– సాయిప్రసాద్‌

‌కొవిడ్‌-19 ‌మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ అనివార్యమని భావించి, అంతటి కఠిన నిర్ణయాన్ని అమలు చేసినప్పుడు కొంతమేరకు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం సహజం. అయితే అతిత్వరగా ఈ విపత్తు నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించేందుకు ‘ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌’ ‌పేరుతో రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు అనేకమంది ప్యాకేజీని కోరిన మాట కూడా అందరికి తెలిసిందే. తీరా ఇంత భారీ ప్యాకేజీ ప్రకటించిన అనంతరం చాలా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే చర్యలు ఉన్నప్పటికీ కొంతమంది ఆర్థిక నిపుణులు ఇంకాస్త మెరుగైన ప్యాకేజీని ఆశించారు. దీనికి కారణం వెతకాలంటే ఆర్థికవేత్త కానవసరం లేదు.

ఈ కష్ట సమయంలో ప్రధానమంత్రి స్వయంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్యాకేజీలో అన్ని వర్గాలకు ఆర్థిక లబ్ధి కలిగించే అంశాలు ఉంటాయని చాలామంది ఆశించారు. వాస్తవానికి అన్ని వర్గాలకు ఆర్థిక లబ్ధి కలిగించే ప్రయత్నం చేశారు. కానీ, అవి ఆయా వర్గాలు ఆశించిన విధంగా లేకపోవటం, వాటి లక్ష్యాలు, ప్రయోజ నాలపై తగిన అవగాహన కల్పించటంలో విఫల మవ్వటం వంటి అనేక కారణాల వల్ల ప్రభుత్వ ప్యాకేజీపై అసంతృప్తి నెలకొంది. చాలామంది ప్రభుత్వం ఉచితంగా ఎంతోకొంత ఆర్థిక సాయం అందిస్తుందని ఆశపడ్డారు. ప్రభుత్వాలు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అందరూ అలా ఆశపడ్డారు. పాలకులు ఈ సందర్భంగా ప్రజల మానసిక సంసిద్ధతకు తీసుకోవలసిన చర్యలపై శ్రద్ధ చూపలేదని చెప్పక తప్పదు.
ఆదాయం ఉంటేనే సంక్షేమం సాధ్యపడుతుంది. ఆదాయం రావాలంటే ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరగాలంటే అందుకు తగిన సాధనాలు ఉండాలి. లాక్‌డౌన్‌లో కార్యకలాపాలు స్తంభిం చటంవల్ల కొన్ని ఉత్పత్తి సాధనాలు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి ప్రారంభించాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఆర్థిక కార్యకలాపాల వేగం పెంచాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం, ఉపశమనం కోసం ఉచితంగా ఎంతోకొంత సొమ్మును ప్రజలకి అందిస్తే సరిపోదు. ప్రజలకు ఉచితంగా డబ్బు ఇస్తే దాన్ని తమ అవసరాలకు ఖర్చు చేస్తారు. కాబట్టి వారికి అవసరమైన వస్తుసేవలు స్థానికంగా అందు బాటులో ఉండాలి. వస్తుసేవలు అందుబాటులో ఉండాలంటే స్థానికంగా వాటి ఉత్పత్తి అయినా జరగాలి లేదా ఇతర ప్రాంతాల నుంచి వాటిని తీసుకొచ్చి స్థానికంగా అందుబాటులో ఉంచాలి. అలా సరిపడా వస్తుసేవలు అందుబాటులో లేకపోతే డిమాండ్‌, ‌సరఫరాలకు మధ్య వ్యత్యాసం ఏర్పడు తుంది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న ఇతర ప్రాంత ఉత్పత్తులు స్థానిక మార్కెట్లలో పెరిగిపోతాయి. ఈ ఉత్పత్తులు మార్కెట్లలో పెరగటం వల్ల స్థానిక వస్తుసేవల ఉత్పత్తుల అమ్మకాలు దెబ్బ తినటమే కాక ప్రభుత్వం సంక్షేమం కోసం వెచ్చించిన సొమ్ము ఆర్థిక లావాదేవీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. అప్పుడు మళ్లీ యథాస్థితి లేదా అంతకంటే హీనస్థితికి దిగజారే ప్రమాదముంది.
