లైంగిక అత్యాచారం అనేది అన్ని నేరాల కంటే ఘోరమైనది. అమానుషమైనది. ఇలాంటి నేరాన్ని గర్హించడం దగ్గర వర్గంతో, ప్రాంతంతో, సామాజిక స్థాయితో సంబంధం ఉండకూడదు. ఏ మహిళ మీద, ఏ వయసులో జరిగినా అది శిక్షార్హమైనదే. బాలికల మీద జరిగితే అది వ్యవస్థ తలదించుకోవాల్సిన ఘోరాతి ఘోరం. ఒక పక్క లాక్‌డౌన్‌ అమలవుతూ ఉంటే హైదరాబాద్‌ ‌నగరంలో కొన్ని లైంగిక అత్యాచారం కేసులు నమోదైనాయి.

మతి స్థిమితం అంతగా లేని ఒక పన్నెండేళ్ల బాలిక మీద నలుగురు అత్యాచారం జరిపారు. ఈ ఘోరం ఏప్రిల్‌ 22‌న జరిగింది. అలాగే ఏప్రిల్‌ 25‌న మరొక ఉదంతం గురించి కూడా మీడియా వెల్లడించింది. కంప్యూటర్‌ ‌టెక్నిషియన్‌ ఒకడు మంత్రాల నెపంతో ఒక మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చి 1వ తేదీన జరిగిన మరొక దారుణం గురించి కూడా పత్రికలు వెల్లడించాయి. 45 ఏళ్ల ఒక వ్యక్తి తాగిన మైకంలో 12 సంవత్స రాల బాలిక మీద అత్యాచారం చేయబోయాడు. ఆ బాలిక తల్లి అడ్డు పడి రక్షించింది. కానీ అదే సమయంలో ఆ బాలిక సోదరి, 14 సంవత్సరాల మరొక బాలికపై అతడే ఒక సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తున్న సంగతి బయటపడి అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఆ బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఇంతకీ ఆ వ్యక్తి ఆ బాలికల తండ్రే. మే 6, 2020న చాదర్‌ ‌ఘాట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో షకీల్‌ అనే వివాహితుడిని లైంగిక అత్యాచారం కేసులోనే అరెస్టు చేశారు. తమ పొరుగునే ఉన్న ఎస్‌.‌సి. వర్గానికి చెందిన మైనర్‌ ‌బాలిక మీద ఇతడు అర్ధరాత్రి అత్యాచారం జరిపాడు. ఇంకా చిత్రం ఇతడు మలక్‌పేట ఎమ్మెల్యేకు సన్నిహితు డని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వచ్చి షకీల్‌ ‌మీద చేయి చేసుకోవడం మరీ విచిత్రం. షకీల్‌ ఎంఐఎం ‌కార్యకర్త అని అంతా ఘోషిస్తూ ఉంటే, అబ్బే అతడితో మాకేమీ సంబంధం లేదని ఆ పార్టీ కొట్టిపారేసింది.
ఇంతకూ ఇన్ని ఘోరాలు ఇలా ఒక్కచోటే జరిగినా సామాజిక సాంస్కృతిక కార్యకర్తలు, మానవ హక్కుల వీరులు ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలాంటి ఘోరాల మీద నిరసన గళం ఎత్తేవారి నోళ్లను ఏ వాస్తవం కట్టేసింది. ఇక్కడే ఒక ఘటన, దాని మీద దేశవ్యాప్తంగా జరిగిన నిరసన గుర్తు చేసు కుందాం. దేశ ప్రతిష్టను పాడు చేసే విధంగా ఆ పరిణామాలు ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌లోని కథువా అనే గ్రామంలో అసిఫా భాను అనే ఎనిమిదేళ్ల బాలిక మీద లైంగిక అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆమె మృతదేహం తరువాత దొరికింది. దేశమంతా అట్టుడికినట్టు ఉడికి పోయింది. 2018 జనవరిలో ఇది జరిగింది. ఇందులో సంజీరామ్‌ అనే గుడి పూజారిని దోషిగా పేర్కొన్నారు. ఇంకా దీపక్‌ ‌రాజ్‌ (‌పోలీసు అధికారి), తిలక్‌రాజ్‌ (‌కానిస్టేబుల్‌), అరవింద్‌ ‌దత్‌ (ఎస్‌ఐ), ‌పర్వేశ్‌ ‌కుమార్‌ (‌పోలీసు శాఖ), విశాల్‌ (‌సంజీరామ్‌ ‌కుమారుడు), మరొక మైనరు కూడా ఉన్నాడు. ఏడుగురు నిందితులలో ఆరుగురికి శిక్షలు పడ్డాయి. ఈ దుర్ఘటన మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ఇలాంటి అందోళనలు నిర్వహించే మహిళా హక్కుల కార్యకర్తలు, లైంగిక అత్యాచారాల వ్యతిరేక సంస్థలు అన్ని కేసులలోను ఒకే విధంగా ఉండలేవా? ఉండలేవనే చాలామంది ఆరోపణ. బాధితు రాలి వర్గాన్ని బట్టి ఈ సంఘాలు, హక్కుల నేతలు కదులుతారన్న విమర్శ బలంగానే చాలాసార్లు వినిపిస్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఘటనల విషయంలో కూడా ఇలాంటి పాక్షిక దృష్టి కనిపిస్తున్నది.

ఏప్రిల్‌ 22‌న దుండిగల్‌లో సూరారం కాలనీలో ఉండే ఒక బాలిక (ఈమెకు మానసిక స్థితి సరిగా లేదు) తల్లిదండ్రుల మీద అలిగి బయటకొచ్చేసింది. దుండిగల్‌లోనే రోడా మిస్త్రి నగర్‌లో ఉంటున్న నలుగురు ఆమెను కిడ్నాప్‌ ‌చేశారు. ఏప్రిల్‌ 22‌న మహమ్మద్‌ ‌జుమ్మన్‌ అనే వ్యక్తి ఆ పన్నెండేళ్ల బాలికను రోడ్డు మీద చూసి, మభ్యపెట్టి తన గదికి తీసుకువెళ్లాడని పోలీసులు చెప్పారు. అక్కడే ఓ నలుగురు ఆమెపై సామూహిక లైంగిక అత్యాచారం జరిపారు. తరువాత రోడ్డు మీదకు తీసుకువచ్చి వదిలేశారు. ఆ బాలిక వెళ్లి తల్లికి విషయం చెప్పడంతో ఈమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్టు మీడియా వెల్లడించింది. వీళ్లే ఢిల్లీకి చెందిన మహమ్మద్‌ ‌జుమ్మన్‌ (33), ఆం‌ధప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పఠాన్‌ అక్బర్‌ ‌ఖాన్‌ (26), ‌నిజామాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ‌గయాజ్‌ (25), ‌హైదరాబాద్‌లోని లంగర్‌ ‌హౌజ్‌కు చెందిన మహమ్మద్‌ అలీముద్దీన్‌. ‌వీళ్లంతా డ్రైవర్లు.

ఏప్రిల్‌ 25, (‌సాక్షి పోస్ట్) ‌మంత్రాలతో నయం చేస్తానని చెప్పి, ఒక మహిళపై మహమ్మద్‌ ‌మొయిజుద్దీన్‌ (27) అనే వ్యక్తి లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అనే ప్రాంతంలో జరిగింది. ఇతడు కంప్యూటర్‌ ‌టెక్నీషియన్‌. ఇక తాగుడు మైకంలో కూతురు మీదే అత్యాచారం చేయబోయిన వ్యక్తి సంగతి సరేసరి. మార్చి 3న (2020) బహరిన్‌ ‌జాతీయుడు సుఖరల్లా బైరామీ అనే వాడిని కూడా అరెస్టు చేశారు. ఇది కూడా లైంగిక అత్యాచారం కేసే. ఈ కేసులన్నింటిలోను మతి స్థిమితం అంతగా లేని ఒక బాలిక పట్ల ఆ నలుగురు అంత ఘోరంగా వ్యవహరించడం గురించి మానవ హక్కుల కార్యకర్తలకు ఎందుకు పట్టడం లేదు? అంటే అత్యాచారం చేసిన వారిని బట్టి స్పందన ఉంటుందా? దళిత బాలిక అత్యాచారం కేసులో షకీల్‌కు శిక్ష తప్పదని తెలంగాణ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌చేసిన ప్రకటన కూడా పత్రికలలో వచ్చింది. రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ ‌కూడా దీనికి స్పందించింది. అయినా మహిళా హక్కుల కార్యకర్తలు ఎందుకు స్పందించడం లేదు? బాధితురాలు ఒక వర్గానికి చెంది ఉంటేనే స్పందిస్తారా? అలాగే నేరగాళ్లు ఒక వర్గానికి చెంది ఉన్నా కూడా స్పందించరా? దయచేసి జవాబు చెప్పిండి!

About Author

By editor

Twitter
Instagram