– క్రాంతి

భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ వేర్పాటువాదానికి మద్దతు ఇచ్చే విధంగా ఉన్న 2020 పులిట్జర్‌ అవార్డులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేర్పాటువాద ఉద్యమ ఫోటోలను అవార్డుకు ఎంపిక చేశారు. అంతేకాదు, ఈ ఫోటోలకు ఉపయోగించిన శీర్షికల్లోని పదజాలం అభ్యంతరకరంగా ఉంది. పులిట్జర్‌ అవార్డుల ఎంపికను తప్పుపడుతూ 132 మంది భారతీయ ప్రముఖులు బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిపై సంతకం చేసిన వారిలో పద్మ అవార్డు గ్రహీతలు, మాజీ ఎంపీలు, ఆర్మీ అధికారులు, వైస్‌ ‌చాన్సలర్లు ఉన్నారు.

జర్నలిజంలో అత్యుత్తమ సేవలందించి నందుకు గానూ ఇచ్చే పులిట్జర్‌ అవార్డు ప్రతిష్ట మసకబారింది. పులిట్జర్‌ ‌ప్రైజ్‌ – 2020 ఎం‌పిక తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఫోటో జర్నలిస్టుల కేటగిరీలో జమ్ముకశ్మీర్‌కు చెందిన ముక్తార్‌ఖాన్‌, ‌దార్‌యాసిన్‌, అసోసియేట్‌ ‌ప్రెస్‌కి చెందిన చెన్నీ ఆనంద్‌లను ఎంపిక చేశారు. అయితే వీరు తీసిన ఫోటోలు ఏమిటో తెలిస్తే సగటు భారతీయుడు ఆగ్రహంతో ఉడికిపోక తప్పదు. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని నిర్మూలించి బాధ్యతాయుతమైన పాలన నెలకొల్పే దిశగా భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370‌ని రద్దు చేసింది. ఈ సందర్భంగా కొందరు వేర్పాటువాదులు, వారిని సమర్థించే వారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా దళాల వాహనంపై ఓ వేర్పాటువాది దాడికి దిగడం, వారిని చెదరగొట్టడం, లాఠీలు పట్టిన కొందరు మహిళలు, ఏడుస్తున్న దృశ్యాలు, గాయపడిన వారిని ఫోటోలు తీశారు. ఇందులో అవార్డు ఇచ్చేంత ప్రతిభ, నాణ్యత ఏముందో తెలియదు. పత్రికల్లో కనిపించే సాధారణ ఫోటోలు మాత్రమే ఇవి.

ఈ దృశ్యం కనిపించలేదా?


జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్నది ఎవరో అందరికీ తెలుసు. పాకిస్తాన్‌ ‌ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలను భారత సైన్యం ఎంతో దీటుగా తిప్పి కొడుతోంది. ఈ క్రమంలో ఎంతో మంది జవాన్లు, పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి త్యాగాలను తక్కువ చేసే విధంగా వేర్పాటువాద కార్యకలాపాల ఫోటోలను అవార్డులకు ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది. ఇదే విషయాన్ని జమ్ముకశ్మీర్‌ ‌పోలీసు ఆఫీసర్‌ ఇం‌తియాజ్‌ ‌హుస్సేన్‌ ‌ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 2017లో కశ్మీర్‌లో టెర్రరిస్టులు హతమార్చిన ఒక పోలీసు ఆఫీసర్‌ ‌కుమార్తె ఫోటో ఈ ట్వీట్‌కు జోడించారాయన. ఉగ్రవాదుల చేతిలో తన తండ్రి బలికావడంతో ఆ పాప ఏడుస్తోంది. ఇది చూసిన ఎవరి హృదయమైనా కరగాల్సిందే. ఈ ఫోటోకి ఏమైనా అవార్డు లభిస్తుందా? అని ఇంతియాజ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

