కొవిడ్‌ 19 ‌మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన సహాయకునిగా పనిచేసిన డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌గోయెల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఇంతవరకు ఆ పదవిలో జపాన్‌కు చెందిన డాక్టర్‌ ‌హిరోకి నకాతని ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివాదాలలో కూరుకుపోయి ఉన్న సమయంలో డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌కీలక బాధ్యతలు చేపట్టారు. మే 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్‌ 19 ‌మహమ్మారి విస్తరణ విషయంలో చైనా మీద మొత్తం ప్రపంచం కన్నెర్ర చేస్తున్న సమయమిది. అలాంటి చైనా పట్ల పక్షపాత వైఖరితో ఉన్న సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటూ విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా కూడా ఒకే మాట మీద ఉన్నాయి. చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపివేస్తానని అమెరికా హెచ్చిరించింది కూడా. చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కయిందన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌విమర్శలు కురిపిస్తున్నారు. నిధులు ఆపేయగలమని కూడా చెబుతున్నారు. ఇదే కాదు, ఊహాన్‌లోని ప్రయోగశాల నుంచే కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌బయటపడిందని, దీని మీద దర్యాప్తు జరిపించాలని 128 దేశాలు (భారత్‌ ‌సహా) గట్టిగా కోరుతున్న నేపథ్యంలో డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ఆ ‌కీలక పదవికి ఎంపికయ్యారు. డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌చేపట్టిన బాధ్యతలు కీలకమైనవి. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే కార్యనిర్వాహక మండలిలో 34 మంది సభ్యులు ఉంటారు. వీరంతా వైద్యరంగంలో సాంకేతికంగా అర్హత సాధించినవారే. వీరంతా ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఆయా దేశాల నుంచి నియమితులై వచ్చినవారే. 194 మంది సభ్యుల ఈ అసెంబ్లీ విధాన నిర్ణయంలో కీలకంగా ఉంటుంది. డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌మే 18న జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 78వ సమావేశంలో (వీడియో కాన్ఫరెన్స్ ‌విధానంలో) పాల్గొన్నారు. కొవిడ్‌ 19 ‌నివారణకు రాజకీయ సంకల్పంతో భారతదేశం, నరేంద్ర మోదీ నాయకత్వంలో పాల్గొన్నదని ఆ సమావేశంలో డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌వెల్లడించారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram