సరిహద్దుల రక్షణ కోసం భారత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరాదన్నదే చైనా లక్ష్యంగా కనిపిస్తున్నది. అలాంటి ప్రయత్నం కనిపిస్తే పొరుగు భూభాగాలపై తన హక్కు గురించి మాట్లాడడం కూడా చైనా ప్రభుత్వానికి పరిపాటిగానే ఉంది. ఇంతకుముందు పాలించిన ప్రభుత్వాలు సరిహద్దుల రక్షణ మీద పెట్టవలసినంత దృష్టి పెట్టలేదన్నది పెద్ద విమర్శ. ఒక వాస్తవం. ఆ పని ఇటీవల మొదలు కావడం పొరుగు దేశం చైనాకు కంటగింపుగా ఉంది. ఒక దేశం తన సరిహద్దుల రక్షణకు పూనుకుంటే ఇరుగు పొరుగు వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి? అందులో కనిపించేది ఆధిపత్య ధోరణి తప్ప మరొకటి కాదు. ఆధిపత్య ధోరణి అనడం తొందరపాటు కానే కాదు. అలాంటి అభిప్రాయానికి రావడానికి ఏడు దశాబ్దాల చరిత్ర సరిపోతుంది. 1950లో మన రెండు దేశాల మధ్య ఆధునిక విదేశీ సంబంధాలు మొదలయినప్పటి నుంచి కూడా చైనా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నది. ఆధిపత్యం, ఆక్రమణ విధానమే. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో మన తొలితరం నేతలకు పొరుగు దేశం నుంచి ఇలాంటి అనుభవాలే ఎదురయినాయి. అవే కొనసాగుతున్నాయి. చైనా ఎప్పటికీ నమ్మదగిన పొరుగు దేశం కాదన్నదే ఆనాటి నుంచి మార్చుకునే అవసరం లేకుండా ఉన్న స్థిరమైన అభిప్రాయం. అందుకు తగ్గట్టే చైనా అడుగులు ఉన్నాయి. గల్వాన్‌ ‌లోయ మీద ఆధిపత్యం మాదేనంటూ తాజాగా ఆ దేశం మాట్లాడడం ఆధిపత్య ధోరణిలో మరొక అడుగు మాత్రమే. గల్వాన్‌ ‌లోయ దగ్గర భారత్‌, ‌చైనా సైనికుల మధ్య జరిగిన ఇటీవలి ఘర్షణ అరవై ఏళ్ల ఉద్రిక్తతలలో పరాకాష్ట వంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించడం సంచలనం రేపింది. తమ సైనికులు ఎంతమంది చనిపోయారో చైనా వెల్లడించలేదు. హిమాలయ సరిహద్దులలో చెలరేగిన ఘర్షణలు, సైనికుల మోహరింపులు అసాధారణంగానే ఉన్నాయి. ఈసారి నేపాల్‌, ‌పాకిస్తాన్‌ అనే రెండు దేశాలను కూడా తనతో పాటే భారత్‌తో సంఘర్షించడానికి చైనా సిద్ధం చేసింది.

