నరేంద్ర మోదీతో సాధ్యంకానిదంటూ ఏదీ లేదు. ఇది బీజేపీ ఎన్నికల నినాదం కూడా. ఇది కేవలం నినాదంగానే మిగిలిపోలేదు. గత ఆరేళ్ల బీజేపీ పాలన దీన్ని రుజువు చేసింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను పరిష్కరించింది. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. ప్రపంచంలో భారతదేశ కీర్తి, ప్రతిష్టలను పెంచింది.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే ముందు.. పదేళ్ల యూపీఏ పాలనలో పైనుండి కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయింది. భారీ అక్రమూలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం సంక్షోభస్థాయికి చేరింది. వృద్ధిరేటు మందగించింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు హద్దులు దాటాయి. ఈ పరిస్థితులు మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన తీవ్రవాద దాడులు ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. దీంతో విసిగి వేసారిన ప్రజలు యూపీఏ పాలనకు చరమగీతం పాడారు.

తన అద్భుత మేధోశక్తితో, సమర్థ నాయకత్వంతో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని చూసి, ఆయనపై పూర్తి విశ్వాసంతో సంపూర్ణ మెజారిటీ ఇచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనను గాడిలో పెట్టి, అనేక సంస్కరణలు చేపట్టి దేశంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులను సాధించారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు చేయలేని అనేక పనులను ఈ ఆరేళ్లలో చేసి చూపించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. అంతేకాదు, పారదర్శక పాలనతో సామాన్యులకు సైతం చేరువయ్యారు. జన్‌ధన్‌, ఆధార్‌, ‌మొబైల్‌ ‌త్రయాన్ని ప్రయోగించి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను నేరుగా ప్రజలకు అందేలా చేశారు. పనికిరాని చట్టాలను తొలగించి వ్యాపార సౌలభ్యాన్ని పెంచారు. ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులలో పైరవీలకు చెక్‌ ‌పెట్టింది. ఫలితంగా అసాధారణ సేవలందిస్తున్న అత్యంత సామాన్యులు సైతం పద్మ అవార్డులను అందుకుంటున్నారు.
ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా, సామాజిక భద్రత, కనీస అవసరాలైన ఇల్లు, గ్యాస్‌, ‌విద్యుత్తు కనెక్షన్‌, ‌మరుగుదొడ్డి, ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం వంటివి కల్పించి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. సౌరవిద్యుత్తును ప్రోత్సహించి దేశవ్యాప్తంగా 24 గంటలు నిరంతరంగా విద్యుత్తు సరఫరా అయ్యేట్టు చేశారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతేకాదు రైతులు పండించిన పంటలకు రికార్డు స్థాయిలో మద్దతు ధరలను పెంచారు.

తాత్కాలిక ప్రయోజనాలు ఒనగూర్చే పథకాలకు, ప్రజలను పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడేట్లుగా చేసే పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల ఆర్థికశక్తిని పెంచే వాటిపై దృష్టిసారించింది మోదీ ప్రభుత్వం. చిరు వ్యాపారులకు ముద్ర రుణాల ద్వారా రుణ సదుపాయం కల్పించి వారికి స్వయం ఉపాధి అవకాశాలను పెంచింది. స్టార్ట్ అప్‌ ఇం‌డియా, స్టాండ్‌ అప్‌ ఇం‌డియా ద్వారా అంకుర కంపెనీలను ప్రోత్సహిస్తోంది. యువతలో నైపుణ్యాన్నిపెంచడానికి స్కిల్‌ ఇం‌డియా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తన అంతర్జాతీయ పర్యటనల ద్వారా, దౌత్య చతురతతో మోదీ ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకొని పాకిస్తాన్‌ను ఏకాకి చేశారు. చైనా దూకుడుకు కళ్లెం వేశారు. ప్రపంచ దేశాలతో అనేక ఒప్పందాలు చేసుకొని, విదేశీ పెట్టుబడులను సాధించి, విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌ను తమకు ఇష్టమైన గమ్యంగా తీర్చిదిద్దారు.
ఇలా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మోదీ 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తూ 303 స్థానాలు సాధించి తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారు. గడిచిన ఏడాది అనేక సవాళ్ల మధ్య సాగింది. దేశం ఎదుర్కొంటున్న అనేక కఠిన సమస్యలను నరేంద్ర నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరించింది.

పాకిస్తాన్‌, ఆఫ్ఘానిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో మతపరమైన వివక్షను ఎదుర్కొని భారత్‌కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించారు. మతపరమైన వేధింపులు భరించలేక భారత్‌కు వలస వచ్చి దశాబ్దాలుగా ఎటువంటి గుర్తింపు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతూ నలిగిపోతున్న వారికి స్వాంతన చేకూర్చారు. దేశ వ్యతిరేకశక్తులు, కొన్ని ప్రతిపక్షాలు ఈ బిల్లును ద్వారా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసినా వాటిని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగింది. త్రివిధ దళాలను సమన్వయం చేయడానికి, సమర్థవంతంగా తమ బాధ్యతల్ని నెరవేర్చడానికి చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ని నియమించాలని రక్షణ వర్గాల నుండి ఏళ్లుగా డిమాండ్‌ ఉం‌ది. దాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యూపీఏ తప్పటగుల వల్ల సమస్యల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేయడానికి, వాటి రుణ సామర్థ్యం పెంచడానికి పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసింది. దేశంలో కార్పొరేట్‌ ‌పన్నును 22 శాతానికి తగ్గించి మన వ్యాపార సంస్థలు ప్రపంచ సంస్థలతో పోటీ పడడానికి వీలు కల్పించింది. కొత్తగా ప్రారంభించే ఉత్పత్తి సంస్థలకు కేవలం 15 శాతమే పన్ను విధించి వాటిని ప్రోత్సహిస్తున్నది. వ్యక్తిగత పన్నును కూడా సరళీకరించి మధ్య తరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించింది.
ఇటీవల యావత్‌ ‌ప్రపంచాన్ని చివురుటాకులా వణికిస్తున్న చైనా మహమ్మారి కరోనా వైరస్‌ ‌నివారణలో సైతం నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నేతలు కూడా కొనియాడారు. సమయానుకూలమైన నిర్ణయాలు, సాహసోపేతమైన చర్యలతో, ప్రజల భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా కరోనాను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. సరైన సమయంలో లాక్‌డౌన్‌ను విధించి, పటిష్టంగా అమలు చేయడం ద్వారా పెను ప్రమాదం నుండి దేశాన్ని గట్టెక్కించారు. అంతేకాదు, దేశంలో ఆరోగ్య వసతులను పెద్ద ఎత్తున పెంచుకోగలిగాం. కరోనా భారత్‌కు చేరుకునే వరకు ఇలాంటి వైరస్‌లను పరీక్షించి నిర్ధారించేందుకు దేశంలో కేవలం ఒకే ఒక్క పరీక్షా కేంద్రం ఉండేది. ఇప్పుడు 600 పైగా పరీక్షా కేంద్రాలున్నాయి. గతంలో దేశంలో ఏడాదికి 45 వేల పిపిఈ కిట్లు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు రోజుకు 3 లక్షల పిపిఈ కిట్లు ఉత్పత్తి జరుగుతున్నది. 3.5 లక్షల ఎన్‌ 95 ‌మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. 10 లక్షల మందికి ఏకకాలంలో చికిత్స అందించే వసతులు కల్పించారు.
కరోనా నివారణలో భాగంగా రూ. 20 లక్షల కోట్లను ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మూడు లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. మొదటిది లాక్‌డౌన్‌ ‌సందర్భంగా పేద ప్రజలు ఎవరూ కనీస అవసరాలకు ఇబ్బంది పడకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే దేశంలోని 80 కోట్ల మంది పేదలకు మూడు నెలల పాటు మనిషికి 5 కిలోల బియ్యం, కిలో పప్పు సరఫరా చేశారు. 20 కోట్ల మంది జన్‌ధన్‌ ‌ఖాతా కలిగిన మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున సహాయం అందించారు. వీటికి అదనంగా పెన్షన్‌దారులకు రూ. 1000 అందిస్తున్నారు. వలస కార్మికులకు ఆహారానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదని విపత్తు నిర్వహణ నిధుల నుండి ప్రభుత్వం రూ. 11,092 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం 1.72 లక్షల కోట్ల రూపాయలతో గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన ద్వారా పేద ప్రజలను, శ్రామికులను ఆదుకునే ప్రయత్నం చేశారు.

రెండవది, లాక్‌డౌన్‌ ‌కారణంగా ఎవరూ ఉపాధిని కోల్పోవద్దు అనే ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి భారత్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టింది. అంతేకాదు, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి రూ.30 వేల కోట్లు, ఈక్విటీ ద్వారా మరో రూ.50 వేల కోట్లను ప్రకటించింది. లాక్‌డౌన్‌లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్రాలకు నిధులందించారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన ద్వారా 73,000 కోట్ల రూపాయలను ముందస్తుగా అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు.

మూడవది, కరోనా కారణంగా ప్రజల జీవన పద్ధతుల్లో వచ్చే మార్పుల కారణంగా వ్యాపార స్థితిగతులు, పరిధులు కూడా మారుతాయి కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా అనేక రంగాల్లో నూతన ప్రభుత్వ విధానాలను ప్రకటించారు. ఇలా గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అంతర్జాతీయ మాంద్యపు పరిస్థితులను, కరోనా పరిస్థితులను ప్రజల భాగస్వామ్యంతో అధిగమించి నవ భారత్‌ ‌నిర్మాణం దిశగా మోదీ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో ప్రధానంగా ప్రశంసించాల్సింది ప్రజలనే. మోదీ పట్ల వారు ప్రకటిస్తున్న అచంచలమైన విశ్వాసమే ఆయన బలం, అస్త్రం. అదే ఈ దేశం బలం కూడా.

  • ఏనుగుల రాకేష్‌రెడ్డి , బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి

About Author

By editor

Twitter
Instagram