స్థానికంగా వస్తుసేవలు ఉత్పత్తి చేస్తే దాని వల్ల, అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయం మెరుగుపడుతుంది. స్థానికంగా లభ్యమయ్యే వస్తు సేవలు కొనుగోలు చేయడం వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెంది, సంపద పెరుగు తుంది. సంపద పెరిగి నప్పుడు కొంత మెరుగైన జీవనానికి ఖర్చు చేసినా కొంత సంక్షేమానికి ఉపయోగ పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంపద సృష్టి, వితరణ పటిష్టంగా, వేగంగా జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి సాధ్యపడు తుంది. కాబట్టి తక్షణ అవసరం – స్వల్పకాలిక ఉపశమనమైన సంక్షేమం కాకుండా దీర్ఘకాలం ప్రయోజనాలను కలిగించే ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికలు రూపొందించాలి. సమస్యలన్నిటినీ అధిగమించి సంపద సృష్టించి, అభివృద్ధి సాధించాలి.
ప్రభుత్వాలు సంపద సృష్టించలేనప్పుడు సంక్షేమ పథకాల అమలు సాధ్యపడదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వాల వద్ద డబ్బు ఉండాలి. ప్రభుత్వం వద్ద డబ్బు ఉండాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలి లేదా ప్రభుత్వాలు అప్పులు చేయాలి. ప్రభుత్వాలు అప్పులు చేసి ఎక్కువ కాలం సంక్షేమ పథకాలు అమలు చేయలేవు. కాబట్టి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలంటే ప్రజల వద్ద చెల్లించే శక్తి ఉండాలి. ప్రజలకు పన్నులు చెల్లించే శక్తి ఉండాలంటే వారి ఆదాయాలు పెరగాలి. వారి ఆదాయాలు పెరగాలంటే సమాజంలో సంపద సృష్టించాలి. వస్తుసేవల ఉత్పత్తి పెరగాలి. మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. అప్పుడే వారికి పన్నుల చెల్లించే శక్తి వస్తుంది. అది జరగాలంటే స్థానికంగా వస్తుసేవల ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలి. లాక్‌డౌన్‌ ‌వల్ల దీనికి కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ప్రస్తుతం ఆ సమస్యలను అధిగమించాలి. మనదేశంలో ఎక్కువ శాతం వస్తుసేవలను ఉత్పత్తి చేసి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించేది అసంఘటిత రంగం, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, సంస్థలు. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఈ రంగాలు తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవం. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్థిక సాయం చేయాలి. ఆ సాయం ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా ఖర్చు చేసే డబ్బులో ఉచితంగా అందించా లని చాలా మంది ఆశపడ్డారు.
అయితే అందరికీ ఉచితంగా ఆర్థిక సాయం అందించే స్తోమత ప్రభుత్వాలకు ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం చేసే వ్యయంలో నాలుగోవంతు అప్పులు చేస్తోంది. అంటే ఆ భారాన్ని భవిష్యత్‌ ‌తరాలకు బదిలీ చేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి సంక్షేమం పేరుతో పంచిపెట్టటం మంచిదికాదు. ప్రభుత్వాలు అప్పులు చేయటం వల్ల ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు సంస్థాగత రుణ సౌకర్యం తగ్గిపోతుంది. ప్రభుత్వం అప్పులు చేయటం వల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాల రుణ సౌకర్యం ఎలా తగ్గుతుందనే అనుమానం కలగవచ్చు. ప్రభుత్వం అప్పులు చేయాలంటే ఎక్కడ చేయాలి? బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచే కదా? ఆ సంస్థలకు అప్పులిచ్చే సామర్థ్యం ఎక్కడ నుంచి వస్తుందంటే ప్రజల చేసే డిపాజిట్ల నుంచే కదా. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి, వాటి ఆధారంగా ఆ సంస్థలు కల్పించే రుణ సదుపాయానికి పరిమితి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆర్థిక సంస్థ వద్ద లక్ష కోట్లు డిపాజిట్లు ఉన్నాయనుకొంటే ఆ సంస్థ దాంట్లో నుంచి 80 వేల కోట్లు అప్పు ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ 80 వేల కోట్లను ఆ సంస్థ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకైనా అప్పు ఇవ్వవచ్చు లేదా ప్రభుత్వానికైనా ఇవ్వవచ్చు. ఆ సంస్థకు ఇచ్చిన అప్పు వడ్డీతో సహా తిరిగి వస్తుందనే నమ్మకం ఉన్నప్పుడు అప్పు ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం అప్పు చేయకపోతే రూ. 80 వేల కోట్లు వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు ఇవ్వొచ్చు. అందులో కొంతమంది చిన్న, మధ్య తరహా సంస్థలు, సామాన్య వ్యక్తులు, పెద్ద సంస్థలు ఎవరైనా ఉండవచ్చు. ఇచ్చిన అప్పు తిరిగి వస్తే చాలు, ఇస్తుంది. ఆ నమ్మకం కలగాలంటే తమ వద్ద తీసుకున్న అప్పును ఆ సంస్థ ఎలా ఉపయో గిస్తుందో ముందే తెలుసుకుంటారు. అప్పు తీసుకున్న వారు దాన్ని సద్వినియోగం చేస్తారనే నమ్మకం కలిగితేనే ఇస్తారు. అంటే ఆ సంస్థ 80 వేట కోట్లను సక్రమంగా ఉపయోగపడే విధంగా అప్పులు ఇస్తుంది. అదే ప్రభుత్వమే అప్పు అడిగితే ఆ సంస్థకు చాలా భారం తగ్గినట్లుగా భావించి వ్యాపార సంస్థలకు ఇవ్వటం ఆపేసి ప్రభుత్వానికి ఇస్తుంది. రూ. 80 వేల కోట్లలో ప్రభుత్వాలు 50 వేల కోట్లు అప్పు తీసుకొంటే ఇక వ్యాపార వర్గాలకు ఆ సంస్థ కేవలం 30 వేల కోట్లే ఇవ్వగలుగుతుంది. అప్పుడు వ్యాపార వర్గాలకు రుణ సౌకర్యం తగ్గినట్టే కదా.
వ్యాపార వర్గాలకు ఇలా తక్కువ వడ్డీకి లభ్యమయ్యే సంస్థాగత రుణ సౌకర్యం తగ్గినప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడేది చిన్న, సూక్ష్మ తరహా సంస్థలే. ఎందుకంటే ఆర్థిక సంస్థలు చిన్న సంస్థలకు అప్పులిచ్చి వసూలు చేసుకోవటం కంటే పెద్ద సంస్థలకు పెద్ద మొత్తంలో అప్పులిచ్చి వసూలు చేసుకోవటం తేలికగా భావిస్తాయి. దానివల్ల చిన్న, సూక్ష్మ సంస్థలు తమ పెట్టుబడి అవసరాలకు కావలసిన సొమ్మును తక్కువ వడ్డీకి పొందలేవు. ఆర్థిక సంస్థల నుంచి అప్పు వచ్చే మార్గాలు తగ్గినప్పుడు ఆయా సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాయి.
లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు, వడ్డీ వ్యాపారులు ఎదుటివారి అవసరాన్ని, బలహీనతను గ్రహించి అధిక వడ్డీలతో పాటు అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలా అప్పు తీసుకొని వ్యాపారం చేసేవారు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వారు అధిక వడ్డీ చెల్లిస్తారు కాబట్టి వారి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఒక పరిమితికి మించి ఉత్పత్తి వ్యయం పెరిగితే తమ వ్యాపారం అనుకున్న ప్రకారం సాగదు. అందుకని ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడానికి ఇతర మార్గాలు అవలంబిస్తారు. అందులో తాము, తమతో కలిసి పనిచేసేవారు ఎక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతారు.
