‘చలే వాయుః చలే చిత్తం’. వాయు చలనంలో ఎక్కువగా చోటు చేసుకునే అవకతవకల వల్ల చిత్తం (అంటే మనసు కూడా) చలిస్తుంది. స్థిరత్వం లేక, ఆందోళనలకు గురై, అన్ని రకాలయిన సైకో న్యూరో ఇమ్యూనోలాజికల్‌ ‌రుగ్మతలకు దారితీస్తుంది. కనుక మనసుని నియంత్రించటానికి మనకి ఉన్న ఒకే ఒక సాధనం శ్వాస. శ్వాసని, దాని గతిని నియంత్రించే పక్రియ ప్రాణాయామం.

సరైన ఆసనాభ్యాసం శరీరాన్ని ప్రాణాయామానికి సిద్ధపరుస్తుంది. ఈ ప్రాణం శరీరంలోకి శ్వాస ద్వారా ప్రవేశిస్తుంది. ఇది హృదయాన్ని చేరుతుంది. హృదయం మూడు క్రియలకు నిలయం. 1. ఋదతి, అంటే తీసుకోవటం, 2. దదాతి అంటే ఇవ్వటం, 3. యానతి అంటే ప్రసరింపచేయటం. ఈ ప్రాణం శరీరమంతటా ప్రవహిస్తుంది. ఐదు రకాల ముఖ్య ప్రాణ వాయువులుగా, ఐదురకాల ఉప ప్రాణవాయువులుగా ఇది శరీరమంతటా (బయటికి) వ్యాప్తి చెంది ఉంటుంది. ముఖ్యంగా వ్యాన అనే ప్రాణ వాయువు శరీర మంతటా ప్రవహిస్తూ బయటకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీని ప్రయాణం వలననే మనకి శరీరమునందలి అన్ని కణాలకి విశ్రాంతి చేకూరుతుంది. కనుకనే మనం శరీరానికి అంటుకునేవి, బిగుతుగా ఉండే వస్త్రాలని ధరించినప్పుడు ఈ వాయు ప్రసరణకి అవరోధం ఏర్పడి మానసికంగా చికాకుని/అసహనాన్ని కలుగచేస్తుంది. ఇటువంటి వస్త్రధారణ యోగాభ్యాసానికి పనికిరాదు.

ప్రాణాయామాన్ని శ్వాస ప్రవాహ నియంత్రణ అని అంటారు.
మన శరీరంలోని వ్యవస్థలలో శ్వాసక్రియ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ‘Dual nature’ కలిగినది. శ్వాసను మన ప్రమేయం లేకుండానే పీల్చుకుంటాం. దీనిని ఇన్‌వాలంటరీ అంటారు. శ్వాసని మనం వాలంటరీగా కూడా తీసుకోవచ్చు. అందుకనే బాగా దీర్ఘంగా కూడా శ్వాసని పీల్చగలం. కనుకనే శ్వాసపక్రియ వ్యవస్థ (వాలంటరీ / ఇన్‌వాలంటరీ) Dual nature ని కలిగి ఉన్నది అని అంటారు. ఈ సౌకర్యం వల్లనే మనం ప్రాణాయామం చేయగలం.

శ్వాస ద్వారా మనం గ్రహించే ఆక్సిజన్‌ ‌తక్కువ ఉండటంవల్ల జీవక్రియలు మందగిస్తాయి. ప్రాణాయామంలోని దీర్ఘ శ్వాసక్రియ వలన అవి చైతన్యవంతమవుతాయి. నిమిషానికి 16 నుంచి 18సార్లు తీసుకునే సాధారణ శ్వాసక్రియ ప్రాణాయామ అభ్యాసం వల్ల క్రమంగా తగ్గి ఆక్సిజన్‌ ‌వినియోగం పెరుగుతుంది.

దీనివలన వంద ట్రిలియన్‌ ‌జీవకణాలకి జరుగవలసిన ఆహారపదార్థాల సరఫరా, టాక్సిన్ల సేకరణ చక్కగా జరిగి Aging Process నిదానమవుతుంది. దీనివలన వ్యక్తి చురుకుగా, ఆరోగ్యంగా ఉంటాడు.

ఒత్తిడిలేని దీర్ఘశ్వాసల ద్వారా చేసే ఈ ప్రాణాయామం వలన శరీరంలో నిరంతరం పేరుకుపోతూ ఉండే మాలిన్యాలు బయటకు పోతాయి. కొన్ని చెమటరూపంలో, కొన్ని బహిశ్వాసతోపాటు తొలగిపోతాయి. శ్వాస గతి స్థిరంగాను, నిలకడగానూ ఉంటుంది. అంతేగాక ఈ ప్రాణాయామం ప్రత్యక్షంగా న్యూరో హార్మోనల్‌ ‌వ్యవస్థలపైన పనిచేసి వాటికి తగిన విశ్రాంతిని కలుగజేస్తుంది.

ముఖ్యంగా నేటి విషమ పరిస్థితులలో కరోనా వంటి వైరస్‌లు upper respiratory tract పైన చేరినపుడు వచ్చే గొంతు సంబంధ ఎలర్జీలు, అలానే Vocal cords కి సంబంధించిన సమస్యల నుంచి కాపాడటానికి ప్రాణాయామం ప్రయోజనకారి కాగలదు.
ఆవేశకావేశాలకు గురైనప్పుడు తిరిగి మనసును సరియైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రాణాయామం చక్కగా సహాయపడుతుంది. అయితే ఇది సరియైన పద్ధతిలోనే అభ్యాసం చేయాలి.

‘‘ప్రాణాయామస్య యుక్తేన
సర్వరోగ నివారణే
అయుక్తాభ్యాస యోగేన
సర్వరోగ సముద్భవః’’

అని హఠయోగంలో చెప్పారు. సరైన ప్రాణాయామ అభ్యాసం అన్ని రోగాలను నివారిస్తుంది. అయుక్తమయిన ప్రాణాయామ అభ్యాసంవల్ల శరీరం సర్వరోగాలకు నిలయమవుతుందని శాస్త్రం హెచ్చరించింది. కనుక సరైన శిక్షకుల వద్ద అభ్యసిస్తే మంచి ఆరోగ్యానికి ఇది సహకరిస్తుంది.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram