ఆచరణ ఎలా ఉన్నా సిద్ధాంతాలూ, పద ప్రయోగం పట్ల పిచ్చి పట్టింపు ఉంటుంది కొందరికి. కానీ ఆ పిచ్చిని వాళ్ల దగ్గరే భద్రంగా పెట్టుకోరు. ఇతరులకు కూడా అంతో ఇంతో ఎక్కించాలనీ, ఇతరులే స్వచ్ఛందంగా ఎక్కించు కుంటే ఇంకా మంచిదని అనుకుంటారు వాళ్లు. ‘సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌’ అన్న పదం వినపడితే చెవులు మూసుకోవాలని అనిపిస్తుందేమో వాడికి. అందుకే ఈ పదం ఎవరి నోటి నుంచి వెలువడకుండా ఆదేశించాల్సిందేనంటూ ఏకంగా సుప్రీంకోర్టుకెక్కాడో ఘనుడు. సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌ ‌బదులు ఫిజికల్‌ ‌డిస్టెన్సింగ్‌ అని వాడాలని కూడా అత్యున్నత న్యాయస్థానానికి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఇతడి పేరు షకీల్‌ ‌ఖురేషీ. సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌ అన్న పదం రాజ్యాంగ స్ఫూర్తికి బొత్తిగా విరుద్ధమట. నిజమే, ఏది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమో, ఏది రాజ్యాంగ స్ఫూర్తికి మోదమో అతడికి మాత్రమే తెలుసు కాబోలు. సుప్రీంకోర్టుకి అలా అని పాఠాలు కూడా చెప్పబోయాడు. చెప్పింది చాలు ఇక అపమంది పెద్ద కోర్టు. జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌, ‌జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, ‌జస్టిస్‌ ‌బిఆర్‌ ‌గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ అసలు విచారణకే పనికి రాదు పొమ్మంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా విచారణ జరిగింది గానీ, లేకపోతే నెత్తి మీద ధర్మాసనం ఏకగ్రీవంగా నాలుగు మొట్టికాయలు కూడా వేసేదే. వీలు కాదు కాబట్టి, ఇలాంటి తిక్క పిల్‌ ‌వేసినందుకు ఒక్క పదివేల రూపాయలు జరిమానా మాత్రం విధించింది. మర్కజ్‌కు మత ప్రార్థనలకి వెళ్లి వచ్చిన వారి కారణంగా కొవిడ్‌ 19 ‌విస్తరించింది అని కూడా పలకరాదని, ఈ సంగతి కూడా తేల్చాలని ఆ మధ్య వేరెవడో కోర్టుని ఆశ్రయించాడు. అప్పుడు కూడా ఇలాగే చుక్కెదురైంది. కోర్టులంటే మరీ ఇంత చులకనా? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమో కాదో వీళ్లు చెప్పాలా? ఇంతకీ ఆ పదం మోదీగారు ఉపయోగించారు కాబట్టి, అది వట్టి సోషల్‌ ‌డిస్ట్రిక్టర్షన్‌ అని కోర్టు చేత చెప్పిస్తే, ఇంక మోదీగారి పని అయిపోదా అని కాబోలు ఇలాంటి కోర్టు పక్షుల ఉద్దేశం.

అసలు హక్కుల కార్యకర్తల దగ్గర, ప్రజా సంఘాల వాళ్ల దగ్గర, కొందరు సాంస్కృతిక సామాజిక కార్యకర్తల దగ్గర సుప్రీం కోర్టుకు సైతం పాఠాలు చెప్పగల న్యాయశాస్త్రం పరిజ్ఞానం టన్నుల కొద్దీ పేరుకు పోయి ఉంటుంది. అది వాళ్ల నమ్మకం మాత్రమే. చిత్రంగా బీజేపీయేతర పార్టీలలో ఉండే సుప్రీంకోర్టు లాయర్లు కూడా ఇలాగే భావిస్తూ ఉంటారు. 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం అంటారు. అది అమలు చేయకుండా క్షణం ఆలస్యం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూర్చుంటారు. కశ్మీర్‌లో బోలెడంత మందిని చంపేసి, సైనిక దళాల మీద దాడులు చేసి, కిడ్నాప్‌లు చేసిన వాడెవడినో భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో లేపేస్తే, ఆ ఎదురు కాల్పులు జరిపిన వాళ్లని తక్షణం బోను కూడా ఎక్కకుండా, కోర్టు దూలానికే వేలాడదీసి ఉరి తీసేటట్టు తీర్పు రాయండని గౌరవనీయులైన న్యాయమూర్తులకి పాఠాలు చెబుతారు. తాము బుజ్జగిస్తున్న వర్గానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా, తాము తీవ్రంగా ద్వేషించే పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రాయకపోయినా కూడా వీళ్లంతా కోర్టులని వేరే వాళ్ల చేత తిట్టిస్తూ ఉంటారు. ఈ ధోరణి ఇకనైనా ఆగాలి.

About Author

By editor

Twitter
YOUTUBE