ఇలాంటి అనేక సమస్యలను లోతుగా తెలుసు న్నది కాబట్టే నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పులు చేసి ప్రచార ఆర్భాటంతో అమలు చేసే సంక్షేమ పథకాల కంటే, తమ స్వశక్తితో కష్టపడి పనిచేసేవారు, సంపద సృష్టించగలిగే సత్తా ఉన్న వారికి తగిన చేయూతనిచ్చి, వారికి అవసరమైన రుణసౌకర్యం కల్పించి తద్వారా ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ‘ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌’‌కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు తక్కువ వడ్డీకి సంస్థాగత రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచితంగా లభించే స్వల్ప సాయం కంటే తమ కార్యకలాపాలను త్వరితగతిన యథాస్థితికి తీసుకు రావటానికి అవరమైన పెట్టుబడి సమకూర్చటం వల్ల వారికి ఎక్కువ మేలు కలుగుతుంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు చిన్న, సూక్ష్మ సంస్థలకు మూడు లక్షల కోట్ల రుణసౌకర్యం కల్పించాలని ఈ ప్యాకేజీలో నిర్దే శించారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలంటే ఆస్తులు తాకట్టుపెట్టాలి. లేదా పూచీకత్తు చూపిం చాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి పూచీకతు లేకుండానే చిన్న, మధ్య తరహా సంస్థలకు అప్పు ఇవ్వాలని కేంద్రం బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.
మనదేశంలో వ్యవసాయేతర రంగంలో దాదాపు 6.7 కోట్ల సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు పనిచేస్తు న్నాయి. వీటి పెట్టుబడి అవసరాలు తీర్చడానికి 3 లక్షల కోట్లు సరిపోవనే వాదన ఉంది. అయితే వాటిలో చాలా సంస్థల పెట్టుబడి అవసరాలు స్వల్పమే. అన్ని సంస్థలు ఒకేసారి రుణ సౌకర్యం కోసం రాకపోవచ్చు. ముందు 3 లక్షల కోట్ల రుణ వితరణ పూర్తి అయి.. ఇంకా అవసరం అయితే అప్పుడు అదనపు నిధులు సమకూర్చమని అడగటం సబబు. కానీ ఇప్పుడే అవి చాలవని అనటం సరైనది కాదు. చిత్రం ఏంటంటే ఇంత పెద్దమొత్తం అప్పును చిల్లర రుణాల రూపంలో ఇవ్వడం ఎక్కువ వ్యయ ప్రయాసాలతో కూడుకుంటుందని, పైగా ఎక్కువ మందికి తక్కువ మొత్తం అప్పు ఇవ్వడం వల్ల ఆశించినంత వేగంగా ఆర్థిక వ్యవస్థ గాడిన పడదని సూక్ష్మ, చిన్న సంస్థల నిర్వచనానికి ఉన్న ఆర్థిక పరిమితిని బాగా పెంచాలనే సూచనని ఆమోదించి ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. దీనివల్ల వాస్తవంగా రుణం అవసరమైన సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు అప్పులు ఇవ్వకుండా ఆర్థికంగా కొంత స్తోమత ఉన్న వారికి లేదా పెద్ద సంస్థలకు అప్పులు ఇచ్చే అవకాశం ఉంది.
అసంఘటిత రంగంలో ఉన్న అనేక సంస్థలకు ఈ ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనం తక్కువే. చిన్న, సూక్ష్మ సంస్థల నిర్వచనానికి ఉన్న పరిమితిని అయిదు రెట్లు పెంచటానికి ఇది సందర్భం అని ప్రభుత్వం భావించి అసంఘటిత రంగంలోని సూక్ష్మ, చిన్న సంస్థలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి తగిన రుణాలను అందుబాటులో ఉండేట్లు చేస్తే బాగుండేది. అప్పుడు విమర్శలకు కూడా అవకాశం ఉండేది కాదు. గతంలో కూడా పూచీకత్తు లేకుండా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అప్పులు ఇచ్చే పథకం ఉండేది. కానీ దాని వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలగలేదు. క్షేత్ర స్థాయిలో బ్యాంకు అధికారులు, నిబంధనల పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అనేక ఇబ్బందులకు గురి చేసి బ్యాంకు నుంచి అప్పు తీసుకోవటం అంత సులభం కాదనే భావన కలిగించారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉండే సూక్ష్మ సంస్థలలో యజమాని లేక మరొకరు అన్నీ తామై చూసుకుంటూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. అటువంటి వారికి బ్యాంకు అధికారుల చుట్టూ అప్పు కోసం తిరగడం ఇబ్బంది. అందుకే వారు వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుత ప్యాకేజీ పట్ల పారిశ్రామిక, వ్యాపారవేత్తలు సంతృప్తి చెందలేకపోతున్నారు.
వ్యాసకర్త : ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE