూపిస్తుంది. అంటే దారిలో వెలుగుల కోసం ఈ దీపం ఏర్పాటు అన్నమాట. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు యాంటీ సెప్టిక్‌, ‌యాంటీ బైయోటిక్‌కి సంబంధించినవే కాబట్టి క్రిమి కీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు. అందువల్ల ఈ బోనానికి పవిత్రత, శుభ్రతతో పాటు రోగనిరోధక శక్తి ఉంటుంది. బోనాల పండుగలో ముఖ్యమైంది బలి. ప్రధానంగా మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా వానా కాలం వలన వచ్చే అంటు వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది. కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఈ సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు. ఈ కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. ఆ పొగ వల్ల క్రిమి కీటకాలు చనిపోతాయి. అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాలతో ఊరేగిస్తారు. బోనాల మరుసటి రోజున రంగం జరుగుతుంది. రంగంనాడు అమ్మవారు ఆవహించిన మహిళ పచ్చికుండపై నిల్చోని భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె చెప్పే వాక్కులు తప్పకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. సంవత్సరం పాటు మానవుల ద్వారా జరిగిన తప్పిదా లకు పరిహారం ఏమిటో అమ్మవారు పూనిన ఆమె చెపితే ఆచరించడం దశాబ్ధాలుగా కొనసాగుతోంది.
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు దేవి రూపంగా కొలుస్తారు. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబి స్తుంది. కావున ఆమెను శాంతపరచడానికి మహిళలు ఆలయానికి వచ్చే సమయంలో వారి పాదాలపై భక్తులు వేపఆకులు, పసుపు కలిపిన నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా, తాము కోరిన కోర్కెలు నెరవేరినందున తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన రంగుల పరికరం) సమర్పించే ఆచారం ఉంది. ఆషాడ మాసం వచ్చిందంటే హైదరాబాద్‌లో బోనాల ఉత్సవ శోభ కనిపిస్తుంది. గల్లీలో ప్రతీ ఇల్లు బోనమెత్తడంతో వేడుకగా పండుగ సాగేది. కానీ కరోనా వైరస్‌ ‌కారణంగా బోనాల ఉత్సవ శోభ నేడు లేదు. గోల్కొండ కోట వద్ద జూన్‌ 25‌న తొలి బోనం నిరాడంబరంగా ప్రారంభమైంది. వందలాది మందితో కళకళలాడే గోల్కొండ కోటలో కేవలం ఇరవై మంది కలిసి తొలిబోనాన్ని జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు సమర్పించారు. తొలిపూజకు అంకురార్పణ జరిగింది. మిగతా ఎనిమిది పూజలు ప్రతీ ఆది, గురువారాల్లో నిర్వహిస్తారు. జూలై 23వ తేదీన అమ్మవార్లకు చివరి పూజ నిర్వహించడంతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
– అక్షర

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram