‌ప్రఖ్యాతిగాంచిన ఆరు ఆస్తిక దర్శనములలో యోగ దర్శనం ఒకటి. యోగ దర్శన సూత్రకారుడు మహర్షి పతంజలి. పూర్వం హిరణ్యగర్భుడు, యాజ్ఞవల్క్యుడు వంటి యోగశాస్త్ర ప్రవర్తకులు ఎందరో ప్రవచించిన విషయాలను క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేయటం వలన ఈ దర్శనానికి పతంజలి యోగదర్శనం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం 200-150 ప్రాంతం నాటి పతంజలి ఆదిశేషుని అవతారమని, సర్వజ్ఞుడయిన ఆయనకు అందరూ అంజలి ఘటించి నమస్కరించేవారు. ‘‘పతన్తి అజ్ఞలయ అస్మిన్‌’’ అనే విగ్రహవాక్యం చేత ‘‘అందరి దోసిళ్లూ ఈయన మీద పడుతున్నాయి’’ అని పతంజలి శబ్దానికి అర్థం. మహర్షి పతంజలి 193 సూత్రాలలో యోగపద్ధతులను సశాస్త్రీయంగా వివరించారు. ఆ మహర్షి లక్ష్యం యోగం ద్వారా రోగాన్ని నయం చేయటం కాదు, ఆనందాన్ని అనుభవించటం. నాలుగు పాదాలుగా వివరించిన ఈ యోగ సూత్రాలలో అసలు యోగమంటే ఏమిటి? ఆ యోగాన్ని సాధించే ఉపాయాలు ఏమిటి? చిత్తంలో (మనస్సు, బుద్ధి, అహంకారం) కలిగే వ్యాపార వృత్తులను నిరోధించటం ఎందుకు? వృత్తి నిరోధం వలన కలిగే ఫలితాలేమిటనే వాటిని సవివరంగా మనముందుంచారు. యోగమంటే మాయలు, గారడీలు, సర్కస్‌ ‌ఫీట్లు చేయటం కాదు. సిద్ధుల ప్రాప్తి అనేది యోగమార్గంలో ఆనుషంగికం మాత్రమే. ప్రధాన లక్ష్యం కాదు అన్నది యోగ శాస్త్రాన్ని సరిగా అర్థంచేసుకొన్న ప్రతి ఒక్కరికీ అవగతమవుతుంది.

ఆసనాలు శారీరక వ్యాయామాలని భావించరాదు. యోగం అంటే ప్రాథమిక స్థాయిలో కలయిక. అంటే శరీర, శ్వాస, మనసుల కలయిక. యోగ అంగాలన్నీ ఒకదానికొకటి అనుసంధానించే ఉండేవే. విడువడి ఉన్నవి కావు. ఈ కలయిక అనేది ఆసనాలలో కూడా నిబిడీకృతమై ఉన్నది. అది మరచి ఆసనాలను కూడా వ్యాయామంలాగా చేయడం వలన ఉపయోగం ఉండదు. అవసరం మేరకు శక్తినుపయోగించి తద్వారా మనసుకు ప్రశాంతతను కలిగించేవే ఆసనాలు. అవి కేవల భంగిమలు కావు. ప్రతి ఆసనానికి విన్యాసం, అంటే కొన్ని స్టెప్స్ ఉం‌టాయి. వాటికి శ్వాస అనుసంధానించి ఉంటుంది. తద్వరా స్థిరమయిన ఆసన స్థితి ఏర్పడుతుంది. అటువంటి అభ్యాసంతో మనసు ప్రశాంతతకు చేరుకుంటుంది. స్ట్రెస్‌ ‌హార్మోన్సు రక్తంలో ఎక్కువగా విడుదల కావు. శరీరానికి స్థిరత్వం, మనసుకు సుఖం కలుగుతాయి. దీనినే పతంజలి ‘‘స్థిర సుఖం ఆసనం’’ అని నిర్వచించారు. ఇటువంటి అభ్యాసం శరీరాన్ని చురకుగా ఉండేట్లు చేస్తుంది. అటువంటి అభ్యాసమే యోగాసనమవు తుంది. లేకపోతే అది సర్కస్‌ ‌ఫీట్‌ ‌లేక భంగిమ. దీనివలన ఏదో వ్యాయామ ఫలితం ఉంటుంది కానీ యోగాసన ఫలితం రాదు. శరీరాన్ని బిగించకుండా, సాగదీస్తూ, ఆ ఆసన సంబంధిత కండరాలను మాత్రమే వినియోగిస్తూ అభ్యాసం చేసే ఆసనాలు శరీరాన్ని రోగమయం కాకుండా కాపాడతాయి. ‘‘న హఠాత్‌, ‌న బలాత్‌’’ అని సూత్రం. అంటే ఆసనాలు అభ్యసించేటప్పుడు ఆసన స్థితికి చేరుకోవ టానికి శక్తికి మించి బల ప్రయోగం చేయకూడదు. ఎలాగైనా చేసేయాలనే మొండితనం కూడదు. అలాంటి అభ్యాసమే అన్ని రోగాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది, అతిగా తినాలని కానీ, దుర్వ్యసనాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది. ఆంతరంగికమయిన క్రమశిక్షణని సాధకునికి ప్రసాదిస్తుంది. శరీర ధర్మశాస్త్ర ప్రకారము అబద్ధాలు ఆడేవారికి, దొంగతనం, అసూయ, అహంకారం వంటి ప్రవర్తనలు కలవారికి ఆసనాలు సులభంగా సిద్ధించవు. ఈ విధంగా ప్రవర్తనలో మార్పును కూడా నిజమైన సాధకుడు చూచుకోగలుగు తాడు. కొన్ని వారాల అభ్యాసం వ్యక్తి ప్రవర్తనలో మార్పుని తీసుకు వస్తుంది. వైద్యశాస్త్రాలకి సైతం లొంగని రోగాల భారి నుంచి కాపాడుతుంది. అత్యంత సంక్లిష్టమయిన మానవ శరీర నిర్మాణం లోని వ్యవస్థల మధ్యనున్న వికృతులను, అత్యంత నేర్పుతో సరిచేసి, వాటి లక్షణాలను తిరిగి పెంపొం దించటంలో ప్రముఖ పాత్ర వహించేవే ఆసనాలు.

వ్యాయామంలో బ్లడ్‌ ‌షంటింగ్‌ అనేది ఇన్‌వాలంటీర్‌గా జరుగుతుంది. అదే ఆసన అభ్యా సంలో ఆ ఆసన స్థితిని అనుసరించి Conscious గా జరుగుతుంది. ఈ ప్రత్యేకత వలననే, ఆసనాలు శరీరావయవ ప్రవర్తనల్లో చోటుచేసుకొన్న వికృతు లను తొలగించి, ఆరోగ్యకరమయిన సంస్కృతిని ఆ అవయవానికి కలగచేస్తాయి. ఆసనాల అభ్యాసం వలన కణాల వ్యాకోచిత్వం రక్షణలో ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ ‌డిప్యూషన్‌ ‌లెవల్స్ ‌పెరుగుతాయి. నాడీమండల వ్యవస్థ ద్వారా ఆరోగ్యవంతమయిన ఎలక్ట్రికల్‌ ‌ట్రాన్స్‌మిషన్‌ ‌జరిగేందుకు ఆసనాలు ఉపకరిస్తాయి. కండరాలలో కెమికల్‌ ‌ఫెటీగ్‌ అనేది జరుగదు. ఆసన అభ్యాసంలో జరిగే ఆర్గానిక్‌ ‌మూవ్‌ ‌మెంట్‌ ‌వలన అవి అనూహ్యంగా శక్తివంతమవు తాయి. (ఉదాహరణకు – గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, Aging Factor ని అధిగమించి పనిచేయటం.)

ఆసనాల సక్రమ అభ్యాసం వల్ల Sympathetic Nervous System క్రియలు చక్కని నియంత్రణ, సమతుల్యతలో ఉండి ఎక్కువగా ఒత్తిడికి లోను గాకుండా చేస్తాయి. క్రమమైన పద్ధతిలో శరీరంలోని బయోరిథమ్‌తో సమన్వయాన్ని కలిగి ఉండే యోగాస నాల అభ్యాసం Bone marrow ఫ్రెష్‌బ్లడ్‌ని అందించటం వలన అందులో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్‌సెల్స్ ‌శక్తిమంతముగాను, చురుకుగానూ పనిచేసేవిగా ఉంటాయి. ఆసనాల వలన కలిగే మసాజ్‌ ‌క్రియవలన స్ప్లీన్‌ ఇతర బాడీ టిష్యూస్‌ ఇమ్యూన్‌ ‌కణాలని చురుకుగా ఉంచుతాయి.

నడవడి – రోగనిరోధక శక్తి

నడవడిలో మాలిన్యాన్ని తొలగించుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానికి పతంజలి సూచించిన మార్గాలే యమ, నియమ, ప్రత్యాహారాలు.
యమ: ఈ అంగంలో ఐదు రకాలయిన వ్రతాలను పాటించాలని పతంజలి సూచిం చారు.అవి:
1. అహింస : భయం, క్రోధం, వీటికి మూలాలు. వీటిని వదిలివేసినట్లయితే హింసా ప్రవృత్తి మనసు నుండి వైదొలగి వ్యక్తి ఆరోగ్య వంతుడవుతాడు.
2. సత్యం : సాధ్యమయినంతవరకు సత్యాన్నే చెప్పడం వలన వ్యక్తికి బలం చేకూరుతుంది. సత్యాన్ని పలకటం అంటే, తన అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు మాటలో మోసం కాని, భ్రాంతి కాని, అర్థంకాకుండా ఉండటం కానీ ఉండకపోవటం.
3. అస్తేయం : ఇతరుల వస్తువులను తీసుకోకపోవటం, వాటి మీద ఆసక్తి లేకపోవటం.
4. బ్రహ్మచర్యం : అంటే మైథునంను త్యజించటం.
మనసు, వాక్కుల ద్వారా జరిగే సమస్త మైథునాలను త్యజించటం. ఇది వీర్య రక్షణ చేస్తుంది. కామోద్దీపనం కలిగించే ఆహారం తీసుకోకూడదు. కామ ప్రకోపాన్ని కలిగించే దృశ్యాలు చూడరాదు. అటువంటి మాటలు వినరాదు. అటువంటి సాహిత్యం చదవకుండా ఉండటం. ఆ విధమయిన భావాలు మనసులో రాకుండా ఉండటం బ్రహ్మచర్యమవుతుంది.
5. అపరిగ్రహం : ఆరాటపడటం, కావలసినదానికంటే ఎక్కువగా కూడ బెట్టడం, ఈ ఒక్క దానిపట్ల నియంత్రణ లేక నేడు అధికశాతం మానవులు అనారోగ్యం పాలవుతున్నారు.

నియమాలు : ఈ అంగంలో ఐదు తప్పనిసరిగా పాటించవలసిన పక్రియలను చెప్పారు పతంజలి.
1. శౌచం : అంటే శుభ్రత. నేటి విపత్కర పరిస్థితులలో ఈ విషయం పట్ల మనం చూపే శ్రద్ధనే మనల్ని ‘‘కరోనా’’ వంటి రోగాల నుంచి కాపాడుతుంది.
2. శౌచం, బాహ్య శౌచమని, అంతర శౌచమని రెండు రకాలు.
బాహ్యశౌచం శరీర శుభ్రతకి సంబంధించింది. అంతఃశౌచం – రాగద్వేషాలను తొలగించుకోవటం. దీనివలన మనసు స్వచ్ఛమై అందరి ఎడల ప్రీతిని కలిగి ఉంటుంది.
ఇటువంటి శౌచాన్ని పాటించటం వలన వ్యక్తి శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.
2. సంతోషం : తనకు లభించిన దానితో తృప్తిని కలిగి ఉండే గుణం. ఇది లేని కారణంగా నేడు మనలో అనారోగ్యం ప్రబలుతున్నది. అందరం తప్పక అలవర్చుకోవలసిన గుణం ఇది.
తపస్సు : ఆకలి – దప్పిక శీతలం – ఉష్ణం, స్థాన (నిలబడటం) – ఆసనాలు (కూర్చోవటం) వంటి ద్వంద్వములను సహించటం, ఈ లక్షణములు కలిగిన నాడు వ్యక్తి తాము తపించే పనిలో లీనమవుతాడు. దీనివలన విజయం కలుగుతుంది.
స్వాధ్యాయం : ఓంకార జపం లేదా మోక్షమార్గం చూపే శాస్త్రాల పఠనం.
ఈశ్వర ప్రణిధానం : మనం చేసే పనులని పరమేశ్వరునికి సమర్పించటం.
ఈ భావన లేకపోవడంతోనే మనిషి అంతా తానే అయినట్టు కర్మతో అనుబంధం ఏర్పరచుకొని, ఎలా బయట పడాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నాడు. దీనిని ఈశ్వరునికి అర్పించటం వల్ల వ్యక్తి తాను చేసే పనిలో నిపుణతను పెంచుకోగలడు.
ఈ విధంగా నడవడిని దిద్దుకొని ఆసన, ప్రాణా యామమాలను అభ్యసించిననాడు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగులకీ, దీర్ఘకాలం ఆరోగ్య వంతమయిన జీవనాన్ని గడుపుతూ జీవన లక్ష్యాన్ని చేరుకునే వారికీ ఇటువంటి యోగ సాధనయే ప్రధమ సోపానం.

ప్రత్యాహారం – రోగ నిరోధక శక్తి

ఇంద్రియాలు తమ తమ లక్షణాలతో సంబంధం కోల్పోవడమే ప్రత్యాహారం. మనకి అయిదు జ్ఞానేంద్రియాలున్నాయి. అవి, జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే మాధ్యమాలు. రూపాలను గ్రహించడానికి కన్ను, శబ్దాలను గ్రహించటానికి చెవి, వాసనలను గ్రహించటానికి ముక్కు, రసము / రుచిని గ్రహించటానికి నాలుక, స్పర్శను గ్రహించటానికి చర్మం. ఐదు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. వాక్కుకి వచనం / మాట్లాడటం, పాదానికి సంచారం, హస్తానికి గ్రహణం / తీసుకోవడం, వాయువుకు జీర్ణమయిన ఆహారాన్ని విసర్జించటం, ఉపస్థకు సంతానాన్ని కలుగజేయటం.
చివరిది మనస్సు. ఈ పదకొండు ఇంద్రియాల ద్వారా మనిషి జీవనం సాగదీస్తుంటాడు.
ఇంద్రియ కార్యకలాపాలను ధర్మంతో సరిచేసుకొంటూ నిగ్రహాన్ని కలిగి ఉండినప్పుడు మనసులో ప్రశాంతత ఉంటుంది. అది లేనినాడు కనపడిన / విన్న / తిన్న / తాకిన ప్రతి విషయం మనలని తనవైపుకు లాగి పొందేలా చేస్తుంది. బలహీనమయిన మనసు దురలవాట్లకు దారి తీస్తుంది. ఇంద్రియాలు బుద్ధి అధీనంలో ఉండాలి కానీ బుద్ధి ఇంద్రియ అధీనంలో ఉండకూడదని యోగశాస్త్రం చెబుతుంది. జింక చాలా దూరం పరిగెత్తే స్వభావం కలది. అయినప్పటికీ దానికి వేణుగానం వంటి మధుర ధ్వనుల మీద ఆసక్తి ఎక్కువ. ఈ బలహీనతవలన వేటగాళ్లు వేణుగానాలతో మైమరపించి కదలకుండా ఉండేట్లు చేసి దాన్ని పట్టుకుంటారు. ఇలా శబ్దమనే ఇంద్రియ బలహీనత దాని పాలిట శాపమయింది. ఇలాగే, ఏనుగు కూడా.

ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలలో ఏదో ఒకదానిపట్ల ఆకర్షితములయిన జంతువులు మృత్యువాత పడ్డాయి. మనిషికి ఈ ఐదు ఇంద్రి యాలు బలహీనపరచేవే కనుక అత్యంత జాగరూకతతో, బుద్ధిని ఉపయోగించి ప్రవర్తించాలని, అదే ప్రత్యాహారమని యోగం చెబుతున్నది. అటువంటి మార్పును నడవడిలో సంపాదించినవాడు శక్తివంతమయిన మనసును కలిగి ఉంటాడు. దాని ద్వారా వ్యక్తిలో సహజంగానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ఆసన, ప్రాణాయామ, యమ, నియమ, ప్రత్యాహారములు రోగ నిరోధక శక్తిని వ్యక్తిలో పెంపొందింపచేసి ఆరోగ్యవంతునిగా మలచటంలో కీలకపాత్రను నిర్వహిస్తున్నాయి.

ఆసనాలు రెండు రకాలు
1. ధ్యానానికి ఉపకరించేవి, 2. శరీర ధర్మానికి ఉపకరించేవి.
దీనిలో ముఖ్యంగా శరీర ధర్మాన్ని కాపాడటంలో, లోపాలను సరిదిద్దటంలో రెండవ రకానికి చెందిన ఆసనాలు (బశ్రీ•బతీ•శ్రీ •అ•) అత్యంత ప్రాధాన్యమైనవి.
మన గుండె రక్త ప్రసరణ రేటు (నిమిషానికి) 250 మి.లీ. మెదడుకి• 750 మి.లి. లివర్‌కి నిమిషానికి 500 మి.లీ. కిడ్నీలకి నిమిషానికి 1200 మి.లీ. వయసులో వస్తున్న పరిణామాలను అనుసరించి ఈ ప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి. శాస్త్రం వివరించిన పద్ధతిలో యోగాసనాలను అభ్యాసం చేసినట్లయితే ప్రసరణకు అడ్డులేకుండా రక్తం కావలసినంత పరిమాణంలో అవయవాలకు సరఫరాతుంది. దీనివలన ఆర్గాన్‌ ‌ట్రాంక్విలిటీ భద్రంగా ఉంటుంది.

యోగానికి 8 అంగాలు
1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, 8. సమాధి
ఇందులో శరీరమాలిన్యం పోవటానికి ఆసనాలు, శ్వాసకి సంబంధించిన మాలిన్యం పోవటానికి ప్రాణాయామాలు, నడవడిలోని మాలిన్యం పోవటానికి యమ, నియమ, ప్రత్య హారాలు, మనోమాలిన్యం పోవటానికి ధారణ, ధ్యాన, సమాధులని పతంజలి వివరించారు.

అజపా మంత్రం

వాయుసంచారం సూర్యోదయం నుండి రెండున్నర ఘడియల వరకు పింగళద్వారా జరుగుతుంది. తరువాత రెండున్నర ఘడియల పాటు ఇడ ద్వారా జరుగుతుంది. ఇదే విధంగా ప్రతీ రెండున్నర గంటల కాలం ఈ నాడులలో మారుతూ మారుతూ వాయుసంచారం జరుగుతుంది.
ఘటిక అనగా ఇరవైనాలుగు నిమిషాలు. అరవై పలాలు ఒక ఘటిక. ఒక పలంలో ఆరు శ్వాసప్రశ్వాసాలు జరుగుతాయి. ఈ విధంగా ఒక ఘడియలో మూడు వందల అరవై జరుగుతాయి. రెండున్నర ఘడియల కాలంలో (అనగా ఒక గంటకు) తొమ్మిదివందలు జరుగుతాయి. ఈ విధంగా సాధారణమైన ఆరోగ్యంతో ఉన్నవానికి సూర్యోదయం మొదలు మరునాడు సూర్యోదయం వరకు ఇరవైఒక్క వేల ఆరువందల శ్వాసప్రశ్వాసలు జరుగుతాయి.
గాలి లోపలకు తీసికొన్నప్పుడు ‘సో’ అనీ, బయటకు విడిచేటప్పుడు ‘అహమ్‌’ అని( కలపగా ‘సోహమ్‌’ అని) భావన చెయ్యాలి. దీనికి అజపామంత్రం అని పేరు. ఇది మనకు తెలియకుండగానే 60 ఘడియల రాత్రింబవళ్ల కాలంలో ఇరవైఒక్క వేల ఆరువందల పర్యాయాలు జరుగుతూ ఉంటుంది.

About Author

By editor

Twitter
YOUTUBE