రాహుల్‌ అభినందన.. బీజేపీ ఆగ్రహం

జమ్ముకశ్మీర్‌లో వేర్పాటు వాదాన్ని సమర్ధించే విధంగా ఉన్న చిత్రాలకు పులిట్జర్‌ అవార్డులు ఇవ్వడం సగటు భారతీయుని ఆగ్రహం తెప్పిస్తుంటే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ మాత్రం అవార్డును పొందిన ఫోటోగ్రాఫర్లను అభినందిస్తున్నారు. పవర్‌ఫుల్‌ ‌ఫోటోల ద్వారా అందరూ గర్వపడేలా చేశారంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ ‌తీరుపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ ‌పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక భావాలను వర్ణించడం ద్వారా వారికి ఈ అవార్డు లభించిందని, అవార్డు అందుకున్న వారిలో ఒకరైన దార్‌ ‌కశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా తన ఫోటోలలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అలాంటి వారికి అవార్డు వస్తే పొడగ్తలతో ముంచెత్తుతారా రాహుల్‌? ‌కశ్మీర్‌ ‌భారతదేశ భూభాగం కాదా? అని సంబిత్‌ ‌పాత్ర ప్రశ్నించారు. ఈ ముగ్గురికి అవార్డు ఇచ్చే సమయంలో పులిట్జర్‌ ‌బోర్డు తన వెబ్‌సైట్‌లో భారత్‌ ‌కశ్మీర్‌ ‌భూభాగంలో కమ్యూనికేషన్‌ని బ్లాక్‌ ‌చేయడం ద్వారా కశ్మీర్‌ ‌స్వాతంత్య్రాన్ని పోగొట్టిన సమయంలో అక్కడివారి జీవితాల్ని ప్రతిబింబించే ఫోటోలు ఇవి అని పేర్కొంది.

భారతీయ ప్రముఖుల ఆగ్రహం

పులిట్జర్‌ అవార్డుల ఎంపిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు భారతీయ ప్రముఖులు కమిటీ జ్యూరీకి బహిరంగ లేఖ రాశారు. భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ, రాజ్యాంగాన్ని అగౌరవ పరిచే రీతిలో వేర్పాటువాదానికి మద్దతు ఇచ్చే చిత్రాలను అవార్డులకు ఎంపిక చేయడాన్ని వీరు తప్పు పట్టారు. ఈ ఫోటోల శీర్షికల్లో ‘భారతీయ నియంత్రిత కశ్మీర్‌’ అనే పదాన్ని ఉపయోగించ డాన్ని, అబద్ధాలు, వాస్తవాలను చూపించారని, వేర్పాటువాదాన్ని ప్రతిబింబించే రీతిలో ఈ ఫోటోలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్‌లో మూడు వేర్వేరు ఘర్షణల్లో ఐదుగురు ఉగ్రవాదులను, 11 ఏళ్ల బందీని భారత భద్రతా దళాలు చంపాయని పేర్కొన్న శీర్షికను వీరు ఖండించారు. పిల్లల మరణానికి భారత సైన్యాన్ని నిందించడాన్ని తప్పు పట్టారు. భారత దేశ ప్రజలను, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని జ్యూరీ సభ్యులు సత్యాన్ని తెలుసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

దొంగలకు అవార్డులా?: ట్రంప్‌

2020-‌పులిట్జర్‌ అవార్డులు కశ్మీర్‌ ‌ఫోటో జర్నలిస్టులతో పాటు పరిశోధనాత్మక రిపోర్టింగ్‌, ఇం‌టర్నేషనల్‌ ‌రిపోర్టింగ్‌లో ది న్యూయార్క్ ‌టైమ్స్‌కి కూడా ఇచ్చారు. అయితే ఈ అవార్డుల ఎంపిక తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌కూడా తప్పు పట్టడం విశేషం. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వారు జర్నలిస్టులు కాదు, దొంగలు. నకిలీ వార్తలు, తప్పుడు కథనాలకు అవార్డులు ఇచ్చారు.’ అని ట్రంప్‌ ‌పేర్కొన్నారు.

About Author

By editor

Twitter
Instagram