ఇటీవల భారత్‌-‌చైనా సరిహద్దులలో మొదలైన కొత్త ఘర్షణలలో, కొత్త నినాదాలు వినిపించడం చైనా పాత విధానానికి కొనసాగింపు. గల్వాన్‌ ‌లోయ మాదేనంటూ చైనా హఠాత్తుగా నినాదం అందుకుంది. దీనిని భారత్‌ ‌వెంటనే ఖండించింది. గల్వాన్‌ ‌లోయ చారిత్రకంగా భారత్‌దేనని మన దేశం గట్టిగానే జవాబు చెప్పింది. ఆ లోయ ప్రాంతంలో చాలాకాలంగా గస్తీ చేపడుతున్నా ఎటువంటి ఘటనలు జరగలేదన్న సంగతి గుర్తు చేసుకోవాలని కూడా భారత్‌ ‌హెచ్చరించింది. అసలు తాజా వివాదం సృష్టికి చైనా కేంద్ర బిందువుగా చేసుకున్నదే గల్వాన్‌ ‌లోయ రగడ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు వివాదానికి మొన్న మే మాసమే వేదిక అయింది. లద్ధాఖ్‌లో భారత్‌ అధీనంలోని మూడు ప్రదేశాలలో చైనా సైనికులు చొరబడ్డారు. శిబిరాలు, గస్తీ కేంద్రాలు ఏర్పాటు చేసే యత్నం చేశారు. వాటిని తొలగించమని చెప్పినందుకే ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో జరిగిందే తెలుగు వ్యక్తి సంతోష్‌ ‌బాబు దుర్మరణం. గల్వాన్‌ ‌నది మీద తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని 72 గంటలలో పూర్తి చేయడం చైనాకు మింగుడు పడడం లేదు. లద్ధాఖ్‌లోనే గల్వాన్‌ ‌లోయ దగ్గర రెండు దేశాల సైనికులు వేల సంఖ్యలో మోహరించారు. చైనా అక్కడ రోడ్డు నిర్మాణానికి అభ్యంతరం చెప్పింది. గతంలో డోక్లాం వద్ద 73 రోజుల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన కూడా ఇలాంటిదే. ఈ జూన్‌ 15‌న ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన 14వ గస్తీ కేంద్రం ఈ వంతెనకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అరవై మీటర్ల పొడవైన ఈ వంతెన మీద ఫిరంగి దళ వాహనాలతో పాటు ఇతర వాహనాలను కూడా నడపవచ్చు. అంటే వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలను వేగంగా తరలించేందుకు ఈ వంతనే కీలకంగా మారింది. అంతేకాకుండా దర్బాక్‌ ‌నుంచి దౌలత్‌ ‌బేగ్‌ ఓల్టీ వరకు 225 కిలో మీటర్ల మేర రహదారిని భారత్‌ ‌కాపాడుకోగలుగుతుంది. రెండు దేశాలకు వ్యూహాత్మకంగా కీలకమైన గల్వాన్‌ ‌పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాలలో ఈ వంతెన కూడా ఒకటి.

‘మిత్రులను మార్చుకోవచ్చు, కానీ ఇరుగు పొరుగును మార్చుకోలేం’ అన్నది అటల్‌ ‌బిహారీ వాజపేయి తేల్చిన శాశ్వత సత్యం. ఈ నేపథ్యంతోనే వాస్తవాలను గమనించుకుంటూ, ఉద్రిక్తతలను తగ్గించుకుంటూ ఇరుగుపొరుగుతో వ్యవహరించడం భారత విదేశాంగ విధాన కీలక లక్షణంగా అవతరించింది. చైనాతో ఇప్పుడు మన విధానం ఇందుకు అనుగుణంగానే ఉన్నది. భారత విదేశాంగ విధానమంత స్పష్టమైనదీ, స్వచ్ఛమైనదీ కాదు చైనా విదేశాంగ విధానం. ఆ దేశానికి ఏది ప్రయోజనమో అదే ఆ దేశ విధానం. అంటే దానికి ఇరుగు పొరుగు దేశాల ప్రయోజనాలు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వవలసినవీ, గౌరవించవలసినవీ కావు. కానీ భారత్‌ ‌విధానం అది కాదు. తన విదేశాంగ విధానానికీ, విలువలకూ తన గతాన్నే ఇప్పటికీ పునాదిగా భావిస్తున్నది. భారత్‌-‌చైనా బంధం అంటే భారత్‌ ‌వరకు రెండు వేల ఏళ్ల నాగరికతల కొనసాగింపు. అక్టోబర్‌ 1, 1949‌న చైనాకు స్వాతంత్య్రం వచ్చింది. ఆధునిక కాలంలో మన రెండు దేశాల దౌత్య సంబంధాలు దాదాపు అప్పుడే ఆరంభమైనాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా (తైవాన్‌)‌తో లాంఛనంగా తెగతెంపులు చేసుకుని పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనాను 1950లోనే భారత్‌ ‌గుర్తించింది. అలా గుర్తించిన తొలి దేశాల జాబితాలో భారత్‌ ‌కూడా ఒకటి. అటు సోషలిస్ట్, ఇటు కమ్యూనిస్టు బ్లాక్‌కు చెందనప్పటికీ చైనాను భారత్‌ ‌గుర్తించింది.

భారత్‌, ‌చైనా పురాతన సంస్కృతి కలిగిన ఆసియా దిగ్గజాలు. పట్టుదారి (సిల్క్ ‌రూట్‌) ఆ ‌రెండు దేశాల నాగరికతలకు గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య బౌద్ధం, వాణిజ్యం ఎంత బలీయంగా ఆదానప్రదానాలు సాగించాయో ఆ దారే చెబుతుంది. కానీ హున్‌ ‌జాతి నుంచి బయటపడి కమ్యూనిస్టు బాట పట్టిన తరువాత పట్టుదారి కాస్తా, పక్కదారిగా రూపుదిద్దుకుంది. విస్తరణ కాంక్ష ప్రధానమైంది. చైనా విదేశాంగ విధానానికి ఇదే ఆయువు. దేశ భూభాగంలో దాదాపు 45 శాతం ఉన్న సంస్థానాలను భారత్‌లో అంతర్భాగం చేసిన వారు సర్దార్‌ ‌పటేల్‌. అలా భారతదేశానికి ఒక సమాఖ్య రూపును సంతరించి పెట్టారాయన. లోపలి నుంచే కాదు, బయట నుంచి కూడా ఉన్న బెడదలను గుర్తించడంలో పటేల్‌ ‌గొప్ప వాస్తవికమైన దృష్టిని ప్రదర్శించారని చెప్పడానికి చాలా అధారాలు ఉన్నాయి. నెహ్రూ దృష్టి పటేల్‌ ‌దృష్టి వంటిది కాదు. టిబెట్‌ ‌వ్యవహారంతో ఇది బాగా అర్థమవుతుంది. టిబెట్‌ ‌మన ఉత్తర సరిహద్దు. అది ఒక విధంగా స్వతంత్ర దేశం. భారత్‌, ‌టిబెట్ల మధ్య ఏనాడూ శత్రుత్వం లేదు. కానీ టిబెట్‌తో చైనాకు ఉన్న బంధం మాత్రం- ఆధిపత్య ధోరణితో ఉన్నదే. కమ్యూనిస్టు ప్రభుత్వమే కాదు, అంతకు ముందు ఉన్న హున్‌ ‌జాతి ప్రభుత్వాలు కూడా టిబెట్‌ ‌మీద అదే ధోరణిని ప్రదర్శించాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనాను భారత్‌ ‌గుర్తించిన సంవత్సరమే, అంటే 1950లోనే చైనా టిబెట్‌లోకి ప్రవేశించి ఒక శాశ్వత సమస్యను భారత్‌ ‌నెత్తిన పెట్టింది. టిబెట్‌కు ఆయుధ సంపత్తి లేదు. చైనాకు ఏ విధంగానూ ముప్పు కాదు. అయినా సరే టిబెట్‌ను ‘విముక్తం’ చేసి తీరతామనే చైనా ప్రకటించింది. అయినా భారత్‌ ‌మౌనం వహించివలసిన పరిస్థితి. ఇది ఎందుకంటే, శ్వేతజాతి పాలనా ఫలితం. టిబెట్‌ ‌మీద చైనా ఆధిపత్యాన్ని ఇంగ్లండ్‌ ‌గుర్తించింది. టిబెట్‌లోకి చైనా సైన్యం వెళ్లడం గురించి పటేల్‌ అసహనంగానే ఉన్నారు. అందుకే చైనాతో భారత్‌కు ఎదురుకాగల ముప్పును గురించి 1950కి ముందే ఆయన పండిట్‌ ‌నెహ్రూను హెచ్చరించారు. కానీ హిమాలయ సరిహద్దు దేశాలైన నేపాల్‌, ‌భూటాన్‌, ‌సిక్కింల మీద తమ అదుపు వంటి కీలక ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే తప్ప పొరుగు దేశంతో (చైనాతో) ఘర్షణకు పూనుకోరాదన్నదే నెహ్రూ విధానం. అందుకే టిబెట్‌ ‌విషయంలో భారతదేశానికి ప్రాదేశిక, రాజకీయ ఆంక్షలేమీలేవనీ, ఆ దేశంతో సాంస్కృతిక, వాణిజ్య బంధాలనే భారత్‌ ‌కోరుతోందనీ 1950లోనే నెహ్రూ ప్రకటించారు. టిబెట్‌ ‌విషయంలో నెహ్రూ ఇలాంటి స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ చైనా భారత్‌ను నమ్మకపోవడమే చరిత్రలో వైచిత్రి. కొన్ని అపనమ్మకాలతోనే భారత్‌తో చైనా దౌత్య సంబంధాలు మొదలయినాయి. టిబెట్‌లో అణచివేత సర్వసాధారణం. అంతేకాదు, భారత్‌లో టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా రాజకీయ ఆశ్రయం పొందడం కూడా చైనాకు సమ్మతం కాదు. కొద్దికాలం క్రితం దలైలామా అరుణాచల్‌‌ప్రదేశ్‌లో, ముఖ్యంగా అక్కడి తవాంగ్‌ అనే చోటికి వెళ్లడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. తవాంగ్‌ను చైనా దక్షిణ టిబెట్‌గా చెప్పుకుంటుంది.

1949 పరిస్థితులు వేరు. 1962 నాటి పరిస్థితులు వేరు. 1990 తరువాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. అయినా చైనా తన విధానాలను మార్చుకోలేదు. మధ్య యుగాల నాటి మంగోలు వీరుల దుందుడుకు తనం, రెండో ప్రపంచ యుద్ధం నాటి హిట్లర్‌ ‌పంథా, కమ్యూనిస్టు హింసాత్మక దృష్టి చైనాలో కనిపిస్తూనే ఉన్నాయి. మారిన ప్రతి ప్రపంచ పరిణామంలోను భారత్‌ ‌వ్యతిరేకతనే చూసింది చైనా. భారత్‌ ‌పట్ల ఒక శత్రుపూరిత వైఖరి కొనసాగించ డానికి కారణం ఇదే. అప్పుడే ఇరుగు పొరుగు ఆక్రమణ విధానానికి ఒక దారి మిగిలి ఉంటుంది. సోవియెట్‌ ‌రష్యాతో మొదట అంటకాగిన చైనా తరువాత ప్రపంచ ఆధిపత్యం కోసం పేచీ పడింది. కానీ అప్పటికే సోవియెట్‌ ‌రష్యా, భారత్‌ ‌బంధం దృఢంగా ఉంది. సోవియెట్‌ ‌రష్యా పతనం, ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు దరిమిలా చైనా చాలాకాలమే అమెరికాతో బంధం కొనసాగించింది. సోవియెట్‌ ‌రష్యాతో భారత్‌ ‌సన్నిహితంగా ఉండడం నాడు చైనాకు నచ్చలేదు. తాను అమెరికాకు దూరం జరిగిన తరువాత భారత్‌, అమెరికా సంబంధాలు బలపడడం కూడా ఇప్పుడు ఆ దేశానికి నచ్చడం లేదు. సోవియెట్‌ ‌రష్యాతో గానీ, అమెరికాతో గానీ చైనా విభేదాలు ముమ్మాటికీ ఆధిపత్య ధోరణికి సంబంధించినవే. సోవియెట్‌ ‌రష్యా ఇక గతం. కానీ తన ప్రపంచాధి పత్యానికి పోటీ కేంద్రం తయారవుతుంటే అమెరికా అంగీకరించగలదా? ఈ వాస్తవాన్ని చైనా గుర్తించ నిరాకరిస్తున్నది. సోవియెట్‌ ‌రష్యా, అమెరికా, ఇప్పుడు భారత్‌ – ఈ ‌మూడు దేశాల విదేశాంగ విధానంలో చైనాలో స్పుటంగా కనిపించే అంశం ఆధిపత్య ధోరణి. కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో ప్రపంచం ముందు దోషిగా నిలబడి ఉన్న కాలంలో కూడా అదే ఆధిపత్య ధోరణితో చైనా ప్రదర్శిస్తున్నది. అంటే ఆధిపత్య ధోరణితోనే సాధించడం ఆ దేశ విధానం. అంతర్జాతీయ సంస్థలలో భారత్‌ ‌ప్రవేశం మీద కూడా చైనాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధింప చేయడానికి భారత్‌ ‌చేసిన యత్నాలను చైనా వమ్ము చేసింది. జైషే మహమ్మద్‌ ‌సంస్థ మీద, ఆ సంస్థ నాయకుడు మసూద్‌ అజర్‌ ‌మీద ఆంక్షలు విధింప చేయాలని భారత్‌ ‌ప్రయత్నాన్ని చిరకాలం నిలిపివేసేటట్టు చేసింది చైనాయే. ఆ విధంగా పాక్‌ ‌తన బంధాన్ని నిలుపుకుంటున్నది. ప్రతి ప్రపంచ పరిణామాన్ని కూడా పొరుగున ఉన్న భారత్‌లో ఆక్రమణ సాగించడానికి వీలైనట్టు చెప్పడానికి ప్రయత్నించడమే చైనా విధానం.
ఆధునిక భారత, చైనా సంబంధాలను నిర్దేశిస్తున్నది కూడా చైనా ఆధిపత్య, ఆక్రమణ విధానమే. సరిహద్దు వివాదాలే ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలను శాసిస్తున్నాయి. 1962 నాటి చైనా యుద్ధం, 1967 నాటి చో లా ఉదంతం, 1987 నాటి సరిహద్దు ఘర్షణలు అన్నీ కూడా దీనినే రుజువు చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దురదృష్టవశాత్తు ఈ సరిహద్దు మొత్తం వివాదాస్పదమే. చైనా వంటి పేచీకోరు దేశానికి ఇదే పెద్ద వరం. డోక్లాం , అక్సాయ్‌ ‌చిన్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌తాజాగా లద్ధాఖ్‌లోను సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. భారత్‌లోని ఈశాన్యంలో అరుణాచల్‌ ‌సహా బౌద్ధులు సంప్రదాయకంగా నివసించే 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదన. పశ్చిమ హిమాలయాలలోని అక్సాయ్‌ ‌చిన్‌ ‌వద్ద 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమించిందని భారత్‌ ఆరోపణ. ఇందులో లద్ధాఖ్‌లోని కొంత భూభాగం కూడా ఉంది.

2017లో డోక్లాం వద్ద కూడా ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడినప్పటికీ 1980 నుంచి ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను విజయవంతంగానే నెరుపుతున్నాయి. 2008లోనే చైనా భారత్‌ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కూడా అవతరించింది. రెండు దేశాలు సమాంతరంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. 21వ శతాబ్దపు భారత్‌-‌చైనా బంధాలను ఈ అంశం కూడా విశేషంగానే ప్రభావితం చేస్తుంది. చైనా అభివృద్ధిలో అమెరికాకు ఉన్న అప్రకటిత అభ్యంతరాలే, భారత్‌ ఎదుగుదల విషయంలోను చైనా ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు పాకిస్తాన్‌, ‌నేపాల్‌లతో కలసి భారత్‌ ‌మీద ముప్పేట దాడికి పాల్పడుతున్నది. అలాగే బంగ్లాదేశ్‌ను కూడా ఉసిగొల్పాలని చూస్తున్నది. ఇక మిగిలింది శ్రీలంక ఒక్కటే. ఇది కూడా దాదాపు చైనా అధీనంలోనే ఉన్నది.

సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం భారత్‌, ‌చైనాలకు అంత సులభమేమీ కాదు. ప్రధానమైన మెక్‌మహన్‌ ‌రేఖను గుర్తించడం దగ్గరే రెండు దేశాలకు కూడా సందేహాలు ఉన్నాయి. 1988లో రాజీవ్‌ ‌గాంధీ చైనా సందర్శన తరువాత చర్చల ద్వారా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రయత్నం ఆరంభమైంది. 1993లో మళ్లీ రెండు దేశాలు శాంతి ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఇది వాస్తవ నియంత్రణ రేఖ వద్ద వ్యవహరించ వలసిన తీరు గురించి చెప్పినదే. తరువాత 20 దఫాలు చర్చలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. ఇందులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింగ్‌ ‌పింగ్‌ ‌పాల్గొన్న చర్చలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లద్ధాఖ్‌ ‌ఘర్షణతో 1993 నుంచి చేసుకున్న ఒప్పందాలన్నీ కాలగర్భంలో కలసిపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. దాని తీవ్రత అలాంటిది.

సరిహద్దు సమస్య మాత్రమే భారత్‌, ‌చైనా మధ్య విభేదాలకు మూలమా? అదేమీ కాదు. కశ్మీర్‌ ‌విషయంలో పాకిస్తాన్‌ ‌తిక్క వాదనకు చైనా వంత పాడుతూ ఉంటుంది. ఇది భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. పాకిస్తాన్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌ ‌గుండా చైనా రోడ్డును నిర్మించింది. అణు సరఫరా బృందంలోనికి పాకిస్తాన్‌ ‌ప్రవేశాన్ని ఆకాంక్షిస్తూ చైనా, భారత్‌ ‌ప్రవేశానికి మోకాలడ్డుతున్నది. బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌కు భారత్‌ ‌సంతకం చేయకపోవడం చైనాకు కన్నెర్రగా ఉంది. అదీ కాకుండా 370 అధికరణం రద్దు వల్ల తన వ్యవహారాలకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కూడా చైనాకు ఉంది. అలాగే లద్ధాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇవ్వడం వల్ల యథాతథ స్థితికి గండి పడుతుందని కూడా చైనా అనుమానం. అంటే తన భవిష్యత్‌ ‌వ్యూహాలకు అది ఆటంకం కల్పిస్తుందన్న అనుమానం. అక్సాయ్‌ ‌చిన్‌, ఆ‌క్రమిత కశ్మీర్‌, ‌గిల్గిత్‌ ‌ప్రాంతాల మీద భారత్‌ అభిప్రాయాల గురించి హోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన ప్రకటనలను అడ్డం పెట్టుకుని కూడా చైనా కొంత హంగామా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియాలో దీటైన ఆర్థికశక్తిగా భారత్‌ ఎదగడం చైనాకు మింగుడుపడడం లేదు. ప్రస్తుతం ఆసియాలో అగ్రరాజ్యంగా వెలుగొందాలని భావిస్తున్న చైనాకు భారత్‌ ‌పోటీ రావడం ఇష్టం లేదు. చైనా, అమెరికా వైరం మధ్య భారత్‌ అమెరికాతో సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా చైనాకు బాధగా ఉంది.
ఈ నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌సరిహద్దులలో ఎలాంటి చర్య తీసుకోవడానికైనా సైన్యానికి అధికారం ఇవ్వడం సముచితమే. వాస్తవ నియంత్రణ రేఖను దాటి ఒక్క అడుగు కూడా చైనా వేయకుండా కట్టడి చేయడానికి కూడా ప్రత్యేక దళాలను నియమించింది భారతదేశం. చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్‌-‌చైనా బంధాలు ఇక పూర్వం వలె ఉండే అవకాశమే లేదు. నిజానికి ఒక దేశం ఆధిపత్యం కింద, ఆదేశాల కింద మరొక దేశం ఉండడం, ఉండాలని అనుకోవడం దౌత్యం అనిపించు కోదు. కొత్త ఘర్షణలతో రెండు దేశాలకు వాణిజ్యపరమైన నష్టం అపారం. అయినా దేశరక్షణకు భారత్‌ ‌పెద్ద పీట వేయదలిచినట్టు స్పష్టం మవుతున్నది. ఈ క్రమం లోనే అమెరికా, భారత్‌ ‌సైనిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరిస్తాయన్న అంచనాలు అప్పుడే వెలువడుతున్నాయి. ప్రపంచంతో చైనా సంబంధాలకు కొవిడ్‌ 19 ‌కొత్త రూపు ఇచ్చింది. కొవిడ్‌ 19 అపకీర్తి నుంచి బయటపడే వ్యూహంలో భారత్‌తో తన సంబంధాలను కీలక సమయంలో చైనాయే మరింత వికృతం చేసింది.

తెలుగు జవాన్‌ ‌వీరమరణం

భారత్‌-‌చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత సైనికుల్లో తెలుగు జవాన్‌ ‌బిక్కముళ్ల సంతోష్‌బాబు ఒకరు. దేశ రక్షణ కోసం సంతోష్‌బాబు చూపిన తెగువ, ధైర్యం భారతీయులందరికీ గర్వకారణం. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు 16వ బిహార్‌ ‌రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి ఉపేందర్‌, ‌తల్లి మంజుల, భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు. సంతోష్‌బాబు 2004లో లెఫ్టినెంట్‌ ‌హోదాలో సైన్యంలో చేరారు. శ్రీనగర్‌, ‌కుప్వారా, లద్ధాఖ్‌లలో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. కొన్నాళ్లు కాంగోలో మనదేశం తరపున విధులు నిర్వర్తించిన సంతోష్‌బాబు 37 ఏళ్లకే కల్నల్‌ ‌హోదా పొందారు. సంతోష్‌బాబుకు నెల రోజుల క్రితమే హైదరాబాద్‌ ‌బదిలీ అయింది. అయితే కరోనా నేపథ్యంలో అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్నారు.
