భాగ్యనగరవాసులకు మరో ఆరాధ్య దేవత బల్కంపేటలోని ఎల్లమ్మతల్లి. గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవార్లతో పాటు పూజాదికాలు, ఏటా ఆషాడంలో బోనాలు అందుకుంటున్న తల్లి. భాగ్యనగరం మరో రక్షకురాలు బల్కంపేట ఎల్లమ్మ దేవత.

హైదరాబాద్‌ ‌నగరం ఏర్పడక ముందు, ఏడు శతాబ్దాల క్రితం ఊటబావిలో ఆవిర్భవించిన ఎల్లమ్మ తల్లి నాటి నుంచి విశేషపూజలు అందుకుంటోంది. ఈమెను పరశురాముని తల్లి (జమదగ్ని పత్ని) రేణుకాదేవి అంశగా భావిస్తారు. దేశంలోని వివిధ పరశురామ క్షేత్రాలలో రేణుకా ఆలయాలు ఉన్నాయి. వాటిలో బల్కంపేటలోని ఆలయం ఒకటి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుచంపల్లిలో రేణుకా పరమేశ్వరీ ఆలయం, తిరువణ్ణామలై జిల్లా పడవీడులో రేణుకాంబళ్‌ అమ్మన్‌ ‌కోయిల్‌, ‌కర్ణాటకలో శివమొగ్గ జిల్లా చంద్రగుత్తి, గడగ్‌ ‌జిల్లా బీదరహల్లి, మహరాష్ట్రలోని మాహోర్‌లో రేణుకా ఆలయాలు భక్తులతో నిత్యం రద్దీగా ఉంటాయి. పురాణగాథ ప్రకారం రేణుకను జానపదులు కులదేవతగా కొలుస్తారు. ఆమెను దుర్గ అవతారంగా కూడా పూజిస్తారు. రేణుకను శైవులు, శాక్తేయులు ‘ఛిన్నమస్త’ అనే పేరిట ఆరాధిస్తారు. రేణుకాదేవి ఎల్లరకు అమ్మ కనుక ‘ఎల్లమ్మ’గా వ్యవహరిస్తారు.
అప్పట్లో బెహలూఖాన్‌గూడగా పిలిచే నేటి బల్కంపేట ప్రాంతం కుగ్రామంగా ఉండేది. చారితక్ర ఆధారాల ప్రకారం, ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా పలుగుకు పెద్ద రాయి తగిలిందట. బావిలో పది అడుగుల లోతులో శయన రూపంలో గల అమ్మవారి విగ్రహం కనిపించింది. గ్రామస్థుల సహకారంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితంలేక పోయింది. ‘అమ్మవారు అక్కడే ఉండి పూజలందుకోవాలను కుంటున్నారేమో! అలాగే చేస్తే సరి. దైవనిర్ణయాన్ని ఎలా కాదనగలం?’అని అక్కడికి చేరుకున్న శివసత్తుల (శివరాధనలో ఉన్న స్త్రీలు) మాట మేరకు విగ్రహాన్ని బావిలోనే ఉంచి పూజించసాగారు. అమ్మవారు జలధివాసినిగా ఆవిర్భవించినందున అమెను ‘జలదుర్గ’ అవతారంగా పూజిస్తారు. అచిరకాలంలోనే అమ్మవారి మహిమలు ప్రచారం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తుల రాకపోకలు ఆరంభమై అక్కడ చిన్నపాటి ఆలయం వెలసింది. సంస్థానా ధీశుడు రాజా శివరాజ బహదూర్‌ 1919‌లో అమ్మవారికి ఆలయం నిర్మించారు. శీతలాదేవి ఈ ఆలయానికి క్షేత్రపాలకురాలు. (ఆమెనే జానపదులు పోచమ్మగా పూజిస్తారు) ఆమె పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు, ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనం ఇస్తారు.
తూర్పుముఖంగా చూస్తున్నట్లు శయన రూపంలోని పోచమ్మ అమ్మవారి పైభాగంలోని మహామండపం నుంచి వెలిగే అఖండజ్యోతి భక్తులకు జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది. ఆరంభంలో వారంలో సోమ, బుధ, శనివారాలు తప్ప ఇతర రోజులలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. కాలక్రమేణ నిత్యదర్శనాలు ఏర్పడ్డాయి. ఆది, మంగళ, గురువారాలు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులుగా భావించడంతో ఈ మూడు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జంట నగరాలలోని ఇతర అమ్మవార్ల ఆలయాల తరహాలోనే ఇక్కడ కూడా బోనాల సమర్పణ ప్రారంభించారు.
బోనాల విశిష్టతను పరిశీలిస్తే.. 1869 ప్రాంతంలో హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరా లలో మలేరియా వ్యాధి తీవ్ర రూపం దాల్చి పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించడంతో ప్రకృతిని ప్రసన్నం చేసుకునేందుకు జాతరలు, ఉత్సవాలు జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు జంటనగరాలలోని అమ్మవార్ల ఆలయాలలో బోనాలు ప్రారంభ మయ్యాయి. మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, పెద్దమ్మ తదితర కాళీమాత రూపాలను పూజించసాగారు. దానిలో భాగంగానే రేణుకా ఎల్లమ్మ ఆలయంలోనూ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అందులో భాగంగా ప్రతి ఏటా ఆషాడ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదానికి వ్యవహారిక రూపం. అమ్మవారు చిత్రాన్నప్రియ అని స్తోత్రాలు చెబుతున్నందున ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు బోనం సమర్పించుకోవడమే ఈ పండుగ పరమార్థం. శుచిగా, పవిత్రంగా వండిన బోనాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కొత్తకుండలో ఉంచి, దానిపై ప్రమిద వెలిగించి ఆడపడుచులు తలపై పెట్టి తీసుకు వెళతారు. అలా బోనం తలకెత్తుకున్న మహిళలను అమ్మశక్తికి ప్రతీకగా భావిస్తూ భక్తులు వారి కాళ్లపై నీరు పోస్తుంటారు.
‘అమ్మా బైలెల్లినాదో నాయనా! తల్లీ బైలెల్లినాదో ఎల్లు ఎల్లాయి రాయే మాయమ్మ / మమ్మేలు మాతల్లి నీకు శరణాలు/మాకన్న తరలిరాయే ఎల్లమ్మ / బల్కంపేట ఎల్లమ్మా’ అని ఆలపిస్తూ బోనాలు సమర్పిస్తారు. డప్పులు, మంగళవాయిద్యాల మధ్య మహిళలు ఊరేగింపుగా వచ్చి పోచమ్మ తల్లికి ఘటాలు సమర్పిస్తారు.
ఈ ఆలయంలోని అమ్మవారి మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న ఊట బావి నుంచి వచ్చిన నీటిని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుంటే తామర, గజ్జి వంటి అంటువ్యాధులు, కలరా, మశూచి వంటివి సమసి పోతాయని, ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే దుష్టశక్తుల బెడద ఉండదని భక్తుల విశ్వాసం. నూతన దంపతులు పసుపు బట్టలతో అమ్మవారిని దర్శించు కుంటే వారి కాపురం చీకుచింతలకు అతీతంగా సాగుతుందని విశ్వాసం.

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
Instagram