ఆ రాత్రి అసలేం జరిగింది?

జూన్‌ 6‌న లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా గల్వాన్‌ ‌లోయలో నిర్మించిన తాత్కాలిక చెక్‌ ‌పోస్టులను తొలగించడానికి, అక్కడి నుంచి వెనక్కి వెళ్లడానికి చైనా అంగీకరించింది. చైనా బలగాల ఉపసంహరణ పక్రియ ఎంతవరకు వచ్చిందో చూడటం కోసం కల్నల్‌ ‌సంతోష్‌బాబు నేతృత్వంలోని 40 మంది జవాన్లు జూన్‌ 15‌న సాయంత్రం గల్వాన్‌ ‌లోయలోకి వెళ్లారు. భారత భూభాగంలో చైనా సైనికులు అబ్జర్వేషన్‌ ‌పోస్టు నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు.

చైనా బలగాల్లో కొత్త ముఖాలు ఉండటాన్ని సంతోష్‌బాబు గమనించారు. అంతకుముందున్న వారితో సంతోష్‌బాబుకు పరిచయం ఉంది. అదనపు బలగాలను చైనా మోహరించిందని పసిగట్టిన సంతోష్‌బాబు.. భారత భూభాగంలో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఆయన మాట్లాడుతుండగానే ఓ చైనా సైనికుడు మాండరిన్‌ ‌భాషలో దూషిస్తూ సంతోష్‌బాబును బలంగా వెనక్కి నెట్టేశాడు. తమ కల్నల్‌పై చైనా సైనికుడు చేయి చేసుకోవడాన్ని సహించలేకపోయిన భారత బలగాలు చైనా సైన్యంపై దాడికి దిగాయి. అరగంట పాటు ఇరు వర్గాలు తలపడగా.. రెండు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో భారత సైన్యం చైనా పోస్టును తగులబెట్టింది. ఘర్షణల్లో కల్నల్‌ ‌సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినప్పటికీ.. అక్కడి నుంచి వెనక్కి మళ్లడానికి ఇష్టపడలేదు. అక్కడే ఉండి గాయపడిన సైనికులను వెనక్కి పంపి అదనపు బలగాలను రప్పించారు. భారత సైనికులు రగిలిపోతుండగానే కాసేపటికే చైనా బలగాలు భారీఎత్తున అక్కడికి చేరుకున్నాయి. చీకటి పడ్డాక ఏదైనా జరిగే ప్రమాదం ఉందని సంతోష్‌బాబు అనుమానించారు. ఆయన అనుమానమే నిజమైంది. గల్వాన్‌ ‌నది ఒడ్డున, కొండల్లో నక్కి ఉన్న చైనా సైనికులు భారీ సంఖ్యలో ఒక్కసారిగా దాడికి దిగారు. మేకులున్న ఇనుప రాడ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు.

రాత్రి 9 గంటల సమయంలో కల్నల్‌ ‌సంతోష్‌బాబు తలపై భారీ రాయితో దాడి చేశారు. ఆయన గల్వాన్‌ ‌నదిలోకి పడిపోయారు. తమ కల్నల్‌ను చైనా సైన్యం హతమార్చిన విషయాన్ని గమనించిన భారత సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాదాపు 45 నిమిషాల పాటు ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రంగా దాడి జరిగింది. అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి మిగతా ప్రాంతాలకూ ఘర్షణలు పాకాయి. ఇరు సైన్యాలకు చెందిన దాదాపు 300 మంది ఒకరితో మరొకరు తలపడ్డారు. ఈ ఘర్షణల్లో చైనా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు 35 మంది ఆ దేశ సైనికులు మరణించినట్లుగా సమాచారం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
Instagram